మా ఆయనకు కూడా సంగీతం తెలుసు. ఆయన సింగపూర్‌లో ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. నేను మాత్రం హౌస్వైఫ్గానే సెటిలయ్యా. పిల్లల ఆలనా పాలనలోనే రోజంతా గడిచిపోయేది. అయితే నాలోని కర్నాటిక్ క్లాసికల్ సింగర్ మాత్రం నిరంతరం సాధన చేస్తూనే ఉండేది. సింగపూర్‌లోని మా కాలనీలో నవరాత్రి ఉత్సవాలకు గళం సవరించుకునేదాన్ని. అప్పుడప్పుడు కాన్సర్ట్‌లు కూడా ఇస్తుంటా.
చక్కని గళం ఉండి, టాలెంట్ ఉన్నా కూడా సరైన వేదిక లేక బాత్రూమ్ సింగర్స్గానే మిగిలిపోతారు చాలామంది. ఎవరేమనుకుంటారోనని చాటుమాటుగా గళం సవరించుకుంటుంటారు. ప్రపంచవ్యాప్తంగా అలాంటి కొన్ని వేల ‘సీక్రెట్’ సింగర్స్‌ను అందరికీ పరిచయం చేస్తోంది ‘స్మ్యూల్’. అలా పరిచయమైన వారిలో విధు వివేక్ ఒకరు. సింగపూర్‌లో నివాసముంటున్న విధు ప్రస్తుతం ‘స్మ్యూల్’ సంగీత ప్రపంచంలో సెలబ్రిటీ సింగర్. అంతేకాదు.. ఒక డబ్మాష్తో ఆమె సూపర్‌స్టార్ రజనీకాంత్ దృష్టిని ఆకర్షించారు. ‘‘రజనీ సార్ పిలిచి అభినందించడం నా జీవితంలో మర్చిపోలేను’’ అంటున్న విధు వివేక్ సింగపూర్ నుంచి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఈ ‘స్మ్యూల్’ సెలబ్రిటీ సింగర్ సంగీత ప్రయాణం ఆమె మాటల్లోనే...
‘స్మ్యూల్’లో విధువివేక్గా పాపులర్ అయినప్పటికీ నా అసలు పేరు శ్రీవిద్య. అందరూ ‘విధు’ అని పిలిచేవారు. అది కాస్తా పెళ్లయిన తర్వాత ‘విధు వివేక్’గా మారింది. మాది చెన్నై. అక్కడి వీధుల్లోనే నా సంగీతయాత్ర మొదలయ్యింది. నాకొక సిస్టర్ ఉంది. అమ్మనాన్నలకు (నాన్న చనిపోయారు. అమ్మపేరు ఉష) సంగీతమంటే ఇష్టం కాబట్టి మా ఇద్దరికీ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. నాలుగేళ్లు ప్రసిద్ధ సంగీత గురువులు శ్రీమతి సీతానారాయణన్, చెంగళ్పట్ రంగనాథన్గార్ల శిష్యరికంలో శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నా. చిన్నప్పుడు ఆలిండియో రేడియోలో కూడా పాటలు పాడేదాన్ని. ఒకసారి మా సిస్టర్, నేను రేడియోలో ప్రోగ్రామ్ ఇచ్చేందుకు వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. అయినప్పటికీ పట్టువదలకుండా రేడియోలో కార్యక్రమం ఇచ్చి వచ్చాను. సంగీతం అంటే అంత ప్రేమ నాకు.
సరదాగా ‘స్మ్యూల్’కు ...
డిగ్రీ అయిపోయిన తర్వాత చెన్నైలోనే ఎంబీఏ చేశాను. ఒక కంపెనీలో ఉద్యోగం కూడా చేసేదాన్ని. ఆ తర్వాత ఇంట్లోవాళ్లు నాకు పెళ్లి చేయడంతో మా వారు వివేక్‌తో కలిసి సింగపూర్‌కు వచ్చేశాను. మా ఆయనకు కూడా సంగీతం తెలుసు. ఆయన ఇక్కడే ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. నేను మాత్రం హౌస్వైఫ్గానే సెటిలయ్యాను. నాకు ఒక అమ్మాయి (12), ఒక అబ్బాయి (8). వాళ్ల ఆలనా పాలనలోనే రోజంతా గడిచిపోయేది. అయితే నాలోని కర్నాటిక్ క్లాసికల్ సింగర్ మాత్రం నిరంతరం సాధన చేస్తూనే ఉండేది. సింగపూర్‌లోని మా కాలనీలో నవరాత్రి ఉత్సవాలకు గళం సవరించుకునేదాన్ని. అప్పుడప్పుడు కాన్సర్ట్‌లు ఇస్తుండేదాన్ని. ఏడాదికొకసారి చెన్నై వచ్చినప్పుడు సంగీతకారులను కలుస్తుండేదాన్ని. ఆ విధంగా సంగీతంతో అనుబంధం మాత్రం కొనసాగుతూనే ఉంది.
గత ఏడాది నెట్లో ‘స్మ్యూల్’ గురించి తెలుసుకున్నా. క్లాసికల్ సింగర్‌ని అయినప్పటికీ తమిళ అమ్మాయిని కాబట్టి సహజంగానే సినిమా పిచ్చి ఉంటుంది కదా. పాత పాటల నుంచి, కొత్త పాటల దాకా అన్ని సినిమా పాటలు పాడేదాన్ని. ‘స్మ్యూల్’లో సరదాగా పాటలు పాడాలనుకుని 70 డాలర్లు చెల్లించి (ఇండియాతో పోల్చితే సింగపూర్‌లో ఫీజు ఎక్కువ) ఒక ఏడాదికి రిజిస్టర్ చేయించుకున్నా. నిజంగా ఇదో కొత్త అనుభవం. ‘స్మ్యూల్’ యాప్ ద్వారా నచ్చిన పాటకు సంబంధించి ‘కరోకే’ (గాయనీ గాయకుల గొంతులు మినహా మిగతా ట్రాకులతో కూడిన మ్యూజిక్)ను హెడ్‌ఫోన్స్ ద్వారా వింటూ దానికి అనుగుణంగా పాట పాడి అప్లోడ్ చేయడమే. మ్యూజిక్ ట్రాక్‌కు తగ్గట్టుగా పాడాలంటే ఎవరికైనా కొంత అనుభవం అవసరం. ఎక్కడ పాటను ఆపాలో, ఎక్కడ రాగాన్ని ఎత్తుకోవాలో తెలియాలి. పాట, సంగీతంపై పూర్తిగా అవగాహన ఉంటేనే ‘కరోకే’ అర్థమవుతుంది. ఆ విధంగా తమిళ, మలయాళ, హిందీ (ఒకట్రెండు తెలుగు పాటలు కూడా పాడాను) పాటలు ఏడాది కాలంలో 1,050కి పైగా పాడాను. వాటిలో ఇళయరాజా దగ్గరి నుంచి ఎ.ఆర్.రెహమాన్ పాటల దాకా ఎంతోమంది సంగీత దర్శకుల పాటలున్నాయి. పాటతో పాటు వీడియో కూడా అప్లోడ్ అవుతుంది కాబట్టి ఆ సింగర్స్ ఎవరనేది బయటి ప్రపంచానికి తెలుస్తారు. ఆ విధంగా ‘స్మ్యూల్’లో నా పాటలకు గుర్తింపు లభించింది.
ఒక పాటకు పది లక్షల వ్యూస్...
నేను ఇప్పటిదాకా ‘స్మ్యూల్’లో పాడిన వెయ్యికి పైగా పాటల్లో చాలా పాటలు నాకు పేరు తీసుకొచ్చాయి. వాటిలో తమిళ చిత్రం ‘రెక్కా’ (2016)లోని ‘కన్నమ్మ... కన్నమ్మ’ అనే పాటను ప్రపంచవ్యాప్తంగా పదిలక్షల మందికి పైగా వీక్షించారు. అమెరికన్ ప్రసిద్ధ గాయకుడు ఎద్ షీరన్ పాట ‘షేప్ ఆఫ్ యూ’ను చాలా దేశాల్లో అభిమానులు పాడి ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారు. నేను కూడా ఆ పాటకు అభిమానిని. నేను సరదాగా పాడిన ‘షేప్ ఆఫ్ యూ’కు కూడా ఊహించని రెస్పాన్స్ వచ్చింది. నెట్లో ఆ పాటలను చూసి, విని సంగీతాభిమానులు చేసే కామెంట్స్ సంతోషాన్నిస్తాయి. మరిన్ని పాటలు పాడేందుకు ఉత్సాహాన్ని అందిస్తాయి. ఇంటినే రికార్డింగ్ స్టూడియోగా చేసుకుని ఒక పాట పాడితే, అది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ కావడం విశేషమే కదా. ఆ విధంగా ‘స్మ్యూల్’ నాలాంటి ఎందరో గాయనీ గాయకులను తెరపైకి తీసుకొస్తోంది. ఇప్పటికి నాకు 44 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటే వాళ్లంతా నా పాటలు క్రమం తప్పకుండా వింటున్నట్టే కదా.
రజనీని కలవడం మర్చిపోలేను...

‘కబాలి’ సినిమా విడుదలకు ముందు ట్రైలర్‌లోని రజనీకాంత్ డైలాగు ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఇంటర్నెట్లో చాలామంది ఆ డైలాగును అనుకరించి పెట్టేవారు. నేను కూడా సరదాగా ‘కబాలి’ డైలాగును డబ్‌మాష్ చేశాను. అది ఇన్‌స్టంట్‌గా హిట్ అయ్యింది. ఆ తర్వాత రజనీసర్కు కూడా చేరింది. అది చూసి ఆయన చాలా ముచ్చట పడ్డారు. నన్ను కలవమన్నారు. చెన్నైలో రజనీసర్ను కలవడం నా జీవితంలో మర్చిపోలేని గొప్ప జ్ఞాపకం. ఆయనతో నలభై నిమిషాలు ఉన్నాను. నా పాటల గురించి తెలుసుకుని సంతోషించారు. గత ఏడాది డిసెంబర్లో చెన్నైలో జరిగిన ‘తరంగ్’ పోటీల్లో నాకు స్పెషల్ జ్యూరీ అవార్డు ఇచ్చారు.
ఏ అవకాశాన్నీ వదులుకోను...
క్లాసికల్ సింగర్‌ను కాబట్టి సినిమా పాటలు పాడటం పెద్దగా కష్టమేం కాదు. నా గొంతులోని ఎక్స్ప్రెషన్స్ నచ్చిన చాలామంది ‘సినిమాల్లో పాటలు పాడొచ్చు కదా’ అంటున్నారు. అయితే నేను ఎప్పుడూ ఏదీ ప్లాన్ చేసుకోను. నాకు నచ్చింది చేసుకుంటూ వెళ్తుంటా. ఒకవేళ ఎవరైనా సినిమాల్లో పాడమని ఆఫర్ ఇస్తే కాదనను. తప్పకుండా అక్కడ కూడా నా టాలెంట్ నిరూపించుకోవాలనే చూస్తా. ఫేవరెట్ సాంగ్స్, ఫేవరెట్ సింగర్స్, ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటూ ఎవరూ లేరు. మంచి పాటలు ఏ భాషలో ఉన్నా, ఎవరు సంగీతం చేసినా, ఎవరు పాడినా ఎంచక్కా ఆస్వాదిస్తా. నా కుటుంబంతో చాలాకాలంగా సింగపూర్‌లో ఉంటున్నా, సోషల్ మీడియా పుణ్యమా అని సంగీత ప్రపంచానికి అనుక్షణం అందుబాటులోనే ఉంటున్నా. ఈ రోజుల్లో ఆసక్తి, టాలెంట్ ఉంటే హౌస్‌మేకర్ అయినా సెలబ్రిటీ కావొచ్చనడానికి నేనే చక్కని ఉదాహరణ.
ఏమిటీ ‘స్మ్యూల్’..?
సంగీత ప్రపంచంలో ఇప్పటికే పాపులర్ అయిన ‘స్మ్యూల్’ ఓ యాప్. ప్రపంచాన్ని సంగీతంతో కలిపే యాప్ ఇది. స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ప్రధాన కేంద్రం అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఉంది. ఈ యాప్ పాటల కోసం కాబట్టి వాయిస్ క్లారిటీ బాగుంటుంది. ప్రపంచంలోని ఎవరైనా, ఎవరితోనైనా నచ్చిన పాట పాడుకునే సదుపాయం ఉంటుంది (ఇందుకోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది). వివిధ భాషల్లోని పాటలకు సంబంధించిన ‘కరోకే’లను డౌన్లోడ్ చేసుకుని పాటలు పాడాల్సి ఉంటుంది. ఆ పాటలు గాయకుల వీడియోతోపాటు అప్లోడ్ అవుతాయి. కావాలనుకుంటే ఒరిజినల్ గాయకులతో (సింగ్ విత్ ఆర్టిస్ట్) కూడా పాటను పాడే వెసులుబాటు ఇందులో ఉంది. ఇంగ్లీషు, హిందీ, మలయాళం, తమిళం, తెలుగు... ఇలా ఆయా భాషల విభాగాలు, ఫేవరేట్ గాయనీగాయకుల విభాగం, లవ్‌సాంగ్స్, పాప్... ఇలా అనేక విభాగాలుంటాయి. ఎవరికి ఏది కావాలంటే అది వినొచ్చు. పాటకు సంబంధించిన లిరిక్స్ కూడా ఉంటాయి. వాటిని చూస్తూ పాడొచ్చు. ఫోన్నెంబర్తోగానీ, ఫేస్బుక్తోగానీ, ఈమెయిల్తోగానీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
-చల్లా శ్రీనివాస్