Telugu-Woman-Fabulous-Journey-in-The-field-of-Archeology

చదువు అక్కర్లేదని పెళ్లి చేశారు.. అయినా ఆమె అమెరికా వరకు..

మహిళలకు చదువూ, ఆస్తీ పెద్దగా అక్కర్లేదనే వాతావరణం ఉన్న ఇంట్లో పుట్టి పెరిగిన ఓ బక్కపలచని అమ్మాయి...

ఇంటర్‌ పూర్తి చేసే లోగానే వివాహబంధంలో అడుగుపెట్టారు...
ఇద్దరు పిల్లల తల్లిగా...
తనకంటూ ఓ అస్తిత్వం ఉండాలని తపించారు... 
మహిళలు అతి తక్కువగా కనిపించే చరిత్ర, ఆర్కియాలజీ రంగంలోకి అడుగుపెట్టారు... 
దేశ, విదేశాల్లో పరిశోధనలు చేశారు...
పుస్తకాలు రాశారు...
శ్రీపద్మా హోల్ట్‌...
తాను ఎంచుకున్న రంగంలో తనదైన ముద్ర వేశారు. మైలవరం నుంచి అమెరికా వరకూ సాగిన మన తెలుగు మహిళ పయనం అక్షరాలా ఆసక్తిదాయకం.
 
‘‘చిన్న వయసులోనే అక్షరం మీద మొలకెత్తిన ప్రేమ నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రేరణగా నిలిచింది. ప్రపంచం ముందు నన్ను నేను కొత్తగా నిలబెట్టుకోవడానికి దోహదం చేసింది. నా బాల్యం, యవ్వనపు తొలి రోజులు పల్లెటూరులోనే గడిచిపోయాయి. మాది కృష్ణా జిల్లా మైలవరానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలోని అనంతవరం. అక్కడ మోతుబరి రైతు కుటుంబంలో పుట్టిన అచ్చమైన పల్లెటూరి అమ్మాయిని నేను. మేము నలుగురం. అన్న, అక్క, నేను, చెల్లి. మా ఇంటిలో ఆడపిల్లలకు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. పెళ్లిళ్లకు కట్నకానుకల కింద డబ్బులు, నగలు బాగానే ఇచ్చేవారు. కానీ పొలం మాత్రం మగపిల్లలకే అనే ధోరణి ఉండేది. నేను పదో తరగతి వరకూ మైలవరం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో చదివాను. నాకు డాక్టర్‌ కావాలని కోరిక. అందుకే ఇంటర్‌లో బైపీసీ తీసుకున్నా. గుడ్లవల్లేరులో మా అక్కవాళ్ళ ఇంట్లో ఉంటూ చదువుకున్నాను. ఇంటర్‌ పరీక్షలు అయి ఇంటికి రాగానే ‘నీకు పెళ్ళి’ అన్నారు. నాకు ఇంకా చదువుకోవాలని ఉందని చెప్పే అవకాశం లేకుండానే- బూర్గుంపాడు దగ్గర ఏలేరులో, మా పిన్ని వాళ్ళింట్లో నా పెళ్ళి జరిగిపోయింది- నా ప్రమేయం లేకుండానే!
 
ఉత్తరాంధ్ర ఆలయాలపై అధ్యయనం
ఆ తరువాత ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. నాకు చాలా మంచి మార్కులొచ్చాయి. కానీ ఏం లాభం! అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. వైవాహిక జీవితంతో సర్దుకుపోయాను. నాకు ఇద్దరు పిల్లలు కలిగారు. మా అమ్మాయి పుట్టేనాటికి మా అక్కా, బావా ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రొఫెసర్‌ రమణ నన్ను చదవాల్సిందిగా ప్రోత్సహించారు. అలా 1982లో బి.ఎ. పూర్తి చేశాను. ఈలోగా మా వారు విశాఖలో బోటు తీసుకొని వ్యాపారం మొదలుపెట్టారు. మేము కూడా అక్కడికి చేరాం. మా పిల్లలు బడికి వెళ్ళాక తీరిక దొరికింది. ఇంకా చదవాలనే కోరిక బలపడింది. నాకు 26ఏళ్ల్లు వచ్చేసరికి ఆర్కియాలజీలో పీజీ చేశా.
 
ఆ తరువాత హిస్టరీలో కూడా! యూనివర్సిటీలో నేనే ఫస్ట్‌. వెంటనే ఆర్కియాలజీలో పీహెచ్‌డీలో చేరిపోయా. ఉత్తరాంధ్రలోని దేవాలయాల ఆర్కిటెక్చర్‌, దేవతల వస్త్రధారణ, ఆభరణాలు, వారి హెయిర్‌ స్టయిల్‌ నా అధ్యయనాంశాలు. దాని ద్వారా నాటి సమాజంలోని పోకడలను గుర్తించే క్రమంలో చేసిన అధ్యయనం అది. 1989లో పరిశోధన పూర్తయ్యింది. 1991లో న్యూఢిల్లీకి చెందిన ‘ఆగమ్‌ కళా ప్రకాశన్‌’ వారు దాన్ని పుస్తకంగా ప్రచురించారు. 1989-90 మధ్య కాలంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఎ.యు)లోని సెంటర్‌ ఫర్‌ మెరైన్‌ ఆర్కియలాజికల్‌ స్టడీస్‌లో రిసెర్చ్‌ అసిస్టెంట్‌గా పనిచేశాను అక్కడ ఉన్నప్పుడే ఎస్‌.ఆర్‌.రావుగారితో కలిసి నేటి మఽథురను నాటి కృష్ణుడి మఽథురగా ధ్రువీకరించేందుకు జరిగిన ప్రయత్నాలలో భాగంగా సాగిన అవశేషాల పరిశీలనలో పాల్గొన్నాను.
 
ఉచ్చారణతో ఇబ్బంది పడ్డా!
యూజీసీ అనుమతి రావడంతో రీసెర్చ్‌ అసోసియేట్‌గా 1990 నుంచి 1994 వరకూ ఏయూలోనే హిస్టరీ అండ్‌ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నా. అధ్యాపకురాలిగా నా తొలి జీవితం అక్కడే మొదలయింది. తరువాత అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలో నాకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను. అప్పటికే మా అబ్బాయి చదువుల కోసం అమెరికా వెళ్లిపోయాడు. మా అమ్మాయిని తీసుకొని 1994లో నేనూ అమెరికా వెళ్లా. హార్వర్డ్‌ యూనివర్శిటీలో రిసెర్చ్‌ అసోసియేట్‌గా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నా. 2005లో అక్కడ నుంచి మేన్‌ రాష్ట్రంలోని చారిత్రక పట్టణం బ్రున్స్‌విక్‌ టౌన్‌లోని బౌడిన్‌ కాలేజ్‌కి విజిటింగ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా వెళ్లాను. అక్కడ ఉచ్చారణ కారణంగా ఎదురైన సమస్య అంతా ఇంతా కాదు. అక్కడే వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించాను. ఆ తరువాత శ్రీలంకలో పనిచేసే అవకాశం లభించింది.
 
శ్రీలంకలో మేము ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఆ కేంద్రం అడ్మినిస్ట్రేటివ్‌ డైరెక్టర్‌గా, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. ఆ క్రమంలోనే శ్రీలంకతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. యూనివర్సిటీ ఆఫ్‌ క్యాలిఫోర్నియాలో కొద్ది కాలం చేసి, ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ చికాగోలోని డివినిటీ స్కూల్‌లో విజిటింగ్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ఉన్నాను. లింగ వివక్ష రాజ్యమేలిన ఇంట్లో పుట్టిన నేను నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని నిలబడగలిగాను. అది నాకు ఎంతో తృప్తిని ఇస్తోంది. ఇప్పుడు నాకు 62 ఏళ్లు. నా ప్రాంత యువతరానికి ఏదైనా చేయాలన్న అభిలాష ఉంది. ఉన్నత విద్య పట్ల, పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఇవ్వగలిగినంత చేయూత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.’’
 
మా అమ్మ, తాతయ్యల ప్రభావం ఎంతో...!
‘‘మా నాన్నగారు ఉయ్యూరు వెంకట్రావు అంటే మా ఇంట్లో అందరికీ భయం. బయట నుంచి లోపలికి వస్తున్నారంటే గప్‌చుప్‌ అయిపోయేవాళ్ళం. ఆయన హార్మోనియం, మృదంగం అద్భుతంగా వాయించే వారు. పాటలు రాగయుక్తంగా పాడేవారు. ఆయన గొంతు శ్రావ్యంగా ఉండేది. మా అమ్మ అన్నపూర్ణమ్మ సాధారణ గృహిణి. కానీ సంస్కృతాంధ్ర పద్యాలు, పురాణాలు చక్కగా చదవగలిగేది. మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకు నేను ముద్దులపట్టిని. ఆయన దగ్గరే సుమతీ శతకం పద్యాలు నేర్చుకున్నా. నా తొమ్మిదో ఏటే ఆయన మరణించారు. కానీ నాపై ఆయన ప్రభావం చాలానే ఉంది. సాహిత్యం, చరిత్ర పట్ల నాకు ప్రత్యేక ఆసక్తి కలగడానికి ఆ చిరుప్రాయంలో ఆయన వేసిన పునాదులే కారణం. మా నాయనమ్మ పార్వతమ్మ. బడి చదువులేని గొప్ప పండితురాలు. ఆమె భక్తిపారవశ్యంతో ఛందోబద్ధంగా పద్యాలు అల్లేవారు. పురాణాలు శ్రావ్యంగా చదువుతూండేవారు. స్కూలు నుంచి రాగానే నా చేత కూడా చదివించేవారు. నాలో పఠనాసక్తి పెరగడానికి ఇది కూడా ఓ కారణం.’’
 
మన దేవతలు... శ్రీలంక వైవిధ్యం
‘‘హార్వర్డ్‌ యూనివర్శిటీలో నేను చేసిన పరిశోధనల్లో ఆసక్తికరమైంది ‘మన గ్రామ దేవతలు’. మన దేశంలోని ప్రతి ఊరిలోనూ గ్రామ దేవతలు ఉంటారు. ఒక్కో దేవతది ఒక్కో కథ. వేట ప్రధాన జీవనంగా ఉన్న కాలం నుంచి నేటి వరకూ గ్రామ దేవతలు మన సంస్కృతిలో ఓ భాగంగా, అవిభాజ్యంగా కొనసాగిన తీరును వివిధ రూపాల్లో నిర్ధారించి, అక్షరబద్ధం చేశాను. అలాగే శైవ, వైష్ణవ, బౌద్ధ, జైన మతాల ఆచారాల్లోకి ఈ దేవతల చిత్రాలు, సంజ్ఞలు ప్రభావశీలంగా చొచ్చుకు వెళ్ళిన తీరును కూడా వివరించగలిగాను. ఈ పుస్తకం వివిధ దేశాల్లోని మతాచారాల మీద అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యయనం చేస్తున్న వారి దృష్టిలో పండింది. ‘లంకాపుర- ది లెగసీ ఆఫ్‌ ది రామాయణ ఇన్‌ శ్రీలంక’ అనే వ్యాస సంపుటిని జస్టిన్‌ డబ్ల్యూ హెన్రీతో కలిసి, జర్నల్‌ ఆఫ్‌ సౌత్‌ ఏసియన్‌ స్టడీస్‌ సహకారంతో ప్రచురించాను.
 
రామాయణానికీ, లంకకూ ఉన్న అవినాభావ సంబంధం, రావణ, విభీషణులు పూజలు అందుకోవడానికి కారణం, బౌద్ధ మతం ప్రభావితమైన తీరు తదితర అంశాలను ఆ వ్యాసాల్లో పొందుపరిచాం. శ్రీలంకకు తొలి బౌద్ధ విగ్రహం మన ప్రాంతం నుంచే వెళ్లిందన్న విషయాన్ని సగర్వంగా చాటగలిగాను. శ్రీలంకలో నన్ను ఆకర్షించింది పారంపర్య వైద్యం. అద్భుతమైన వైద్య విధానాలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. దానికి శాస్త్రీయతను ఆపాదించే క్రమంలో ఆ పారంపర్య వైద్య కుటుంబాలు పూర్తి నిర్లక్ష్యానికి గురవుతూ వస్తున్నాయి. ఆ కుటుంబాలకే పరిమితమవుతూ వచ్చిన అనేకానేక పద్ధతులు కనుమరుగయ్యే ప్రమాదం కనిపించింది. విస్తృతంగా పర్యటించి, దీనిపై క్షుణ్ణంగా అధ్యయనం చేశాం. త్వరలోనే ఈ అంశంపై ఆ పరిశోధనాత్మక వ్యాస సంపుటిని ప్రచురించబోతున్నాం.’’
 
శోధన... అక్షర సాధన!
  • చరిత్ర, పురావస్తు రంగాలపై శ్రీపద్మ విస్తృతమైన పరిశోధన సాగించారు. అనేక రచనలు కూడా చేశారు.
  • ఉత్తరాంధ్ర ఆలయాల్లోని శిల్పాలపై దుస్తులు, ఆభరణాల విశిష్టతను వివరిస్తూ 1991లో ఒక పరిశోధనా గ్రంథం.
  • భారతదేశంలోని మత సంప్రదాయాల్లో గ్రామదేవతల ప్రాధాన్యాన్ని వివరిస్తూ ‘విసిట్యూడ్స్‌ ఆఫ్‌ ది గాడెస్‌’ అనే మరో పరిశోధనా గ్రంథం రాశారు.
  • ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా నదీ లోయలో బౌద్ధ మతం పరిఢవిల్లిన తీరుపై రూపొందిన ‘బుద్ధిజం ఇన్‌ కృష్ణా రివర్‌ వ్యాలీ ఆఫ్‌ ఆంధ్రా’ అనే వ్యాస సంకలనానికి ఎ.డబ్ల్యు. బార్బర్‌తో కలిసి సంపాదకత్వం.
  • హిందూ దేవాలయాలు, దేవతామూర్తులపై ‘ఇన్వెంటింగ్‌ అండ్‌ రీ-ఇన్వెంటింగ్‌ ది గాడెస్‌’ అనే సంకలనానికి సంపాదకురాలు.
  • శ్రీలంకలో నెలకొన్న ఘర్షణాత్మక పరిస్థితుల నేపథ్యాన్ని తీసుకొని ‘ఫ్రాక్చర్డ్‌ బ్లిస్‌’ అనే చారిత్రక-కాల్పనిక రచన.