Rs5-to-Dh300-million-an-Indian-Expat-Dubai-story

రూ.5తో దుబాయికెళ్లి.. రూ.579 కోట్లకు పడగలెత్తిన భారతీయుడు

18 ఏళ్ల వయసులో... చేతిలో అయిదు రూపాయలతో భారత్ నుంచి దుబాయికి వలస వెళ్లాడా వ్యక్తి.. 1959లో అలా వలస వెళ్లిన ఆ వ్యక్తి నేడు.. ఏకంగా 579 కోట్ల రూపాయలకు అధిపతి. ఎన్నో కష్టాలనోర్చి, ఆటుపోట్లను ఎదుర్కొని తన విజయానికి బాటలు వేసుకున్నాడు. దుబాయిలో సక్సెస్‌ఫుల్ భారతీయ వ్యాపారవేత్తగా పేరుగావించారు. ఆయనే రామ్ బుక్సాని. 
 
1941లో స్వాతంత్ర్యం రాకముందు పాకిస్థాన్ పరిథిలో ఉన్న హైదరాబాద్‌లో రామ్ బుక్సానీ జన్మించారు. అయిదేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి మరణించాడు. ఆ తర్వాత స్వాతంత్ర్యం, వెంటనే దేశ విభజన జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రామ్ బుక్సానీ కుటుంబం భారత్‌లోని గుజరాత్ రాష్ట్రంలోని బరోడాకు (ఇప్పటి వడోదర) వెళ్లిపోయారు. 18 ఏళ్ల వయసు వచ్చేనాటికి చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబానికి అండగా ఉన్నారు. ఆ సమయంలో ఓ పత్రికలో వచ్చిన వార్తను రామ్ బుక్సానీ చూశారు. దుబాయిలోని ఓ అంతర్జాతీయ వాణిజ్య కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌ ఉద్యోగాలున్నాయని ఆ పేపర్లో ప్రకటన వచ్చింది. దీంతో వెంటనే తన తల్లి, సోదరుడికి ఈ విషయం చెప్పారు. ‘నేను దుబాయిలో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తాననీ, గల్ఫ్‌కు వెళ్తానని చెప్పగానే అమ్మ, తమ్ముడు ఆశ్చర్యపోయారు. నా గురించి, నా భవిష్యత్ గురించి మా అమ్మ ఎంతగానో ఆందోళన చెందింది. మొదట్లో వద్దన్నారు. కానీ నేనే పట్టుబట్టి దుబాయికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. మొత్తానికి వారిని ఒప్పించి దుబాయికి వచ్చేశా..’ అని రామ్ బుక్సానీ వివరించారు. 
 
అదో మర్చిపోలేని తీపి జ్ఞాపకం:
నాకున్న అర్హతల వల్ల వెంటనే ఉద్యోగం లభించింది. 60 ఏళ్ల క్రితం.. అంటే 1959లో 18 ఏళ్ల వయసులో నేను దుబాయికి వచ్చా. అప్పట్లో దుబాయిలో విమానాశ్రయం లేదు. ముంబాయి నుంచి పడవ ప్రయాణం చేసి దుబాయికి వెళ్లా. దుబాయికి చేరుకోవడానికి అయిదు రోజులు ప్రయాణం చేయాల్సి వచ్చింది. కరాచీ, మస్కట్, షార్జాహ్ మీదుగా దుబాయికి ప్రయాణం చేశా. నేను ప్రయాణం చేస్తున్న బోటు.. కరాచీ రాగానే ఏదో తెలియని భావోద్వేగం నన్ను అలుముకుంది. నేను ఇక్కడే పుట్టా.. కొన్నాళ్ల పాటు ఇక్కడే పెరిగా. మళ్లీ ఇక్కడకు వస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. అది మరచిపోలేని ఓ తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది. బోటు దిగి ఒక రోజంతా ఆ ప్రాంతంలో తిరగాలని ఉంది. కానీ నా దగ్గర 5 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ డబ్బుతో మళ్లీ టికెట్ కొని.. కొత్తగా ప్రయాణం ప్రారంభిస్తే.. దుబాయిలో అవసరాలకు సరిపోవు. అందుకే దూరం నుంచే నేను పుట్టి పెరిగిన నగరాన్ని చూసి మనసారా ఆస్వాదించా. అయిదు రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత దుబాయికి చేరుకున్నా. నదిలోనే మధ్యలోనే ఆపేసి.. ఓ చిన్న బోటు ద్వారా మమ్మల్ని ఒడ్డుకు తీసుకెళ్లారు. అక్కడే చిన్న కస్టమ్స్ గది ఉంది. మా పాస్‌పోర్టులను అక్కడే తీసుకున్నారు. తర్వాతి రోజు ఆ పాస్‌పోర్టులను మా ఆఫీసు అడ్రస్‌కు పంపించారు. 
 
నిత్యం ప్రజల్లోనే ఉండే దుబాయి రాజు
కంపెనీకి చెందిన ఓ వ్యక్తి వచ్చి మమ్మల్ని ఆఫీసుకు తీసుకెళ్లారు. అప్పట్లో దుబాయి చాలా చిన్నదిగా ఉండేది. ఒక అరగంటలోనే దుబాయిని నేను చట్టి వచ్చా. అప్పటి దుబాయి రాజు, ఇప్పటి దుబాయి రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ తండ్రి అయిన.. షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్.. కస్టమ్స్ ఆఫీసులో కూర్చునేవారు. తమ దేశానిక వస్తున్న ప్రతి ఒక్క విదేశీయుడిని దగ్గర నుంచి కలసుకునేవారు. వారిని సాదరంగా ఆహ్వానించేవారు. రోజూ పొద్దున్నే తెల్లవారుజామున 5గంటలకు ఆయన నిద్రలేచేవారు. ఒక ఓపెన్ టాప్ జీప్‌లో దుబాయి అంతా చుట్టేసేవారు. తిరిగి 6.30గంటలకు తన మసీదుకు వెళ్లేవారు. అక్కడికి ఎవరైనా వచ్చి తమ సమస్యలను చెప్పుకునే వీలు కల్పించారు. వారి సమస్యలను తీర్చి పంపించేవారు. 
 
షేవింగ్‌కు కూడా అలవెన్స్ ఇచ్చారు
అప్పట్లో అక్కడ ఆహారాన్ని స్వీకరించే పద్ధతి వేరుగా ఉండేది. పెద్ద గిన్నెలో మటన్ కూరను ఉంచేవారు. చపాతీలను మరో ప్లేట్‌లో ఉంచేవారు. చేతిలో చపాతీని తీసుకుని గిన్నెలోని కూరను అద్దుకుని తినేవారు. అందరికీ కలిపి ఒకే గిన్నె ఉండేది. మన దేశంలోలాగా వేరు వేరు కంచాలు ఉండేవి కావు. తినేందుకు అనుసరిస్తున్న పద్ధతి.. ఒకరిపై మరొకరికి అనుబంధాన్ని పెంచుతుందని వారి నమ్మకం. 1959 ప్రాంతంలో దుబాయిలో విద్యుత్ సరఫరా వ్యవస్థ తక్కువగానే ఉండేది. ఫ్రిడ్జిలు, కూలర్లు వంటివి అప్పుడు అసలే లేవు. కేవలం గదిలో ఒక ఫ్యాన్ మాత్రమే ఉండేది. సాయంత్రం 6.30 గంటలకు దుబాయిలోని ప్రజలంతా నిద్రకు ఉపక్రమించేవాళ్లు. అది అంతా ఆశ్చర్యంగా కనిపించేంది. నాకు నెల జీతం.. 125 రూపాయలుగా ఉండేది. భోజనం, వసతి, ఒకసారికి హెయిర్ కటింగ్‌కు అయే ఖర్చుతోపాటు రెండు సినిమా టికెట్లను కూడా ప్రతీనెలా ఇచ్చేవారు. షేవింగ్ అలవెన్స్ కూడా ఉండేది. పెద్దగా ఖర్చులు లేకపోవడంతో మొదటి నెల జీతంలో 75 రూపాయలను మా అమ్మకు పంపించాను. నా తమ్ముడి చదువుకు ఆ డబ్బు చాలా ఉపయోగపడ్డాయి. 
 
నా జీవితాన్ని మలుపు తిప్పిన ఆఫర్
నా పని తీరును చూసి.. మూడేళ్ల తర్వాత కంపెనీ ఓ ఆఫర్‌ను ఇచ్చింది. జీతాన్ని 125 రూపాయల నుంచి 400కు పెంచడం ఒకటి కాగా.. జీతాన్ని రూ.300కు పెంచుతూ కంపెనీ లాభాల్లో షేర్‌ను ఇవ్వడం. ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకోమని యాజమాన్యం చెప్పింది. ఆ పరిస్థితుల్లో ఎవరైనా జీతం పెరుగుదల గురించే ఆలోచించేవారు.. కానీ నేను మాత్రం రెండో ఆప్షన్‌ను ఎంచుకున్నా.. అదే నా జీవితాన్ని మలుపు తిప్పింది. 21 ఏళ్లకే సంపాదించే పరిస్థితుల నుంచి ఏదైనా సాధించే అవకాశాన్ని చేజిక్కించుకున్నాను. నన్ను వెతుక్కుంటూ వచ్చిన సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకున్నాను. 
 
మొదట్లో బయటి నుంచి బ్రోకర్లు వచ్చి మా కంపెనీ శాంపిల్స్‌ను తీసుకునేవారు. వాటిని వారు బయటి మార్కెట్లో అమ్ముకునేవారు. ఈ విధానం వల్ల నష్టపోతున్నామని నాకు అనిపించింది. శాంపిల్స్‌ను బయటకు తీసుకెళ్లి ప్రజలకు, చిన్న తరహా వ్యాపారస్తులకు నేనే అమ్మాలనుకుంటున్నానీ, కస్టమర్లను స్వయంగా రప్పిస్తానని  సీనియర్‌కు చెప్పా. దానికి ఆయన వద్దన్నారు. ఒక రోజు చెప్పాపెట్టకుండా, ఆయన అనుమతి తీసుకోకుండా సిగరెట్, లైటర్, పింగాళీ గిన్నెల శాంపిల్స్‌ను దుస్తుల్లో దాచుకుని దొంగచాటుగా బయటకు తీసుకెళ్లాను. దగ్గరలోని సిటీకి వెళ్లి వాటిని అమ్మాను. ఓ చిన్న వ్యాపారవేత్త వాటిని కొని ఏకంగా 125 డాలర్ల విలువ చేసే వస్తువులను ఆర్డర్ కూడా ఇచ్చాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వచ్చి.. సీనియర్‌కు జరిగిందంతా చెప్పాడు. ఆయన కూడా ఆశ్చర్యపోయి ప్రోత్సహించాడు. వ్యాపారం బాగుందనుకుంటుండగా.. కొన్నాళ్లకు సహభాగస్వాములు కొందరు తమ షేర్లను అమ్మాలనుకుంటున్నట్లు తెలిపారు. నేను చేస్తున్న వ్యాపారంపై నాకు నమ్మకం ఉంది కాబట్టి.. అదే అవకాశంగా నేను ఆ షేర్లను కొన్నాను. ఇంటర్నేషనల్ ట్రిమ్మింగ్స్ అండ్ లేబుల్స్ గ్రూప్‌ కంపెనీని ఏర్పాటు చేశా.. వివిధ రంగాలకు వ్యాపారాన్ని విస్తరించా. ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ రంగంలోకి కూడా అడుగుపెట్టా. కాస్మొటిక్స్, టెక్స్‌టైల్స్‌లోనూ విజయం సాధించా..
 
రూ.5 నుంచి వందల కోట్లకు..
ప్రస్తుతం రామ్ బుక్సానీ.. దుబాయిలో ఓ ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త.. ఐటీఎల్ కాస్మోస్ గ్రూప్‌ చైర్మన్. ఇప్పుడు ఆయన ఆస్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 మిలియన్ దిర్హమ్‌లు (579 కోట్ల 78 లక్షల రూపాయలకు పైగానే..). మధ్య ఆసియా దేశాల్లో టాప్ ఇండియన్ లీడర్స్‌లో ఒకరిగా ఫోర్భ్ ప్రకటించిన జాబితాలో ఈయన చోటు దక్కించుకున్నారు. 2017లో లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు ఎంపికయ్యారు.