Hyderabad-Girl-Wins-Rs-50-lakh-Scholarship-from-Australia-University

విదేశీ విద్యను ఉచితంగా సొంతం చేసుకుని.. సత్తాచాటిన తెలుగు యువతి

విదేశీ విద్య అనేది సామాన్యులకు అందని ద్రాక్ష. అయితే అర్హతలు ఉంటే, విదేశీ విద్యను ఉచితంగా సొంతం చేసుకోవచ్చని నిరూపించింది స్రష్టవాణి. హైదరాబాద్‌కు చెందిన ఈ న్యాయ విద్యార్థిని ఏకంగా 60 లక్షల రూపాయల ఆస్ట్రేలియా స్కాలర్‌షిప్‌ను దక్కించుకుని వార్తల్లోకెక్కింది! తెలంగాణ నుంచి ఈ అవకాశం పొందిన తొలి న్యాయ విద్యార్థి ఆమె. ‘ఛేంజ్‌ ది వరల్డ్‌’ అనే ‘వలింగాంగ్‌’ యూనివర్సిటీ ఉపకార వేతనం గురించీ, అర్హత పొందడానికి తాను చేసిన కృషి గురించీ స్రష్టవాణి ఏం చెబుతున్నారంటే...

 ‘‘నాకు విదేశాల్లో ఉన్నతవిద్య అభ్యసించాలనే కోరిక ఉండేది. న్యాయ విద్య పూర్తయిన తర్వాత ప్రయత్నాలు చేద్దామని అనుకున్నా. అయితే అదృష్టవశాత్తూ ఆ అవకాశం చదువు మధ్యలోనే దక్కింది. నేను పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లో అయినా... బెంగుళూరులోని రేవా యూనివర్సిటీలో ‘లా’ సీటు రావడంతో చేరిపోయా. మా దగ్గరి బంధువు ద్వారా ‘ఛేంజ్‌ ది వరల్డ్‌’ అనే స్కాలర్‌షిప్‌ ఒకటి ఉందనీ, ఆ స్కాలర్‌షిప్‌కి అర్హులైన అభ్యర్థుల కోసం ‘స్టడీపాత్‌’ కన్సల్టెన్సీ వెతుకుతోందనీ తెలిసింది. అన్ని అర్హతలూ ఉండి, ఆర్థిక స్థోమత లేని కారణంగా విదేశాల్లో చదవలేని వారి కోసమే ఈ స్కాలర్‌షిప్‌. ఈ స్కాలర్‌షిప్‌తో నూటికి నూరు శాతం ట్యూషన్‌ ఫీజు మినహాయింపు పొందవచ్చు. అయితే దీన్ని పొందడానికి కేవలం విద్యార్హతలు ఒక్కటే సరిపోవు. అభిరుచులూ ఉండాలి. భవిష్యత్తు పట్ల స్పష్టమైన దృక్పథం కలిగి ఉండాలి. రాత పరీక్షలో కూడా అర్హత సాధించాలి. వీటన్నిటిలో నేను నెగ్గాను. అన్నిటికన్నా ముఖ్యంగా రెండు నిమిషాల నిడివి ఉండే వీడియో రికార్డు చేసి, స్కాలర్‌షిప్‌ అందిస్తున్న యూనివర్సిటీకి పంపించాలి. ఎంపికలో అదే కీలకమైన ఘట్టం!
 
ఆ వీడియోలో....
‘ఛేంజ్‌ ది వరల్డ్‌’... పేరుకు తగ్గట్టు, నా రచనా వ్యాసంగాన్ని ఉపయోగించుకుని ప్రపంచంలో మార్పు ఎలా తీసుకురాగలనో ‘వలింగాంగ్‌’ యూనివర్సిటీ పెద్దలకు రెండు నిమిషాల నిడివిగల వీడియో ద్వారా వివరించాను. వీడియోలో తొలుత నన్ను నేను పరిచయం చేసుకుని, నాన్న అరవిందకుమార్‌, అమ్మ ఆశ గురించి టూకీగా చెప్పాను. అలాగే నాకున్న కవితలు రాసే అభిరుచి ఆధారంగా లా విద్యకు, వృత్తికి ఎలా న్యాయం చేయగలనో చెప్పాను. రచనా వ్యాసంగం విద్యకు, పురోగతికి ఎలా దోహదపడుతుందో చెప్పాను. సూటిగా, స్పష్టంగా నేను ఇచ్చిన వివరణ వారికి నచ్చి నన్ను ఎంపిక చేశారు.
 
ఇప్పటికీ నమ్మలేకపోతున్నా...
బెంగుళూరులో నా రెండేళ్ల న్యాయ విద్య పూర్తయిపోయింది. కాబట్టి మిగతా రెండేళ్ల న్యాయ విద్యను కొనసాగించడానికి నాకు ‘వలింగాంగ్‌’ యూనివర్సిటీ వెసులుబాటు కల్పించింది. ఈ స్కాలర్‌షిప్‌ బహూకరించడానికి ఆస్ట్రేలియా నుంచి స్వయంగా యూనివర్శిటీ పెద్దలు రావడం గొప్ప విషయం. మరీ ముఖ్యంగా నాకు స్కాలర్‌షిప్‌ అందించడానికి వచ్చిన యూనివర్సిటీ ప్రతినిధి నా పుస్తకం ‘వైల్డ్‌ వింగ్స్‌’ నుంచి కొన్ని కవితలు వినిపించడంతో ఆశ్చర్యానికి లోనయ్యాను. ఇలాంటి స్కాలర్‌షిప్‌ నాలాంటి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆస్ర్టేలియా వెళ్తున్నా. ఈ అవకాశాన్ని నూటికి నూరు శాతం సద్వినియోగం చేసుకుని, యూనివర్సిటీ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాను.
 
‘స్టడీపాత్‌’ అండదండలు!
‘ఛేంజ్‌ ది వరల్డ్‌’ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకున్న కొన్ని లక్షల మంది అభ్యర్థుల్లో స్రష్టవాణి ఒకరు. ఈ స్కాలర్‌షిప్‌ దక్కించుకోవాలంటే ఆంగ్ల భాషకు సంబంధించిన పరీక్షలో కనీసం 6 పాయింట్లు సాధించాలి. ఇందులో విజేతగా నిలిచిన స్రష్ట ఆస్ట్రేలియాలో చదువుకుని, ఉద్యోగంలో స్థిరపడేంత వరకూ ‘స్టడీపాత్‌’ తనకు అండగా ఉంటుంది. - షెల్లీ కర్నాటి, సి.ఈ.వో, స్టడీపాత్‌, ఆస్ట్రేలియా
 
అన్ని విధాలా అర్హురాలు!
‘వలింగాంగ్‌’ యూనివర్సిటీ వరల్డ్‌ ర్యాంకింగ్‌లో 212, న్యాయ విద్యలో 78వ స్థానాల్లో ఉంది. స్రష్ట ఈ స్కాలర్‌షిప్‌కి ఎంపికవడానికి కారణం ఆమెలో ఉన్న ప్రత్యేకమైన అంశాలే! ‘రచనా వ్యాసంగం ద్వారా ప్రపంచాన్ని మార్చగలను’ అంటూ ఆమె చెప్పిన వీడియో వివరణ మమ్మల్ని ఆకర్షించింది. దాంతో ఈ స్కాలర్‌షిప్‌కి ఆమె అన్ని విధాలా అర్హురాలని నిర్ధారించుకుని ఎంపిక చేశాం!’’ - పీటర్‌ ముర్రే, అంతర్జాతీయ రిక్రూట్‌మెంట్‌ మేనేజర్‌
 
 
గోగుమళ్ల కవిత, ఫొటోలు: అశోకుడు