NRIs-doing-service-to-own-village

అమెరికాలో స్థిరపడినా.. సొంతూరి కోసం..

జన్మభూమి రుణం తీర్చుకుంటున్న ప్రవాసులు

స్వగ్రామాల్లో సేవా కార్యక్రమాలు
విద్య, వైద్యానికి ఆర్థిక సాయం
సామాజికాభివృద్ధి పనులకూ తోడ్పాటు

మేదరమెట్ల/అద్దంకి టౌన్‌, మే 28 : ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని అని ఏనాడో.. యువతను చైతన్యపరిచారు అపరదేశభక్తుడైన రాయప్రోలువారు. అదిగో.. ఆ సందేశాన్ని వంటబట్టించుకున్నారు ఆ యువకులు. ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి.. ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడినా పుట్టినూరి మట్టివాసన మరిచిపోలేదు. ఊరి ప్రజలన్నా వారికి వల్లమాలిన అభిమానం. అందుకే ఊరికి ఉపకారం చేయాలని తలంచారు. అందుకు తమవంతు చేయూతనందిస్తున్నారు.
 
అమెరికాలో స్థిరపడినా...
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలంలోని రావినూతల గ్రామానికి చెందిన కారుసాల వెంకటసుబ్బారావు, శ్రీదేవి దంపతులు అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం డల్లా్‌సలో ఉంటున్నారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన సుబ్బారావు వరంగల్‌ ఆర్‌ఈసీలో ఇంజనీరింగ్‌ చదివారు. 90వ దశకంలో ఉద్యోగం రావడంతో అమెరికాకు వెళ్లారు. అక్కడే స్థిరపడిన ఆయన పలు కంపెనీలు స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఇక ఊరి బాగు కోసం ముందుకు వచ్చారు. రూ.4లక్షలు సొంత డబ్బులు వెచ్చించి మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయించారు. తాను చదివిన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో విద్యార్థులకు ఐదేళ్లపాటు మినరల్‌ వాటర్‌ను సొంత ఖర్చులతో సరఫరా చేయించిన ఆయన ఇప్పుడు స్కూల్‌లోనే వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయించారు. అక్కడ వంట గది నిర్మించారు.
 
పలు దేవాలయాల పునఃనిర్మాణానికి ఆర్థిక సాయం అందించారు. సుబ్బారావు సతీమణి శ్రీదేవి తన స్వగ్రామమైన ఎన్నూరులో నూ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తాను నిర్వహించే స్వే చ్ఛ ఫౌండేషన్‌ ద్వారా బోర్లు తవ్వించడంతోపాటు విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. రావినూతలలో ఇప్పటికే రెండు డిజిటల్‌ తరగతి గదులను ఏర్పాటు చేశారు. ఇంకా ఈ ప్రాంతంలోని పలు పాఠశాలల్లో డిజిటల్‌ తరగతుల ఏర్పాటుకు నిధులు సమకూర్చేందుకు సుబ్బారావు సిద్ధంగా ఉన్నారు. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో రావినూతలలో ఐటీ కంపెనీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.
 
గార్లపాటి సేవలు...
అద్దంకి మండలం నాగులపాడుకు చెందిన గార్లపాటి బాలశంకరరావు అమెరికాలో స్థిరపడ్డారు. స్వగ్రామానికి వచ్చినప్పుడు వైద్యం కోసం పేద ప్రజలు పడుతున్న ఇక్కట్లను గమనించారు. దీంతో ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికి మరో దాత రిటైర్డ్‌ ఉద్యోగి బోడెంపూడి ఆంజనేయులుతో కలిసి రూ. 50 వేల విలువచేసే ఆక్సీ మీటర్‌ను అందజేశారు. స్వగ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో సొంతంగా ఆంజనేయస్వామి గుడిని నిర్మించారు. వాటర్‌ ప్లాంట్‌కు విద్యుత్‌ మోటర్‌ను అందజేశారు. శింగరకొండ సమీపంలోని బాలయోగి గురుకుల బాలిక పాఠశాలల విద్యార్థులకు తన వంతు సహకారం అందజేశారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కనపర్తి సమీపంలోని మైనంపాడు వద్ద ఉన్న నీడీ ఇల్లిటరేట్‌ చిల్డ్రన్‌ పౌండేషన్‌ (ఎన్‌ఐసీఈ)కు ఏటా తనవంతు రూ.25వేల నుంచి రూ.30 వేల సాయం అందిస్తున్నారు.