Indian-came-after-10-years-from-America

అమెరికాలో పదేళ్లు ఉండి భారత్‌కు తిరిగొచ్చి..

‘నవీన’ సమాచార శక్తి

120 అగ్రశ్రేణి కంపెనీలకు డేటా ఎనలిటిక్స్‌ సేవలు..
పీఎంవో సహా పలు కేంద్ర మంత్రిత్వ శాఖలకు సమాచారం

ప్రపంచంలో చాలా మందిలాగే.. ఆ కుర్రాడికి అమెరికా అంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి అక్కడికి వెళ్లాలని కలలు కన్నాడు. చివరకు వెళ్లాడు. అక్కడ పదేళ్లపాటు ఉండి సంపాదించిన అనుభవంతో భారత్‌కు తిరిగొచ్చి ఓ కంపెనీ పెట్టాడు. బిగ్‌డేటా ఎనలిటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధ) సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనలో ఆ సంస్థ అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించింది. పీఎంవో సహా పలు కేంద్ర శాఖలకు, 120 అగ్రశ్రేణి అంతర్జాతీయ కంపెనీలకు సేవలు అందిస్తున్న ఆ సంస్థ పేరు.. గ్రామెనర్‌. దాన్ని స్థాపించిన వ్యక్తి.. మన తెలుగోడు.. గట్టు నవీన్‌. గ్రామెనర్‌ గురించి.. తన అనుభవాల గురించి నవీన్‌ మాటల్లోనే..
 
నేను పుట్టింది.. పెరిగింది హైదరాబాద్‌లో. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. మా అమ్మనాన్నలవి రెండు భిన్నమైన ఆలోచనా విధానాలు. ‘నువ్వు అందరికన్నా ముందు ఉండాలి.. దాని కోసం ఎంత కష్టానికైనా సిద్ధపడాలి..’ అని అమ్మ చెప్పేది. ‘నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అత్యాశ పనికిరాదు’ అని నాన్న చెబుతూ ఉండేవారు. ఈ రెండు ఆలోచనా విధానాలు నాకు జీవితంలో ఎంతో ఉపయోగపడ్డాయి. చిన్నప్పుడు నాకు అమెరికా అంటే పిచ్చి. అక్కడకి వెళ్లడమే నా జీవిత లక్ష్యంగా ఉండేది. బీటెక్‌ తర్వాత కొద్ది కాలం ఐబీఎంలో ఉద్యోగం చేసి.. 1999లో అమెరికా వెళ్లా. అక్కడ పదేళ్లపాటు అందరిలాగానే గడిపేశా. ఆ తర్వాత నాలో అసంతృప్తి మొదలైంది. ‘ఈ జీవితం నాకు నిజంగానే ఆనందం ఇస్తోందా? నేను చేయాలనుకున్న పని చేస్తున్నానా? కార్పొరేట్‌ నిచ్చెనలో నేను ఎంత వరకూ వెళ్లగలను? నా అనుభవాన్నంతా ఈ కంపెనీల కోసమే ఎందుకు వెచ్చించాలి? లాంటి రకరకాల ప్రశ్నలు నన్ను వేధించడం మొదలుపెట్టాయి. నా ఆలోచనలను కొందరు ఫ్రెండ్స్‌తో పంచుకున్నా. వారిలో కొందరికి కూడా అలాంటి ఆలోచనలే ఉన్నాయి. దాంతో ఆరుగురు స్నేహితుల కలిసి ఏదైనా చేయాలనుకున్నాం. ఆ సమయంలో బిగ్‌డేటా, ఆర్టిఫియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) వంటివి ఊపు అందుకుంటున్నాయి. దాంతో మేం ఆ రంగాల్లోనే ప్రవేశించాలనుకున్నాం. మా అనుభవం, విజ్ఞానం ముందు స్వదేశానికే ఉపయోగపడాలనే ఆలోచనతో మన దేశంలో గ్రామెనర్‌ అనే కంపెనీ ప్రారంభించాం. ఈ పేరుకు ఒక అర్థముంది. గ్రామీణ్‌ (గ్రామాలు)+ ఎనర్‌ (ఎనర్జీకి సంక్షిప్తరూపం- శక్తి) అనే రెండు పదాలను కలిపితే గ్రామెనర్‌ అవుతుంది. మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు సమాచార శక్తిని అందించాలనేది మా లక్ష్యం.
 
కుటుంబమూ ముఖ్యమే
గ్రామెనర్‌ పెట్టిన తర్వాత మేమందరం రాత్రింబవళ్లు పనిచేస్తూనే ఉండేవాళ్లం. 2014లో మా అమ్మాయి- ‘‘ఐ హేట్‌ గ్రామెనర్‌. దిస్‌ టుక్‌ మై డాడ్‌ ఫ్రమ్‌ మీ (నాకు గ్రామెనర్‌ అంటే ద్వేషం. అది నా నుంచి మా నాన్నను దూరం చేసింది)’’ అని ఉత్తరం రాసింది. అది నాకొక షాక్‌. ఆ తర్వాత నా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించటం మొదలుపెట్టా. వృత్తిలో బిజీ అయ్యే ప్రొఫెషనల్స్‌కు నేనిచ్చే సలహా ఒకటే.. ‘వృత్తి ముఖ్యమే.. కానీ కుటుంబం కూడా ముఖ్యమనే విషయాన్ని మర్చిపోవద్దు’
 
తొలి అడుగులు..
మన చుట్టూ ఉన్న రకరకాల వ్యవస్థలలో అనేక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమాచారాన్ని క్రోడీకరిస్తే కొన్ని లక్షల టెర్రాబైట్ల సమాచారమవుతుంది. దీనినే మనం కంప్యూటర్‌ పరిభాషలో బిగ్‌డేటా అంటాం. ఇది అక్షరాల రూపంలో ఉంటుంది. అంకెల రూపంలో ఉంటుంది. చిత్రాల రూపంలో ఉంటుంది. ఈ సమాచారాన్నంతా ఒక చోట చేర్చి విశ్లేషించాలంటే లక్షల మంది మనుషులు అవసరమవుతారు. వీరి అవసరం లేకుండా కంప్యూటర్ల ద్వారా ఈ విశ్లేషణ చేయటమే బిగ్‌ డేటా ఎనలిటిక్స్‌. ఒక్క మాటలో చెప్పాలంటే సంక్లిష్టమైన సమాచారాన్ని విశ్లేషించి సులభంగా సామాన్యమైన వ్యక్తులకు కూడా అర్థమయ్యేలా అందించే ప్రక్రియ ఇది. కంప్యూటర్లకు కూడా మానవుల మాదిరిగా ఆలోచించే తర్కాన్ని (ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌- కృత్రిమ మేధ) నేర్పితే ఈ పని మరింత సులభమవుతుంది. ఈ రెండింటినీ ఉపయోగించి మేమొక సాఫ్ట్‌వేర్‌ రూపొందించాం. అత్యంత సంక్లిష్టమైన సమాచారాన్ని విశ్లేషించి.. మనకు కావాల్సిన పద్ధతిలో విడగొట్టి ఇవ్వటం దీని ప్రత్యేకత. మా సాఫ్ట్‌వేర్‌ సేవలను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు అందించటం మొదలుపెట్టాం. ఆ సమయంలో మాకు ఎయిర్‌టెల్‌ రూపంలో పెద్ద బ్రేక్‌ వచ్చింది. ఎయిర్‌టెల్‌ మాకు వాణిజ్యరంగంలో తొలి కస్టమర్‌. ఆ సమయంలో మాది చాలా చిన్న కంపెనీ. కానీ మా సాఫ్ట్‌వేర్‌ వారికి చాలా ఉపయోగపడింది. దానిని గుర్తించి ఆ కంపెనీ మాకు ‘మోస్ట్‌ వేల్యూడ్‌ పార్టనర్‌’ అనే గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత మేమింక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ప్రపంచబ్యాంకు నుంచి నాస్కాం దాకా.. మైక్రోసాఫ్ట్‌ నుంచి ఎయిర్‌బస్‌ దాకా.. ప్రధాని కార్యాలయం (పీఎంఓ) నుంచి వాణిజ్యమంత్రిత్వ శాఖ దాకా అనేక మందితో పనిచేసే అవకాశం కల్పించింది. ప్రస్తుతం మేము బ్యాంకింగ్‌.. ఫార్మా.. ఏరోనాటిక్స్‌.. మీడియా వంటి 12 శాఖల్లో.. 120 అగ్రశేణి కంపెనీలతో.. ప్రభుత్వవిభాగాలతో కలిపి పనిచేస్తున్నాం. తాజాగా జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాల విశ్లేషణలో రిపబ్లిక్‌ టీవీ, సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌లు ప్రసారం చేసిన సంక్షిప్త సమాచారం, చార్టులు మావే! ఇక గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మియామీ హెరాల్డ్‌కు కూడా సహకరించాం.