NRI-Woman-Innovative-Shortfilms-on-Indians-lifestyle-in-US

ఎన్నారైలపై షార్ట్‌ఫిల్మ్‌లు.. అమెరికాలో తెలుగు మహిళ వినూత్న ప్రయత్నం..

అమెరికాలో గత ఐదేళ్లుగా షార్ట్‌ ఫిలిమ్స్‌, డాక్యుమెంటరీలు, కామెడీ షోల ద్వారా పేరు తెచ్చుకుంటున్నారు అవంతిక నక్షత్రం. తన చిన్ననాటి ఆసక్తికి, భర్త ప్రోత్సాహం కూడా తోడవ్వడంతో అమెరికాలో ‘పిలుపు టీవీ’ వెబ్‌ ఛానెల్‌ను ఏర్పాటు చేయడమేగాక, షార్ట్‌ ఫిలిమ్స్‌ తీస్తూ సత్తా చాటుకుంటున్నారు. ఇటీవల ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో ముచ్చటించారు. ఆ విశేషాలే ఇవి...

‘‘మాది హైదరాబాద్‌. సిద్ధిపేటకు చెందిన వేణుతో నా వివాహం అయ్యింది. ఉద్యోగ రీత్యా మేము అమెరికాలో స్థిరపడ్డాం. అక్కడే ‘పిలుపు టీవీ’ (వెబ్‌ ఛానెల్‌)కి సీఈఓగా, ఒక స్కూల్‌ టీచర్‌గా ఎన్నో బాధ్యతల్ని నిర్వహిస్తూనే ‘నక్షత్రం ప్రొడక్షన్స్‌’ సంస్థ ద్వారా ఎందరో కళాకారుల్ని, నటుల్ని, దర్శకులను పరిచయం చేశాం. మావారు వేణు దర్శకునిగా ఎన్నో లఘు చిత్రాల్ని తీశాం. తాజాగా ‘కాక్‌టైల్‌ డైరీస్‌’ అనే వెబ్‌సిరీస్‌ని సాయిరామ్‌ పల్లి దర్శకత్వంలో నిర్మించాం. ఈ వెబ్‌సిరీస్‌ ‘అమెజాన్‌ పైరమ్‌’ ద్వారా, మరో యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా ఇండియాలో విడుదలయ్యింది.
 
కళాకారులను ప్రోత్సహించాలనే...
నా చిన్నప్పుడు ఖైరతాబాద్‌లో మాకు స్టూడియో (మ్యాచ్‌ లైన్‌ స్టూడియో) ఉండేది. దాన్ని మా నాన్న నూతి రాంగోపాల్‌, అన్నయ్య అమర్‌దీప్‌ నడిపేవారు. వారిద్దరూ అప్పట్లో టీవీ యాడ్స్‌ చేసేవారు. ఇంట్లో వాటి గురించి ఏదో ఒక విషయం చర్చించుకొనేవారు. వారి మాటల్లో నిర్మాణానికి సంబంధించిన ఎన్నో విషయాలు అర్థం అయ్యేవి. అమెరికా వెళ్లిన తర్వాత ‘ఫెర్ఫాక్స్‌ పబ్లిక్‌ యాక్సెస్‌’లో ఎడిటింగ్‌, ప్రొడక్షన్‌ కోర్సులు చేశా. ఆ అనుభవంతో ‘ఆర్లింగ్టన్‌ ఇండిపెండెన్స్‌ మీడియా’లో చాలా వీడియోస్‌ని ఎడిట్‌ చేశా. ఆ అనుభవం నాకు ఇప్పుడు టీవీ కార్యక్రమాలు ఎడిట్‌ చేయడానికి పనికొస్తొంది.
 
మావారు అమెరికాలో ఐటీ ఉద్యోగి. సాహిత్యం, సాంస్కృతిక కార్యక్రమాలంటే ఆయనకు ఇష్టం. కొన్ని లఘు చిత్రాలకు దర్శకత్వం చేశారు. మా ‘పిలుపు టీవీ’కి స్ర్కిప్ట్స్‌ రాయడమేగాక కార్యక్రమ నిర్వహణలో నాకు సాయపడుతుంటారు. మా చుట్టూ ఎందరో లైక్‌మైండెడ్‌ కళాకారులు ఉన్నారు. వారిని ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో ఈ సంస్థ ప్రారంభించాం. అయితే మేము కేవలం యూట్యూబ్‌ హిట్స్‌ కోసం కార్యక్రమాలు చేయడం లేదు. మేము తీసే లఘు చిత్రాల్లో, నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో అనేక సమాజహిత అంశాలుంటాయి. సమాజంలో కొందరు జనం డాలర్ల కోసం పరుగెత్తుతున్న తీరు, దాని ప్రభావం, మనం కోల్పోతున్న మానవీయ విలువలు, తల్లిదండ్రుల క్షోభ... ఇలా ప్రతీ అంశం ఆలోచింపచేసే విధంగా ఉంటుంది. అందుకే మా లఘు చిత్రాలకు చాలామంది మిత్రులు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. లోకల్‌ బిజినెస్‌ యాజమాన్యాలు, రెస్టారెంట్‌ వాళ్ళు, కమ్మూనిటీ ఆర్గనైజషన్‌లు కూడా మాకు అండగా నిలుస్తున్నాయి.
 
అనేక ఆటంకాల నడుమ...
ఇక నా విషయానికొస్తే వీడియో ఎడిటింగ్‌తో (‘పిలుపు టీవీ’కి పూర్తి స్థాయి ఎడిటర్‌ని) పాటు, ప్రీ స్కూల్‌ టీచర్‌గా వారానికి మూడు రోజులు ఉద్యోగం, పార్ట్‌టైమ్‌ కౌంటీ ఎలక్షన్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. లఘు చిత్రాల ద్వారా, ‘పిలుపు టీవీ’ ద్వారా ఎందరో కళాకారులను, టీవీ యాంకర్స్‌ని పరిచయం చేశాం. మూడేళ్ల క్రితం ‘దేశీ టాలెంట్‌ హంట్‌’ ద్వారా చాలామంది సింగర్స్‌ని పరిచయం చేశాం. ఆ విధంగా ‘అమెరికాలో తెలుగువాళ్ల టాలెంట్‌కి కొదువలేద’నే విషయం రుజువయ్యింది. మేము తీస్తున్న వెబ్‌ సిరీస్‌ ద్వారా ఎంతోమంది ఇప్పటికే తమ టాలెంట్‌ను నిరూపించుకున్నారు.
 
అయితే నిర్మాణం విషయానికొస్తే ఇండియాతో పోల్చితే మాకు చాలా ఛాలెంజెస్‌ ఉంటాయని చెప్పవచ్చు. అందరూ ఒక అభిరుచితో యాక్ట్‌ చేయడానికి వచ్చిన వారే కానీ పూర్తిస్థాయిలో నటనకే అంకితం అయిన వారు చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే న్యూయార్క్‌, లాస్‌ ఏంజెల్స్‌ వంటి నగరాల్లో కొంతమంది నటీనటులు పూర్తిస్థాయిలో ముందుకు వచ్చినా ఇంకా వారికి నటించే సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. అదీగాక వారాంతాల్లోనే షూటింగ్‌ చేయాల్సి వస్తుంది. అక్కడి వాతావరణం ఒక పెద్ద సవాల్‌. సున్నా డిగ్రీ కన్నా తక్కువ ఉష్ణోగ్రతలకు పడిపోతుంటాయి, కొన్ని సీన్లు అనుకున్న సమయానికి పూర్తి చేయాలంటే ఆ చలిలోనే షూట్‌ చేయక తప్పదు. వీకెండ్‌లో అందర్నీ ఒక చోట చేర్చడం పెద్ద సవాలు.
 
అయినా అందరి సహకారంతో తాజాగా ‘కాక్‌టైల్‌ డైరీస్‌’ను విజయవంతంగా పూర్తి చేయగలిగాము. అమెరికా నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ వాటిలో వీసా కోసం పడే కష్టాలని హైలైట్‌ చేసినవే ఎక్కువ. ఇందులో మేము అమెరికాలో మన లైఫ్‌ ఎలా ఉంటుంది? భార్యభర్తల మధ్య అనుబంధం... పని ఒత్తిడి, వారాంతాల్లో విహారాలు... ఇవన్నీ మూడు కుటుంబాల నేపథ్యంలో తీశాం. అంటే పూర్తిగా బ్యాచిలర్స్‌ది ఒక స్టైల్‌, ఫ్యామిలీ విత్‌ కిడ్‌ ఒక స్టైల్‌, ఫామిలీ వితౌట్‌ కిడ్‌ ఒక స్టైల్‌. ఇలా మూడు విభిన్న మనస్తత్వాలు ఇందులో ఉంటాయి. ‘కాక్‌టైల్‌ డైరీస్‌’ వెబ్‌ సిరీస్‌ యు.కె, యు.ఎస్‌లలో అమెజాన్‌ పైరమ్‌లో... మిగతా అన్ని దేశాల్లో (ఇండియా సహా) ‘ఐక్యూఎల్‌ఐకె’ ద్వారా యూ ట్యూబ్‌లో విడుదలయ్యింది.