Classical-Dancer-Neelima-success-story-from-Hyderabad-to-America

అమెరికాకు వెళ్లినా.. ఆమె నాట్యాన్ని వదల్లేదు.. అగ్రరాజ్యంలోనూ..

 శిల్పాన్ని తలపించే భంగిమ... భావాన్ని పలికించే అభినయం... ఆమె అందెల రవం ప్రతి కళాహృదయంతో తాళం వేయిస్తుంది. గేయాలను నృత్యరూపకాలుగా తీర్చిదిద్దుతూ... శిక్షణా సంస్థ నెలకొల్పి మన కూచిపూడి నాట్యానికి అమెరికాలో పట్టం కడుతున్న నర్తకి, గురువు నీలిమా గడ్డమనుగు నాట్యవిలాసం ఇది...

 
‘‘భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడంలో లలిత కళలది ప్రముఖ పాత్ర. అందుకే ఆ కళలంటే నాకెంతో మక్కువ. అమ్మా నాన్నల ప్రోత్సాహంతో నాలుగేళ్ల వయసులోనే కూచిపూడి నాట్యం మొదలు పెట్టాను. అలా తెలిసీ తెలియని వయసులో గజ్జె కట్టినా... ఆ తరువాత అది ఇష్టంగా మారింది. బహుశా నటరాజ కటాక్షం కూడా నాపై ఉందనుకుంటాను. కనుకనే నర్తన నా జీవితంలో భాగమైపోయింది. నేను పుట్టింది హైదరాబాద్‌లోనే. ప్రాథమిక విద్యా ఇక్కడే. అయితే నాన్న వృత్తిరీత్యా డిగ్రీ (బీఎస్‌సీ కెమిస్ర్టీ) అనకాపల్లిలో చదివాను. ఎక్కడ ఉన్నా... ఏం చదివినా... కూచిపూడి నాట్యాన్ని మాత్రం వదిలిపెట్టలేదు.
 
ఆరేళ్లకు అరంగేట్రం...
చెప్పాను కదా... నాలుగేళ్లప్పుడు నాట్యం ప్రారంభించానని! అందులో ఓనమాలు దిద్దింది మైథిలీ ప్రభాకర్‌ గారి దగ్గర. ఆవిడే నా తొలి గురువు. హైదరాబాద్‌లోని రాంనగర్‌గుండులో ఉండేవారు. నాలో ఆసక్తి, ఉత్సాహం చూసి బాగా ప్రోత్సహించారు. ఆ తరువాత రెండేళ్లకు, అంటే ఆరేళ్లప్పుడు అరంగేట్రం చేశాను. చెప్పుకోదగ్గ నా మొట్టమొదటి ప్రదర్శనంటే... ఏడున్నరేళ్ల వయసులో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో నర్తించడం. అప్పుడు ఎంతోమంది ప్రముఖులు, పెద్దలు అభినందించారు. ఆశీర్వదించారు. అలాంటి వారందరి ఆశీర్వాదంతో... నాకు పదొకండేళ్లప్పుడే కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాను. ఏటా వేసవి శిక్షణా తరగతులు కూడా నిర్వహించేదాన్ని.
 
అభినయానికి మెరుగులు...
నాకు స్ఫూర్తి పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత, కూచిపూడి నాట్య పితామహుడు వెంపటి చినసత్యం గారు. ఆయన శిష్యుడు, గురువు దండిభొట్ల నారాయణమూర్తి వద్ద మెరుగులు అద్దుకున్నాను. పదిహేనేళ్లు సుదీర్ఘంగా కూచిపూడి నాట్యంలోని విభిన్న శైలులు సాధన చేశా. అదే సమయంలో తెలుగు విశ్వవిద్యాలయంలో డ్యాన్స్‌ డిప్లమో పూర్తయింది. హైదరాబాద్‌లోనే కాదు... దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో వందల ప్రదర్శనలు చేశాను. అవన్నీ ఒక ఎత్తయితే... బాలభారతి, లయన్స్‌ క్లబ్‌, ఇతర సాంస్కృతిక వేదికలు నిర్వహించే నాట్య పోటీల్లో బహుమతులు గెలుచుకోవడం మరో ఎత్తు. ఏదో వెళ్లాం... వచ్చాం అన్నట్టు కాకుండా, దాదాపు పోటీపడిన ప్రతి చోటా మొదటి బహుమతి నాకే వచ్చేది.
 
పెళ్లితో అమెరికాకు...
కూచిపూడి నాట్యంలో విభిన్న శైలుల సాధన, ప్రదర్శనలతో తలమునకలై ఉన్న సమయంలో నాకు పెళ్లి కుదిరింది. ఆయన పేరు శివ. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అలా 1999లో మా పెళ్లి తరువాత అమెరికా వెళ్లా. అట్లాంటాలో స్థిర నివాసం. అక్కడకు వెళ్లినా కూచిపూడిని మరిచిపోలేదు. ఇంటి దగ్గరే పిల్లలకు శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టాను. తొలుత ముగ్గురు విద్యార్థులతో మొదలైంది అమెరికాలో నా నాట్య ప్రయాణం. ఏడాదిలో పన్నెండు మంది అయ్యారు. నాట్య తరగతులు పోను మిగిలిన సమయమంతా ఖాళీగా ఉండాల్సి వచ్చేంది. దీంతో 2004లో నేను కూడా ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేరాను. మరో పక్క కూచిపూడి శిక్షణ కూడా కొనసాగుతోంది. అయితే 2010లో బాబు అంశ్‌ పుట్టాడు. ఇక దాంతో ఉద్యోగం మానేశాను. ఇప్పుడు వాడికి తొమ్మిదేళ్లు. ఫోర్త్‌ గ్రేడ్‌ చదువుతున్నాడు.
 
అమెరికాలో అంకురార్పణ...
అమెరికాలో మన కళలకు ఎంతో ఆదరణ. విదేశీయులు కూడా ఆసక్తి చూపుతారు. అక్కడ ప్రతి భారతీయుల ఇంట్లో లలిత కళలు నేర్చుకొనేవారు కనీసం ఒకరుంటారు. అలాంటి ఇల్లు చూసినప్పుడల్లా నాకెంతో ముచ్చటగా ఉంటుంది. మన సంప్రదాయ కూచిపూడి నాట్యాన్ని సాధ్యమైనంతమందికి చేరువ చేయాలనిపించింది. ఆ సంకల్పంతోనే అట్లాంటాలో ‘నటరాజ నాట్యాంజలి’ నెలకొల్పాను. అమెరికాలో ముగ్గురు శిష్యులతో మొదలైన నా ప్రయాణం... నేడు దాదాపు 150 మంది విద్యార్థులకు శిక్షణనిచ్చే నాట్యాలయంగా రూపుదిద్దుకుంది. నా శిష్యుల్లో తెలుగువారే కాదు... భారత్‌లోని అన్ని రాష్ట్రాలవారూ ఉన్నారు.
 
మరిచిపోలేని ప్రదర్శనలెన్నో...
లలిత కళల మీదున్న ఇష్టంతో నాట్యంతో పాటు ఆరున్నరేళ్లు బుచ్చిబాబు గారి వద్ద వీణ నేర్చుకున్నా. సీతామహాలక్ష్మి గారి ఆధ్వర్యంలో నాలుగేళ్లు కర్ణాటక సంగీతం సాధన చేశా. నాకు వాటి ఆరాధనలోనే ఆస్వాదన ఉంటుంది. అందుకే నిరంతరం ప్రదర్శనలు! ఉత్సవాల సమయంలో తిరుమల తిరుపతి వంటి ప్రముఖ దేవాలయాలు, ఆటా, నాటా తదితర సంస్థలు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చాను. నర్తించడమే కాదు... నృత్యరూపకాలన్నా చాలా ఆసక్తి. ఇప్పటి వరకు మూడు వందలకు పైగా గేయాలకు ప్రయోగాత్మకంగా కూచిపూడి నృత్యరూపకాలు అందించాను. ‘మహిషాసుర మర్దిని, అష్టలక్ష్మి స్తోత్రాలతో పాటు అన్నమయ్య కృతులు, హనుమద్‌ వైభవం, జావళీలెన్నో వాటిల్లో ఉన్నాయి. అన్నింటి కంటే ‘పంచభూత ప్రశస్తి’ పేరుతో చేసిన నృత్యరూపకం ఎంతో సంతృప్తినిచ్చింది. కొంత కాలం ‘నాటా’ సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా కూడా పనిచేశాను.
ప్రతి రూపాయీ సామాజిక సేవకే...
మనం ఎక్కడ ఉన్నా... ఎంత ఎదిగినా... సమాజాన్ని మరిచిపోకూడదు. ‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అన్నట్టు ఎవరినో నిందిస్తూ కూర్చొనే కంటే... మనకు చేతనైంది మనం చేస్తూ పోవాలి. అప్పుడు మనమూ పెరుగుతాం... మనతో పాటు మన సమాజమూ అభివృద్ధి చెందుతుంది. ఆ సంకల్పంతోనే నేను ప్రదర్శనలు నిర్వహించినా, నృత్యరూపకాలు చేసినా వచ్చిన డబ్బంతా సామాజిక సేవకే ఇచ్చేస్తాను. కేవలం నిధుల సేకరణ కోసమే చాలా కార్యక్రమాలు చేశాను. గురువుగా పుచ్చుకొనే జీతం తప్ప ప్రదర్శనల ద్వారా వచ్చిన ప్రతి రూపాయీ సేవా కార్యక్రమాలకే పంపిస్తాను.
 
హుద్‌హుద్‌ తుపాను బాధితుల కోసం, కాకినాడలోని వృద్ధాశ్రమం కోసం నిధులు సేకరించాను. అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ‘సేవా ఇంటర్నేషనల్‌, మైత్రీ, అమన్‌ వేదిక, ప్యూర్‌’ వంటి స్వచ్ఛంద సంస్థలకు ప్రదర్శనల ద్వారా వచ్చిన డబ్బును అందిస్తుంటాను. నాట్యం తరువాత నాకు సంతృప్తినిచ్చేది ఈ సేవా కార్యక్రమాలే. నా సంకల్పం... కూచిపూడికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తేవడం... ఆ దిశగా తరువాతి తరంలో స్ఫూర్తి నింపి నడిపించడం. ఈ నిరంతర ప్రయాణంలో సాధ్యమైనన్ని అడుగులు వేయడానికి ప్రయత్నిస్తా.’’
 
హనుమా