Karabi-Gogoi-Appointed-as-Defence-attach-to-Russia

కరబీ గొగోయ్.. తొలి మహిళగా మరో కొత్త అధ్యాయం..

అలలపై ప్రయాణం ఆమెకు ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే తనను నావల్‌ ఇంజనీర్‌ చేసింది. ఆ వెంటనే ధైర్యసాహసాలతో కూడిన నౌకాదళంలో అడుగుపెట్టారామె. తాజాగా రష్యా రాజధాని మాస్కోలో భారత దౌత్య కార్యాలయంలో భద్రతా అధికారిణిగా నియమితులైన నౌకాదళానికి చెందిన తొలి మహిళగా మరో కొత్త అధ్యాయం లిఖించారు లెఫ్టినెంట్‌ కమాండర్‌ కరబీ గొగోయ్‌.

కరబీ గొగోయ్‌ పుట్టి పెరిగింది గువహటిలో. దేశరక్షణలో తాను భాగం కావాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఆమెలో బలంగా ఉండేది. ఆ ఆలోచనతోనే నావల్‌ ఇంజనీరింగ్‌ చదివారు. చదువయ్యాక 2010లో ఇండియన్‌ నేవీలో ఉద్యోంగలో చేరారు. యుద్ధనౌకల తయారీ, వాటి నిర్వహణలో అనుభవజ్ఞురాలిగా తక్కువ కాలంలోనే గుర్తింపు మంచి తెచ్చుకున్నారు. ఆమె భర్త ప్రాంజల్‌ హాండికే కూడా నేవీలోనే లెఫ్టినెంట్‌ కమాండర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటకలోని కర్వారా బేస్‌లో లెఫ్టినెంట్‌ కమాండర్‌గా (ఆర్మీలో మేజర్‌ హోదాకు సమానం) విధులు నిర్వర్తిస్తున్నారు. అసిస్టెంట్‌ నావల్‌ అటాచ్‌ పోస్టింగ్‌ కోసం చాలామంది పోటీపడ్డారు. అయితే వారిలో దౌత్యపరమైన అంశాలతో కూడిన అసైన్‌మెంట్‌లో ముందంజలో నిలిచి, ఇంటర్వ్యూలో కూడా మంచి మార్కులు సాధించారు కరబీ. త్వరలోనే అసిస్టెంట్‌ నావల్‌ అటాచ్‌గా మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు.
 
‘‘లెఫ్టినెంట్‌ కమాండర్‌ గొగోయ్‌ ఈ నెల తీసుకుంటున్న రష్యన్‌ భాష కోర్సు ఈ నెలతో పూర్తికానుంది. అన్ని అనుమతులు రాగానే ఈ డిసెంబర్‌లో మాస్కోలో ఆమె కొత్త పోస్టింగ్‌ తీసుకోనున్నారు’’ అని అధికారులు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వింగ్‌ కమాండర్‌ అంజలీ సింగ్‌ (యుద్ధ విమానాలు నడపడంలో సిద్ధహస్తురాలు) రష్యాలోని భారత దౌత్య కార్యాలయంలో మిలటరీ డిప్లొమాట్‌గా చేరిన తొలి మహిళగా గుర్తింపు సాధించారు. దేశరక్షణలో భాగమవుతూ మహిళా శక్తిని ఘనంగా చాటుతోన్న ఈ సాహస వనితలు ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.