He-went-Abu-Dhabi-with-just-500-Rupees-Now-He-is-a-Owner-of-Rs-39-Thousand-Crores

రూ.500తో గల్ఫ్‌కెళ్లిన భారతీయుడు.. 30 వేల కోట్లకు అధిపతి..

దుబాయి/న్యూఢిల్లీ: దేనికైనా టైమ్ రావాలి.. అని పెద్దలు అంటుంటారు. కానీ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని తన లక్ష్యానికి బాటలు వేసుకున్నాడో భారతీయుడు. పొట్టకూటి కోసం దేశం కాని దేశానికి వెళ్లిన ఆయన.. కోట్లకు పడగలెత్తాడు. పరాయి దేశంలోని అత్యంత ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా నిలిచాడు. ఒకప్పుడు ఇంట్లో అప్పులు తీర్చేందుకు భారత దేశ సరిహద్దు దాటిన ఆయన.. నేడు ఎందరికో ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నారు. ఆయనే.. డాక్టర్ బీ.ఆర్.శెట్టి. అబూదబీలోని న్యూ మెడికల్ సెంటర్ (ఎన్ఎంసీ) చైర్మన్‌ అయిన ఆయన.. యూఏఈ ఎక్స్‌చేంజ్, నియోఫార్మా, బీఆర్ఎస్ వెంచర్స్ వంటి రంగాల్లోనూ తన వ్యాపారాన్ని వ్యాప్తి చేశారు. 500 రూపాయలతో దేశం దాటిన ఆయన.. ఏకంగా 29వేల 465 కోట్ల రూపాయలకు(ఆగస్టు 2018నాటికి) అధిపతి అయ్యారు. 

1973వ సంవత్సరం మే నెల 3వ తారీఖున పొట్టకూటి కోసం శెట్టి అబూదబీకి వచ్చారు. జేబులో 29 దిర్హమ్స్ (సుమారు 500 రూపాయలు)తో స్వదేశాన్ని విడిచి విదేశానికి పయనమయ్యారు. రావడం రావడమే ఆయనకు దొంగల రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. శెట్టి లగేజీని ఎయిర్‌పోర్ట్‌లో ఎవరో కొట్టేశారు. దీంతో విమానాశ్రయం నుంచి బయటకు రాగానే.. మొదటగా వస్త్రాలను కొనుగోలు చేశారు. ‘అప్పట్లో నా పరిస్థితులు చావో రేవో అన్నట్లుగా ఉండేవి. విపరీతంగా అప్పుల్లో కూరుకుపోయాం. దీంతో మరో ప్రత్యామ్నాయం లేక యూఏఈకి వలస వెళ్లాలని నిర్ణయించుకున్నా. మరింత అప్పు తీసుకుని దేశం గడప దాటాను. యూఏఈలో చచ్చేలా కష్టపడైనా సరే.. సంపాదించి అప్పులు తీర్చాలన్నదే నా లక్ష్యంగా ఉండేది. కానీ పరిస్థితులన్నీ అనూహ్యంగా మారిపోయాయి. అనుకోకుండానే నా లక్ష్యం మారిపోయింది. స్వయంకృషితో వ్యాపారం ప్రారంభించి, అమ్మ ఆశీర్వాదంతో ఈ స్థాయికి చేరుకున్నా’ అని బీఆర్ శెట్టి గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 
 
సేల్స్‌మెన్‌గా జీవితం ప్రారంభం:
అబూదబీలో సేల్స్‌మెన్‌గా నా జీవితాన్ని ప్రారంభించా. ఫార్మా ఔషధాలు అమ్మడం నా పని. ఇంటింటికీ తిరిగి మెడిసిన్స్‌ను అమ్మాలి. అబూదబీలోని మాజ్దా 323 ప్రాతంలో తిరిగేవాడిని.. ఇప్పుడు ఉన్న అబూదబీ సిటీ.. 36 ఏళ్ల క్రితం ఇలా ఉండేది కాదు. ఇప్పుడు ఎటు చూసినా బహుళ అంతస్థుల భవనాలు కనిపిస్తున్నాయి కానీ.. అప్పట్లో మొత్తం ఇసుకే. విపరీతమైన వేడి ఉండేది. ఆ వేడిని తట్టుకుంటూనే ఔషధాలు అమ్మేవాడిని. ఆ ప్రాంతంలో ఏదో తెలీని పాజిటివ్ ఎనర్జీ ఉందనిపించేంది. ఇక్కడే ఉండి ఏదో ఒకటి సాధించు అని నాకు చెబుతున్నట్లు అనిపించేంది. ఏదో ఒకటి సాధించాలనే కల, భారీ లక్ష్యం, హార్డ్ వర్క్.. ఉంటే అనుకున్నది సాధిస్తానన్న నమ్మకం నాకు ఏర్పడింది. ఒక నెల రోజుల తర్వాత మా అమ్మకు ఓ లేఖ రాశాను. నా బాగోగుల గురించి అందులో వివరంగా రాశాను. నాకు ఏర్పాటు చేసిన వసతి సదుపాయం అంతగా బాగుండేది కాదు. వేసవి కాలంలోనూ ఒకే ఒక్క ఫ్యాన్‌తో సర్దుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ నా కష్టాల గురించి అమ్మకు ఉత్తరంలో ఏమాత్రం చెప్పలేదు. ఒక ఏడాదిలోనే అప్పులన్నీ తీర్చేశాను. 
 
ఒక్క ఆలోచన.. జీవితాన్ని మార్చేసింది:
ఎంతో కష్టపడి ఒక్క ఏడాదిలోనే అప్పులన్నీ తీర్చేశా. అయితే ఆ తర్వాత ఏం చేయాలి..? అనే దానిపై విపరీతంగా ఆలోచించా. ఆ సమయంలో వార్తా పత్రికల్లో చాలా ఆర్టికల్స్‌ను నేను చదివాను. ఫార్మారంగం గురించి అప్పటి యూఏఈ ప్రధాని షేక్ జయీద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ చేసిన ప్రకటనలు నాలో కొత్త ఆలోచనలు రేకెత్తించాయి. ‘దేశ రాజధానిలో అతి తక్కువ ధరలకే ఫార్మా ఉత్పత్తులు లభిస్తే బాగుంటుంది.. ఆ దిశగా ఎవరైనా ముందుకు వస్తే ప్రోత్సహిస్తాం..’ అన్న యూఏఈ రాజు మాటలతో నాకు నా లక్ష్యం ఏంటో తెలిసిపోయింది. ‘న్యూ మెడికల్ సెంటర్’ను ప్రారంభించాలని అప్పుడే నిర్ణయించుకున్నా. నా ఆలోచన గురించి అమ్మకు లేఖరాశాను. ఆమె ఆశీర్వాదం తీసుకున్నాను. 1973లో యూఏఈకి వచ్చిన నేను.. రెండేళ్లలోనే ‘ఎన్ఎంసీ’ని ప్రారంభించా.. హందాన్ వీధిలో ఒక అపార్ట్‌మెంట్‌ను లీజుకు తీసుకున్నా. నేను ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో డాక్టర్‌గా మొట్టమొదటగా ఉద్యోగంలోకి తీసుకున్నది నా భార్యనే. మొదటి రోజు ముగ్గురు రోగులు ఆసుపత్రికి వచ్చారు. రోగులకు ఫీజు కూడా అతి తక్కువ తీసుకునేవాడిని. మేము అందించే సర్వీసుల్లో క్వాలిటీని చూసి.. ప్రజాదరణ రానురానూ పెరిగింది. 1975వ సంవత్సరంలో ముగ్గురు రోగులతో ప్రారంభమయిన మా ఆసుపత్రి.. నేడు 8.5 మిలియన్ల మందికి చేరుకుంది. ప్రతియేటా మా ఆసుపత్రిలో 85లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. 17 దేశాల్లో మా ఎన్ఎంసీని విస్తరించాం. మూడు వేల మందికి పైగా డాక్టర్లు పనిచేస్తున్నారు. వైద్యరంగంలోనే కాకుండా.. ఔషధ తయారీ రంగంలో కూడా మేం ప్రవేశించాం. 2003లో అబూదబీ కేంద్రంగా నియోఫార్మాను ఏర్పాటు చేశాం. ఎడారిలో ఇసుక తిన్నెల మధ్యలో ఫార్మా కంపెనీని ఏర్పాటు చేస్తానని చెప్పినప్పుడు పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగి అయిన నా పాత మిత్రుడు పీఏ షెనోయ్ నాకు అండగా నిలిచారు. బ్యాంకులోని సీనియర్ అధికారులకు నచ్చజెప్పి నా లోన్ అప్రూవ్ అయ్యేలా చేశాడు. 80 మిలియన్ దిర్హమ్స్ (దాదాపు 152 కోట్ల రూపాయలు) లోన్‌ను రెండు వారాల్లోనే ఇప్పించాడు.. కంపెనీ ప్రారంభంలో ఆటుపోట్లు ఎదురైనా.. అపజయాన్ని మాత్రం చవిచూడలేదు.