Kuwait-Swamy-spending-lakhs-of-rupees-for

1985లో కువైట్‌కు వెళ్లిన ఆయన.. నేడు లక్షలు ఖర్చు పెడుతూ..

నవతరం నాటకాల్లోకి రావాలి: కువైట్‌ స్వామి


హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): తెలుగు నాటకం సత్తాను ప్రపంచానికి చాటాలన్న తపనతో కష్టార్జితంలోంచి రూ.లక్షలు వెచ్చిస్తున్న వై.ఎస్.కె.ఎస్.స్వామి మంచి ప్రదర్శనలకు చేయూతనందిస్తానంటున్నారు. 50 ఏళ్లుగా తెలుగు నాటకంతో సన్నిహితంగా మెసులుతున్న ఆయన కువైట్‌లో ఎలక్ట్రానిక్‌ ఇంజనీర్‌గా రిటైర్‌ అయి తెలుగు గడ్డపై స్థిరపడ్డారు. రెండు దశాబ్దాలుగా కువైట్‌లో 1050 మంది తెలుగు కుటుంబాలను ఒక వేదికపైకి తెచ్చి తెలుగు సంస్కృతికి పెద్దపీట వేశారు. తాజాగా తెలుగు నాటక రచనల పోటీ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కువైట్‌ స్వామిగా తెలుగు కళారంగానికి పరిచితుడైన ఆయన చెబుతున్న ముచ్చట్లు ఇవి..
 
‘ప్రపంచంలోని ప్రాంతీయ భాషల్లో తెలుగు తీయదనం అందరికీ తెలిసిందే. నాటకాల సంగతి వచ్చేసరికి మనం వెనుకబడిపోయామనుకునే న్యూనత పేరుకుపోయింది. వాస్తవానికి ప్రపంచ భాషల్లో తెలుగు నాటకం ముందుంది. ఏటా మన రచయితలు రాస్తున్నవి లెక్క కడితే మనం అగ్రభాగాన ఉన్నామని నిబ్బరంగా చాటుకోవచ్చు. 50 ఏళ్లుగా నేను నాటకానికి ఎంతో కొంత దగ్గరగా ఉన్నాను. సమాజంలో వచ్చిన మార్పుల వల్ల 1980 తర్వాత తరంలో అభిరుచులు మారిపోయాయి. సహజమైన రంగస్థల అభినయం కన్నా కృత్రిమ మాధ్యమాలపై మోజు పెరిగింది. వేషం వేసేవారికి, చూసేవారికి ఉండే మానసిక సంబంధాలు, రసాస్వాధనలో తేడాలు తెలుసుకోలేనంత మారిపోయాం. ఇవి గమనించిన నాకు మన నాటకం కోసం ఏదైనా చేయాలనిపించింది.  బతుకుదెరువు కోసం కువైట్‌లో 30ఏళ్లు ఉండడంతో అక్కడే కువైట్‌ తెలుగు కళా సమితి స్థాపించాను. మిత్రులు, కార్యకర్తల సహకారంతో నాటకానికి కొత్త వేదిక ఏర్పాటుచేయగలిగాం..’
 
కళా నేపథ్యం
1985లో తెలుగు విద్యాలయం ఆవిర్భవించిన తర్వాత నాటక రచనతోపాటు ప్రదర్శనలు, అందుకు తగ్గటు ప్రాంతీయ పోటీలు నిర్వహించేవారు. నేను ఉద్యోగ బాధ్యతల్లో రాయలసీమలోని ఎర్రగుంట్ల నుంచి కువైట్‌కు వలస పోయిన సమయమూ అదే. అప్పటి పోటీల్లో పల్లేటి లక్ష్మీకులశేఖర్‌ రచన తపస్సు ప్రథమ బహుమతి అందుకుంది. ఆ తర్వాత వివరాలు తెలుసుకుని నాటకం ప్రదర్శనకు నేను పూనుకున్నాను. ఎర్రగుంట్లలో ఒక నాటక సమాజం మా వల్ల పుట్టుకొచ్చింది. ఆ రోజుల్లో పాలకొల్లులో ఉండే పేలూరిదాసు దర్శకత్వ ప్రతిభను అందరూ చెప్పుకొనేవారు. ఆయన్ని సంప్రదించి తపస్సు నాటకాన్ని తపస్సులానే సాధన చేసి ప్ర
 
తిభావంతమైన ప్రదర్శనగా తీర్చిదిద్దగలిగాం. నాటకాల వారికి కలకాలం గుర్తుండే ప్రొద్దుటూరు నాగరాజు తపస్సు ప్రదర్శనలకోసం విపరీతంగా శ్రమించాడు. మేము ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా అప్పటితరం ఉద్దండుల మధ్య మా కొత్తసమాజం బహుమతుల పంట పండించేది. ఆ ప్రస్థానం ఇప్పటికీ స్ఫూర్తిదాయకం. నేను కువైట్‌లో స్థిరపడటంతో ఆ సమాజం అక్కడితోనే ఆగిపోయింది. 1992 నుంచి కువైట్‌ తెలుగు కళాసమితి సాంస్కృతిక రంగంలో చురుకైన వేదికగా మారింది. ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నిర్వహించాం. తెలుగు నాటకానికి పెద్దపీట వేశాం. ఆ రోజుల్లో మహత్తర ప్రదర్శనలుగా జేజేలు అందుకున్న పెండింగ్‌ ఫైల్‌, ఓటున్న మహారాజుకు కోటిదండాలు, అనగనగా ఒక రోజు, కుందేటికొమ్ము వంటివి కువైట్‌లో వేదిక మీదకు వచ్చాయి..
 
ప్రదర్శనలపైనా దృష్టి
రచనల తర్వాత ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇవ్వాలనిపించింది. ఈ ఏడాది నుంచి మా పోటీల్లో బహుమతి పొందిన రచనల ప్రదర్శన కోసం అవసరమైన తోడ్పాటు అందిద్దామ సంకల్పించాం. హైదరాబాద్‌, విశాఖ లో గల రంగస్థల నిపుణులు, సాంకేతిక పరిజ్ఞానంలో పరిణిత గలవారు మాకు తోడుంటామన్నారు. మా కుటుంబ అవసరాలు, బాధ్యతలు అయిపోయాయి. నాకున్న దాంట్లో నాటకం కోసం ఎక్కువ భాగం వెచ్చించాలనుకుంటున్నాను. కొత్తతరం నాటక రంగంలోకి రావాలన్నది నా కోరిక. ప్రదర్శనల్లోనూ అత్యాధునిక పద్ధతులు రావాలి. ఈ ఏడాది రచనల పోటీకి ఆహ్వాన ప్రకటనలు ఇచ్చేశాను. నాటక వికాసం కోసం 96668 17969 ఫోన్‌ నెంబరులో అందుబాటులో ఉంటాను.’’
 
పోటాపోటీగా రచనలు 
తెలుగునాటక వికాసం కోసం అజోవిభో.. నంది నాటకాలు వంటివి చేస్తున్న కృషితో పాటు లోపాలనూ గమనించిన నాకు మంచి నాటికలకు ప్రత్యేక ప్రోత్సాహం అవుసరమనిపించింది. 2012లో కువైట్‌ తెలుగు కళా సమితి నుంచి రచనల పోటీ మొదలుపెట్టాం. రచయితల నుంచి మంచిస్పందన వచ్చింది. నాటకం తగ్గి నాటికలు తెలుగ గడ్డపై పెరగడంలో మా కృషి ఫలవంతమైంది. ఎలాంటి వేదికపైనైనా సులువుగా, అనువుగా నాటిక ఉండేలా ఆలోచనలు ఆచరణలోకి వచ్చాయి. రచనలకు ఉత్తమ బహుమతిగా 200వేల మెత్తం ఇవ్వడంతోపాటు ద్వితీయ, తృతీయ, ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నాం. తెలుగు రచయితలు మా వేదికవైపు చూపు సారించి నాటికల పదును పెంచారు. 2012లో 48 రచనలు వన్తే మరుసటి ఏడాదికి రెట్టింపయ్యాయి. ఏడాదికి 110 నాటికలు పోటాపోటీగా తయారయ్యే రచనా స్పర్ధ పెరిగింది. 45 పరిషత్‌లు, నంది నాటకాల్లో బహుమతులు తెచ్చుకున్నవి ముందుగా మా వేదిక నుంచి బహుమతులు అందుకున్నాయి.