Hyderabadi-Ghazala-Hashmi-Creates-New-Record-in-Virginia-State

వర్జీనియా తొలి ముస్లిం మహిళా సెనేటర్‌గా.. హైదరాబాదీ ఆడపడుచు..

గజాలా హష్మీ మన హైదరాబాదీ ఆడపడుచు. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో తాజాగా సెనేటర్‌గా ఎంపికయ్యారు. ఆ రాష్ట్ర తొలి ముస్లిం మహిళా సెనేటర్‌గా సామాన్యుల గొంతుకయ్యారు. ‘అమెరికన్‌ ముస్లింలు కూడా అమెరికన్లే’ అని ధైర్యంగా నినదించి... ట్రంప్‌ ప్రభుత్వాన్ని ధిక్కరించి మరీ తిరుగులేని ప్రజా మద్దతును సాధించారు. కాలేజీలో ప్రొఫెసర్‌గా విద్యార్థులకు బోధించిన స్వేచ్ఛా, సమానత్వాల కోసం ఎన్నికల రణరంగంలో అడుగుపెట్ట్టి విజయ బావుటా ఎగరేశారు.

 
వాల్ట్‌ విట్‌మాన్‌ కవిత్వాన్ని గజాలా బాగా ఇష్టపడతారు. కవులు, కవితలు లేకుండా ఆమె ప్రసంగం ఉండదంటే అతిశయోక్తి కాదు. ‘‘విట్‌మాన్‌ రాసిన కవితల్లోని ‘ఐ హియర్‌ అమెరికా సింగింగ్‌’ అనే కొన్ని పంక్తులు నాకు చాలా ఇష్టం. ఆ తరువాత లాంగ్‌స్టన్‌ హ్యూస్‌ ‘ఐ, టూ, సింగ్‌ అమెరికా’ అన్నారు. ఇప్పుడు నేనూ ‘ఐ టూ సింగ్‌ అమెరికా’ అంటున్నాను’’ అని ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూలో గజాలా ఉద్వేగంగా చెప్పారు. కాలేజీలో ఆమె అమెరికన్‌ సాహిత్యం బోధించేవారు. కవితలను ప్రస్తావించకుండా ఆమె ప్రసంగం సాగదు. సమాజంలోని అన్ని వర్గాలకూ ప్రజా ప్రతినిధులు ప్రాతినిధ్యం వహించాలనేది ఆమె దృఢమైన అభిప్రాయం.
 
హైదరాబాదీ ఆడపడుచు
గజాలా హష్మీ స్వస్థలం హైదరాబాదే. తండ్రి జియా హష్మీ ప్రొఫెసర్‌. తల్లి తన్వీర్‌ హష్మీ విద్యావంతురాలు. 1964లో హైదరాబాద్‌లోని మలక్‌పేటలో గజాలా జన్మించారు. ‘చిన్న పిల్లగా ఉన్నప్పుడే చాలా తెలివితేటలు చూపేది... ఇప్పుడు వర్జీనియా సెనేటర్‌ అయింది’ అని ఆమె గెలుపు గురించి తెలుసిన బంధువులు సంతోషిస్తున్నారు. ‘చిన్నతనంలో గజాలాను ప్రేమగా మున్నీ అని పిలుచుకునేవాళ్లం’ అని పాత సంగతులను గుర్తు చేసుకుంటున్నారు. 1969లో ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లింది. అప్పుడు గజాలా వయస్సు నాలుగేళ్లు. ఇప్పటివరకూ ఆమె కుటుంబంతో కలసి నాలుగుసార్లు హైదరాబాద్‌కు వచ్చారు. చివరగా 2015లో ఆమె హైదరాబాద్‌ వచ్చారు. ‘ఐ లవ్‌ హైదరాబాద్‌, తరచూ హైదరాబాద్‌కు రావాలని ఉన్నా పని ఒత్తిడితో కుదరటం లేదు’ అన్నారు. గజాలాకు ఇద్దరు కూతుళ్లు.
 
ఈ గెలుపు మీది!
వర్జీనియా రాష్ట్రానికి సెనేటర్‌గా ఎన్నికైన తొలి అమెరికన్‌ ముస్లిం మహిళగా, తొలి భారత సంతతి మహిళగా రెండు రికార్డులు సృష్టించారు. డెమోక్రటిక్‌ పార్టీ తరపున పోటీచేసిన గజాలా రిపబ్లికన్‌ పార్టీకి చెందిన సెనేటర్‌ గ్లిన్‌ స్టర్టివాంట్‌ను ఓడించి చరిత్ర సృష్టించారు. ‘‘ఈ విజయం నా ఒక్కదానిది కాదు, మీ అందరిదీ. వర్జీనియాలో ప్రగతిశీల మార్పును కోరుకునేవారంతా తమ తరపున గొంతు వినిపించాలని నన్ను గెలిపించారు. అలాంటి వారందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాను’’ అన్నారు. గత కొన్నేళ్లుగా వర్జీనియాలో తుపాకీ సంస్కృతి బాగా పెరిగిపోయింది. గజాలా ఎన్నికల ప్రచారంలో గన్‌సేఫ్టీ ప్రధానాంశం అయింది. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టుగా తుపాకుల సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడుతానని, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ గజాలాకు శుభాకాంక్షలు చెప్పారు.
 
ట్రంప్‌ ట్రావెల్‌ బ్యాన్‌తో రాజకీయాల్లోకి
ఎమోరీ యూనివర్సిటీ నుంచి గజాలా పీహెచ్‌డీ చేశారు. దాదాపు 25 ఏళ్ల పాటు వర్జీనియాకు చెందిన కాలేజ్‌ అండ్‌ యూనివర్సిటీ సిస్టమ్‌లో లీడింగ్‌ ఎడ్యుకేటర్‌గా సేవలందించారు. ప్రస్తుతం ఆమె రేనాల్డ్స్‌ కమ్యూనిటీ కాలేజ్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ టీచింగ్‌ అండ్‌ లెర్నింగ్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. అసలు ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి పరోక్షంగానే అయినా ట్రంప్‌ కారణమయ్యారన్నది ఆమె చెప్పిన మాట. 2017లో ట్రంప్‌ తెచ్చిన ముస్లింల పైన ట్రావెల్‌ బ్యాన్‌ ప్రస్తావన ఆమెను రాజకీయాల్లోకి వచ్చేట్ట్టు చేసింది.
 
‘‘ఫిబ్రవరి 2017లో నేను కాలేజీలో ఉండగా రేడియోలో విన్న వార్త నాలో ఆందోళనను పెంచింది. అందులో ముస్లిం ట్రావెల్‌ బ్యాన్‌ గురించి ట్రంప్‌ ప్రస్తావించారు. నేను ఈ దేశంలో 50 ఏళ్లుగా నివసిస్తున్నాను. అమెరికానే నా ఇల్లు అనుకున్నాను. ఇక్కడ నాకు సొంత ఇల్లు, కుటుంబం ఉన్నాయి. ఇక్కడ భిన్న సంస్కృతుల ప్రజలు ఉన్నారు. మనసంతా వికలమైంది. పార్కింగ్‌ నుంచి నా కారు తీసుకొని బయటకు రాలేకపోయాను. అది నా వ్యక్తిత్వానికి పరీక్ష. సర్దుకుపోయి బతకడం, లేదా ఎదురుతిరిగి పోరాటం చేయడం - రెండే నా ముందు ఉన్న దారులు. నేను రెండో దారినే ఎంచుకున్నాను. ఆ సంక్షోభ సమయం నుంచే నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనే నిర్ణయం తీసుకున్నాను’’ అని గజాలా గతాన్ని గుర్తు చేసుకున్నారు.
 
ఇక్కడి ముస్లింలు కూడా అమెరికన్లే
‘‘ముస్లింల మీద ప్రజల్లో పెంచుతున్న అపోహలను ఈ ఎన్నికల్లో నా గెలుపు ద్వారా పటాపంచలు చేసినట్టయింది. ‘అమెరికాలో ఉండే ముస్లింలు కూడా అమెరికన్లే’ అని ఈ విజయంతో మనం సందేశం పంపాము’’ అని ఆమె ప్రకటించారు. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో వలసల వల్ల ముస్లిముల జనాభా క్రమంగా పెరుగుతోంది. ముస్లిం మహిళలు ఎక్కువ సంఖ్యలో రాజకీయాల్లోకి వస్తున్నారు. గతేడాది ఇద్దరు ముస్లిం మహిళలు అమెరికా కాంగ్రె్‌సకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో కూడా గజాలాతో పాటు అబ్‌రార్‌ ఒమైష్‌, లీసా జార్గార్‌పూర్‌, బూటా బిబేరాజ్‌ అనే మరో ముగ్గురు ముస్లిం మహిళలు సెనేట్‌కు ఎంపికయ్యారు. గజాలా గెలుపు ఆమెకే కాదు డెమోక్రాట్లకు అదృష్టం తెచ్చిపెట్టింది. రాష్ట్రప్రభుత్వంపై డెమోక్రాట్లకు ఆధిపత్యం దక్కింది. హౌస్‌ ఆఫ్‌ డెలిగేట్స్‌, సెనేట్‌ రెండు సభల్లోనూ డెమోక్రాట్లకు మెజారిటి దక్కడం గత పాతికేళ్లలో ఇదే తొలిసారి కావడం ఆమె గెలుపు ఎంత కీలకమో తెలియజేస్తోంది.