Mrudhula-naveen-helps-to-own-village

సమాజసేవలో నేనుసైతం

విదేశంలో ఉంటూ స్వదేశంలో స్వచ్ఛంద సేవలు

అనాథలకు, దివ్యాంగులకు ఆపన్న హస్తం

ఎన్నారై మృదుల స్ఫూర్తి ఎందరికో ఆదర్శం

ఖమ్మం:అడగందే అమ్మ అయిన అన్నం పెట్టని ఈ రోజుల్లో ఉన్న ఊరుని కన్నతల్లిదండ్రులను మరచిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. స్వార్థం పెరిగిపోయిన ఈ సమాజంలో ఇంకా సేవాగుణం కనిపిస్తూనే ఉంది. ఎంతోమంది సమాజశ్రేయస్సు కోసం.. పొరుగువారి కోసం పరితపిస్తున్నా వారూ ఉన్నారు. ఎంతో మంది అభాగ్యులకు, అనాథలకు, దివ్యాంగులకు ఆపన్న హస్తాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి వారి కోవకే చెందుతారు భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన బెజ్జారి మృదులానవీన్‌.

కొత్తగూడెంలోని అత్తూలూరి ఉమామహేశ్వర రావు, పార్వతీ దేవులకు పెద్ద కుమార్తె మృదుల ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. అక్కడే స్థిర పడ్డారు. అయినా ఉన్న ఊరుకి తాము స్వచ్ఛందంగా సేవచేయాలనే సంకల్పంతో అడుగు ముందుకు వేశారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తూ. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా అక్కడే స్థిరపడిన నవీన్‌ను వివాహమాడారు. సుమారు 15ఏళ్లుగా చిరాగ్‌ ఫౌండేషన్‌ను స్థాపించి ఉమ్మడి ఖమ్మం జిల్లా లో ఎన్నో సేవలందించారు. ఖమ్మానికి చెందిన మరో ఎన్‌ఆర్‌ఐ స్నేహితురాలు గుర్రం జ్యోతి సహకారంతో మృదులానవీన్‌ పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ‘ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న’ అన్న మదర్‌థెరిస్సా మాటలను స్ఫూర్తి గా తీసుకొని ఎన్నో సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అమెరికాలో ఎన్‌ఆర్‌ఐలను ఐక్యం చేసి ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లాలో ఇప్పటికే సుమారు రూ. రెండు కోట్లతో సేవలందించారు. 
మృదుల సేవలివే
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని హేమచంద్రాపురం గ్రామంలో అమ్మ అనాథ శరణాలయ భవన నిర్మాణానికి రూ.15లక్షలను అందించారు. 
  • అనాథల పిల్లలను సమాజంలో ఎవరూ చిన్న చూపు చూడకూడదనే లక్ష్యంతో అమెరికాలో ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ దృష్టికి తీసుకెళ్లి వారి సహకారంతో పాటు వీరు కూడా కొంత నిధులను వెచ్చించారు. 
  • జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న బాలికలకు శారీరక పరిశుభ్రతకు శానిటరీ నాప్‌కిన్స్‌ను జిల్లా వ్యాప్తంగా అందజేశారు. 
  • మన్యంలో గిరిజన పిల్లలు, మైదానంలోని పేద చిన్నారులకు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారు లకు మల్టీవిటమిన్‌ మాత్రలను ఉచితంగా పంపిణీ చేశారు. 
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దివ్యాంగులకు అండగా నిలిస్తూ ఇప్పటికే 50వీల్‌ చైర్స్‌, ట్రై సైకిళ్లను అందజేశారు. 
  • శిథిలావస్థలో ఉన్న కొత్తగూడెంలోని గొల్లగూడెం ప్రాథమిక పాఠశాల బాగు చేసేందుకు రూ.ఐదు లక్షలు వెచ్చించి మరమ్మతులు, ప్రహరీ నిర్మింపజేశారు. 
  • సూర్యాపేట జిల్లాలో దివ్యాంగులకు రూ. రెండు లక్షల పరికరాలను, 20 ట్రైసైకిళ్లను అందజేశారు. 
  • ఖమ్మం మమతా ఆస్పత్రి ప్రాంతంలో ఉన్న హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్థుల పిల్లల పరిస్థితిని చక్కదిద్దేందుకు వారు ఆర్థికంగా ఆదుకునేందుకు చిరాగ్‌ ఫౌండేషన్‌ ద్వారా గేదెలను కొనుగోలు చేసి ఉచితంగా అందజేశారు. 
  • అమెరికాలో సంకరా ఐ ఫౌండేషన్‌ను సభ్యులతో కలిసి సుమారు రూ.10లక్షల  విరాళాలు సేకరించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు పనులకు వెచ్చించారు. 
తోడుగా నిలిచిన స్నేహితులు, తల్లిదండ్రులు
అమెరికాలో ఉద్యోగం చేస్తూ వచ్చిన సంపాదనలో కాస్త సమాజానికి వెచ్చిస్తూ అందరికి ఆదర్శంగా నిలచిన మృదులా నవీన్‌కు కొత్తగూడెం ప్రాంతంలో స్నేహితులైన లగడపాటి రమేష్‌, గుర్రం జ్యోతి, తల్లిదండ్రులు అత్తులూరి ఉమామహేశ్వరరావు, పార్వతీ దేవీ తోడుగా నిలచారు. జిల్లాలో మృదుల నవీన్‌ చేపట్టే స్వచ్ఛంద సేవలకు వారు కూడా ఊతమిస్తున్నారు.
 
సొంతలాభం కొంతమానుకుని..
- మృదులా నవీన్‌, ఎన్‌ఆర్‌ఐ 
ఊరుమనకేమిచ్చిందని అనుకోవడం కంటే ఆ ఊరుకి మనం ఏం చేశామనేది ఆలోచించుకోవాలి. ‘దేశమంటే మట్టికాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌..’ అన్న గురుజాడ సూక్తిని నేటికీ మరువలేం. అందుకే తాను అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ వచ్చిన సంపాదన కాస్త సమాజానికి ఇస్తూ సేవలందిస్తున్నందుకు స్వదేశీయులుగా గర్విస్తున్నాం. దేశ మును ప్రేమించుమన్న.. మంచి అన్నది పెంచుమన్న.. వట్టిమాటలు కట్టిపెట్టోయ్‌.. గట్టిమేలు తలపెట్టవోయ్‌ అనేదే సమాజానికి మేం ఇచ్చే సందేశం.