Purnabramha-Taste-of-Maharashtrian-Cuisine-goes-Global

ఆమె చేసే వంటల రుచులకు ప్రపంచమే ఫిదా అవుతుంది!

వంట వండే విధానం గురించి ఆమె చెబుతుంటే ... వినేవారికి నోరూరుతుంది! ఆమె గరిటె తిప్పుతుంటే, ఆ వంటకాలను ఎప్పుడెప్పుడు రుచి చూస్తామా అని మనసు ఉరకలేస్తుంది! ఇదంతా జయంతీ కఠాలే చేతి మహిమే కాదు... ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని నమ్మే ఆమె తత్వం కూడా. ‘పూర్ణబ్రహ్మ’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా మరాఠా రుచులను అందించే రెస్టారెంట్లను విజయవంతంగా నడుపుతూ... భోజనప్రియుల అభిమానాన్ని చూరగొంటున్న జయంతి విజయాల ఘుమఘుమలివి...

 
‘వంట చేయడం కూడా సైన్స్‌ ప్రయోగం చేయడం లాంటిదే! వంట గది మన ప్రయోగశాల, అక్కడ రసాయనాలకు బదులు ప్రేమను వాడాలి’ అంటారు జయంతీ కఠాలే. ఆమె గెలుపు కూడా ఓ కథలాంటిదే! దేశ విదేశాల్లో ‘పూర్ణబ్రహ ్మ’ పేరుతో గొలుసుకట్టు శాకాహార రెస్టారెంట్లను నడుపుతున్న జయంతి వయసు 40 ఏళ్లు.
 
రెస్టారెంట్ల రంగంలోకి అడుగుపెట్టడానికి తన కుటుంబ నేపథ్యమే కారణం అంటారు జయంతి. ‘బయట తిండి ఆరోగ్యానికి హానికరమే కాదు... అనవసరపు ఖర్చు’ అని వాళ్ల ఇంట్లో భావించేవారు. ఇంటి భోజనంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి అనే నమ్మే కుటుంబం వారిది. అలా జయంతి చిన్నతనంలో తల్లి, అమ్మమ్మల దగ్గర వంటలో నిష్ణాతురాలైంది. బంధువుల ఇళ్లలో ఎక్కడ ఏ చిన్న వేడుక జరిగినా కనీసం 30 మంది వచ్చేవారు. వారందరికీ వంట చేయడం ఓ పండుగలా ఉండేది. ఎక్కడికెళ్లినా జయంతి కూడా వంటసాయం చేసేవారు. అయితే ఆహార వ్యాపారంలోకి అడుగుపెట్టాలనే ఆలోచన ఆమెకు అప్పుడు రాలేదు.
 
ఆస్ట్రేలియాలో ఆరంభం...
ఐటీ జాబ్‌ కోసం 2006లో జయంతి ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడ భారతీయ భోజనం దొరికేది కాదు. మంచి భోజన ప్రియురాలైన జయంతి బయట ఇండియన్‌ ఫుడ్‌ దొరికినా బాగుంటుందో, లేదో అని తినేవారు కాదు. అప్పుడే స్నేహితుల సలహా మేరకు ఆమె రకరకాల వంటకాలను చేసి అందించాలని నిర్ణయించుకున్నారు. స్నేహితుల సాయంతో ‘ఆర్కుట్‌’లో ఖాతా క్రియేట్‌ చేశారు. వినాయక చతుర్థికి కొబ్బరి, బెల్లంతో చేసే ‘మోదక్‌’ స్వీట్లు తయారుచేయాలనుకున్నారు. ఆర్డర ్ల కోసం ఆర్కుట్‌లో పోస్ట్‌ పెట్టారు. దానికి మంచి స్పందన వచ్చింది. ‘‘ఇంటి భోజనాన్ని భోజనప్రియులకు అందించడంలో అదే నా తొలి అడుగు. ఆస్ట్రేలియాలో ఉన్నన్ని రోజులూ రకరకాల మరాఠా వంటకాలను అందించేదాన్ని. రెండేళ్ల తరువాత ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు తిరిగొచ్చాను. బెంగళూరులో ‘ఇన్ఫోసిస్‌’లో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా చేరాను. కానీ రుచికరమైన ఆహారాన్ని అందరికీ అందించడం మానలేదు. పండుగలు, వేడుకల వంటి సందర్భాల్లో ఆర్డర్లు తీసుకొని ఆహార పదార్థాలను అందించేదాన్ని’’ అని తన వంటల ప్రయాణం గురించి వివరించారు జయంతి.
 
‘‘ఒకసారి ఒక పెద్దాయన వచ్చి స్వీట్లు తయారు చేయమని అడిగాడు. అనారోగ్యంతో ఉన్న భార్యకు వాటిని ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేయాలనేది ఆయన ఆశ. ఆ స్వీట్ల వల్ల ఆమెకు పాత రోజులు గుర్తుకొస్తాయి. అయితే అతనికి స్థానిక వంటలతో ఉన్న అనుబంధాన్ని నేను గుర్తించాను. అప్పుడే నాకు దీన్ని పూర్తిస్థాయి వ్యాపకంగా చేపట్టాలనే ఆలోచన వచ్చింది. మా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం అంటే నా భుజాలపైన పెద్ద బాధ్యత ఉన్నటే! ఆ పేరును చెడగొట్టకూడదు అనుకుని మూడేళ్లపాటు మహారాష్ట్ర వంటల మీద పరిశోధన చేశాను’’ అని చెప్పారు జయంతి.
 
నగలు అమ్మి జీతాలు ఇచ్చి..
మొదట్లో ఒక గ్యారేజీలో చిన్న మరాఠా వంటశాలను ప్రారంభించారు. రెండేళ్లపాటు ఒక వైపు ఉద్యోగం, మరోవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే వంటశాలను నడిపారు. ‘‘పొద్దున్నే మూడున్నరకు నిద్ర లేచేదాన్ని! అర్ధరాత్రి దాటాక నిద్రపోయేదాన్ని. ఆఫీసుకు వెళ్లడానికి ముందే వంటలు పూర్తిచేసేదాన్ని. ఆఫీసులో తొమ్మిది గంటలు పనిచేసి, ఇంటికొచ్చి మరుసటి రోజు చేయాల్సిన వంటల కోసం సరంజామా సిద్ధం చేసుకునేదాన్ని. అలా చాలా కష్టపడ్డాను’’ అంటూ ఆనాటి సంగతులను జయంతి గుర్తుచేసుకున్నారు.
 
ఒక కస్టమర్‌ సలహా మేరకు బెంగళూరు హెచ్‌.ఎస్‌.ఆర్‌ లే అవుట్‌లో తొలి రెస్టారెంట్‌ను జయంతి ప్రారంభించారు. దానికోసం బ్యాంకులో రుణం తీసుకున్నారు. రెస్టారెంట్‌ ప్రారంభించిన తొలినాళ్లలో చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు. రెస్టారెంట్‌ను నడపడానికి పర్సనల్‌ లోన్‌ తీసుకున్నారు. సమయానికి డబ్బు చేతికందనప్పుడు, ఏకంగా తన బంగారు నగలు అమ్మి ఉద్యోగులకు జీతాలు చెల్లించారు.
 
‘‘మా అమ్మానాన్నలు ఇద్దరూ క్రీడా ఉపాధ్యాయులు. ‘ఎంత కష్టమైన పరిస్థితులు ఎదురైనా అనుకున్నది సాఽధించేవరకూ పట్టుదలతో పనిచేయాలి’ అని వారు చెప్పిన మాటలు ఆ సమయంలో నాకు స్ఫూర్తినిచ్చాయి’’ అంటారు జయంతి. పట్టువదలకుండా ప్రయత్నించడం వల్ల చిన్నగా మొదలైన వ్యాపారం క్రమంగా గాడినపడింది. తరువాత కొద్దికాలానికే ముంబయి, పుణే, అమరావతిలో ‘పూర్ణబ్రహ్మ’ రెస్టారెంట్‌ శాఖలు ప్రారంభించారు. ఆ తరువాత ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లోనూ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. నాణ్యతను పాటించడం వల్ల ఆమె రెస్టారెంట్లకు చాలామంది రెగ్యులర్‌ కస్టమర్లుగా మారారు. మసాలా దట్టించిన మిసల్‌ పావ్‌, దాల్‌ కా దుల్హా, సాబుదానా వడలతో పాటు... శ్రీఖండ్‌ పూరీ, పూరణ్‌పోలీ లాంటి స్వీట్లు సహా పలు మరాఠా వంటకాలను రెస్టారెంట్‌లో వడ్డిస్తారు. ‘‘మరాఠా వంటకాలను మాత్ర మే ఇక్కడ అందిస్తాం. అలాగని పోహా, వడా పావ్‌లకే మేము పరిమితం కాదలుచుకోలేదు. వంటకాల తయారీలో వాడే ప్రతి దినుసులో, వండే విధానంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం’’ అని చెప్పారు జయంతి. విశేషం ఏమిటంటే ‘పూర్ణబ్రహ్మ’ రెస్టారెంట్లలో పనిచేసేవారిలో 70 శాతం మంది మహిళలే! వంటవారికి జయంతి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. అంతేకాదు ఆమె తన ఉద్యోగుల బాగోగులు చూసుకుంటారు. వారి పిల్లలను చదివిస్తున్నారు కూడా.
 
వృథా చేయకుండా తింటే డిస్కౌంట్‌!
ఆహార వృథాను తగ్గించేందుకు జయంతి తన రెస్టారెంట్లలో వినూత్న ప్రయోగం చేశారు. భోజనం వృథా చేయకుండా తిన్న కస్టమర్‌కు బిల్లులో ఐదు శాతం రాయితీ ఇస్తున్నారు. ఆహార పదార్థాలను తినకుండా వదిలిపెడితే బిల్లులో రెండు శాతం అదనంగా వసూలు చేస్తారు.
 
ఆహారం రుచిగా, శుచిగా ఉంటుందనే పేరు రావడంతో ఎంతోమంది ప్రముఖులు తరచూ ‘పూర్ణబ్రహ్మ’ రెస్టారెంట్లకు వస్తుంటారు. ‘ఇన్ఫోసిస్‌’ స్థాపకులు నారాయణమూర్తి భార్య, ప్రముఖ రచయిత్రి సుధామూర్తి వారిలో ఒకరు. ‘‘సుధా మేడమ్‌ నాకు ఇన్‌స్పిరేషన్‌. ఆమె మా సిబ్బందితో కలసి భోజనం చేసి, అందరినీ ఆశీర్వదించారు. ‘సుధా మామ్‌తో నా కోసం కిచిడీ పంపించు’ అని నారాయణమూర్తిగారు ఓ రోజు నాతో చెప్పారు. దాంతో నాకు ఒక్కసారిగా గాలిలో తేలిపోయినట్టయింది. అయితే నా జర్నీ ఇప్పుడే ప్రారంభమైంది. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఐదువేల ఔట్‌లెట్‌లు ప్రారంభించి ప్రతి భారతీయుడూ కోరుకునే మంచి దేశీ ఫుడ్‌ను అందించాలనేది నా కల’’ అంటారు జయంతి. ఫుడ్‌ గురించి, తన రెస్టారెంట్ల విజయాల గురించి ‘టెడ్‌టాక్స్‌’తో సహా పలు అంతర్జాతీయ వేదికలపై ఆమె చేసిన ప్రసంగాలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి.
 
‘పూర్ణబ్రహ్మ’ రెస్టారెంట్లలో వారంలో ఒక రోజు పూర్తిగా థాలీలనే అందిస్తారు. కొల్హాపూర్‌ ప్రాంతానికి చెందిన మహాలక్ష్మీ థాలీ, కొంకణ్‌ ప్రాంతానికి చెందిన శివ్‌ థాలీ, పిల్లల కోసం బాలగోపాల్‌ థాలీలను ప్రత్యేకంగా ఆ రోజు అందిస్తారు.