ఎన్‌ఆర్‌ఈ, ఎన్‌ఆర్‌వో బ్యాంకు ఖాతాల్లో ఏది బెస్ట్‌

 నగదును భారత్‌కు బదిలీ చేసే విషయంలో ఎన్నారైలకు చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. తమ దగ్గర ఉన్న డాలర్లను ఇండియా రూపాయల్లోకి మార్చి పంపించాలంటే తలప్రాణం తోకకు వస్తుంది. అయితే బ్యాంకింగ్‌ రంగంలో ఎన్నారైలకు ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని కొన్ని భారత బ్యాంకులు పలు నూతన సేవలను ప్రాంరంభించాయి. వాటిలో భాగమే నాన్‌ రెసిడెంట్‌ ఎక్ట్సర్నల్‌ (ఎన్‌ఆర్‌ఈ), ఆర్డినరీ నాన్‌ రెసిడెంట్‌ అకౌంట్‌ (ఎన్‌ఆర్‌వో) బ్యాంకు ఖాతాలు. ఈ రెండు రకాల ఖాతాల ద్వారా తమ డబ్బును భారత్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులకు, మిత్రులకు సులభంగా పంపవచ్చు. ఈ బ్యాంకు అకౌంట్లను తెరవడానికి భారత ప్రభుత్వ అనుమతి ఏమాత్రం అవసరంలేదు. భారత సంతతి వ్యక్తని నిరూపించే పీఐవో, ఓసీఐ కార్డుల పత్రాలు ఉంటే చాలు. 

 

భారత బ్యాంకులు అందిస్తున్న ఈ రెండు రకాల ఖాతాల్లోనూ వ్యత్యాసాలు ఉన్నాయి. దేని లాభాలు దానికున్నాయి. అవేమిటో తెలుసుకుంటే ఏ రకమైన ఖాతా ఉపయోగపడుతుందో సులభంగా తెలుసుకోవచ్చు. 
ఎన్‌ఆర్‌ఈ ఖాతా:
ఈ ఖాతాల్లోని నగదును ఖాతాదారుడు స్వదేశానికి పంపించవచ్చు. ఈ ఖాతాల్లోని నగదు రూపాయలుగా జమ అవుతుంది. ఈ నగదును తీసుకునేటప్పుడు అది డాలర్లుగా వస్తుంది. ఈ ఖాతాలకు భారత్‌లో టాక్స్‌ ఉండదు. వీటికి ఎన్నారైలు నివసించే ప్రాంతాల్లో టాక్స్‌ ఉండవచ్చు. ఇద్దరు ఎన్నారైలు కలిసి ఈ ఖాతాను పొందవచ్చు. అయితే భారత్‌లో ఉండే వారితో కలిసి ఈ ఖాతాను నిర్వహించలేరు.
 
ఎన్‌ఆర్‌వో ఖాతా
ఈ ఖాతాలపై ఇటు భారత్‌లోనూ, అటు ఎన్నారైల స్థానిక రాష్ట్రంలోనూ టాక్స్‌ పడే అవకాశం ఉంది. భారతీయులతో కలిసి ఎన్నారైలు ఈ ఖాతాను నిర్వహించవచ్చు. ఈ ఖాతా ద్వారా నగదును భారత్‌కు పంపించవచ్చు.. కానీ దానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఈ ఖాతాలో సంవత్సరానికి ఒక మిలియన్‌ యూఎస్‌ డాలర్ల వరకూ నగదు లావాదేవీలు జరుపుకోవచ్చు. అయితే ఈ లావాదేవీలకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం టాక్స్‌ చెల్లించాలి.