When-this-couple-realized-their-food-they-went-viral

అమెరికాలో లక్షల జీతాన్నిచ్చే జాబ్స్‌కు గుడ్‌బై చెప్పి.. ఈ భార్యాభర్తలు చేస్తున్నదిదీ..!

అమ్మాయికి వంట చేయడం వచ్చా? ఏం వంటలు బాగా చేస్తుంది? భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లిచూపుల రోజు అత్తింటి వాళ్లు అమ్మాయి కుటుంబాన్ని అడిగే ప్రశ్న ఇది. కానీ ఇప్పుడు అలా అడిగే రోజులు పోయాయి. టెక్నాలజీ పెరగడం.. దాంతోపాటుగా ఫాస్ట్‌ఫుడ్ కల్చర్ కూడా బాగా పెరగడమే దీనికి కారణం. ఇక అమెరికా సంబంధం అయితే పెళ్లి చేసుకునే అమ్మాయికి అలాంటి బాధే లేదు. అక్కడ ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటారు కాబట్టి.. ఒకపూట అమ్మాయి వండితే.. మరోపూట అబ్బాయి వంట చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొచ్చేస్తారు. ఎలాగో ఆన్‌లైన్ ఫుడ్ బిజినెస్ బాగా పెరిగిపోయింది కాబట్టి వంట చేయడం రాకపోయినా దిగులే లేదు. ఇప్పుడు అసలు వంటల గురించి.. వండటం గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే..

 
బెంగాలీ కుటుంబానికి చెందిన ఓ అబ్బాయి, బెంగాలీ ఫుడ్‌కు ప్రేమికురాలిగా మారిపోయిన అమ్మాయి ఇండియాలో పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. కొన్నేళ్ల తరువాత వారిద్దరికీ ఎందుకో చేస్తున్న ఉద్యోగాలు బోర్ కొట్టేశాయి. ఒక్కసారిగా కుకింగ్‌పై వారి దృష్టి పడింది. బెంగాలీ సంప్రదాయ వంటకాలన్నీ నేర్చుకోవాలనుకున్నారు. నేర్చుకోవడమే కాకుండా ఆ వంటకాలన్నీ అందరికీ అందించాలనుకున్నారు. ఉద్యోగం చేస్తూనే యూట్యూబ్ చానల్‌ను మొదలుపెట్టారు. మరి ఇప్పుడు ఆ చానల్ ఎలా నడుస్తోంది.. వారు ఇంకా ఉద్యోగాలు చేస్తున్నారా? అసలు అమెరికాలోనే ఉన్నారా? తెలుసుకుందాం పదండి..  
 
సప్తర్షి చక్రవర్తిది సాంప్రదాయమైన బెంగాలీ కుటుంబం. చక్రవర్తికి చిన్ననాటి నుంచి పండుగలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా లక్ష్మీపూజ అంటే చక్రవర్తికి చాలా ఇష్టం. ఏ పెద్ద పండుగ వచ్చినా సరే.. బెంగాలీ కుటుంబాలు వివిధ రకాల వంటకాలు వండాల్సిందే. బెంగాలీ సంస్కృతికి, అక్కడి వంటకాలకు పెద్ద ముడే ఉంది. చక్రవర్తికి వంటలపై మక్కువ కూడా ఇలానే పుట్టింది. ‘లక్ష్మీపూజ రోజు ఇంట్లో నానమ్మ లక్ష్మీదేవికి నైవేద్యంగా భూనా కిచూరి, లబ్రా చేస్తుంది. ఇంట్లో అందరూ ఆరోజు ఉపవాసం ఉండటంతో.. ప్రతి వంటకాన్నీ నేనే రుచి చూసి ఎలా ఉందో చెప్పాలి. ఈరోజు నాకు బెంగాలీ వంటకాలపై యూట్యూబ్ చానల్ పెట్టాలనే ఆలోచన ఆ రుచుల ప్రభావంగానే మొదలైంది’ అని చెబుతున్నాడు చక్రవర్తి.
 
ఇక చక్రవర్తి భార్య ఇన్సియా పూనావాలా పుట్టి పెరిగిందంతా కలకత్తాలోనే. కానీ ఇన్సియాది బెంగాలీ కుటుంబం కాకపోవడంతో ఆమె బెంగాలీ వంటకాలను రుచి చూడటానికే చాలా కాలం పట్టింది. కాలేజ్‌ టూర్‌కు వెళ్లినప్పుడు ఇన్సియా వాళ్ల వెంట వెళ్లిన కుక్ వండిన పప్పు, బాత్, టోర్కరీలతో మొదటిసారిగా ఇన్సియా బెంగాలీ వంటకాల రుచి చూసింది. ఇక అప్పటి నుంచి ఆ వంటకాలను ఎక్కువగా తినడం మొదలుపెట్టింది. అలా తనకు బెంగాలీ వంటకాలపై మక్కువ పెరిగిందని ఇన్సియా చెబుతోంది.
 
చక్రవర్తి, ఇన్సియా ఇండియాలోనే పెళ్లి చేసుకుని లాస్ ఏంజెలెస్‌లో స్థిరపడ్డారు. చక్రవర్తి ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్‌గా, ఇన్సియా ఓ పబ్లిషింగ్ హౌస్‌లో ఎడిటర్‌గా ఉద్యోగం చేస్తున్న సమయంలో వారికి సొంత యూట్యూబ్ చానల్‌ పెట్టాలనే ఆలోచన వచ్చింది. 2014లో ఈ ఆలోచన వచ్చిందని, ఆ సమయంలోనే వంటలకు సంబంధించి ఎన్నో యూట్యూబ్ చానళ్లు పుట్టుకొచ్చినట్టు ఈ జంట గుర్తుచేసుకుంది. 2015లో వీరిద్దరూ ఇంట్లోనే కొత్త కొత్త బెంగాలీ వంటలు వండటం మొదలుపెట్టారు. 2016లో శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న సమయంలో వీరు ‘బాంగ్ ఈట్స్’ అనే చానల్‌ను స్టార్ట్ చేసి ఇంట్లోనే వంటలు చేసి ఆ వీడియోలను అప్‌లోడ్ చేస్తూ వచ్చారు.
 
ఇద్దరూ ఉద్యోగం చేస్తూనే ఈ వంట వీడియోలను చేస్తూ వచ్చారు. వీకెండ్‌లో చక్రవర్తి షూట్ చేస్తే.. మిగతా రోజులలో ఇన్సియా ఆ వీడియోలను ఎడిటింగ్ చేసేది. నిదానంగా వీరి వీడియోలు చూసే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. అలా 2016 నుంచి 2019 వరకు దాదాపు 200 బెంగాలీ వంటకాల తయారీ విధానాలను వీరు అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలను ఫాలో అవుతున్న వారందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. బెంగాలీ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చే వీరి వంటల వీడియోలు చూస్తుంటేనే నోరూరుతుందని ఫాలోవర్లు చెబుతున్నారు. బాంగ్ ఈట్స్ చానల్‌ను ఐదు లక్షల మంది సబ్‌స్క్రైబ్ చేసుకోవడంతో చక్రవర్తి, ఇన్సియా ఫుల్‌టైం దీనిపైనే దృష్టి పెట్టాలనుకుని చేస్తున్న ఉద్యోగాలకు స్వస్తి పలికేశారు. తన సొంత ప్రాంతంలోనే ఉంటే మరెన్నో విషయాలు తెలుస్తాయని.. మరెన్నో వంటకాలను చేయొచ్చని మూడు నెలల క్రితం తిరిగి ఇండియాకు వచ్చేశారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. ఒక్క వీడియోలో కూడా ఈ జంట ఎక్కడా కనిపించదు. కేవలం వారు చేసే వంటకాలను మాత్రమే వీడియోలో చూపిస్తారు.
 
తమ వీడియోలను చూసి ప్రతిఒక్కరూ ఇళ్లలోనే రుచికరమైన వంటలను వండుకోవాలనేదే తమ కోరికని చక్రవర్తి, ఇన్సియా చెబుతున్నారు. చింగ్రీ మలాయ్‌కరీ, కోషా మాంగ్‌షో లాంటి వంటకాలను రెస్టారెంట్లలో తినే బదులు ఇంట్లోనే ఎంతో రుచికరంగా వండుకోవచ్చని సలహా ఇస్తున్నారు. బెంగాలీ వంటకాలను ప్రతి ఒక్కరికీ అందించడమే తమ లక్ష్యమని, రానున్న రోజుల్లో మరింత పరిశోధన చేసి కొత్త కొత్త వంటకాలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తామని తెలిపారు.