Passport-Rules-changed-by-woman

పోరాడి.. పాస్‌పోర్టు రూల్సునే మార్చేసింది!

పందొమ్మిదేళ్లకే పెళ్లి చేసుకుంది. ఆరునెలలకే భర్త నిజస్వరూపం తెలుసుకుంది. కానీ అప్పటికే తను గర్భిణీ. అయినా సరే భర్త ‘టార్చర్‌’ భరించలేక బయటకు వచ్చి సొంత కాళ్లపై నిలబడేందుకు జీవనపోరాటం చేసింది. ఇక్కడే చిన్న ట్విస్ట్‌. పుట్టిన బిడ్డకు పాస్‌పోర్టు కావాలంటే తండ్రి సంతకం కావాల్సిందేనన్నారు. మరోసారి పోరాటం చేసి ప్రభుత్వ నిబంధనలే మారేలా చేసింది. ముంబయికి చెందిన జారియా పట్నీ పోరాటం... ఆద్యంతం ఆసక్తికరం.

 
జారియా పట్నీకి అప్పుడు సరిగ్గా 19 ఏళ్లు. ముంబయిలో ఒకే బిల్డింగులో నివాసముంటున్న అతడు ఒక వ్యాపారవ్తేత్త. బిజినెస్‌ పనులు మీద తరచూ దుబాయికి వెళ్తుండేవాడు. జారియా డ్రైవర్‌ ద్వారా ఆమె చదువుతున్న కాలేజీ అడ్రస్‌ తెలుసుకుని వెంటపడ్డాడు. అతడు తన కన్నా ఏడేళ్లు పెద్ద. అతడి తల్లిదండ్రుల ఒత్తిడితో ఆగమేఘాల మీద జారియా పెళ్లి జరిగింది. ఎన్నో కలలతో కొత్త కాపురానికి దుబాయి వెళ్లిన జారియాకు భర్త నిజస్వరూపం హనీమూన్‌లోనే తెలిసొచ్చింది.
 
దుస్తులు, అలవాట్లు... ఇలా అన్ని విషయాల్లో తనకు నచ్చినట్లుగానే ఉండమనేవాడు. లేదంటే టార్చర్‌ పెట్టేవాడు. వేగంగా వెళ్తున్న కారులో నుంచి తోస్తూ భయపెట్టేవాడు. అర్థరాత్రి గదిలో ఏసీ ఆఫ్‌ చేసేవాడు. ఒళ్లంతా చెమటలు కక్కుతుంటే ఆనందించేవాడు. వార్డ్‌రోబ్‌లోని సౌందర్య సాధనాలన్నింటిని బయటకు విసిరేసేవాడు. ఆరోగ్యం బాగోలేకపోతే ఆసుపత్రికి కూడా తీసుకెళ్లేవాడు కాదు. ‘‘ఆసుపత్రికి ఒక్క రోజు ఆలస్యంగా వచ్చుంటే, నీ డెడ్‌బాడీని ముంబయికి పంపేవాళ్లం’’ అని నర్సు ఆమెతో చెప్పిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండేదో ఊహించొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కరోజు కూడా భర్తతో కాపురం చేయలేనని నిర్ణయించుకుంది. అయితే అప్పటికే జారియా గర్భిణీ. ఒంటరిగానే ముంబయికి చేరుకుంది.
 
అయినా సరే అతడి టార్చర్‌ ఆగలేదు. ఏడాది తిరిగేసరికి జారియాకు కొడుకు పుట్టాడు. భర్త నుంచి విడిపోవాలనుకుంది. కొడుకును తీసుకునే కోర్టు ట్రయల్స్‌కు తిరిగేది. సుదీర్ఘ పోరాటం తర్వాత 2012లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నాలు చేసింది. ఫోటోగ్రఫీలో ప్రవేశం ఉన్న జారియా ఒక్కో మెట్టు ఎక్కుతూ పాపులర్‌ బ్రాండ్లకు ఫోటోషూట్‌లు చేసే స్థాయికి ఎదిగింది. ఇక్కడే మరోసారి ఆమెకు మాజీ భర్త సమస్య ఎదురైంది. కొడుకు పాస్‌పోర్టు అప్లికేషన్‌లో తండ్రి సంతకం లేదని తిప్పిపంపారు. ఎన్నిసార్లు పాస్‌పోర్టు ఆఫీసుకు వెళ్లినా అదే సాకుగా చూపేవారు. విసిగి వేసారిన జారియా ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ట్వీట్‌ చేయడమేగాక, ‘ఛేంజ్‌.ఆర్గ్‌’ అనే ఆన్‌లైన్‌ సైట్‌లో పిటిషన్‌ ఫైల్‌ చేసింది. ఈ పిటిషన్‌ను 96 వేల మంది సపోర్టు చేయడంతో కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘సింగిల్‌ మదర్‌’ లీగల్‌ గార్డియన్‌గా ఉండొచ్చనే సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉండటంతో పిల్లల పాస్‌పోర్టు విషయంలో నిబంధనలను సడలించారు. మొత్తానికి జారియా పోరాటం ఎందరో సింగిల్‌ మదర్స్‌కు ఊరటనే కాదు, అంతులేని ఆత్మవిశ్వాసాన్నీ అందించింది.