Srikakulam-Youth-900-crore-turnover-company

తూర్పు, పడమర శాస్త్రీయ వారధి!

ఉద్యోగులు 5000.. టర్నోవర్‌ 900 కోట్లు

ఓమిక్స్‌ ఇంటర్నేషనల్‌తో వినూత్న ప్రయోగం
శ్రీకాకుళం కుర్రాడి విజయ ప్రస్థానం
 
ఈ ప్రపంచంలో అనేక అవకాశాలుంటాయి. వాటిని అందరి కన్నా ముందుగా అందిపుచ్చుకున్న వారే విజేతగా నిలుస్తారు. అలాంటి ఒక యువ శాస్త్రవేత్త డాక్టర్‌ జి. శ్రీనుబాబు. శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి.. చదువుకోవడానికి రోజుకు ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లొచ్చిన సాదాసీదా కుర్రాడు! ఆ అబ్బాయే.. మధుమేహ వ్యాధి నివారణపై పరిశోధనలు చేసి సియోల్‌లోని హ్యూమన్‌ ప్రొటోమ్‌ ఆర్గనైజేషన్‌ నుంచి యువ శాస్త్రవేత్త అవార్డు పొందాడు. తాను పరిశోధనలు చేస్తున్న సమయంలో సమాచారం కోసం తాను పడిన తిప్పలను గుర్తుపెట్టుకొని.. అందరికీ సమాచారం అందించాలనే ఉద్దేశంతో ఓమిక్స్‌ అనే కంపెనీని స్థాపించాడు. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఈ కంపెనీ ఐదు వేల మంది ఉద్యోగులతో.. 900 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. ఆ యువ విజేత.. డాక్టర్‌ జి.శ్రీనుబాబు. ఆయన విజయ ప్రస్థానం ఆయన మాటల్లోనే..
 
‘మాది శ్రీకాకుళం దగ్గర ఒక కుగ్రామం. దిగువ మధ్యతరగతి కుటుంబం కావడంతో చదువుకోవడానికి అవసరమైన సదుపాయాలేమీ ఉండేవి కావు. స్కూలుకు వెళ్లడానికి ఏడు కిలోమీటర్ల నడక. చేతిలో డబ్బులు లేకపోవటం వల్ల ఫీజు కట్టలేకపోయేవాళ్లం. ఎప్పుడు చదువు ఆగిపోతుందోననే భయంతోనే నా బాల్యమంతా గడిచిపోయింది. ఇంటర్‌ పూర్తయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఫార్మసీలో చేరా. స్కాలర్‌షి్‌పల సాయంతో డిగ్రీ పూర్తి చేసి.. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే పీహెచ్‌డీ చేయటానికి చేరా. ఇప్పుడైతే ఇంటర్నెట్‌ సహా అనేక సదుపాయాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయిగానీ 20 ఏళ్ల క్రితం ఇవేమీ పెద్దగా అందుబాటులో ఉండేవి కాదు. ముఖ్యంగా శాస్త్రీయ పరిశోధనలకు అవసరమైన సమాచారం కొన్ని జర్నల్స్‌లో మాత్రమే లభించేది. ఆ జర్నల్స్‌ హైదరాబాద్‌లోని సీసీఎంబీ, ఐఐసీటీ వంటి సంస్థల లైబ్రరీలలో ఉండేవి. వాటి కోసం నేను వైజాగ్‌ నుంచి ప్రతి వారం హైదరాబాద్‌ వచ్చేవాడిని. మన దేశంలో పరిశోధనలకు ప్రధాన అడ్డంకి సమాచార లేమి అనే విషయం ఆ సమయంలోనే నాకు తెలిసింది. అలా ఇబ్బంది పడుతూనే పీహెచ్‌డీ పూర్తి చేశా. మధుమేహ వ్యాధిలో కీలకపాత్ర పోషించే ప్రొటీన్‌ల మోడలింగ్‌కు సంబంధించి నాకు డాక్టరేట్‌ వచ్చింది. ఆ తర్వాత నా పరిశోధనలు కొనసాగించా. ఈ పరిశోధనలకు నాకు సియోల్‌లోని హ్యూమన్‌ ప్రొటోమ్‌ ఆర్గనైజేషన్‌ నుంచి యువ శాస్త్రవేత్త అవార్డు కూడా లభించింది. ఆ సమయంలోనే నాకు స్టాన్‌ఫర్డ్‌లో ప్రొస్టే్ట్రట్‌ కేన్సర్‌పై పరిశోధనలు చేసే అవకాశం లభించింది. అక్కడ నేను అభివృద్ధి చేసిన మోడల్స్‌నే ఇప్పటికీ వాడుతున్నారు. ఆ సమయంలోనే నాకు జర్నల్స్‌కు సంబంధించిన అంశాలపై అవగాహన ఏర్పడింది.
 
విజ్ఞాన వ్యాపారం..
పాశ్చాత్య దేశాల్లో సమాచారం అనేది పెద్ద విజ్ఞాన వ్యాపారం. ఉదాహరణకు మీరు ఒక పరిశోధన చేశారనుకుందాం. దానిని ఒక ప్రముఖ సైన్స్‌ మ్యాగజైన్‌లో ప్రచురించానుకుందాం. దానిని ఎవరైనా చదవాలంటే కొంత రుసుము చెల్లించాలి. ఇలా చాలా సంస్థలు ఒకో ఆర్టికల్‌ మీద ఏడాదికి ఐదు నుంచి పది వేల డాలర్ల వరకూ సంపాదిస్తూ ఉంటాయి. దీంతోపాటు సబ్‌స్ర్కిప్షన్స్‌, కాన్ఫరెన్స్‌లను నిర్వహించడం వంటివాటి ద్వారా సొమ్ము సంపాదిస్తూ ఉంటారు. నేను ఓమిక్స్‌ను స్థాపించే దాకా ఇలాంటి సంస్థలు ప్రపంచంలో రెండు, మూడో ఉన్నాయి. వాటి వార్షికాదాయం వేల కోట్ల రూపాయలుంటుంది. అయితే ఈ పద్ధతి వల్ల కొందరికి మాత్రమే సమాచారం అందుతూ ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో పరిశోధకులకు నాణ్యమైన సమాచారం అందదు. ఇలాంటి పరిస్థితిని అధిగమించటానికి నేను ఓపెన్‌ సోర్స్‌ జర్నల్‌ పద్ధతిలో ఓమిక్స్‌ కంపెనీని ప్రారంభించా. దీనిలో ఒకసారి చందా కడితే చాలు. మా దగ్గర అప్‌డేట్‌ అయ్యే సమాచారాన్నంత చదువుకోవచ్చు. మా దగ్గర ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమయ్యే కొన్ని కోట్ల పేజీల సమాచారాన్ని వారు చదువుకోవచ్చు. ఇలా మేము ప్రస్తుతం వెయ్యికిపైగా సైంటిఫిక్‌ జర్నల్స్‌ను ప్రచురిస్తున్నాం. వీటిలో వివిధ శాస్త్ర రంగాలకు సంబంధించిన 50 వేలకు పైగా వ్యాసాలు ప్రచురితమవుతాయి. మా విస్తృతి, వ్యాసాలలోని నాణ్యత వల్ల మా వెబ్‌సైట్‌ను(www.pulsus.com) సందర్శించే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం మా దగ్గర ఐదు వేల మంది పనిచేస్తున్నారు. వీరిలో 75 శాతానికి పైగా మహిళలే! మాకు రుసుము చెల్లించి మా వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం కోసం వచ్చే కస్టమర్ల సంఖ్య ఏడాదికి రెండు కోట్ల దాకా ఉంటుంది. ప్రస్తుతం మా టర్నోవర్‌ 900 కోట్ల రూపాయలు. ఇది భవిష్యత్తులో మరింతగా పెరుగుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు.
 
అనువాదం కూడా..
ఈ ప్రస్థానంలో నేను అనేక పాఠాలు నేర్చుకున్నా. ప్రస్తుతం మేము పబ్లిషింగ్‌తో పాటు సాంకేతిక సమావేశాల నిర్వహణ, అనువాదాలను కూడా ప్రారంభించాం. ఏటా మేం ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడు వేల సమావేశాలను నిర్వహిస్తూ ఉంటాం. ఇక అనువాదాల విషయానికి వస్తే- 1.25 కోట్ల పేజీ సాంకేతిక సమాచారాన్ని రష్యన్‌లోకి అనువదించాం. చైనీస్ లోకి కూడా మా వద్ద ఉన్న సాంకేతిక సమాచారాన్ని అనువాదం చేసి అందిస్తున్నాం. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంతో కూడా హిందీలోకి సాంకేతిక సమాచారం అనువాదానికి ఒక ఒప్పందం చేసుకున్నాం. ఇవన్నీ ఒక వైపు జరుగుతున్నా- తెలుగు భాషలోకి సాంకేతిక సమాచారం లేదనే భావన నాకు ఇబ్బంది కలిగిస్తూనే ఉంది. అందుకే తెలుగులోకి దాదాపు రెండు కోట్ల పేజీల సాంకేతిక సమాచారాన్ని అనువాదం చేయాలని ఒక ప్రాజెక్టును ప్రారంభించాం. ఇది పూర్తయ్యే సరికి మరో మూడు, నాలుగేళ్లు పడుతుంది.
 
ఈ ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత తెలుగునకు సంబంధించిన అనేక అంశాలపై దృష్టిని కేంద్రీకరించాం. మన దేశంలో హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష తెలుగే! అయినా తెలుగులో పరిశోధకులకు అవసరమైన సాంకేతిక సమాచారం దొరకదు. ఎవరైనా మొదట తమ మాతృభాషలో ఆలోచిస్తారు. ఆ తర్వాతే ఇతర భాషలలోకి తమ ఆలోచనలను అనువదిస్తారు. అలాంటప్పుడు మనం తెలుగును ఎందుకు చిన్న చూపు చూడాలి? ఇటీవల మేము శ్రీకాకుళంలో ఒక సైన్స్‌ ఫెయిర్‌ నిర్వహించాం. అందులో పాల్గొన్న వారి ఆలోచనలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి.
 
కానీ వాటిని అంతర్జాతీయంగా పట్టుకువెళ్లే వేదిక లేదు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న సాంకేతిక సమాచారమంతా తెలుగులోకి వస్తే- గ్రామ గ్రామాల్లో ఉన్న పరిశోధకులు తమ ఆలోచనలకు మరింత పదును పెట్టుకోవచ్చు. అలాంటి వేదికగా మేము నిలవాలని భావిస్తున్నాం. దీని కోసం వైజాగ్‌లో వెయ్యి మంది సిబ్బందితో ఒక కార్యాలయాన్ని ప్రారంభిస్తాం. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు వచ్చాయి.
-స్పెషల్‌ డెస్క్‌