Gulf-expats-giving-Pensions-in-village-of-Kadapa-

పల్లెకు ప్రభాతం!

గల్ఫ్‌లో సంఘంగా ఏర్పడి చాకిబండకు కుర్రాళ్ల సేవ

సొంతడబ్బులతో పింఛన్లు.. అంబులెన్స్‌ వితరణ

ఆంధ్రజ్యోతి, 24-04-2018: జీవనోపాధి కోసం దూరదేశాలకు వెళ్లి, అక్కడ కాస్త స్థిరపడ్డాక, తాము వదిలిపెట్టి వచ్చిన గ్రామం సంక్షేమం కోసం పాటుపడటం చూస్తున్నాం. ఇలాంటి ‘శ్రీమంతుల’కు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వాగతం పలుకుతూనే ఉంది. కానీ, ఒక గ్రామం, ప్రాంతం నుంచి విదేశాలకు వెళ్లి, అక్కడ ఒక్కటై జన్మభూమిలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం మాత్రం అరుదే. కడప జిల్లా చిన్నమండెం మండలంలోని మారుమూల గ్రామం చాకిబండకు చెందిన కుర్రాళ్లు గల్ఫ్‌ వేదికగా ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు.
 
ప్రవాస సేవా సంఘం పేరిట ఆరునెలలుగా తమ ఊరిజనానికి కొత్త వెలుగులు పంచుతున్నారు. చాకిబండ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఒకరిద్దరు గల్ఫ్‌బాట పట్టారు. వీరిలో కొందరు బాగా డబ్బులు సంపాదించి అక్కడే స్థిరపడ్డారు. దశాబ్దాలుగా గల్ఫ్‌లో ఉంటున్న ఈ ఊరికి చెందిన కుర్రాళ్లకు ఒక ఆలోచన వచ్చింది. ‘మనమంతా బాగున్నాం. అలాగే, మన ఊరు, ప్రాంతం కూడా బాగుపడితే బాగుంటుంది కదా’ అని వారు ఆలోచించారు. చాకిబండ కుర్రాళ్లు చొరవ తీసుకొంటే, ఆ ఊరికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గల్ఫ్‌కు వలస వచ్చిన మిగతావారు సహకరించారు. అంతా కలిసి 2017 జూన్‌ 4వ తేదీన ప్రవాస సేవా సంఘంగా ఏర్పడ్డారు. చాకిబండతో మొదలుపెట్టి, దిగువ గొట్టివీడు, మల్లూరు, కొత్తపల్లె, వండాడి, సరిహద్దులోని ఏపిలవంక వరకూ తమ సేవలను విస్తరించారు.
ఊరికి ఊతంగా...
తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో అనాథలలైన ఇద్దరు మతిస్థిమితం లేని పిల్లల దుస్థితి ప్రవాస సేవా సంఘం ప్రతినిధులను కదిలించింది. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రితో వారిద్దరికీ శస్త్రచికిత్స చేయించారు. ఇప్పుడు చాకిబండలో ఈ అన్నదమ్ములు ఉపాధి వేటలో ఉన్నారు. ఈ గ్రామానికి సమీపంలోనే ఉన్న ఏపిలవంకపల్లెలో ఓ మహిళ దీనావస్థకు సంఘం స్పందించింది. 10 ఏళ్ల వయసు కలిగిన ఇద్దరు ఆడపిల్లలను ఆమెకు అప్పగించి భర్త చనిపోయాడు. సంఘం అందించిన ఆర్థిక సాయంతో ఇప్పుడు ఆమె, తన ఊళ్లో దుకాణం నడుపుకొంటోంది. అలాగే, ప్రతి నెలా 60 మంది పేద వృద్ధులకు సంఘం ప్రతినిధులు రూ.200 చొప్పున పింఛన్‌ అందిస్తున్నారు. దీనికోసం ప్రతినెలా 15వ తేదీ లోపు గల్ఫ్‌ నుంచి నిధులు గ్రామానికి అందుతున్నాయి.
 
అత్యవసర కేసులను రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించడానికి వీలుగా అంబులెన్స్‌ను ఏర్పాటుచేశారు. ఎక్కడో గల్ఫ్‌లో ఉన్న కుటుంబ సభ్యులు వచ్చి అంత్యక్రియల్లో పాల్గొనేదాకా, మృతదేహాలను జాగ్రత్త చేసే ఏర్పాటు చాకిబండలో లేదు. ఇందుకోసమని బాడీఫ్రీజర్‌ను కొనుగోలు చేశారు. స్థోమత లేని పేద కుటుంబాల్లో మరణాలు సంభవించినప్పుడు, అంత్యక్రియలకు అయ్యే ఖర్చులకు డబ్బులు అందిస్తున్నారు. తమ కార్యక్రమాల కోసం చాకిబండలో కార్యాలయం ఏర్పాటుచేసుకొన్నారు. ఆంజనేయులు అధ్యక్షుడిగా ఏర్పడిన ప్రవాస సేవాసంఘంలో ప్రస్తుతం ఖదీర్‌బాషా, ఖాదర్‌బాషా, ఉమాపతి, నాగభూషణం, మద్దసాని శంకర్‌ సభ్యులుగా కొనసాగుతున్నారు.
-చిన్నమండెం/ రాయచోటి