Girl-quits-US-job-and-starts-a-new-business-in-India

అమెరికా జాబ్‌కు గుడ్‌బై.. హైదరాబాద్‌కు వచ్చి ఈ యువతి.. సాధించిన విజయమిది..!

హైదరాబాద్: అమెరికాలో పెద్ద ఉద్యోగం, మంచి జీతం, ఏసీ గదులు.. ఇవేమీ ఆమెకు సంతృప్తినివ్వలేకపోయాయి. మాతృభూమికి ఏదైనా చేసి రుణం తీర్చుకోవాలనే ఆమె సంకల్పం ముందు చాలా చిన్నవిగా కనిపించాయి. అంతే ఓ నిర్ణయానికొచ్చిన శ్రుతి అహూజా(32).. తన ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. స్వస్థలం హైదరాబాద్ చేరుకొని సొంతగా బిజినెస్ చేయాలని అనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పిందీ ఎలక్ట్రికల్ ఇంజనీరు. ఆమె మాటల వెనకున్న పట్టుదల చూసిన ఆ తల్లిదండ్రులు కూతురికి అండగా నిలిచారు. 2010లో స్వదేశానికి వచ్చిన ఆమె.. రెండేళ్లపాటు రకరకాల పరిశోధనలు చేసింది. ఏ బిజినెస్ అయితే బావుంటుందని బాగా ఆలోచించింది. చివరకు 2012లో వేస్ట్‌మేనేజ్‌మెంట్‌లో అడుగుపెట్టాలని నిర్ణయించుకుంది.

‘భారత్‌లో ఏటా 2.3కోట్ల టన్నుల సేంద్రియ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని తెలిసి ఆశ్చర్యపోయాను. దీన్నే ఎందుకు నా వ్యాపారంగా మార్చుకోకూడదని ఆలోచించాను’ అంటున్న శ్రుతి.. అనుకున్నదే తడవుగా హైదరాబాద్ శివార్లలో ఉన్న తండ్రి పొలంలో ‘అహూజా ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించింది. దానిలో సేంద్రియ వ్యర్థాలను ఉపయోగించి గ్యాస్ ఉత్పత్తి చేయడం మొదలెట్టింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఎవరికీ పెద్దగా పరిచయం లేని ఈ ప్రొడక్ట్‌ను మార్కెట్లోకి తీసుకురావడమే ఆమెకు సవాల్‌గా మారింది. ఎన్నో కష్టనష్టాలను భరించి నేడు తన రంగంలో ఓ విన్నర్‌గా నిలిచింది. ఒక్కసారి మార్కెట్లోకి అడుగు పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఆమెకు రాలేదు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16చోట్ల బ్రాంచిలతో అద్భుతంగా నడుస్తోందామె బిజినెస్. ఈ కంపెనీల్లో ఇప్పటివరకు సుమారు 12వేల టన్నుల సేంద్రియ వ్యర్థాలను వినియోగించుకున్నారు. తద్వారా 600టన్నులపైగా ఎల్‌పీజీ గ్యాసును ఆదా చేయగలిగారు. అంతేకాదు 4లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉత్పత్తిని నివారించగలిగారు. అంటే పర్యావరణానికి, దేశానికి ఎంత మేలు జరిగిందో ఊహించుకోవచ్చు.