Telugu-family-who-went-Malaysia-150-years-back-fight-for-Telugu-language

150 ఏళ్ల క్రితం విశాఖ నుంచి.. మలేషియాకు వెళ్లిన కుటుంబం.. ‘తెలుగు’ కోసం ఆరాటం..

మలేషియాలో తెలుగు భాష, సంస్కృతుల కోసం కృషి చేస్తున్న అప్పలనాయుడు అక్కయ్య

మలేషియాలోనే పుట్టి పెరిగినా తెలుగు నేలతో బంధం కోసం వచ్చిన కుటుంబం
మనుమలతో కలిసి తిరుమల శ్రీనివాసుడిని సందర్శన

తిరుమల (ఆంధ్రజ్యోతి): ఆయన ఒక తోటమాలి కొడుకు. పుట్టింది మలేషియా దేశంలో. తండ్రిది మాత్రం విశాఖ ప్రాంతం. బ్రిటీష్‌ వాళ్ళు నూటా యాభై ఏళ్ళ కిందట వేలాది మంది తెలుగువాళ్ళని కొబ్బరి తోటల్లో కూలి పనులు చేయడానికి పడవల్లో మలేషియాకు తరలించారు. అక్కడ అష్టకష్టాలు పడి ఎందరో చనిపోయారు. ప్రాణాలు నిలుపుకున్నవాళ్లు తమతో పాటూ తెలుగు భాషా సంస్కృతులనూ కాపాడుకున్నారు. తమ పిల్లలూ, వారి పిల్లలూ తెలుగు ఆచార సంప్రదాయాలకూ, భాషకూ దూరం అవుతుండడంతో వారిని భారత దేశానికి తీసుకువచ్చి ఇది మన పూర్వీకులు పుట్టిన తెలుగు నేల అని పరిచయం చేస్తున్నారు. అందులో భాగంగానే తిరుమల శ్రీనివాసుని దర్శనానికి తమ పిల్లలూ, మనుమలతో కలిసి వచ్చిన ఒక తెలుగు కుటుంబాన్ని ‘ఆంధ్రజ్యోతి’ పలుకరించింది. తెలుగునేలతో తమ బంధాన్ని కాపాడుకోవడానికి వారు చేస్తున్న ప్రయత్నాలను అడిగి తెలుసుకుంది. ఆ వివరాలు...
 
తోటమాలిగా వెళ్లిన తండ్రి అక్కయ్య  
దాదాపు నూటయాబై ఏళ్ళకు పూర్వం విశాఖపట్నం ప్రాంతానికి చెందిన అనేక మందిని బ్రిటీష్‌ వాళ్లు కూలీలుగా మలేషియాకు తరలించారు. అలా వెళ్ళిన కుటుంబాలకు చెందిన వారిలో మూడోతరం వ్యక్తి వెలగ అప్పలనాయుడు అక్కయ్య. ఆయన పుట్టిందీ పెరిగిందీ కూడా మలేసియాలోనే. టెంకాయతోపుల్లో పనివాళ్ళుగా చేరిన తెలుగువాళ్ళు తెలుగు అక్షరాలు మరచిపోకుండా కాపాడుకోవడానికి తర్వాతి తరానికి ఇసుకల్లో అక్షరాలు దిద్దించి నేర్పించారని మూడోతరం వారసుడైన అప్పలనాయుడు చెప్పారు. ఆ తర్వాత అక్కడి తోటల్లోనూ చిన్న చిన్న బడులు తెరిచి చదువు చెప్పారని అలా చదువుకున్న తెలుగువారు తర్వాత తర్వాత తమ పిల్లల చదువులు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారని తెలిపారు. తండ్రి కూలీ అయినా అప్పలనాయుడు చదువుకోవడంతో బడిలో టీచరయ్యారు. తమిళ, తెలుగు ప్రైమరీ స్కూల్‌లో 1967 నుంచి 89 వరకు  టీచర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2003 వరకు ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆ సమయంలో వందలాదిగా తెలుగు బడులు మలేషియాలో నడిచాయి. 
 
కార్మికుల పిల్లలందరూ చదువుకుని ఉద్యోగాల కోసం పట్టణాలకు వచ్చేయటంతో 2003 సంవత్సరానికి అక్కడి తెలుగు పాఠశాలలన్నీ మూతపడ్డాయి. దాంతో తెలుగు భాష మనుగడ దెబ్బతింటుందనే ఉద్దేశంతో మలేషియా తెలుగు సంఘం ఆ ప్రభుత్వంతో చర్చలు జరపగా ఏ భాష అయినప్పటికీ 15 మంది పిల్లలు ఉంటే మాతృభాష చదువుకోవచ్చని అనుమతి ఇచ్చింది. తెలుగులో చదువుకున్నవారికి ఉపాధి సమస్య ఎదురవడంతో తెలుగు బడులు ఉనికిని కోల్పోయాయి. దీంతో తెలుగు భాష మలేషియా దేశంలో అంతరించి పోతుందనే ఆందోళనతో మలేషియా తెలుగు సంఘం తమ పిల్లలు ఇంగ్లీషు, మలయా భాషల్లో చదువుకున్నా తెలుగు భాషను నేర్పించాలని నిర్ణయించుకున్నారు. మలేషియా దేశవ్యాప్తంగా ఉన్న 40 శాఖల ద్వారా తెలుగు టీచర్లతో శని, ఆదివారాల్లో రెండు- మూడు గంటల పాటు పాఠాలు చెప్పించి తెలుగుపై కనీస పట్టువచ్చేలా విశేష కృషి చేశారు. ఆ తర్వాత వారి చదువులకు గుర్తింపు రావాలనే ఉద్దేశంతో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అక్కడ చదువుకునే విద్యార్థులకు సిర్టిఫికెట్‌ ఇవ్వాలని కోరారు.
 
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లే ప్రశ్నపత్రానికి అక్కడ పరీక్షలు నిర్వహిస్తూ,  తద్వారా పాసైన విద్యార్థులకు ధ్రువపత్రాలు కూడా మంజూరు చేస్తున్నారు. ప్రవేశిక, మాధ్యమిక, ప్రవీణ, విశారద అనే నాలుగు విభాగాలకు సంబంధించి మాధ్యమిక, విశారద కోర్సులకు ఏపీ నుంచి, ప్రవేశిక, ప్రవీణ విభాగాలకు మలేషియా తెలుగు సంఘం నుంచి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. అయితే ఉపాధ్యాయుల కొరత ఉన్న నేపథ్యంలో తెలుగు సంఘం తరుపున వెలగ అప్పలనాయుడు అక్కయ్య మలేషియా ప్రభుత్వానికి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య సమన్వయం కుదర్చాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వం అనుమతితో తెలుగు భాషను మరింత వ్యాప్తి చేయచ్చని ఆశిస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో ‘తెలుగు విద్యాలయం’ అనే భవనాన్ని ఏర్పాటు చేసుకుని సెలవు దినాల్లో  తెలుగు బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. మలేషియా మొత్తం మీదుగా ఉన్న 4 నుంచి 5 లక్షల మంది తెలుగువారి పిల్లలో మాతృభాషపై మమకారం, తెలుగు సంస్కృతిపై ఆసక్తి తగ్గకూడదనే ఉద్దేశంతో అక్కడి తెలుగు సంఘం పలురకాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నదని అప్పలనాయుడు అక్కయ్య ఆంధ్రజ్యోతికి వివరించారు. 
 
ఇక్కడ బ్రహ్మోత్సవాల సమయంలోనే ఆక్కడా ఉత్సవాలు 
మలేషియాలో తెలుగువారు ఉండే ప్రదేశాల్లో బాగన్‌డత్తో జిల్లాలోని సుంగయ్‌ సుమున్‌ గ్రామం ఒకటి. అక్కడ శ్రీవేంక టేశ్వరస్వామి ఆలయం ఉంది.  ఆ ఆలయంలో శ్రీవారికి నిత్యం అన్ని రకాల పూజలు నిర్వహిస్తున్నారు. ఆ దేవస్థానానికి డిప్యూ టీ చైర్మన్‌గా ఉన్న వెలగ అప్పలనాయుడు అక్కయ్య కైంకర్యాల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తిరుపతి నుంచి శ్రీవేంకటేశ్వరస్వామి, అమ్మవారు, ఆండాళ్‌, ఆంజనేయస్వామి విగ్రహాలను కూడా అక్కడికి తరలించి పూజలు చేస్తుండటం గమనార్హం. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో అక్కడ కూడా బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మలేషియాలో ఉండే తెలుగు వారందరూ ఆ ఉత్సవాల్లో పాల్గొంటారు. 
 
1986లో మొదటసారిగా వచ్చా
మా నాన్న తిరుమల గురించి చెప్పేవారు. ఆ తర్వాత ఇక్కడి రావాలని చాలాసార్లు అనుకున్నా సాధ్యం కాలేదు. అయితే 1986లో మొదటిసారిగా తిరుమలకు వచ్చి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నా. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఏడాదిలో రెండుమూడు సార్లు స్వామి దర్శనానికి వస్తున్నాం. నాతో పాటు నా కుటుంబం, స్నేహితులను కూడా తీసుకువస్తా. నాకు నలుగురు సంతానం. పెద్ద కుమార్తె ఉషా నందిని, కుమారులు శరత్‌బాబు, కిరణ్‌బాబు, చివరి అమ్మాయి తుషా నందిని. వారికి తెలుగు నేర్పించటంతో పాటు మన సంప్రదాయాలన్నీ నేర్పించా. ఇప్పుడు వాళ్లు కూడా భాషపై మంచి పట్టు సాధించారు. ఇన్నేళ్లుగా వారు మలేషియాలో ఉంటున్నా మమ్మల్ని తెలుగులో అమ్మ, నాన్న అనే పిలుస్తారు.   
- వెలగ అప్పలనాయుడు
 
మన పండుగలన్నీ చేసుకుంటాం
మన తెలుగు పండుగలన్నీ వైభవంగా చేసుకుంటాం. ఇళ్లను శుభ్రపరుచుకుని అలంకరించుకుంటాం. తెలుగు ఆడవారమంతా ఒకే చోట చేరి భజనలు కూడా చేస్తాం. మన వంటకాలేవీ మర్చిపోలేదు. బూరెలు, వడ, పాయసం, పులిహోర, కలగూర లాంటి వంటకాలు చేసుకుంటాం. సంక్రాంతి, ఉగాది, దీపావళి పండగలు వస్తే మంచి సందడి ఉంటుంది. తెలుగు సంప్రదాయాలన్నీ అచరిస్తాం. పెళ్లిళ్లు కూడా ఇక్కడి సంప్రదాయం ప్రకారమే జరుగుతాయి. 
- అప్పలనాయుడు సతీమణి జయలక్ష్మి
 
తెలుగు సినిమాలు బాగా చూస్తాం
తెలుగు భాష అంటే చాలా ఇష్టం. అలాగే ఇండియాకు రావటం కూడా చాలా ఇష్టం. అక్కడ వివిధ రకాల భాషలు మాట్లాడేవారు ఎంతమంది ఉన్నా మన తెలుగువాళ్లు కనిప్తే తెలుగులోనే మాట్లాడుకుంటాం. అలాగే తెలుగులో విడుదలయ్యే సినిమాలన్నీ చూస్తాం. మహేష్‌బాబు సినిమాలంటే చాలా ఇష్టం. పండగలకు అమ్మచేసే వంటకాలు చాలా బాగుంటాయి. తిరుమలకు తరుచు వస్తుంటాం. స్వామిని దర్శించుకున్న తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటోంది.
- కుమార్తె తుషా నందిని