The-Sellout

అమెరికాపై వ్యంగ్యాగ్రహం ‘ది సెల్‌అవుట్‌’

ఎప్పటినుండో అమెరికా తనని తాను జాతి వివక్ష రహిత రాజ్యంగా ప్రకటించుకుంటున్నప్పుడు, గతంలోకాని వర్తమానంలోకాని జాతి వివక్ష రహిత అమెరికా ఎప్పుడు పుట్టిందో, ఎప్పుడు నిలిచిందో ప్రపంచం వెతకడం ప్రారంభించింది. పౌరహక్కుల చట్టాన్ని శాసనంగా ప్రకటించిన 1964లో కానీ, సుప్రీంకోర్టులో మొదటి ఆఫ్రికన్‌ - అమెరికన్‌ సభ్యుడిగా థర్‌గుడ్‌ మార్షల్‌ నియామకం జరిగినపుడు కానీ, బరాక్‌ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా గెలిచినప్పుడు కానీ, అమెరికాకి కలర్‌ బ్లైండ్‌నెస్‌ వచ్చిందని ఒక తెల్ల జాతీయుడే గోల చేసినపుడుకానీ కనపడని జాతి సమానత్వం అమెరికాని ప్రశ్నించడం ప్రారంభించింది. ఈ ప్రశ్నల్లోంచే అమెరికా జాతి వివక్షని, అక్కడి రాజ్యాంగ విధానంలోని బలహీనతలని, అణగదొక్కబడుతున్న పౌరహక్కుల ఉద్యమాలని ప్రపంచానికి చెప్పడానికి పాల్‌ బీటీ చూపెట్టిన పరిహాసపు చీకటికోణం ‘ది సెల్‌అవుట్‌’ నవల. 2015లోనే రాసినప్పటికీ, 2016 అంతర్జాతీయ బుకర్‌ పురస్కారాన్ని అందుకున్న మొదటి అమెరికన్‌ రచయితగా ప్రత్యేకతను సొంతం చేసుకున్న నేపథ్యంలో... పాల్‌ బీటీ నవలలోని విషయాలని ప్రస్తుత అమెరికా స్థితిగతులలోంచి, ప్రపంచ పరిణామాలలోంచి, సాహిత్య సంగతులలోంచి విశ్లేషించడమే ఈ వ్యాస ఉద్దేశం.
 
    
                  నిజానికి పాల్‌ బీటీ కవిగా 1990ల నుండే ప్రపంచ పాఠకులకు, MTV వీక్షకులకు పరిచయం. అమెరికాలోని నల్లజాతీయుల జీవితాలపై పదునైన వ్యంగ్య రచనగా పాల్‌ బీటీ మొదటి నవల ‘ది వైట్‌ బోయ్‌ షఫిల్‌’ 1998లో వచ్చింది. అమెరికాలోని పేదవారైన నల్లజాతీయుల నేర ప్రస్థానాలపై బీటీ రెండవ నవల ‘టఫ్‌’ 2008లో వచ్చింది. బెర్లిన్‌లోని అమెరికన్‌ డి.జె. గురించి మూడవనవల ‘స్లంబర్‌ లాండ్‌’ 2013లో వచ్చింది. ఆఫ్రికన్‌ - అమెరికన్‌ల జీవితాలపై పాల్‌ బీటీ కొనసాగిస్తున్న అధ్యయనానికి ఆయన నవలలను మజిలీలుగానూ, అమెరికా పక్షపాతానికి ఆనవాళ్లుగానూ చెప్పవచ్చు. అయితే, మొదటి మూడు నవలలలోనూ లేని ఒక శక్తిమంతమైన వ్యంగ్యం పాల్‌ బీటీ ప్రస్తుత నవల ‘ది సెల్‌అవుట్‌’ను అలంకరించింది. ప్రపంచానికి కనపడుతున్న అమెరికాకి, నిజమైన అమెరికాకి మధ్య వైరుధ్యాలని బయట పెట్టడానికి, చిరునామా లేకుండా పోతున్న నల్లజాతీయులపై అమెరికా వ్యవహరిస్తున్న తీరుకు పాల్‌ బీటీ వ్యక్తం చేసిన తీవ్ర ఆగ్రహం ఈ నవల.
 
                  పాల్‌ బీటీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలామంది ఆఫ్రికన్‌ అమెరికన్‌లు తమను వేరుగా చూసినపుడే బాగున్నామని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందంటాడు. ఈ ఆశ్చర్యమే నల్లజాతీయుల జీవితాలపై అధ్యయనానికి ప్రేరణగా నిలవడం జరిగింది. 2014లో ఫెర్గూసన్‌ నగరానికి చెందిన మైకేల్‌ బ్రౌన్‌ అనే 18 ఏళ్ల నల్లజాతి యువకుడిని ఒక అమెరికన్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కాల్చి చంపడం, అమెరికా ఎన్నికల నియమావళిలో భాగంగా నల్లజాతి ఓట్లలో ఒకటికి 8 శాతాన్ని అనర్హతగా ప్రకటించడం, 2015లో బాల్టీమోర్‌ నగరానికి చెందిన ఫ్రెడీ గ్రే అనే నల్లజాతి యువకుడిని పోలీసులు చిత్ర హింసలు పెట్టి చంపడం, ఇంకా అనేక రాష్ర్టాలలో నల్లజాతులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో పాల్‌ బీటీ తన నవల ‘ది సెల్‌అవుట్‌’ను పూర్తి చేశాడు. ‘ఐ లైక్‌డ్‌ ది ఐడియా ఆఫ్‌ ప్లేయింగ్‌ విత్‌ ది నోషన్‌ ఆఫ్‌ సెగ్రెగేషన్‌ ఇన్‌ ఎ మోడరన్‌ కాన్‌టెస్ట్‌’ అని సరదాగా చెప్పుకున్న పాల్‌ బీటీలోని ఆవేదన, ఆగ్రహం ఈ నవలని గొప్ప వ్యంగ్య కృతిగా మలచింది.
 
                  లాస్‌ఏంజెల్స్‌కు దక్షిణంగా ఊరు బయట ఉన్న ‘డికెన్స్‌’ అనే బస్తీలో పుట్టిన నల్లజాతి యువకుడి కథే ‘ది సెల్‌ అవుట్‌’. ‘నేను’తో ఈ నవల ప్రారంభమవుతుంది. ఈ డికెన్స్‌ బస్తీలో అన్ని రంగుల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు ఉంటారు. హఠాత్తుగా తను పుట్టి పెరిగిన డికెన్స్‌ మాయమై పోతుంది. లాస్‌ఏంజిల్స్‌లో కాని, కాలిఫోర్నియాలో కాని ఈ బస్తీ ఉండదు. ఆ మహా నగరాల సౌందర్యానికి అడ్డుగా భావించడం వల్ల, వాళ్ళు విడిచే వ్యర్థ పదార్ధాలను వదిలే ఒక సూయజ్‌ టేంక్‌ అవసరం వల్ల ఆ బస్తీ కనపడకుండా పోతుంది. బహుశా ఈ సందర్భం ఇవాళ ప్రపంచానికి పరిచయమైనదే. అభివృద్ధి పేరుతో వేల గ్రామాలను మాయం చేసి మనుషులను నిర్వాసితులను చేస్తున్న వర్తమాన విషాదం ఈ నవల చదువుతున్న పాఠకుడి మనసును తాకుతుంది.
 
                  తిరిగి తన డికెన్స్‌ను పొందాలని ‘మీ’ లేదా ’నేను’ చేసే పోరాటం ఈ నవలంతా పరుచుకుని ఉంటుంది. బస్తీ లేకపోవడం వలన ఉనికినే కోల్పోయిన హోమ్నీ జెంకిన్స్‌ అనే ఒక నటుడు తనంతట తానుగా ‘నేను’కి బానిసగా మారడం, ‘నేను’ తిరిగి జాతులుగా ప్రజలను గుర్తించడం, పాఠశాలలో జాతుల ప్రకారం విభజన చేయడం ప్రారంభించి, తన బస్తీ గుర్తిస్తూ ఒక సరిహద్దు గీత గీసి, తమ ఉనికిని నిలుపుకోవాలనుకుంటాడు. ఈ ప్రయత్నంలోనే ‘నేను’పై కోర్టు కేసు నమోదవుతుంది. తిరిగి జాతి వివక్షను ప్రోత్సహిస్తున్నాడని, ప్రజలని విడదీస్తున్నాడని ప్రకటించి, విచారణ ప్రారంభిస్తుంది.
 
                  ఇక్కడ పాల్‌ బీటీ తన వ్యంగ్య వైభవాన్ని హాస్యంతో మిళితం చేసి చూపెడతాడు. ఈ మొత్తం పోరాటాన్ని కథకుడు తనకు, అమెరికా సంయుక్త రాష్ర్టాలకు మధ్య జరిగే పోరాటంగా ప్రకటిస్తాడు. తిరిగి priority seating for seniors, disabled, and whites అనే సైన్‌ బోర్డులు ఏర్పాటుచేసి, ఎక్కడికక్కడ ఈ వివక్షను అందరూ గుర్తించేలా చేస్తాడు. బస్తీలను మాయంచేయడం వలన వాషింగ్టన డీసీ పాతకాలం నాటి రోమ్‌ నగరంలా ఉందని, ఇల్లులేని నల్లజాతీయులు - బాంబ్‌ను గుర్తించే కుక్కలు - యాత్రికులను తీసుకువచ్చే బస్‌లతో రోమ్‌ ఎలా ఉండేదో, ఇప్పుడు అమెరికా అలా ఉందని చెపుతూ కథకుడు చేసిన వ్యాఖ్యానం నిజమైన అమెరికాను ప్రపంచానికి చూపెడుతుంది.
 
                  ఫ్లానరీ ఓ కానర్‌ తన నవల ‘వైజ్‌ బ్లడ్‌’లో ఏ విధంగా అయితే సమస్య పరిష్కారమయ్యేదాకా సమస్యను ఎంత తీవ్రంగా ప్రదర్శించాడో, అదే పద్ధతి మనకి పాల్‌ బీటీ నవల ‘ది సెల్‌అవుట్‌’ లోనూ కనపడుతుంది. ప్రతి వాక్యాన్ని మరింత దట్టంగా, రసవత్తరంగా రాయడం వలన ప్రతి అక్షరంలోనూ జాతి వివక్షకు సంబంధించి, అమెరికా సామాజిక రాజకీయ విషయాలకి సంబంధించి ఎన్నో అర్థాలు కనపడతాయి. ఒకచోట కథకుడుsilence can be either protest or consent, but most times its fear అంటాడు. మౌనంగా ఉండడం వలన ఒక్కొక్కసారి మనం మన అంగీకారాన్నో, నిరసననో తెలియజేయవచ్చు కాని ఎక్కువసార్లు అది మనలోని భయాన్నే చెపుతుంది అంటున్న పాల్‌ బీటీ కథా నాయకుడు మన చుట్టూ జరుగుతున్న అనేక పరిణామాల పట్ల మన ఉదాసీనతను ప్రశ్నిస్తాడు. నిజానికి ఈ నవలను ఒక హాస్య వ్యంగ్య రచనగా చెప్పడానికి పాల్‌ బీటీ కూడా ఇష్టపడడం లేదు. ప్రపంచవ్యాప్తంగా గడచిన కొద్ది నెలలలోనే అనేక రకాలైన జాతి వివక్షను రేకెత్తించే సమస్యలు ఎదురైనాయి. పౌరహక్కుల ఉద్యమం ప్రారంభమైన అమెరికా దక్షిణ తూర్పు ప్రాంతంలోని ‘ఆలబామా’లో కేవలం ఇంగ్లీషులో స్పందించలేదని 57 సంవత్సరాల సురేష్‌ భాయ్‌ పటేల్‌ను చితకబాదిన పోలీసుల వ్యవహారం, బెంగుళూరులో గత నెలలోనే ఆఫ్రికన్‌లపై జరిగిన దాడి, మన రాష్ట్రంలోనే దళితులపై మతోన్మాదులు చేస్తున్న దౌర్జన్యం... మొదలైనవెన్నో ప్రజలను అస్థిమితానికి గురిచేస్తున్న కాలంలో ఈ నవల పాఠకులను ఆలోచింపజేస్తుంది. ఎంతో హాస్యాన్ని వ్యం గ్యంగా ఒలికించినా... ప్రతి అక్షరం చెపుతున్న యదార్థమైన వర్తమాన విషాదం ‘ది సెల్‌అవుట్‌’ నవలకి బుకర్‌ను అందించింది.
 
                  బుకర్‌ ఫ్రైజ్‌ కమిటీ ఛైర్మన్‌, చరిత్ర పరిశోధకురాలు అయిన అమందా ఫోర్‌మెన్‌ మాట్లాడుతూ 'Novel for our times' అనడం నిజంగా గొప్ప వాస్తవాన్ని చెప్పడమే. ప్రజాస్వామ్యానికి మబ్బులు కమ్ముకుంటున్న సమయంలో, ప్రజలంతా భయంతోనో, ఉదాసీనతతోనో మౌనంగా ఉంటున్న సందర్భంలో, ప్రపంచంలోని దేశాలు, రాజ్యాలు అధికారం కోసం ప్రజలను జాతులుగా, కూలీలుగా, జెండర్‌లుగా, వర్గాలుగా చూస్తున్న కాలంలో జాతి వివక్షపై గుసగుసలుగా చెప్పుకునే దశ నుండి గట్టిగా వినిపించే దశ దాకా పాల్‌ బీటీ చేసిన ప్రయాణమే ఈ నవల. పాటల మాంత్రికుడు బాచ్‌ డిలాన్‌కు నోబెల్‌ వచ్చిన ఈ నెలలోనే, అమెరికా అధ్యక్ష ఎన్నికల సన్నాహాలు జరుగుతున్న ఈ నెలలోనే, అమెరికా డొల్లతనాన్ని చాలా నగ్నంగా చూపెట్టి, బుకర్‌ను గెల్చుకున్నాడు పాల్‌ బీటీ. ‘దిస్‌ మే బీ హార్డ్‌ టు బిలీవ్‌, కమింగ్‌ ఫ్రమ్‌ ఏ బ్లాక్‌ మాన్‌, బట్‌ ఐ హేవ్‌ స్టోలెన్‌ నథింగ్‌...’ అంటూ ప్రారంభమయ్యే ఈ నవల అమెరికా రాజ్యాంగ, రక్షణ, న్యాయవ్యవస్థలలోని లోపాలు నల్లజాతీయులను ఎలా ఛిన్నాభిన్నం చేస్తున్నాయో కళ్లకు కట్టినట్టు చెబుతుంది. ఒక పక్క హాస్యంతో, మరొక పక్క వ్యంగ్యంతో, ఇంకొక పక్క వెటకారంతో ముస్తాబయిన ఈ నవలలోని సంభాషణలు, కథనాలు సంక్లిష్టతలోంచి పాఠకుడిని కాస్త రిలాక్స్‌ చేస్తూ ఆలోచించమంటాయి. ఇది వర్తమాన ప్రపంచ ద్వంద్వ నీతికి నిలువెత్తు నిదర్శనం. ప్రపంచ పెద్దన్నయ్యగా గప్పాలు కొట్టుకుంటున్న అమెరికా విశ్వరూపాన్ని చూపెట్టే నవల ఇది. కంగ్రాట్స్‌ పాల్‌ బీటీ...! 
 నండూరి రాజగోపాల్‌ 
రచయిత, జర్నలిస్ట్‌