ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి, అక్కడే స్థిరపడిన భారతీయుల్లో మోనిషా ఘోష్ కూడా ఒకరు. సమాచార రంగంలో పరిశోధకురాలిగా సమాచార, సాంకేతిక వ్యవస్థ మీద అనతికాలంలోనే తనదైన ముద్ర వేశారామె. తాజాగా అక్కడి ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ (ఎఫ్‌సీసీ)లో ముఖ్య సాంకేతిక అధికారిణిగా ఎంపికై వార్తల్లో నిలిచారు. ఈ హోదాకు చేరుకున్న మొదటి మహిళ ఆమే కావడం విశేషం. జనవరిలో సీటీవోగా బాధ్యతలు చేపట్టనున్న మోనిషా విశేషాలివి...
అమెరికాలో రేడియో, టీవీ, శాటిలైట్, కేబుల్ ద్వారా జరిగే అంతర్‌రాష్ట్ర, అంతర్జాతీయ సమాచారాన్ని ఎఫ్‌సీసీ నియంత్రిస్తుంది. ఎఫ్‌సీసీ అనేది అమెరికా ప్రభుత్వంలోని శక్తిమంతమైన స్వతంత్ర సంస్థ. ఇది అమెరికన్ కాంగ్రెస్ కనుసన్నల్లో పనిచేస్తుంది. అమెరికాలో సమాచార వ్యవస్థకు సంబంధించిన చట్టం, నియమాలు సవ్యంగా అమలు చేయడం ఈ సంస్థ బాధ్యత. ఎఫ్‌సీసీలో ఇప్పటివరకూ ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా మగవాళ్లే ఉండేవారు. మొదటిసారిగా ఒక మహిళకు ఆ అవకాశం దక్కింది. ప్రస్తుతం మోనిషా షికాగో యూనివర్సిటీకి చెందిన అర్‌గొన్నె నేషనల్ ల్యాబరేటరీలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
వైర్‌లెస్ రంగంలో అందెవేసిన చెయ్యి....
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ పూర్తయ్యాక తన బ్యాచ్‌మేట్స్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే మోనిషా మాత్రం పీహెచ్‌డీ చేయాలనుకున్నారు. వైర్‌లెస్ కమ్యూనికేషన్, సిగ్నల్ ప్రాసెసింగ్ మీద ఆమెకు ఆసక్తి ఎక్కువ. దాంతో అదే అంశం మీద పీహెచ్‌డీ చేయాలనుకున్నారామె. అదే సమయంలో కాలిఫోర్నియాలోని సదరన్ యూనివర్సిటీలో ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్‌లో పరిశోధన చేసే అవకాశం రావడంతో వెంటనే చేరిపోయారు మోనిషా. పీహెచ్‌డీ తరువాత షికాగో యూనివర్సిటీలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా కొన్నాళ్లు పనిచేశారు. సమాచార వ్యవస్థలో వేగంగా వస్తోన్న మార్పులను గమనించడం, తదనుగుణంగా పరిశోధనలు చేయడంలో మోనిషా ముందుండేవారు. ఆ క్రమంలోనే ఆమె వైర్‌లెస్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 5జీ, వైఫై వ్యవస్థ మీద పరిశోధనలు చేశారు. వీటితో పాటు వ్యవసాయ రంగంలో తక్కువ శక్తితో పనిచేసే సెన్సార్ నెట్‌వర్క్స్ రూపొందించడం, సిగ్నల్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో జన్యుక్రమాన్ని అధ్యయనం చేయడం మీద ఆమె దృష్టి సారిస్తున్నారు.
అమెరికన్లకు 5జీ టెక్నాలజీ అందుబాటులోకి తేవడంలో మోనిషా కీలకపాత్ర పోషిస్తారని ప్రస్తుతం ఎఫ్‌సీసీ ఛైర్మన్‌గా ఉన్న భారతీయ అమెరికన్ అజిత్ పాయ్ ఆమెను ప్రశంసించారు. ‘‘డాక్టర్ ఘోష్ వైర్‌లెస్ టెక్నాలజీ మీద ఎన్నో పరిశోధనలు చేశారు. ఆమె పరిశోధనలు ఎంతో విలువైనవి. ఇంటర్నెట్ థింగ్స్ నుంచి మెడికల్ టెలీమెట్రీ, బ్రాడ్‌కాస్టింగ్‌కు సంబంధించిన సమాచారం ఆమె సొంతం. ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా మోనిషా నియామకం చరిత్రలో నిలిచిపోతుంది. సైన్స్ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకునేందుకు ఎంతోమంది అమ్మాయిలకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తారని భావిస్తున్నా’’ అంటున్నారు అజిత్. జనవరి 13న సీటీవోగా బాధ్యతలు చేపట్టనున్న మోనిషా ఇప్పటి వరకూ 50కి పైగా పరిశోధన పత్రాలు సమర్పించారు. ఆమె పేరిట 40 పేటెంట్లు కూడా ఉన్నాయి.