‘నా రంగు, నాలా జుట్టు ఉన్న అమ్మాయిని అసలు అందగత్తెగానే పరిగణించని ప్రపంచంలో పెరిగాను నేను’... ఆదివారం రాత్రి అమెరికాలో జరిగిన మెగా ఈవెంట్‌లో విశ్వసుందరి కిరీటం శిరస్సున అలంకరించుకున్న సందర్భంలో 26 ఏళ్ల జొజిబినీ టున్జీ భావోద్వేగం ఇది! అందమంటే పైన కనిపించే రంగును బట్టి కొలిచేది కాదంటున్న ఈ దక్షిణాఫ్రికా సుందరి ఇప్పుడు మిస్ యూనివర్స్-2019. ఆమె ప్రయాణంలో వివక్షల సూటిపోటి మాటలు ఎన్నో...
జార్జియా: అందాల కిరీటం అంటే ఆమెకు వ్యక్తిగత ఘనత మాత్రమే కాదు... తన నల్లజాతి మొత్తానికి దక్కిన ఘనత. అవును... దక్షిణాఫ్రికాలోని జోలోలో పుట్టిన జొజిబినీ టున్జీ చిన్నప్పటి నుంచి వివక్షను ఎదుర్కొంటూనే పెరిగారు. అందుకే ఆమె ఈ అందాల పోటీలను తన గళం గట్టిగా వినిపించే వేదికగా కూడా మలుచుకున్నారు. సొంత దేశంలోనే అవమానాలు ఎదురైనా ఎదిరించి నిలిచిన ఆమె మిస్ యూనివర్స్ టైటిల్ సాధించిన మూడో దక్షిణాఫ్రికా మహిళగా ఇప్పుడు రికార్డులకెక్కారు. పుట్టిన ఊరికి సమీపంలోని సిడ్వడ్వేనిలో పెరిగిన టున్జీకి ఇద్దరు సోదరీమణులున్నారు. ప్రాథమిక విద్య అయిపోగానే పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇమేజ్ మేనేజ్‌మెంట్(2018)లో ‘కేప్ పెనిన్సులా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ’ నుంచి డిగ్రీ పట్టా పొందారు.
ఇంట గెలిచి...
‘మిస్ యూనివర్స్’ టైటిల్ గెలవడానికి ముందు టున్జీ ఈ ఏడాది ‘మిస్ సౌతాఫ్రికా’గా నిలిచారు. అయితే ఆ టైటిల్ ఆమెకు అంత సులువుగా రాలేదు. దాని వెనుక ఎన్నో మనోవేదనలు, అవమానాలూ ఉన్నాయి. వాస్తవానికి రెండేళ్ల కిందట జరిగిన ‘మిస్ సౌతాఫ్రికా’లో కూడా ఆమె పోటీపడ్డారు. కానీ టాప్ 12లో కూడా ఆమెకు స్థానం దక్కలేదు. అలాగని ఆమె నిరాశ పడలేదు. మళ్లీ ప్రయత్నించి, కిరీటం సాధించారు. అయితే ఆ చరిత్రాత్మక విజయం ఆమెను వివాదాల్లోకి లాగింది. టున్జీ గెలుపు గిట్టని కొందరు ఆమె మేని ఛాయ గురించి ఆన్‌లైన్‌లో చర్చకు తెరలేపారు. ‘నాలాంటి వారు అందాల కిరీటం గెలవడం వారికి నచ్చడం లేదు’ అంటూ ఆ సందర్భంలో టున్జీ బాధపడ్డారు. అయితే ఆ అవహేళనలేవీ తన స్ఫూర్తి ముందు నిలవలేకపోయాయి.
అందమంటే రంగేనా?
‘‘అందమంటే పైకి కనిపించేదో, శరీరం రంగో కాదు అని వీళ్లందరికీ అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. మా దేశంలో ఈ ‘కలరిజమ్’ అతి పెద్ద సమస్యగా మారింది’’ అంటూ ఓ పత్రిక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు టున్జీ. అంతే కాదు... ‘‘నల్లగా ఉన్నవారిని అందగత్తెలుగా పరిగణించవద్దు అని వాళ్లందరిలో ప్రోగ్రామింగ్ చేసినట్టున్నారు’’ అంటూ అసహనంతో వ్యంగాస్త్రం కూడా సంధించారు. అప్పటి నుంచి టున్జీ వివక్షపై తన గళాన్ని వినిపిస్తున్నారు. ఎదుటివాళ్లను విమర్శించే ముందు వాళ్లను వాళ్లు ప్రేమించుకోవడం నేర్పిస్తే, ఇలాంటి జాత్యహంకారాలకు తెరపడుతుందనేది ఆమె అభిప్రాయం.
సొంత దేశంలో ఈ వెక్కిరింపులే టున్జీలో మరింత పట్టుదలను పెంచాయి. ‘విశ్వసుందరి’ కిరీటాన్ని దక్కించుకోవాలన్న కసిని పెంచాయి. ఆ సంకల్పంతోనే లక్ష్యం అందుకోవాలని ఆమె అహర్నిశలూ శ్రమించారు. శరీర ఆకృతే కాదు... తెలివితేటలకూ పదును పెట్టారు. చివరకు అమెరికాలోని అట్లాంటా వేదికగా అత్యంత వైభవంగా జరిగిన మెగా ఈవెంట్‌లో ‘విశ్వసుందరి’గా నిలిచారు. ప్రపంచానికి తన సందేశాన్ని వినిపించారు. ఆనంద భాష్పాలు... ఉద్విగ్న క్షణాలు... కళ్లు చెమర్చిన వేళ జొజిబినీ టున్జీ మనసు లోతుల్లో నుంచి రెండు ముక్కలు...
‘‘నాలాంటి రంగు, జుట్టు ఉన్న మహిళలు అందగత్తెలే కాదన్న సమాజంలో నేను పెరిగాను. అలాంటి వివక్షకు ముగింపు పలికే సమయం ఇదేనని భావిస్తున్నా. చిన్నారులు నాలో వారిని వారు చూసుకోవాలని కోరుకొంటున్నాను’’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఆమె మాటలు అక్కడున్నవారినే కాదు, టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న కోట్లమందిని కదిలించాయి.. ‘నీ విజయం ఎట్టకేలకు నా నాలుగేళ్ల కూతురు ఓ సెలబ్రిటీలో తనను తాను చూసుకొనేలా చేసింది’ అంటూ ఓ తల్లి ఇన్‌స్టాగ్రామ్‌లో టున్జీని అభినందిస్తూ పోస్ట్ పెట్టింది. ఈ విషయాన్ని టున్జీ ఎంతో గర్వంగా పంచుకున్నారు. అందుకే టున్జీ గెలుపు నల్లజాతి మొత్తానిది! అంతేకాదు... ఓ నల్లజాతి మహిళ ‘విశ్వసుందరి’గా నిలవడం ఎనిమిదేళ్ల తరువాత ఇదే తొలిసారి. 1977లో ట్రినిడాడ్‌కు చెందిన జానెల్లే కమిషంగ్ మొట్టమొదటిసారి ఈ టైటిల్ దక్కించుకుంది.
మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న టున్జీ... మరోవైపు సామాజిక సేవ కూడా చేస్తున్నారు. లింగ వివక్షపై విస్తృతంగా పోరాడుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తన ఉద్యమాన్ని ఉధృతంగా నడిపిస్త్ను ఆమె ఒక పుస్తకాల పురుగు. అమ్మమ్మే తనకు స్ఫూర్తి అని చెబుతున్న ఈ విశ్వసుందరి రూపలావణ్యంలోనే కాదు... ఆకట్టుకొనే వాగ్ధాటి, తెలివితేటలు, వినమ్రతలతో న్యాయనిర్ణేతలు, ఆహూతుల మనసు గెలుచుకున్నారు. అందుకే అందాల పోటీకే పనికిరావన్నవారు... నీ ‘రంగు’ రంగే కాదన్నవారు ఇప్పుడు జొజిబినీ టున్జీకి నీరాజనాలు పడుతున్నారు.