16-Years-old-Young-Telugu-guy-creating-new-Records

అవధాన ఆదిత్యుడు

ఆంధ్రజ్యోతి (10-01-2019):అమెరికాలో పుట్టి, పెరిగినా అమ్మభాషపై మక్కువ, పద్యాలు నేర్చుకోవడం నుంచి పద్యాలు రాసేస్థాయికి, అష్టావధానాలు, నవావధానాలతో పెద్దల ఆశీస్సులు..

 
శ్రీరామానుజుగాచినావు భరతున్‌ సేనన్‌ సువేగమ్ముతో
కారాగారవినాశకారివయి నన్‌ గావంగ జాగేల వి
శ్వారాధ్యా గ్రహపీడనివారణ కృపాసంపూర్ణ రావయ్య ధీ
శూరా నన్‌ దయజూడు శీఘ్రముగ తేజోరూప యో మారుతీ
 
పదహరేళ్ల కుర్రాడు రాసిన తొలి పద్యమిది! అదీ.. అమెరికాలో పుట్టి, అక్కడే పెరిగి ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్న నవయువకుడి ప్రతిభకు నిదర్శనం!! మన సంస్కృతి, సంప్రదాయాలకు దూరంగా ఉండే గడ్డపై పుట్టినా.. అమ్మ, నాన్నల సాహిత్యాభిలాష, భాషాభిమానం నుంచి స్ఫూర్తిపొంది.. సంస్కృతాంధ్రాల్లో పట్టు సాధించి, అష్టావధానాలు చేసే స్థాయికి ఎదిగిన ప్రతిభాశాలి అతడు. పేరు.. గన్నవరం లలిత్‌ ఆదిత్య. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో 16న సంస్కృతాంధ్ర ద్విగుణిత అష్టావధానం చేయబోతున్న లలిత్‌ ఆదిత్య గురించి..
 
చిరుప్రాయంలోనే పద్యం వైపు ఆకర్షితుడైన లలిత్‌ ఆదిత్య తండ్రి గన్నవరం మారుతీ శశిధర్‌, తల్లి శైలజ. ఇద్దరూ హైదరాబాద్‌లో పుట్టిపెరిగారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో నిపుణులైన మారుతీ శశిధర్‌ ఐబీఎంలో పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. ఆ దంపతులకు 2000 సంవత్సరం సెప్టెంబరు 23న లలిత్‌ జన్మించాడు. చేసేది ఐటీ ఉద్యోగమే అయినా.. మారుతీశశిధర్‌కు సాహిత్యాభిలాష ఎక్కువ. దీంతో తనకు కూడా చిన్నతనం నుంచి సాహిత్యంపై ఆసక్తి పెరిగిందని లలిత్‌ చెబుతారు. ఇక.. లలిత్‌తో తెలుగులో ఓనమాలు దిద్దించి, మాతృభాషపై అభిమానాన్ని పెంపొందించింది అతడి మాతృమూర్తి శైలజ.
 
‘‘తెలుగు రాయడం, చదవడం, వేమన పద్యాలు, సుమతీశతకం.. అన్నీ అమ్మ దగ్గరే నేర్చుకున్నా. క్రమంగా.. పద్యాలు రాయాలన్న ఆసక్తి కలిగింది. రాయడానికి ప్రయత్నించాను. రాయాలంటే ఛందస్సు తెలియాలి కదా! ఇంటర్‌నెట్‌లో వెతికి ఛందస్సు నేర్చుకున్నాను. అలా చిన్నచిన్నగా పద్యాలు రాయడం ఆరంభించి.. నా పదహారో ఏట ఆంజనేయ స్వామి శతకం రాశాను. నాకు హనుమంతుడంటే ఇష్టం. 2016లో కనెక్టికట్‌లో సరస్వతీ దేవి ఆలయం ఒకటి నిర్మించారు. ఆ గుడిలోనే ఆంజనేయస్వామిని కూడా ప్రతిష్ఠించారు. ఆ సందర్భంలోనే ఆ స్వామిని స్తుతిస్తూ తేటగీతిలో శతకం రాశాను. ఆ శతకాన్ని ఎవరికైనా పెద్దలకు చూపిస్తే తప్పొప్పులు చెప్తారు కదా అనే ఉద్దేశంతో ప్రయత్నించగా.. ధూళిపాళ మహదేవమణిగారి గురించి తెలిసింది. ఆయన అందులో తప్పొప్పుల గురించి నాకు వివరించారు.
  
‘వీడు పద్యాలు రాయగలుగుతాడు’ అనుకున్నారో ఏమో.. వారే నాకు యతి, ప్రాస నియమాల గురించి చెప్పి నేర్పించారు.’’ అని లలిత్‌ వివరించారు. ‘‘ధూళిపాళవారి కన్నా ముందు నాకు వేదం, వేదాంతం, సంప్రదాయం, పూజల గురించి నేర్పినవారు మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి. ఇంట్లో మా అమ్మ, నాన్న నేర్పిన పద్యాలు, తెలుగు పునాది మాత్రమే. పద్యాలు కాకుండా నాకు వచ్చినదేదైనా ఉందీ అంటే అది ఆయన దగ్గర నేర్చుకున్నదే. వారి ఆశీస్సులు లేనిదే నేను లేను. అలాగే నాకు సంస్కృతం నేర్పిన గురువు రాయప్రోలు కామేశ్వర శర్మ. మన సంస్కృతి తెలియాలంటే.. సంస్కృతం తెలియాల్సిందేనని మా అమ్మానాన్నలు చెప్పారు. అందుకే సంస్కృతం కూడా నేర్చుకున్నాను’’ అని తెలిపారు.
 
అష్టావధానం..
పద్యాలు రాయడం ఒకెత్తు అయితే.. అంతమంది పెద్దలు, హేమాహేమీల ముందు అష్టావధానం చేయడం మరొక ఎత్తు! అదెలా సాధ్యమైందన్న ప్రశ్నకు.. ‘‘అష్టావధానం చేయాలనుకున్నాను. కానీ.. చేయగలననే నమ్మకం వచ్చేలోగానే చేయాల్సి వచ్చింది’’ అని లలిత్‌ చెప్పారు. చాలాకాలంపాటు ఇంటర్‌నెట్‌ ద్వారా ధూళిపాళ మహదేవమణి వద్ద శిష్యరికం చేసిన లలిత్‌.. 2017లో రాజమండ్రిలోని ఆయన నివాసంలో 7 రోజులపాటు ఉన్నారు. అక్కడున్నన్ని రోజులూ.. దత్తపది, నిషిద్ధాక్షరి ఇలా రకరకాల సమస్యలు ఇచ్చి శిక్షణ ఇచ్చిన మహదేవమణి.. తన శిష్యుడు అష్టావధానానికి సిద్ధమయ్యాడనే నిర్ణయానికి వచ్చారు.
 
ఒక శుభముహూర్తాన.. ‘అష్టావధానం రేపు చేస్తావా? ఎల్లుండి చేస్తావా?’ అని ఆయన తనను అడిగినట్టు లలిత్‌ చెబుతారు. ‘‘ఆయన అలా అడగగానే.. రేపెందుకొచ్చిన గొడవ, ఒకరోజు సమయం దొరుకుతుంది కదా అని ఎల్లుండి చేస్తానన్నాను. అలాగని టెన్షన్‌ పడలేదు. నేను చేయగలుగుతానన్న నమ్మకం లేకుంటే ఆయన చెప్పరు కదా. అదీ నా నమ్మకం’’ అని వివరించారు. తొలి అష్టావధానంలోనే పెద్దల ప్రశంసలందుకున్న లలిత్‌ ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో, అమెరికాలో కూడా అష్టావధానాలు, నవావధానాలు విజయవంతంగా చేశారు.
 
చదువులోనూ మేటి..
శతకాలు రాయడంలోనే కాదు.. మామూలు చదువులోనూ లలిత్‌ మేటి. ప్రస్తుతం యూటీ ఆస్టిన్‌ వర్సిటీలో ఏరో స్పేస్‌ ఇంజనీరింగ్‌ చేస్తున్నారు. తొలిసంవత్సరంలో తొలి సెమిస్టర్‌ ఇటీవలే పూర్తయింది. అటు పద్యం.. ఇటు ఈ సాంకేతిక విద్య.. రెండూ ఎలా సాధ్యమయ్యాయంటే.. ‘పద్యం నాకిష్టం. పైగా దానికి ప్రత్యేకంగా కష్టపడాల్సిన పని లేదు. నా మంచం మీద పడుకుని నా పద్యాలు నేను చెప్పుకొంటే సరిపోతుంది. ఇక, పద్యం అంటే ఎంత ఇష్టమో.. విమానాలన్నా, స్పేస్‌ అన్నా కూడా చిన్నప్పటి నుంచీ అంతే ఇష్టం. అందుకే ఆ విభాగం ఎంచుకున్నా’’ అని చెప్పారు. అదే సమయంలో.. మన సంస్కృతికి సంబంధించిన అంశాల గురించి పెద్దల దగ్గర తెలుసుకోవడం కూడా లలిత్‌కు చాలా ఇష్టమైన పని. అందుకే ప్రస్తుతం కొద్దిరోజులుగా ఏపీలో ఉంటూ.. విజయవాడ సమీపంలోని టేకుపల్లిలో వెంపటి కుటుంబశాస్త్రి వద్ద అలంకార శాస్త్రం.. దోర్బల ప్రభాకర శర్మ వద్ద న్యాయంలో పాఠం చెప్పించుకున్నారు. ఈ ‘అవధాన యువ కిశోరం’ భవిష్యత్‌లో మరిన్ని ఉన్నతస్థానాలకు ఎదగాలని కోరుకుందామా!!
 
లలిత్‌ రచనలు
సంస్కృతంలో
నారసింహనమశ్శతం, హనుమన్నవకం,
నృసింహపాదాదికేసరాంతస్తోత్రం,
శారదాపంచవింశికా
 
తెలుగులో
హనుమద్దోర్దండ శతకం, శ్రీరామ షోడశి,
ఆవిర్భావము (నరసింహావిర్భావ ఘట్టం),
పర్యావరణావనం, శార్దూల విక్రీడితం
 
కష్టమైన పూరణ..
‘‘ఇన్ని అష్టావధానాలు చేశారు కదా, మీకు కష్టంగా అనిపించిన సమస్య ఎవరైనా ఇచ్చారా?’’ అని లలిత్‌ను ప్రశ్నిస్తే.. ‘కష్టమని కాదుగానీ, బాగా గుర్తుండిపోయిన ఒక పూరణ ఉంది’ అంటూ ఒక పద్యం గురించి వివరించారు.
 
సమస్య: వాలికి సేవజేసె వనవాసనివాసిని సీత భక్తితో..
 
దానికి లలిత్‌ పూరణ ఇదీ..
నేలను బుట్టు యజ్ఞ నవనీతయె సీత, తదీయభర్తకున్‌
వ్రాలి పదమ్ములంటి లలనామణి స్వామి శుభమ్ముకోరి యా
ర్యాలలితన్‌ భజించి సమయమ్మున రక్తిమెయిన్‌ మహాలిక
జ్వాలికి సేవజేసె వనవాసనివాసిని సీత భక్తితో..