Telugu-Woman-Seri-Nirath-Sanjana-has-developes-Sensor-and-GPS-Equipped-Headset-for-Blind

అమెరికాలో సత్తాచాటుతున్న తెలుగు యువతి.. అంధుల కోసం సరికొత్త ఆవిష్కరణ

వైకల్యాన్ని జయించి ఉన్నత విద్యనూ, విదేశంలో ఉద్యోగాన్నీ సాధించినా... అక్కడితో చాలని ఆమె రాజీపడిపోలేదు! తనకన్నా పెద్ద వైకల్యాలతో బాధపడుతున్న వారి కోసం ప్రాజెక్ట్‌ ‘ఐరిస్’కు శ్రీకారం చుట్టారు. అంధుల కోసం సరికొత్త పరికరం తయారు చేసి ‘ఔరా’ అనిపించుకున్నారు.అమెరికాలోని ఫ్లోరిడాలో సిస్టమ్‌ ఎనలిస్ట్‌గాపని చేస్తున్న విశాఖ మహిళ సేరి నిరత్‌ సంజన ప్రయాణం ఓ నవతరం స్ఫూర్తి గాథ!

 ‘‘నాకు పుట్టుకతోనే వినికిడి లోపం ఉంది. అయితే ఏడాది వయసు వచ్చేవరకూ మా తల్లితండ్రులు లీలాకాంత్‌, నివేదిత గుర్తించలేకపోయారు. ఎవరైనా పిలిచినా, మాట్లాడినా నేను స్పందించకపోవడంతో నన్ను వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళారు. పరీక్షల్లో నాకు వినికిడి సమస్య ఉందని నిర్ధారణ అయింది. అయితే ఆ లోపం కారణంగా నాకు ఏ ఇబ్బంది కలగకుండా పెంచాలనీ, ఆ సమస్య నాకు శాపం కాకూడదనీ మా అమ్మానాన్న తపించారు. అందరి పిల్లల్లానే నేనూ ఆడుతూపాడుతూ చదువుకోవాలని ఆరాటపడ్డారు. ‘ఏం చేయాలా..’ అని ఆలోచిస్తున్న తరుణంలో వారికి ఓ శుభవార్త తెలిసింది. 

నాలాంటి సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చెన్నైలోని బాల విద్యాలయంలో శిక్షణ ఇస్తున్నారని! నన్ను వెంటనే తీసుకువెళ్లి అందులో చేర్పించారు. అక్కడ నాలుగేళ్లపాటు శిక్షణ ఇప్పించారు. వినికిడి సమస్యతోపాటు చిన్నతనంలో మాటలు రాకపోవడంతో అమ్మానాన్న ఎంతగానో బాధపడ్డారు. మూడేళ్ల శిక్షణ తరువాత ‘అమ్మ’, ‘అప్పా’ వంటి చిన్న చిన్న మాటలు మాట్లాడడంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. వినికిడి సమస్యతో పాటు నాకు మాటలూ కూడా రావని వాళ్ళు ఎంతో బెంగపడేవారు. నా నోటి నుంచి మాట రావడంతో వాళ్ల ఆనందానికి అవధుల్లేవు.  

నేరుగా ఒకటో తరగతిలో..

చెన్నైలో నాలుగేళ్ల శిక్షణ తరువాత విశాఖపట్నం తీసుకువచ్చి, నేరుగా ఒకటో తరగతిలో చేర్పించారు. మాటలే రావనుకున్న నాకు మాటలు రావడం, స్కూల్‌కు వెళ్లడం కొత్తగా అనిపించింది. కానీ అప్పటి నుంచీ కొత్త సమస్యలు మొదలయ్యాయి. వినికిడి పరికరం ఉన్నా స్కూల్లో టీచర్లు చెప్పేవి అర్థంకాక ఇబ్బందిపడేదాన్ని. ఇంటికి వచ్చాక ఆ రోజు స్కూల్లో చెప్పిన పాఠాలను మళ్లీ అమ్మతో చెప్పించుకొని ఒక అవగాహనకు వచ్చేదాన్ని. అదే సమయంలో ప్రతిరోజూ అమ్మానాన్న నాతో ఇంకా బాగా మాట్లాడించడానికి ఎంతో ప్రయత్నించేవారు. నీతి కథలు, భిన్నమైన స్టోరీలు చెబుతుండేవారు. ఎక్కువ భాషలతో ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో మొదట ఇంగ్లీష్‌, ఆ తరువాత తెలుగు భాషను కొద్దిగా నేర్పించారు. 

సామర్థ్యంపై భరోసా...

పదో తరగతి తరువాత ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్‌ పూర్తి చేశాను. ఇంజనీరింగ్‌లో మంచి కాలేజీలో చేరాలన్న ఉద్దేశంతో ఇంటర్‌లో ఎంతో కష్టపడి చదివాను. ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ పరీక్షలో 158వ ర్యాంకు రావడంతో నా సామర్థ్యంపై విశ్వాసం పెరిగింది. చెన్నై ఐఐటీలో ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేశాను. ఫైనలియర్‌ చదువుతున్న సమయంలో ప్రతిష్ఠాత్మకమైన నేషనల్‌ ఏరోస్పేస్‌ లేబొరేటరీలో ప్రాజెక్టు ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. అయితే ఉన్నత చదువులు పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఉద్యోగాన్ని వదులుకున్నా.
 
అంధుల బాధలు కళ్లారా చూశా...
అమెరికాలోని టెక్సాస్‌ యూనివర్సిటీలో 2015లో ఎంఎ్‌సలో చేరాను. మాస్టర్స్‌ చేస్తున్న సమయంలో సెకండ్‌ సెమిస్టర్‌లో ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి వచ్చింది. అప్పుడే అంధుల కోసం ఏదైనా భిన్నమైన పరికరాన్ని రూపొందించాలన్న ఆలోచన కలిగింది. వినికిడి సమస్యతోనే నేను ఎన్నో బాధలు అనుభవిస్తే... ఇక ఈ లోకాన్నే చూడలేనివారు ఇంకెన్ని రకాల ఇబ్బందులు పడుతుంటారోనన్న ఆలోచన నాకు చిన్నప్పటి నుంచీ ఉంది. వాళ్ళు ఎదుర్కొనే ఎన్నో సమస్యలను కళ్లారా చూశాను. వారి ఇబ్బందులను కొంతైనా తీర్చడానికి ఏదైనా చేయాలనుకున్నాను. నేను ఇంటర్న్‌షిప్‌ ద్వారా చేయాలనుకున్న ప్రాజెక్టు వారికి ఉపయోగపడేలా ఉండాలనుకున్నాను. అందుకు అనుగుణంగా ‘ఐరిస్‌’ పేరుతో చేపట్టిన ఆ ప్రాజెక్టు ద్వారా సరికొత్త పరికరాన్ని రూపొందించాను.
 
పాల్‌ నేతృత్వంలోని మా బృందం రెండేళ్లపాటు ఈ ప్రాజెక్టు కోసం ఎంతో కష్టపడింది.. మా ప్రాజెక్టు గురించి తెలుసుకున్న అమెరికాకు చెందిన ‘నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ బ్లైండ్‌’ సంస్థ ఆర్థికంగా సాయం చేసి ఎంతగానో ప్రోత్సహించింది. నేను ఎదుర్కొన్న ఇబ్బందుల కంటే అంధులు ఎదుర్కొనే సమస్యలు ఎన్నో రెట్లు పెద్దవి. వారికి ఎంతో కొంత సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ పరికరానికి రూపకల్పన చేశాను. ఈ పరికరం వారి సమస్యలను కొంతైనా తొలగిస్తుందనుకుంటున్నా. అమెరికాలో ప్రస్తుతం దీన్ని సుమారు వంద మంది వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో పూర్తిస్థాయిలో మార్కెట్‌లోకి తీసుకువస్తాం.’’
 
హెచ్చరిస్తుంది... దారి చెబుతుంది!
‘‘అధునాతన సెన్సర్లు, నావిగేషన్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేను ‘ఐరిస్‌’ పరికరాన్ని రూపొందించాను. త్రీడీ కెమెరా, వైబ్రేషన్‌ సెన్సార్‌, బ్లూ టూత్‌ ద్వారా పనిచేసే హెడ్‌ ఫోన్స్‌, బ్యాక్‌ బ్యాగ్‌లో బుల్లి పవర్‌ఫుల్‌ కంప్యూటర్లను మేము పొందుపరిచాం. మొబైల్‌ అప్లికేషన్‌ను వినియోగించాం. వీటన్నింటి సహాయంతో ‘ఐరిస్‌’ పరికరం పనిచేస్తుంది. ఈ భాగాలన్నీ కంప్యూటర్‌తో అనుసంధానమై ఉంటాయి. ఈ ‘ఐరిస్‌’ పరికరాన్ని కలిగిన వ్యక్తి ముందుభాగంలో కంప్యూటర్‌ ఉంటుంది. ఈ కెమెరా త్రీ డైమెన్షన్‌లో ఫొటోలను తీస్తుంది. అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించి బుల్లి కంప్యూటర్‌కు సమాచారాన్ని చేరవేస్తుంది. పరికరాన్ని ధరించిన వ్యక్తి ప్రయాణించే మార్గంలో ఏదైనా వాహనం, ఇతర వస్తువులు గానీ అడ్డు వస్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది. కంప్యూటర్‌ కనెక్ట్‌ చేసి ఉన్న వైబ్రేషన్‌ సెన్సార్‌ ఆన్‌ అవుతుంది. ఆ వ్యక్తి ముందుకు వెళ్లకుండా ఆగిపోయేలా చేస్తుంది. ఎదురుగా వస్తువో, వ్యక్తో అడ్డంగా ఉంటే, అయిదు అడుగుల ముందుగానే ఫోటోని తీసి, దాని వివరాలను హెడ్‌ఫోన్‌ ద్వారా తెలియజేస్తుంది. దాన్ని బట్టి తరువాత ఎటువైపు వెళ్ళాలో ఆ వ్యక్తికి తెలుస్తుంది. దీని ద్వారా చాలావరకు ప్రమాదాలు నివారించేందుకు అవకాశం ఉంది. అదే సమయంలో మొబైల్‌ అప్లికేషన్‌లో తమకు కావాల్సిన ప్రదేశాల గురించి తెలియజేస్తే... ఆ ప్రదేశం చేరేంత వరకూ మార్గదర్శకత్వాన్ని ‘ఐరిస్‌’ అందిస్తుంది.’’
బి. శ్రీనివాస్‌
ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం