రోదసీలోకి మనోడు

గగన్‌యాన్‌తో మరో ఘనత..
అంతరిక్ష రంగంలో కొత్త చరిత 
గగనయాన్‌కు 10వేల కోట్లు
అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి మానవుడు... యూరీ గగారిన్‌.
అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు... రాకేశ్‌ శర్మ!
మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేస్తున్న దేశాలు... రష్యా, అమెరికా, చైనా!
మరో మూడేళ్లలో భారత్‌ కూడా ఈ దేశాల సరసన చేరనుంది! భారత వ్యోమగాములను... మన అంతరిక్ష వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపేందుకు రంగం సిద్ధమవుతోంది! ఉపగ్రహ ప్రయోగాల్లో తిరుగులేని చరిత్ర సృష్టిస్తున్న భారత్‌... ‘గగన యానం’తో సరికొత్త చరిత్ర లిఖిస్తోంది!
 
ఇదీ గగన్‌యాన్‌
అంతరిక్షంలోకి సొంతంగా మానవ సహిత యాత్రలు జరపాలని భారత్‌ 2006లో తలపోసింది. ఈ ప్రాజెక్టుకు ‘గగన్‌యాన్‌’ అని పేరు పెట్టింది. 2007లోనే స్పేస్‌ క్యాప్సూల్‌ రికవరీ ప్రయోగాన్ని (ఎస్‌ఆర్‌ఈ) విజయవంతంగా నిర్వహించింది. వారం రోజులు అంతరిక్షంలో ఉండగలిగేలా ఒక స్పేస్‌క్రాఫ్ట్‌ డిజైన్‌ను 2008 మార్చిలోనే సిద్ధం చేసింది. కానీ... కేంద్రం నుంచి నిధులు లభించలేదు. చివరికి... 2013లో ‘మానవ సహిత అంతరిక్ష యాత్ర’ను ఇస్రో తన ప్రాధాన్య కార్యక్రమాల్లో భాగంగా చేర్చింది. మానవ రహితంగా రెండు ప్రయోగాలను విజయవంతం చేసింది. సాంకేతికంగా పూర్తిస్థాయిలో సిద్ధమైన తర్వాత... ‘అంతరిక్ష యాత్ర చేస్తున్నాం’ అని ఈ ఏడాది పంద్రాగస్టు ప్రసంగంలో మోదీ ప్రకటించారు.
 
ఏమిటీ అంతరిక్షం...
అంతరిక్షం... ఇదో అనంతం, అద్భుతం! సులువుగా చెప్పాలంటే... భూమి నుంచి వంద కిలోమీటర్లకు ఆవల ఉన్నదంతా అంతరిక్షమే! అక్కడంతా ‘శూన్యం’! భూమ్యాకర్షణ పని చేయదు. ఆక్సిజన్‌ ఉండదు. సూర్య, చంద్రులు, నక్షత్రాలూ, ఇతర గ్రహాలూ... అన్నీ అంతరిక్షంలో భాగమే!
 
1961లోనే తొలి యాత్ర
మానవుడు నేల నుంచి నింగిని దాటి... 1961లోనే అంతరిక్షంలోకి ప్రవేశించాడు. ‘వొస్తొక్‌’ కార్యక్రమంలో భాగంగా రష్యా (నాటి సోవియట్‌ యూనియన్‌) 1961 ఏప్రిల్‌ 12న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు శ్రీకారం చుట్టింది. మొట్టమొదటి అంతరిక్ష యాత్రికుడిగా యూరీ గగారిన్‌ పేరు చరిత్రలో నిలిచిపోయింది. 1969లో నీల్‌ ఆమ్‌స్ట్రాంగ్‌ తొలిసారి చంద్రుడిపై కాలుపెట్టాడు.
 
18ఏళ్లుగా పదేపదే...
అంతరిక్షంలో మానవుని ‘శాశ్వత’ విడిది... ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌ (ఐఎ్‌సఎస్‌). 1998 నవంబరులో అమెరికా, రష్యా దీనిని దిగువ భూ కక్ష్యలో ఏర్పాటు చేశాయి. అప్పటి నుంచి అంతరిక్షంలో మానవుడి ఉనికి కొనసాగుతూనే ఉంది. విదేశాలకు వెళ్లి వచ్చినంత సులువుగా వ్యోమగాములు ఐఎ్‌సఎ్‌సకు వెళ్లివస్తున్నారు. ఐఎ్‌సఎ్‌సలో గరిష్ఠంగా ఆరుగురు వ్యోమగాములు ఉండొచ్చు. ఇది భూమికి 330 నుంచి 415 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతుంటుంది.
 
రాకెట్‌... రాకేశ్‌ శర్మ
1984 ఏప్రిల్‌ 2... రాకేశ్‌ శర్మ రష్యా వ్యోమగాములతో కలిసి... అంతరిక్ష యాత్ర చేశారు. ఆయన భారత వైమానిక దళంలో పైలట్‌. అంతరిక్ష యానం చేసిన తొలి భారత పౌరుడిగా రికార్డు సాధించారు. నాటి ప్రధాని ఇందిరతో అంతరిక్షం నుంచే సంభాషించారు. ‘అక్కడి నుంచి భారత్‌ ఎలా కనిపిస్తోంది’ అని ఆమె ప్రశ్నించగా ‘సారే జహాసే అచ్ఛా’ అనే గీతం గుర్తుకొస్తోందని రాకేశ్‌ శర్మ బదులిచ్చారు. ఇక భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ ‘నాసా’ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కల్పనా చావ్లా దుర్మరణం... ఒక విషాదం!
 
అంతరిక్షానికి ‘టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌’
ఇప్పుడు అంతరిక్ష పర్యాటకం పుంజుకుంటోంది. 2004 జూన్‌ 4న ‘స్పేస్‌షిప్‌ వన్‌’ ద్వారా తొలి ప్రైవేటు అంతరిక్ష యానం జరిగింది. ఈ పర్యాటకానికి నాసా కూడా సహకరిస్తోంది.
 
రాకెట్‌ ప్రయోగం ఇలా...
2022లో జీఎస్ ఎల్‌వీ మ్యాక్‌ 3 లాంచర్‌ ద్వారా ప్రయోగం జరుగుతుంది.
 
మొత్తం ముగ్గురు వ్యోమగాములు అంతరిక్ష యాత్ర చేస్తారు. భూమికి 300-400 కిలోమీటర్ల ఎత్తున... గరిష్ఠంగా వారం రోజులపాటు అంతరిక్షంలో ఉంటారు.
 
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందే ఈ అంతరిక్ష వాహక నౌక, సర్వీస్‌ మాడ్యూల్‌ బరువు 7.8 టన్నులు. ఇది సోయుజ్‌ ఆకారంలోనే ఉంటుంది. శ్రీహరికోట నుంచే దీనిని ప్రయోగిస్తారు.
 
వ్యోమగాములు ‘క్యాప్సూల్‌’ ద్వారా భూకక్ష్యలోకి ప్రవేశించి... బంగాళాఖాతంలో దిగుతారు. దీనికి సంబంధించిన ప్రయోగాలను ఇప్పటికే ఇస్రో పలుమార్లు విజయవంతంగా నిర్వహించింది.
 
అవసరమా?
భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశం వేలకోట్లు ఖర్చుపెట్టి అంతరిక్షంలోకి మనుషులను పంపడం అవసరమా? అనేది కొందరి ప్రశ్న! దీనికి కేంద్రం చెప్పే సమాధానం.. ‘‘కచ్చితంగా అవసరమే. ఇలాంటి ప్రయోగాలు యువతలో, రేపటి పౌరుల్లో సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుతాయి. భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా మారి సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడతారు. అంతిమంగా ఇది దేశాభివృద్ధికి దోహదపడుతుంది’’!