MP-Jithender-Reddy-success-story

సుల్తాన్‌ మెచ్చిన ఇంజనీర్‌

ప్రవాసం నుంచి పార్లమెంటుకు..

ఏపీ జితేందర్‌ రెడ్డి ప్రస్థానం..
ఒమన్‌లో రెండు దశాబ్దాల విజయగాథ

(గల్ఫ్‌ నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి ఇర్ఫాన్‌): ఇందిరా గాంధీ ప్రకటిత ఎమర్జెన్సీ అనిశ్చిత పరిస్థితి దేశాన్నికుదిపివేస్తున్న రోజులవి. ఆ సమయంలో కొంత మంది యువకులు తమ ఉజ్వల భవిష్యత్తును వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లారు. అప్పుడే విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న 21 ఏళ్ల ఒక యువకుడు కూడా అలాగే.. కొత్త ఉత్సాహంతో 1975లో గల్ఫ్‌లోని ఒమాన్‌కు చేరుకున్నాడు. ఆ ఏడారి దేశంలో సుదీర్ఘకాలంపాటు విజయవంతంగా పనిచేసి తనదైన ముద్ర వేసి తిరిగి మాతృదేశానికి చేరుకుని రాజకీయాల్లో రాణించాడు. ఏకంగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. నాటి యువకుడు.. నేటి ఎంపీ.. ఎవరో కాదు.. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఏపీ జితేందర్‌ రెడ్డి. ఆయన విజయప్రస్థానం..
 
గల్ఫ్‌ దేశాలలో తొలుత వృత్తిపరంగా, ఆ తర్వాత వాణిజ్యపరంగా విజయవంతమైన అతి కొద్దిమంది తెలుగువారిలో ఒకరు.. జితేందర్‌ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ఎదురుచూసిన ఏడో దశకంలో.. పోలీస్‌ అధికారి అయిన తండ్రి ప్రోత్సాహంతో షాపూర్జీ పల్లోంజీ సంస్థలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారాయన. మొదట్లో కొన్ని నెలలు ముంబైలో పని చేసి ఆ తర్వాత ఒమన్‌కు చేరుకున్నారు. నాటి నుంచి రెండు దశాబ్దాల పాటు ఆయన అక్కడే అంచెలంచెలుగా ఎదిగారు.
 
అప్పుడప్పుడే ఒమన్‌లో రాజ్యాధికార పగ్గాలు చేపట్టిన యువకుడైన సుల్తాన్‌ (రాజు) ఖాబూస్‌ బిన్‌ సయీద్‌ చమురు ఎగుమతి ఆదాయంతో తన దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుండగా.. అందులో రాచప్రసాదం నిర్మాణంతో సహా మరికొన్ని కీలక మౌలిక సదుపాయాల నిర్మాణాల కాంట్రాక్టులను షాపూర్జీ పల్లోంజీ పొందింది. అప్పటికి అక్కడ ఆ సంస్థ మేనేజర్‌గా యువకుడైన జితేందర్‌ రెడ్డి ఉన్నారు.
 
నిజానికి అంత పెద్ద ప్రాజెక్టు బాధ్యతలను అలనాటి బొంబాయి, మద్రా్‌సలలో కార్పొరేట్‌ అనుభవం ఉన్న వారికే ఇస్తారు. కానీ జితేందర్‌ రెడ్డిలోని ప్రతిభా సామర్థ్యాలను గుర్తించిన యాజమాన్యం తమ సంస్థ ఒమన్‌ విభాగం పగ్గాలన్నీ ఆయన చేతిలో పెట్టింది. జితేందర్‌ రెడ్డి ఆ నమ్మకాన్ని వమ్ముచేయలేదు. రేయింబవళ్లూ పని చేసి సంస్థను లాభాల బాటలో నడిపించారు. చేపట్టిన ప్రతి ప్రాజెక్టునూ సమర్థంగా పూర్తి చేసి సత్తా చాటారు. ఆ తర్వాత తానేఒక ఒమనీ అరబ్‌ జాతీయుడి భాగస్వామ్యంతో కంపెనీని నెలకొల్పి దాన్ని అభివృద్ధి చేశారు.
రాజకీయాల్లోకి..
‘సిర్‌ పే లాల్‌ టోపీ రూసీ ఫిర్‌ భీ దిల్‌ హై హిందుస్థానీ’ అన్నట్లుగా పేరు, ప్రతిష్ఠ, డబ్బులు అన్నీ ఉన్నా జితేందర్‌ రెడ్డి మనసంతా మహబూబ్‌నగర్‌లో, దృష్టంతా రాజకీయాలపైనేఉండడంతో తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. 1996లో స్వదేశానికి తిరిగి వచ్చిన ఆయన నాటకీయ రాజకీయ పరిణామాల మధ్య లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరి.. 1999లో రాజకీయ ఉద్దండుడు మల్లికార్జున్‌పై పోటీ చేసి 50 వేలకు పైగా ఓట్లతో గెలుపొంది సంచలనం సృష్టించారు. 2004లో పోటీచేయని ఆయన 2009లో చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచిపోటీచేసి స్వల్ప తేడాతో జైపాల్‌ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 2010లో తెరాసలో చేరిన ఆయన మహబూబ్‌నగర్‌ నుంచి 2014లో జైపాల్‌ రెడ్డిపై పోటీ చేసి విజయం సాధించారు. బీజేపీ 1999లో అధికారంలోకి వచ్చినప్పుడు లోక్‌సభలో ఉన్న ఆయన.. మళ్లీ 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడూ లోక్‌సభకు (వేరే పార్టీ నుంచి) ఎన్నిక కావడం విశేషం.
 
సుల్తాన్‌ నజరానా..
గల్ఫ్‌ దేశాలలో రాజుల కార్యాలయాలను దివానియా అని.. వాటిలో ఉండే ముఖ్యుణ్ని దివాన్‌ అని అంటారు. సుల్తాన్‌ దివాన్‌తోపాటు.. సుల్తాన్‌తో సైతం జితేందర్‌ రెడ్డికి మంచి సంబంధాలున్నాయి. ఉదాహరణకు.. ఒమాన్‌ సుల్తాన్‌ బహుమానాలు ఇవ్వడం అరుదు. తన రాజ్య సందర్శనకు వచ్చిన రాజీవ్‌ గాంధీ, పి.వి.నర్సింహారావులకు బహుమతులు ఇచ్చిన సుల్తాన్‌ సామాన్యులకు నజరానాలు ఇచ్చిన సందర్భాలు అత్యంత అరుదు. అలాంటిది.. తాను ముచ్చటపడి కొన్న ఒక వస్తువును ఆయన జితేందర్‌ రెడ్డికి బహూకరించారు. జితేందర్‌ రెడ్డి ఆ కానుకను ఇప్పటికీ సగర్వంగా భద్రపర్చుకున్నారు.
 
మస్కట్‌లో తొలి సంఘం..
 
గల్ఫ్‌ దేశాలలో మొట్టమొదటిసారి మస్కట్‌లో ప్రవాసాంధ్ర సంఘం నెలకొల్పడంలో జితేందర్‌ రెడ్డి కీలకపాత్ర పోషించారు. తన వాగ్ధాటి, స్నేహపూర్వక స్వభావం వల్లఒమన్‌లో ఆయన తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు.