Indian-is-in-key-position-in-Canadian-parliament

కెనడాలో మనోడే కింగ్‌మేకర్‌

జగ్మీత్‌ సింగ్‌... భారతీయ మూలాలున్న కెనడా దేశస్థుడు. ఇప్పుడు కెనడా రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. అక్కడ జరిగిన ఇటీవలి సాధారణ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని ‘న్యూ డెమోక్రటిక్‌ పార్టీ’ (ఎన్‌డీపీ) 24 సీట్లు గెలుచుకుంది. కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో తిరిగి అధికారం చేపట్టాలంటే మరో పార్టీ మద్దతు తప్పనిసరయింది. ఈ సమీకరణాల నేపథ్యంలో జగ్మీత్‌ ఇప్పుడు అక్కడ కింగ్‌మేకర్‌గా మారారు.

జగ్మీత్‌ సింగ్‌ జిమ్మీ ధలివాల్‌... ఇదీ ఎన్‌డీపీ నేత పూర్తి పేరు. కానీ తన పేరు చివరలోని ‘ధలివాల్‌’ కులాన్ని సూచిస్తుండటం ఆయనకు నచ్చలేదు. దీంతో దాన్ని తీసేసి జగ్మీత్‌ సింగ్‌గానే ప్రపంచానికి చాటుకున్నారు. పంజాబ్‌కు చెందిన ఆయన తల్లిదండ్రులు కెనడాలోని ఒంటారియోలో స్థిరపడ్డారు. అక్కడే పుట్టి పెరిగిన జగ్మీత్‌ 2001లో సైన్స్‌ సబ్జెక్ట్‌తో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత యార్క్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఆయనకు తమ్ముడు గురంటన్‌, చెల్లి మన్‌జోత్‌ ఉన్నారు. ప్రస్తుతం ఒంటారియో అసెంబ్లీ సభ్యుడైన గురంటన్‌ తన అన్నకు రాజకీయాల్లో పూర్తి సహకారం అందిస్తున్నారు. న్యాయశాస్త్రం చదివిన జగ్మీత్‌ కొంతకాలం క్రిమినల్‌ డిఫెన్స్‌ లాయర్‌గా ప్రాక్టీస్‌ చేశారు. మానవహక్కులు, సామాజిక అంశాలకు సంబంధించిన పలు కీలక కేసులు వాదించారు. వివిధ న్యాయశాస్త్ర సంస్థలకు పని చేశారు. న్యాయ సంబంధ విషయాలపై ఉచిత సెమినార్లు ఇచ్చారు. సమానత్వంపై గొంతెత్తిన ఆయన స్వలింగ సంపరు, ట్రాన్స్‌జెండర్ల (ఎల్‌జీబీటీక్యూ)కూ మద్దతుగా నిలిచారు. వారి హక్కుల కోసం పోరాడారు.
 
మొదటి వ్యక్తి ఆయనే...
న్యాయవాదిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జగ్మీత్‌ సింగ్‌... 2011లో రాజకీయల్లోకి ప్రవేశించారు. తాను పుట్టి పెరిగిన ఒంటారియో ప్రావినెన్స్‌లోని బ్రమలో-గోర్‌-మాల్టన్‌ నుంచి పోటీ చేశారు. ఆ తరువాత రాజకీయంగా ఆయన గట్టి పునాదులు వేసుకున్నారు. ఎన్‌డీపీలో బలం పెంచుకున్నారు. అనూహ్యంగా 2017లో పార్టీ నాయకుడిగా పగ్గాలు చేపట్టారు. నాయకత్వం కోసం జరిగిన అంతర్గత ఎన్నికల్లో గెలుపొందారు. తద్వారా కెనడాలోని ఓ ప్రధాన రాజకీయ పార్టీకి నేతృత్వం వహిస్తున్న తొలి శ్వేతజాతీయేతర నాయకుడిగా జగ్మీత్‌ సింగ్‌ చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఆయన దక్షిణ బర్న్‌బే ఎంపీ. అంతేకాదు... ఒంటారియో రాష్ట్ర చట్టసభలో సిక్కుల సంప్రదాయబద్ధమైన తలపాగాతో అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఆయనే!
 
పార్లమెంట్‌లో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తానని, కెనడియన్ల హక్కుల కోసం పోరాడతానని ఎన్నికల ఫలితాల అనంతరం జగ్మీత్‌ సింగ్‌ చెప్పారు. అంతేకాదు... ‘కొలువదీరబోయేది మైనారిటీ ప్రభుత్వమే. ట్రూడో దాన్ని గౌరవించి మమ్మల్ని కలుపుకొని పనిచేస్తారని ఆశిస్తున్నాం’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి అధికార పార్టీకి తమ అవసరం ఎంతుందో చెప్పకనే చెప్పారు సింగ్‌.
ఫ్యాషన్‌ రాజా...
జగ్మీత్‌ ఫ్యాషన్‌ను బాగా ఫాలో అవుతారు. ఎప్పటికప్పుడు సరికొత్త స్టయిల్‌ స్టేట్‌మెంట్స్‌తో కెనడా మీడియాను ఆకర్షిస్తుంటారు. ‘టొరంటో లైఫ్‌’ మ్యాగజైన్‌ టాప్‌ 5 ‘యంగెస్ట్‌ రైజింగ్‌ స్టార్స్‌’ జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. 2013లో టాప్‌ 10 ‘బెస్ట్‌ డ్రెస్డ్‌’గా కవర్‌ పేజీలపై కనిపించారు. టొరంటోలోని టాప్‌ 25 స్టయిలిష్‌ పర్సనాలిటీల జాబితాలో సింగ్‌ కూడా ఉండటం ఆయనకున్న డ్రెస్సింగ్‌ సెన్స్‌కు అద్దం పడుతుంది.
 

సింగ్‌ గత ఏడాది ఫ్యాషన్‌ డిజైనర్‌, పంజాబీ డిజైన్‌ డ్రెస్సుల ‘జంగీరో’ సంస్థ సహ వ్యవస్థాపకురాలు అయిన గురుకిరణ్‌ కౌర్‌ సిద్ధూను వివాహమాడారు. ఓ రెస్టారెంట్‌లో కౌర్‌కు జగ్మీత్‌ పెళ్లి ప్రతిపాదన చేశారు. కెనడాలో పెరిగినా మూలాలను మర్చిపోకపోవడం జగ్మీత్‌లోని ప్రత్యేకత. ఆయన తన మాతృభాష పంజాబీతో పాటు ఇంగ్లిష్‌, హిందీ, ఫ్రెంచ్‌ అనర్గళంగా మాట్లాడ గలరు.


సీట్లు తగ్గినా...
వాస్తవానికి చిన్న వయసులోనే జగ్మీత్‌ సింగ్‌ సారథ్యం వహిస్తున్న ఎన్‌డీపీకి గత ఎన్నికల కన్నా ఈసారి సీట్లు బాగా తగ్గాయి. 2015 ఎన్నికల్లో 44 సీట్లు సాధించిన ఎన్‌డీపీ ప్రస్తుతం 24 స్థానాలకే పరిమితమైంది. అయితే ట్రూడో నాయకత్వంలోని ‘లిబరల్‌ పార్టీ’ మొత్తం 338 ఎలక్టోరల్‌ డిస్ర్టిక్ట్స్‌కు గానూ 157 మాత్రమే గెలుచుకుంది. ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ పార్టీ 121 డిస్ర్టిక్ట్స్‌లో నెగ్గింది. దీంతో ట్రూడోకు ఇతరుల మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే జగ్మీత్‌ సింగ్‌కు కలిసొచ్చింది. సీట్లు తగ్గినా చక్రం తిప్పే స్థానంలో ఉన్న నలభై ఏళ్ల ఈ భారతీయ సంతతి నేత... చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించి తనదైన ముద్ర వేసుకున్నారు.
అక్కడ 18... ఇక్కడ 13...
భారత్‌లో... అలాగే కెనడాలో సిక్కుల జనాభా శాతం రెండే! కానీ ఇక్కడి కంటే అక్కడే ఎక్కువ మంది సిక్కులు ఎంపీలుగా ఉన్నారు. కెనడా తాజా ఎన్నికల్లో 18 మంది సిక్కులు ‘హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌’కు ఎన్నికవ్వగా, మన లోక్‌సభలో సిక్కు ఎంపీల సంఖ్య 13 మాత్రమే! వీరిలో 10 మంది పంజాబ్‌ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.