She-faced-restrictions-with-courage-and-became-a-best-racer

ఆంక్షలను అధిగమించి... రేసర్‌గా దూసుకెళ్తోంది!

రయ్‌మంటూ దూసుకెళ్లే రేస్‌ కార్లను చూసిన ఆమె పెద్దయ్యాక రేసర్‌ కావాలనుకుంది. కానీ ఆమె పుట్టింది మహిళలను డ్రైవింగ్‌ నేర్చుకోవడానికి అనుమతించని సౌదీ అరేబియాలో. కాలక్రమంలో రీమా జుఫ్ఫాలీ ఆ దేశంలోనే తొలి మహిళా రేసర్‌గా గుర్తింపు సాధించింది. ఆంక్షల నీడలో కాలం వెళ్లదీస్తున్న ఈ ఎడారి దేశంలోని మహిళల స్వాభిమానానికి ప్రతీకగా నిలుస్తున్న రీమా జర్నీ ఇది.

 
రీమా పుట్టింది సౌదీ అరేబియాలోని జెడ్డాలో. అక్కడి బ్రిటిష్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తిచేశారు. ఉన్నత విద్య కోసం 2010లో అమెరికా వెళ్లి అక్కడి బోస్టన్‌ నగరంలో ఉన్న నార్త్‌ఈస్ట్రర్న్‌ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌ కోర్సు చేశారు. అలా చదువు నిమిత్తం కొన్నాళ్లు అమెరికాలో ఉన్న ఆమె టీనేజ్‌ నుంచే రేస్‌ కార్ల మీద ఆసక్తి పెంచుకున్నారు. ఫార్ములా వన్‌ రేస్‌లు ఎక్కువగా చూసేవారు. ఈ క్రమంలో డ్రైవింగ్‌ నేర్చుకున్నారు. డ్రైవింగ్‌ టెస్ట్‌ కూడా పాస్‌ అయ్యారు. తరువాత బీఎండబ్య్లూ 3 సిరీస్‌ కారు కొనుక్కున్నారు. చలికాలంలో మంచు పరుచుకున్న రోడ్ల మీద కారు డ్రైవ్‌ చేస్తూ ఎంజాయ్‌ చేసేవారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక ఉద్యోగంలో చేరాలనుకున్న ఆమెను డ్రైవింగ్‌ మీదున్న ఆసక్తి కుదురుగా ఉండనిచ్చేది కాదు. అప్పుడే ఆమెకు ఫ్లోరిడాలో ఉన్న ‘స్కిప్‌ బార్బర్‌ రేసింగ్‌ స్కూల్‌’ గురించి తెలిసింది. అమెరికాలో జరిగే ప్రతి మెగా ఆటో రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆ స్కూల్లో శిక్షణ తీసుకున్న వారే విజేతలుగా నిలిచేవారని తెలుసుకొని అక్కడ చేరారు. ‘‘అందులో చేరాక నా ఆలోచన విధానం పూర్తిగా మారింది. డ్రైవింగ్‌లో అద్భుతాలు చేయాలన్న పట్టుదల పెరిగింది’’ అంటారు రీమా.
 
ఆమెను చూసి రేసర్‌ అవ్వాలనుకుంది...
అయితే ఆర్థిక కష్టాలు మొదలవడంతో రీమా ఉద్యోగ ప్రయత్నాలు మొదలెట్టారు. లండన్‌లో స్టార్ట్‌ప్‌లో కొన్ని రోజులు పనిచేసిన అనుభవంతో చెల్లెలితో కలిసి రెస్టారెంట్‌ ప్రారంభించాలని అనుకున్నారు. అదే సమయంలో స్కాట్లాండ్‌కు చెందిన మహిళా రేసర్‌ సూసీ వోల్ఫ్‌తో ఏర్పడిన పరిచయం రీమాను ప్రొఫెషనల్‌ రేసింగ్‌ వైపు మళ్లేలా చేసింది. అలా 2017 డిసెంబర్‌లో రేసింగ్‌ లైసెన్స్‌ సాధించిన తొలి సౌదీ మహిళగా వార్తల్లోకెక్కారు. గత ఏడాది అబుదాబీలో జరిగిన పలు రేసింగ్‌ పోటీల్లో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎఫ్‌4 బ్రిటిష్‌ ఛాంపియన్‌షిప్‌లో చక్కని ప్రదర్శన చేశారు. రీమా ప్రతిభ చూసి సౌదీకి చెందిన ‘నేషనల్‌ క్యారియర్‌ ఎయిర్‌లైన్స్‌’ సంస్థ ఆమెను స్పాన్సర్‌ చేసేందుకు ముందుకొచ్చింది. ‘రీమా రేసర్‌ అవడం మా దేశంలో చాలా గొప్ప విషయం. ప్రొఫెషనల్‌ రేసర్‌గా ఆమె రాణించాలని ప్రతి ఒక్కరు కోరకుంటున్నారు’ అని సౌదీ అరేబియా స్పోర్ట్స్‌ అథారిటీ ఛీఫ్‌ ప్రిన్స్‌ అబ్దుల్‌ అజిజ్‌ బిన్‌ తుర్కీఅల్‌ ఫైజల్‌ అన్నారు.
 
నిషేధం ఎత్తివేయడంతో రెక్కలు...
సౌదీ అరేబియాలో మహిళలు వాహనాలు నడపకూడదనే ఆంక్షలు ఎన్నో ఏళ్లుగా ఉన్నాయి. అయితే ఆ దేశ ప్రస్తుత రాజు ప్రిన్స్‌ మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ మహిళలకు స్వేచ్ఛనిస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఆడవాళ్లు డ్రైవింగ్‌ నేర్చుకోవడం మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సంచలన ప్రకటన చేశారు. ఆ నిర్ణయంతో సౌదీ తరఫున తొలి మహిళా రేసర్‌గా సత్తా చాటేందుకు రీమాకు అవకాశం దొరికింది. ‘‘ప్రొఫెషనల్‌ రేసర్‌ అవ్వాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. రేసింగ్‌లోకి ఆలస్యంగా అడుగు పెట్టినప్పటికీ తక్కువ సమయంలోనే రేసింగ్‌ కార్లను ఉరికించడంలో పట్టు సాధించా. ఇప్పటి వరకూ పురుషులు మాత్రమే రేసింగ్‌ కార్లు నడపడం చూసిన వాళ్లు, డ్రైవింగ్‌ నేర్చుకోని చాలామంది అమ్మాయిలు నేను రేసింగ్‌ కారు నడపడం చూసి ఆశ్చర్యపోతున్నారు. చాలామంది మహిళలకు డ్రైవింగ్‌ అనేది ఇంకా నెరవేరని కలగానే ఉంది. అందరు తల్లితండ్రుల్లానే మా అమ్మానాన్నా నా భద్రత గురించి కొంత ఆందోళన చెందేవారు. కానీ నా పట్టుదలను అర్థం చేసుకొని వెన్నుతట్టారు. నా ప్రతి అడుగులో వారి సహకారం, ప్రోత్సాహం ఎంతో ఉంది’’ అని చెబుతారు రీమా.
 
ఆమె కల అదే..
ఫ్రాన్స్‌లో 24 గంటలు జరిగే ‘లే మాన్స్‌’ రేసింగ్‌ పోటీలో పాల్గొనాలనేది రీమా కల. ఇందులో రేసర్లు రోజంతా విరామం లేకుండా రేసింగ్‌ కార్లను నడుపుతూ ఒళ్లు గగుర్పొడించే విన్యాసాలతో ప్రేక్షకుల్ని అలరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న మోటార్‌ రేసింగ్‌ ఈవెంట్‌ ఇది. ‘‘కేటగిరీ, ఈవెంట్‌తో సంబంధం లేకుండా రేసర్‌గా గొప్ప శిఖరాలు చేరాలన్నది నా లక్ష్యం. పురుషులు ఆధిపత్యం చెలాయించే రేసింగ్‌ స్పోర్ట్స్‌లో మహిళా రేసర్‌గా గుర్తుంపు తెచ్చుకోవడం నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది. సౌదీ అరేబియాలో తొలి మహిళా రేసర్‌ నేనే కావడం నా ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది’’ అని చెబుతున్న రీమా ఇన్నాళ్లు ఆంక్షలతో తమ ఆకాంక్షలకు దూరమైన ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.