Telugu-Actress-Laya-special-Interview-from-America

అరవింద సమేతలో ఛాన్స్‌ను వదిలేసుకున్నా.. అమెరికా నుంచి నటి లయ స్పెషల్ ఇంటర్వ్యూ

అమెరికాలో ఉంటున్న సినీ నటి లయ ప్రత్యేక ఇంటర్వ్యూ

అమ్మ చేతి గోరుముద్ద... నాన్న చెప్పిన జాగ్రత్త... సెంటర్లో ముంత మసాలా ... షూటింగు గ్యాపుల్లో చదువంతా... అమెరికాలో ఉన్న ‘లయ’ జ్ఞాపకాల్లో ఇంకా తడిగానే ఉన్నాయి. ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌లో పలకరించగానే తేటతేనె మాటల్లో ఆమె మనసు జాలువారింది. ఆ శ్రుతిలయలు మీకోసం...
 
 
హాయ్‌ లయగారు ఎలా ఉన్నారు?
హాయ్‌ అండీ! చాలా బావున్నాను. లాస్‌ ఏంజిల్స్‌లో కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా ఉన్నా. 
 
పదేళ్ల తర్వాత తెరపై తళుక్కుమన్నారు?
అవునండీ. తెలుగులో పూర్తిస్థాయి హీరోయిన్‌గా చేసి పదేళ్లకు పైగానే అయింది. దర్శకుడు శ్రీనువైట్లగారు ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌ క్యారెక్టర్‌ మా అమ్మాయి శ్లోకతో చేయిద్దామని అప్రోచ్‌ అయ్యారు. మా అమ్మాయికీ ఇంట్రెస్ట్‌ ఉండడంతో సరేనన్నా. మరో చిన్న పాత్ర నన్ను చేయమన్నారు. మా అమ్మాయితో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకోవడం ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఇలాంటి అవకాశం మళ్లీ వస్తుందో లేదోనని ఇద్దరం కలిసి చేశాం. అలాగని ఇది నాకు కమ్‌బ్యాక్‌ సినిమా అనుకోను! యాదృచ్ఛికమైన విషయం ఏంటంటే.. ‘భద్రమ్‌ కొడుకో’ అనే సినిమాతో నేను చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చా. ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’తో నా కూతురు చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కనిపించింది.
  
ఇండస్ట్రీని మిస్సయిన ఫీలింగ్‌ ఉందా?
ఎందుకు ఉండదండీ! పెళ్లయ్యాక సినిమాలు చేద్దామా, వద్దా అన్న ఆలోచన ఉండేది. అయితే నా భర్త నాకు అడ్డు చెప్పలేదు. కాస్త రెస్ట్‌ తీసుకుందాం అని బ్రేక్‌ ఇచ్చా. మధ్యలో ఆఫర్స్‌ వచ్చాయి. నా వయసుకు మించిన పాత్రలు కావడంతో వద్దనుకున్నా. అమ్మ, అక్క, వదిన పాత్రలకు నేనింకా యంగ్‌గా కనిపిస్తున్నానని ఆ దర్శకులే చెప్పారు. ‘అరవింద సమేత’ అలాగే వదులుకున్నా.
 
విజయవాడలో మీ బాల్యం ఎలా ఉండేది?
అసలు మాది వైజాగ్‌! నాన్న ఉద్యోగరీత్యా విజయవాడలో స్థిరపడ్డారు. స్నేహితులతో కలసి స్కూల్‌కి నడుచుకుంటూ వెళ్లడం, ఆ తర్వాత సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లడం భలే సరదాగా ఉండేది. స్కూల్లో అన్నింటిలోనూ నేను ఫస్ట్‌ ఉండేదాన్ని. పదేళ్ల వయసులో భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టా. అందుకే స్కూల్లో పాటలు, డాన్స్‌, స్పీచ్‌ ఇలా ఏదైనా నన్నే వేదిక ఎక్కించేవారు.
 
విజయవాడలో పెరిగినవారికి సినిమా పిచ్చి ఎక్కువ ఉంటుంది. ‘నిన్నే పెళ్లాడతా’ రిలీజ్‌ అయిన టైమ్‌ అది. ఎలాగైనా సినిమా చూడాలి! తీరా చూస్తే టిక్కెట్లు లేవు. ఇంకోసారి అడిగితే ఇంట్లో పంపరు. సినిమా చూడాలని ఫిక్స్‌ అయితే ఏదో ఒక సినిమా చూసి రావలసిందే! పదో తరగతికి వచ్చేసరికి ఓ టీవీ ఛానెల్‌లో ‘స్టార్‌ 2010’ ప్రొగ్రామ్‌ జరుగుతుంటే అమ్మ అప్లై చేసింది. గెలిచిన వారికి గ్రేడ్‌ల వారీగా హీరోయిన్‌, ఆర్టిస్ట్‌, యాంకర్‌గా అవకాశాలిస్తామన్నారు. అలాగే ఇచ్చారు కూడా! ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్‌గా కాకుండా వేరే అవకాశాలు వచ్చాయి. ‘చిన్నగా, సన్నగా ఉన్నావ్‌! ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్‌ చేస్తే వీటికే ఫిక్స్‌ అయిపోతావ్‌. హీరోయిన్‌ కావడానికి టైమ్‌ ఉంది. వెయిట్‌ చెయ్యి. మంచి అవకాశాలు వస్తాయి’ అని రాఘవేంద్రరావుగారు సలహా ఇచ్చారు. అప్పుడు ఆగిపోయా.
 
మొదటి అవకాశం ఎలా వచ్చింది?
పదహారేళ్ల వయసులో ‘స్వయంవరం’ సినిమా అవకాశం వచ్చింది. దానితో మంచి గుర్తింపు రావడంతో అవకాశాలు వరుసకట్టాయి. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హోమ్లీ క్యారెక్టర్‌ అంటే సౌందర్య, గ్లామర్‌ క్యారెక్టర్స్‌ అంటే సిమ్రన్‌ పేర్లు వినిపించేవి. సౌందర్యగారు బిజీగా ఉండి ఏదన్నా పాత్ర అంగీకరించకపోతే తర్వాత ఆప్షన్‌గా నా పేరు వినిపించేది. అలా చాలా పాత్రలు నా దగ్గరకు వచ్చాయి.
 
ఈ గ్యాప్‌లో ఎలాంటి మార్పులు గమనించారు?
సినిమాలు చెయ్యనంత మాత్రాన పరిశ్రమకు దూరం అయినట్టు కాదు కదా! తెలుగు సినిమా పరిధి పెరిగి, మంచి సినిమాలు వస్తున్నాయి. కాకపోతే కథానాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాల గురించి మనవాళ్లు పెద్దగా ఆలోచించడం లేదు. అప్పటితో పోల్చితే ఇప్పటి హీరోయిన్‌లకు కంఫర్ట్స్‌, రెమ్యునరేషన్‌ చాలా ఎక్కువ. నేను సినిమాల నుంచి బయటకు వచ్చే సమయానికి మాకు బాగానే ఇచ్చారు. నా టైమ్‌లో ఫలానా క్యారెక్టర్‌కి ఫలానా అమ్మాయే సూట్‌ అవుతుందని దర్శకులు రాసుకునేవారు. ఇప్పుడు కొత్త అమ్మాయి అయినా ఫరవాలేదు. ఈతరం వాళ్లు సీనియర్‌లకు రెస్పెక్ట్‌ ఇవ్వడం తెలియదని విన్నాను. ఇప్పుడు హీరోయిన్‌లకు లాంగ్‌రన్‌ లేదు. మహా అయితే 10 సినిమాలు చేస్తున్నారంతే! అది కూడా హిట్‌ సినిమాలు ఉంటేనే. రెమ్యునరేషన్‌లో హైక్‌ చూస్తున్నారు. కానీ క్యారెక్టర్‌కి మనమెంత న్యాయం చేస్తున్నామని ఆలోచించట్లేదు. డబ్బు సంపాదన ఒకటే కాదు. ఆత్మ సంతృప్తి కూడా ముఖ్యం. 24 శాఖల్లోనూ లేడీ టెక్నీషియన్లను చూడాలని నా కోరిక.
 
ఇప్పుడు ఏ తరహా పాత్రలు చెయ్యాలనుంది?
తల్లి, అక్క, వదిన పాత్రలు చేయడం నాకు ఇబ్బంది కాదు. కానీ అలా ఊరికే నిలబడి, ఒకటి రెండు డైలాగ్‌లు చెప్పడమే కనిపిస్తోంది. అలాంటి పాత్ర ఎవరైనా చెయ్యొచ్చు కదా! భర్త, పిల్లల్ని వదిలి అమెరికా నుంచి వచ్చి ఓ క్యారెక్టర్‌ చేశానంటే మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి కదా! కొన్ని సినిమాల్లో ‘ఫలానా సినిమాలో నేనీ క్యారెక్టర్‌ చేశాను’ అని చెప్పుకోవలసిన పరిస్థితులను చూస్తున్నాం. జనాలు మెచ్చే క్యారెక్టర్‌ ఉంటే తప్పకుండా చేస్తా. అనుష్క, నయనతార, విద్యాబాలన్‌ చేస్తున్న మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించాలనుంది. ‘రుద్రమదేవి’, ‘మహానటి’ చిత్రాలు బాగా నచ్చాయి. ఈ మధ్యన ఇంగ్లిష్‌లో ‘ద న్యూ క్లాస్‌మేట్‌’ అనే సినిమా చూశా. కూతురు చదువుతున్న స్కూల్‌లోనే తల్లి కూడా చదువుతుంది. ఆ కథ నా మనసును హత్తుకుంది. ‘ఇలాంటి సినిమాలో నేను.. మా అమ్మాయి నటిస్తే బావుంటుంది’ అనిపించింది. అసలు ఆ సినిమాను మరచిపోలేకపోతున్నా.
 
ఫలానా వారితో పని చెయ్యలేకపోయాననే బాధ ఉందా?
ఉందండీ! చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌ ఈ ముగ్గురు హీరోలతో చెయ్యలేకపోయా. ఆ ఫీల్‌ ఇప్పటికీ ఉంది. అలాగే కెరీర్‌ బిగినింగ్‌లో నాకు సలహాలిచ్చిన రాఘవేంద్రరావుగారితోపాటు పలువురు పెద్ద దర్శకులతో పని చేయలేకపోయాను. కె.విశ్వనాథ్‌గారి దర్శకత్వంలో ‘స్వరాభిషేకం’ చేయడం ఆనందంగా అనిపించింది.
 
సినిమాల్లోకి ఎందుకొచ్చానా అని ఎప్పుడన్నా అనిపించిందా?
అలా ఎప్పుడూ అనిపించలేదండీ! నేను సినిమాలు చేస్తూ చదువుకుంటానంటే డేట్స్‌ అడ్జస్ట్‌ చేసుకుని నాకు సహాయపడ్డారు. ‘ఈ అమ్మాయి ఏంటి చదువు.. చదువు.. అంటూ విసిగిస్తుంది’ అని ఎవరూ చిరాకు పడలేదు. చదువుకి వారంతా విలువిచ్చి నాకు సహాయం చేశారు. కాబట్టే నేను ఎం.సి.ఏ పూర్తి చేయగలిగా. పరిశ్రమలో నేనెప్పుడూ ఇబ్బంది పడలేదు. అందుకే నాకు పరిశ్రమ అంటే గౌరవం. ‘సినిమా వాళ్లు’ అని ఎవరైనా వేరు చేసి మాట్లాడితే నేనసలు సహించలేను.
 
అప్పట్లో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఇబ్బందులు ఉండేవా?
‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ అప్పట్లో కూడా ఉందనీ, పెద్ద స్థాయిలో కాకుండా చిన్నస్థాయిలోనే జరిగేదని విన్నాను. ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ అని సినిమా పరిశ్రమనే ఎందుకు టార్గెట్‌ చేస్తారో నాకు అర్థం కాదు. సాఫ్ట్‌వేర్‌, హాస్పిటల్‌, కార్పొరేట్‌ ఇలా అన్ని రంగాల్లోనూ అమ్మాయిలను లోబర్చుకోవాలనుకుంటారు. సినిమా అనేది గ్లామర్‌ ఫీల్డ్‌ కాబట్టి ఇక్కడి వాళ్ల గురించే మాట్లాడతారు.
 
యాక్టర్‌కి, డాక్టర్‌కి ఎలా సెట్‌ అయింది?
2005లో నేను ‘తానా’ సభలకు వెళ్లా. అక్కడ మా బంధువుల ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చింది. ‘నాకు 22 ఏళ్లే కదా ఇంకా టైమ్‌ ఉంది’ అన్నాను. ‘మంచి సంబంధం ఉంటే అమ్మానాన్నలతో మాట్లాడండీ’ అన్నాను. మా అంకుల్‌ ఒకాయన ‘నాతో పనిచేసే డాక్టర్‌ ఒకాయన ఉన్నారు చూస్తావా’ అనడిగారు. ‘ఇండియా వెళ్లాక చూసి మాట్లాడతా’ అని చెప్పి వచ్చేశా. కుదరదేమో అనుకున్న పెళ్లి 2006లో జరిగింది. ఆయన పేరు గణేశ్‌. మంచి మనసున్న వ్యక్తి. బేసిగ్గా ఆయన కళకి చాలా గౌరవిస్తారు. నేను డాన్స్‌ స్కూల్‌ పెట్టినా, సినిమాలు చేస్తానన్నా ప్రోత్సహించారు. అత్తగారి వైపు కూడా చాలా సపోర్ట్‌ ఇస్తారు. అలాగని నేను అడ్వాంటేజ్‌ తీసుకోను. మా 12 ఏళ్ల వైవాహిక జీవితం ఆనందంగా సాగుతోంది. మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి శ్లోక ఆరో తరగతి, అబ్బాయి వచన్‌ రెండో తరగతి చదువుతున్నారు. పెళ్లయిన రెండేళ్ల వరకూ నా వంటలతో మా ఆయన్ని బాగా టార్చర్‌ పెట్టా.
 
తర్వాత వంట నేర్చుకుని మా వాళ్లకు బాగా వండిపెడుతున్నా. మా అమ్మ ‘ఇక్కడి గరిట తీసి అక్కడ పెట్ట’మని కూడా చెప్పేది కాదు. ‘ఇప్పుడే ఎందుకులే ఆ తర్వాత ఎలాగూ చేసుకోవాలి కదా’ అనేది. అది కరెక్ట్‌ కాదని తర్వాత తెలిసింది. అందుకే మా అమ్మాయికి అన్ని పనులు నేర్పిస్తున్నా. పేరు, క్రేజ్‌ ఉన్నంత కాలం ఏం చేసినా, ఎలా చేసినా నడుస్తుంది. ఎంత పెద్ద హీరోయిన్‌ అయినా ఇంటికెళ్లాక సాధారణమైన మనిషి అని మరచిపోకూడదు. మూడ్‌ బావుంటే బాగా రెడీ అవుతా. లేదంటే జిడ్డుగానే బయటకు వెళ్లిపోతా.
 
చిన్నప్పుడు అమ్మ చెప్పిన జాగ్రత్తలు మీరు పిల్లలకు చెబుతారా?
వంటలు, వార్పులు నేర్పలేదు. కానీ అమ్మానాన్న లెక్కలేనన్ని జాగ్రత్తలు చెప్పేవారు. ‘స్కూల్‌ దగ్గర ఎవరన్నా ఏదన్నా ఇస్తే తినొద్దు. లేట్‌ అయితే.. ఫోన్‌ చేయ్యి’ అంటూ తెగ చెప్పేవాళ్లు. కానీ ఇప్పటి రోజులు అలా లేవు. బయట పరిస్థితులు చూస్తే భయంగా ఉంటోంది. ఇప్పుడు నా పిల్లల్ని నేనే స్కూల్‌ దగ్గర డ్రాప్‌ చేస్తుంటే.. ‘ఆ రోజుల్లో అమ్మ నన్ను ఒంటరిగా స్కూల్‌కి ఎలా పంపేది’ అనిపిస్తుంటుంది. మనిషికి పాజిటివ్‌ థింకింగ్‌ ఉండాలి. నా పిల్లలకు నేను అదే నేర్పుతున్నా.
 
ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు?
రెండేళ్ల క్రితం వరకూ ఐటీ జాబ్‌ చేశా. ‘లయాస్‌ డ్యాన్స్‌ అకాడమీ’ పేరుతో డ్యాన్స్‌ స్కూల్‌ ప్రారంభించా. నాకు ఎలాగూ డ్యాన్స్‌ మీద పట్టుంది. కాబట్టి నేనే స్వయంగా 60 మందికి డ్యాన్స్‌ నేర్పిస్తున్నా. నేను పదేళ్ల వయసులో డ్యాన్స్‌ నేర్చుకుంటే.. నా కూతురు ఐదేళ్లకే డ్యాన్స్‌ మీద దృష్టి పెట్టింది. ఇప్పుడు పూర్తిగా కుటుంబం, స్కూల్‌ మీదే దృష్టి సారిస్తున్నా. రానున్న రెండేళ్లల్లో నా స్కూల్‌ని ఉన్నత స్థాయికి తీసుకురావాలని కృషి చేస్తున్నా.
 
నన్ను నన్నుగా ఇష్టపడాలి!
నేను చేసే పనుల వల్ల నన్ను ఎవరన్నా ఇష్టపడితే నాకు నచ్చదు. నన్ను నన్నుగా గుర్తించి ఇష్టపడితేనే ఇష్టం. నా భర్త నేను అలాగే ఉంటాం. సొసైటీలో ఏ మనిషినీ నేను తక్కువగా చూడను. ఎవరికి వారే గొప్ప. బిగినింగ్‌లో నాకు గొడుగుపట్టి, కుర్చీ వేసి, టచప్‌ చేసిన కుర్రాడు, వాళ్ల కుటుంబంతో ఇప్పటికీ టచ్‌లో ఉంటా. హైదరాబాద్‌ వస్తే వాళ్లను తప్పకుండా కలుస్తా.
 
పౌరుషంతో తాగా!
ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా డైట్‌ కోక్‌ అంటే నాకు చాలా ఇష్టం. దాని వెనుక పెద్ద కథ ఉంది. చిన్నతనంలో విజయవాడలో ఓ కిరాణా కొట్టుకి వెళ్లి గోల్డ్‌స్పాట్‌ డ్రింక్‌ అడిగితే షాపు అతను లేదని లిమ్కా, థమ్స్‌అప్‌ ఉందన్నాడు. పక్కనే ఉన్న ఇద్దరు కుర్రాళ్లు చిన్న పిల్లల్లాగా ఇంకా గోల్డ్‌ స్పాట్‌ తాగడమేంటని హేళన చేశారు. పౌరుషంతో ఎత్తింది దించకుండా తాగాను. అలా థమ్స్‌అప్‌ బాగా అలవాటైపోయింది. అమెరికాలో అది దొరక్క ‘డైట్‌కోక్‌’ అలవాటు చేసుకున్నా. మెల్లగా మానేయాలనుకుంటున్నా.
 
ముంత మసాలా మిస్‌ అవుతున్నా!
విజయవాడ బెంజి సర్కిల్‌ సెంటర్‌లో మరమరాలతో ముంత మసాలా చేసే బండి ఉండేది. నాకు అదంటే చాలా ఇష్టం. శని, ఆదివారాల్లో రెండు రూపాయలతో అది తినాల్సిందే. ఆ పొట్లంలో స్ఫూన్‌లాగా ఓ తాటాకు ముక్క ఇచ్చేవాడు. పచ్చి కారంతో కలిపేవాడు కానీ ఆ టేస్టే వేరు. విజయవాడ నుంచి హైదరాబాద్‌, అక్కడి నుంచి అమెరికా వచ్చేశాక మళ్లీ ఆ టేస్ట్‌ చూడలేదు. బాలకృష్ణగారి ఇంటి దగ్గర్లో ఓ పానీపూరి బండి ఉండేది. అక్కడ మాత్రమే మసాలా వాటర్‌ వేడిగా ఉండేది. ఆ రుచి మరెక్కడా ఉండేది కాదు. అందుకే పోటీపడుతూ పానీపూరి తినేదాన్ని. హైదరాబాద్‌ వచ్చిన ప్రతిసారీ ఆ ప్లేస్‌లో పానీపూరి బండి ఉందా, లేదా అని చూస్తా.
 
ఇప్పుడేంటి ఈ గోల
ఇప్పుడు ఒక హీరోయిన్‌ మేకప్‌ వేసుకుని బయటకు వెళ్తే ఎవరు షూట్‌ చేస్తారో, ఏ యూట్యూబ్‌ ఛానెల్‌లో ఏమని రాస్తారో తెలీదు. ఈ మధ్యనే నేనొక ఇంటర్వ్యూ ఇచ్చా. అందులో నా తెలుగు బాగోలేదని ఏదో యూట్యూబ్‌ ఛానెల్‌లో ‘లయ మాతృభాషను కూడా పట్టిపట్టి మాట్లాడుతోంది’ అని ఓ వీడియో పోస్ట్‌ చేశారు. కొన్నేళ్లుగా వేరే ప్రాంతంలో ఉంటున్నప్పుడు యాస మారడం సహజం. నేను నా భాషను, యాసను మరచిపోలేదు. నా మాట తీరు అంతే! అసలు పర్ఫెక్ట్‌గా తెలుగు ఎంతమంది మాట్లాడుతున్నారు? ఆడియో ఫంక్షన్లలో ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. బూతులు తిడుతున్నారు! వాళ్లను ఎందుకు నిలదీయరు? అమ్మాయిలంటే అంత లోకువా? మనిషికో న్యాయమా? నా మానాన నేనెక్కడో ఓ మూలన బతుకుతున్నా.
 
లాంగ్వేజ్‌ బాగోలేదు అంటూ నన్నెందుకు పబ్లిక్‌ ప్లాట్‌ఫామ్‌ మీద అల్లరి చేయాలి? నన్నే కాదు ఎంతో మంది అమ్మాయులను ఇలాగే అల్లరి చేస్తున్నారు. వాళ్లకు కూడా ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి ఉంటారుగా. అలాంటి సందర్భంలో వాళ్లు గుర్తురారా? సోషల్‌ మీడియా వల్లే ఈ గోల అంతా. ఫ్యామిలీ ఫొటో ఫేస్‌బుక్‌లో పెట్టాలన్నా భయంగా ఉంటుంది. చిన్న పిల్లల్ని కూడా వదలడం లేదు. ఆర్టిస్ట్‌గా నటన బాగోకపోతే విమర్శించొచ్చు. వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్‌ చేయకూడదు. నేను ఎవర్నీ పల్లెత్తు మాట అనను. తెలియకుండా ఎవరి మనసన్నా బాధపెట్టి.. ఆ విషయం నాకు తెలిస్తే క్షమాపణ చెప్పడానికి నామోషీగా భావించను.
 
నేను చేసిన సినిమాల్లో ‘స్వయంవరం’, ‘మనోహరం’, ‘ప్రేమించు’, ‘హనుమాన్‌ జంక్షన్‌’, ‘మిస్సమ్మ’, ‘మనసున్న మారాజు’ సినిమాలంటే చాలా ఇష్టం. గుణశేఖర్‌, పెద్ద వంశీగారి డైరెక్షన్‌ స్టైల్‌ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల వర్కింగ్‌ స్టైల్‌లో డీటెయిలింగ్‌ ఉంటుంది. ‘మనోహరం’ సినిమా చేస్తున్నప్పుడు ‘నువ్వు ఈ సినిమా తపనతో చేస్తే డెఫినెట్‌గా అవార్డ్‌ వస్తుంది’ అని గుణశేఖర్‌గారు చెప్పారు. ఆయన చెప్పినట్టే నేను ఆ సినిమాకు చాలా కష్టపడ్డా. ఫలితంగా ఉత్తమనటిగా నంది పురస్కారం అందుకున్నా. డీగ్లామర్‌, బ్లైండ్‌ క్యారెక్టర్‌ అని ‘ప్రేమించు’ సినిమా చెయ్యొద్దని చాలామంది చెప్పారు. కథ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌గా ఉందని చేశా. అది కూడా బాగా ఆడింది. మరో ‘నంది’ని తీసుకొచ్చింది.
 
-ఆలపాటి మధు