యువ వ్యవస్థాపకులే జాతి భవిష్యత్తు

టర్కిష్ లీరా సంక్షోభం ఒక అంటురోగంలా వ్యాపిస్తూ అభివృద్ధిచెందుతున్నదేశాల విదేశీమారక ద్రవ్య విపణిపై తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణమిది. ఈ పరిస్థితులలో భారత్‌ తన అత్యంత ప్రతిభావంతులైన, అద్భుత కార్యసాధకులైన యువ వ్యవస్థాపకులు అందరూ స్వదేశంలోనే ఉండేలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
 
చిన్న వయస్సులోనే తమ తమ రంగాలలో శిఖరాల నధిరోహించిన వారిని మెచ్చుకోనివారు ఉంటారా? ఉండరు. మన సమాచార, ప్రసార సాధనాలు అయితే మరింత ముందుకుపోయి ‘యువ విజేతల ఆరాధన’ ను ఎంతగా ప్రోత్సహించాలో అంతగా ప్రోత్సహిస్తున్నాయి. పిన్న వయస్కులు, అందమైన వారు, స్పురద్రూపులు, రూపలావణ్యం ఉన్నవారు అత్యుత్తములు అని మీడియా మనకు నచ్చజెప్పుతోంది, కాదు కాదు, అంగీకరింపజేస్తోంది సుమా! వారే ‘అగ్రగణ్యులు’ అని, మీరు యవ్వనంలో ఉన్నవారైతే మీరు విధిగా ఆ విజేతల విఖ్యాతిని ఆకాంక్షించి తీరాలని మీడియా మరీ మరీ చెప్పుతోంది. కాదూ, వయస్సు మీరిన వారయితే, ప్చ్‌! మీరు పొందలేని దాని గురించి బాధపడకు తప్పదు మరి. వెండి తెర మీద మెరిసిపోతూ అశేషజనుల పగటి కలలు, వాస్తవ జీవితాలలో అంతర్భాగంగా వెలుగొందే చలన చిత్ర నటీనటుల విజయాలు అటువంటి ఆలోచనా ధోరణులకు ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ‘యువ విజేతల ఆరాధన’, మూడు పదుల వయస్సుకు చేరకముందే తమ తెలివితేటలతో కోటీశ్వరులవుతున్న యువ వ్యవస్థాపకులు లేదా యువ పారిశ్రామిక వేత్తల గురించిన మన విశ్వాసాలకు కూడా వ్యాపించింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఆ ‘ఆరాధన’ భావమే ఈ విశ్వాసాలను అమితంగా ప్రభావితం చేస్తోంది.
 
సరే, భారత్‌లో ఆంత్రప్రెన్యూయర్స్‌ (పరిశ్రమల వ్యవస్థాపకులు) విలక్షణతలు ఏమిటి?న్యూఢిల్లీకి చెందిన ఒక డేటా సర్వే సంస్థ కనుగొన్న విశేషాలివి: భారతీయ టెక్‌– వ్యవస్థాపకులు 28 సంవత్సరాలకు అటు ఇటుగా వయస్సుకలిగివుంటారు; అయితే తమకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోగలిగేనాటికి ఆ యువ వ్యవస్థాపకులకి 32 ఏళ్ళ వయస్సు వస్తుంది. ఈ యువ వ్యవస్థాపకులలో అత్యధికులు (91 శాతం) పురుషులే. వీరేమీ ఐఐటి (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)ల నుంచి పట్టభద్రులయినవారేమీ కాదు. అయితే చాలా మందికి పోస్ట్‌–గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉన్నవారే. అలాగే ఎమ్‌బిఏ చేసిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. డాక్టరేట్‌లు పొందినవారు 11 శాతం మేరకు ఉన్నారు. సాధారణంగా కులీన లేదా ఉన్నత వర్గాలవారు విద్యాభ్యాసం చేసే పాఠశాలలు, కళాశాలల్లో చదువుకోకపోవడమన్నది వారి పురోగతికి ఆటంకమయినట్టు కన్పించ లేదు. ఏ రంగంలోకి ప్రవేశించినా వారు నవకల్పనలకు కారకులయ్యారు. ఆసక్తికరమైన విషయమమేమిటంటే వ్యవస్థాపకుని వయస్సుకు, అతను సమీకరించిన పెట్టుబడి పరిమాణానికి మధ్య సహసంబంధం స్వల్పస్థాయిలో మాత్రమే ఉన్నది. వయస్సు కాక, ఉజ్వల ఆలోచనలే వారి విజయాలకు సోపానాలు అయ్యాయన్నది స్పష్టం.
 
భారతీయ కార్మిక శ్రేణుల్లో, తామూ వ్యవస్థాపకులు కావడానికి ఇష్టపడేవారు, కావాలని ఆకాంక్షించేవారు 83 శాతం (ప్రపంచ స్థాయిలో ఇటువంటి స్వాప్నికులు లేదా సంకల్పుల సంఖ్య కేవలం 53 శాతం మాత్రమే) మంది ఉన్నారని రాండ్‌స్టాడ్‌ వర్క్‌మానిటర్‌ గ్లోబల్ సర్వే వెల్లడించింది. ఇటీవల ఉద్యోగ వాతావరణంలో ఒక స్థిరత్వం నెలకొనడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై పరిమితులు గణనీయంగా తగ్గిపోవడం, కొత్తగా అమలులోకి వచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) సానుకూల ప్రభావాలు, దేశవ్యాప్తంగా ‘మేడ్‌ ఇన్ ఇండియా’, ‘డిజిటల్‌ ఇండియా’ ఇత్యాది సరికొత్త ప్రయత్నాలు, ప్రయోగాలు ఫలిస్తుండడంతో తామే వ్యవస్థాపకులమవ్వాలనే ఆకాంక్ష భారతీయ కార్మిక శ్రేణుల్లో సహజంగానే బలీయమవుతోంది.
 
యువ వ్యవస్థాపకులకు సంబంధించిన వాస్తవాలు భారత్‌ అంతటా ఒకే స్థాయిలో లేవు. హెచ్చు తగ్గులు గణనీయంగా ఉన్నాయి. అత్యంత పిన్నవయస్కులైన యువ వ్యవస్థాపకుల విషయంలో బెంగలూరు అగ్రగామిగా ఉన్నది. బెంగలూరు యువ వ్యవస్థాపకుల సగటు వయస్సు 27 సంవత్సరాలు మాత్రమే. (వీరిలో 11 శాతం మంది మహిళలు కావడం గమనార్హం). అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కో నగరానికి చెందిన ‘కంపాస్‌’ కన్సల్టెన్సీ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పిన్న వయస్కులైన యువ వ్యవస్థాపకుల విషయంలో బెంగలూరు తరువాత ద్వితీయ స్థానంలో కౌలాలంపూర్‌ (మలేసియా) ఉన్నది. ఈ మలేసియన్‌ నగర యువ వ్యవస్థాపకుల సగటు వయస్సు 30.5 సంవత్సరాలు. ఇక మూడో స్థానంలో బ్రెజిల్‌ రాజధాని సావో పాలో (31.7 సంవత్సరాలు), నాలుగో స్థానంలో జర్మనీ రాజధాని బెర్లిన్‌ (31.8 సంవత్సరాలు) నగరాలు ఉన్నాయి. ఇంతకూ భారత్‌లో పిన్నవయస్కులైన యువ వ్యవస్థాపకులు అధిక సంఖ్యలో ఉండడానికి కారణమేమిటి? దేశ జనాభాలో పిన్న వయస్కులు అధికంగా ఉండడమేనని చెప్పవచ్చు (భారతదేశపు యువ జనాభా సగటు వయస్సు 25 సంవత్సరాలు. ఇది, ప్రపంచ వ్యాప్తంగా యువ జనాభా సగటు వయస్సు (26. 4 సంవత్సరాలు మాత్రమే)కంటే తక్కువ! ఆన్‌లైన్‌ డిమాండ్‌, ఇంటర్నెట్‌, సామాజిక అనువర్తింపులతో పాటు సర్వీసెస్‌ యాప్స్‌కు ఉన్న డిమాండ్లను సమర్థంగా తీర్చడానికి నవ కల్పనాకర్తలు అయిన ఈ యువ వ్యవస్థాపకులు విశేష కృషి ఇతోధికంగా తోడ్పడుతోంది. ‘కంపాస్‌’ సర్వేలో మరో వాస్తవం కూడా వెల్లడయింది. సిలికాన్ వ్యాలీ, బెంగలూరులోని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల ఆదాయాల మధ్య తీవ్ర వ్యత్యాసమున్నది.సిలికాన్‌ వ్యాలీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వార్షిక ఆదాయం 1, 18, 000 డాలర్లుకాగా బెంగలూరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వార్షికాదాయం ఇంచుమించు 24, 000 డాలర్లు మాత్రమే . భారతీయ సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ సేవలు అతి చౌకగా లభిస్తున్న కారణంగానే అమెరికా, ఇతర సంప్న దేశాల సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్టులు అత్యధిక సంఖ్యలో భారత్‌కు దక్కుతున్నాయి.
 
యువ భారతీయ పారిశ్రామిక వేత్తలకు సంబంధించిన వాస్తవాలను మరింత వివరంగా చూద్దాం. అత్యంత ప్రముఖులు, అందునా అమెరికా మూలాలు ఉన్న కంపెనీలకు సిఇ ఓలుగా ఉన్న వారి జీవితక్రమాన్ని పరిగణనలోకి తీసుకోండి. వీరిలో చాలా మంది ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత ఏ విశ్వవిద్యాలయం నుంచో లేదా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ లాంటి ఉన్నత విద్యా సంస్థలోనో విద్యా భ్యాసం పూర్తి చేసుకొని డాక్టరేట్ డిగ్రీ సంపాదనకు అమెరికాకు వెళుతున్నారు.ఇటువంటి వారిలో పలువురు పోస్ట్‌ –డాక్టొరల్‌ డిగ్రీకి కూడా అక్కడే వుండిపోతున్నారు. ఈ విద్యాధికులలో చాలా మంది తొలుత తమ స్నేహితుల సంస్థలలో పని చెయ్యడం, ఆ తరువాత తమ సొంత ప్రణాళికలతో అంకుర సంస్థ (స్టార్టప్‌)ల నేర్పాటు చేయడానికి ఆర్థిక వనరులను అన్వేషించడం, అవి లభ్యమైన తరువాత మరిన్ని నిధుల కోసం వెంచర్‌ కేపిటల్‌ (సాహస మూల ధనం– దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో రాబడిని పొందే ఉద్దేశంతో ఆర్థిక సంకటాలకు లోనయ్యే ప్రాజెక్టులలో పెట్టిన పెట్టుబడి. ఈ పెట్టుబడిదారుల– సాధారణంగా ఈక్విటీ వాటాదారులు–కు తాము మదుపు చేసే కంపెనీల లాభాలలో వాటాను పొందే హక్కు, ఆ సంస్థల నిర్వహణను నిర్దేశించే హక్కు ఉంటాయి)ను సమకూర్చుకుంటారు. అమెరికాలో 2007–14 సంవత్సరాల మధ్య కొత్త పరిశ్రమలను నెలకొల్పిన 2.7 మిలియన్‌ వ్యవస్థాపకుల విషయమై ఎమ్‌ ఐ టి నిర్వహించిన ఒక అధ్యయనంలో విజయవంతమైన పారిశ్రామికవేత్తల సగటు వయస్సు 45 సంవత్సరాలుగా నిర్ధారితమయింది. ఐరోపాలో విజయవంతమైన పారిశ్రామికవేత్తల సగటు వయస్సు 25–34 సంవత్సరాల మధ్య ఉన్నది. వీరిలో 15 శాతం మంది మహిళలు. ఇక భారత్‌లో సగటు టెక్‌ పారిశ్రామికవేత్త సగటు వయస్సు 27–29 సంవత్సరాలు. అయితే వీరు తమకు అవసరమైన వెంచర్‌ కేపిటల్‌ సమకూర్చుకునేనాటికి 32 సంవత్సరాల వయస్సులో ఉండడం పరిపాటి. సిలికాన్ వ్యాలీలో వలే భారత్‌లో కూడా యువ వ్యవస్థాపకులు లేదా పారిశ్రామికవేత్తలలో అత్యధికులు పురుషులే. మహిళా పారిశ్రామిక వేత్తలు 9 శాతం కంటే తక్కువగా ఉన్నారు.
 
అమెరికాలో కొత్త సంస్థల వ్యవస్థాపకులలో అత్యధికులు ఆసియా దేశాలకు చెందినవారేనని కాఫ్‌మన్‌ ఇండెక్స్‌ ఆఫ్‌ యు.ఎస్‌. స్టార్టప్స్‌ 2017 సంవత్సరంలో నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడయింది. ఈ ఆసియన్లలో అత్యధికులు ఇటీవలే అమెరికాకు వలసవచ్చిన వారేనని కూడా ఆ సర్వే పేర్కొంది. ఈ పారిశ్రామిక వలసదారులలో 33 శాతం మంది భారతీయులే నని కూడా కాఫ్‌మన్‌ సర్వే వెల్లడించింది. అమెరికాలోని మరే ఇతర మైనారిటీ వర్గం వారికంటే కూడా భారతీయ పారిశ్రామికవేత్తలే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. భారత్‌ మూలాలు ఉన్న యువ పారిశ్రామికవేత్తలు అమెరికాకు వలసరావడం 1980లో ప్రారంభమయింది. 2012 నాటికి అమెరికా జనాభాలో వీరు 1 శాతం కంటే తక్కువ. అయితే అమెరికన్ టెక్నాలజీ – ఇంజనీరింగ్‌ స్టార్టప్స్‌లలో 8 శాతం సంస్థలను నెలకొల్పింది భారతీయులే కావడం గమనార్హమని మను రేఖి అనే వెంచర్‌ కేపిటలిస్ట్‌ తెలిపారు (బెంగలూరు నుంచి వలసవచ్చిన మను రేఖి, సిలికాన్ వ్యాలీలో తొలి దశ వెంచర్‌ కేపిటల్‌ కంపెనీలలో ఒకటైన ఇన్వెంటస్‌ కేపిటల్‌ పార్టనర్స్‌లో భాగస్వామి). భారతీయులు అధిపతులుగా ఉన్న పలు ప్రముఖ కంపెనీలు ఇతోధికంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని, అమెరికా సిరిసంపదల పెరుగుదలకు విశేషంగా తోడ్పడుతున్నాయని ఆయన అన్నారు.
 
నవ భావాలు, కొత్త ఆలోచనలే ఏ జాతినైనా ముందుకు నడిపిస్తాయి. అయినప్పటికీ ఒక దేశం సత్వర ఆర్థికాభివృద్ధిని సాధించడంలో సుస్థిర ప్రభుత్వం, పటిష్ఠ పాలన, సుదీర్ఘ రాజకీయ అనుభవం, వివేచనాపరులైన పౌరుల మార్గదర్శకత్వపు ప్రాసంగికతను తక్కువ అంచనావేయడానికి వీలులేదు. విశేష పాలనానుభవమున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇప్పుడు ఒక కఠిన కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వహించవలసివున్నది. టర్కిష్ లీరా సంక్షోభం ఒక అంటురోగంలా వ్యాపిస్తూ అభివృద్ధిచెందుతున్నదేశాల విదేశీమారక ద్రవ్య విపణిపై తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణమిది. భారత్‌ను అభివృద్ధి చెందుతున్న దేశమే అయినప్పటికీ వాస్తవానికి ఇతోధిక అభివృద్ధి సాధించిన దేశం. అయితే ఒక ‘అభివృద్ధి చెందిన’ దేశంకు ఉన్న వనరుల సమృద్ధి భారత్‌కు లేదు. ఈ దృష్ట్యా ప్రస్తుత పరిస్థితులలో భారత్‌ తన అత్యంత ప్రతిభావంతులైన , అద్భుత కార్యసాధకులైన యువ వ్యవస్థాపకులు అందరూ స్వదేశంలోనే ఉండేలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ యువ వ్యవస్థాపకులు అలా స్వదేశంలో ఉన్నప్పుడు మాత్రమే భారత్‌ అభివృద్ధికి నేరుగా దోహదం చేయగలరు.