Trump-True-life-Story

ట్రంప్‌ గారి... వీర గాథ!

అతడిని...
ప్రేమించవచ్చు, ద్వేషించవచ్చు.
కానీ విస్మరించలేం!
ఎందుకంటే...
అతడు... ట్రంప్‌, డోనాల్డ్‌ ట్రంప్‌.
అమెరికా అధ్యక్షుడు! అగ్రరాజ్యాధినేత!! అతడి చేతిలో అణుబాంబుల మీటలుంటాయి. అతడి బుర్రలో యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతుంటాయి. అతడి ఇనుప బూట్ల కింద చిన్నాచితకా దేశాలు  నలిగిపోతుంటాయి. దొరవారు ఏ నిమిషంలో ఎలా వ్యవహరిస్తారో ఎవరూ ఊహించలేరు. మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టేస్తాననవచ్చు. తాలిబన్లతో చర్చలు జరిపేందుకు సహకరించమంటూ పాకిస్థాన్‌కు లేఖ రాయవచ్చు. వీసా నిబంధనలు మార్చేస్తానంటూ మీసాలు మెలేయవచ్చు.  ‘ఐ లవ్‌ యూ రాజా!’ అంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడికి కన్ను గీటవచ్చు. పెద్దాయన  ఏం చేసినా చెల్లుతుంది. ఏ డైలాగ్‌ వేసినా పండుతుంది.

 

గత రెండేళ్లలో ట్రంప్‌ నిర్ణయాలకూ ప్రతిస్పందనలకూ మూలాలు... ఏడు దశాబ్దాల జీవితంలో ఉన్నాయి. అధ్యక్షుడిగా ట్రంప్‌ను అర్థం చేసుకోవాలంటే- ఓ బిడ్డగా, విద్యార్థిగా, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా, రియాల్టీ టీవీస్టార్‌గా, ముగ్గురు భార్యల భర్తగా, శృంగార ప్రియుడిగా... ట్రంప్‌ జీవితాన్నీ అర్థం చేసుకోవాలి. ట్రంప్‌ పరిణామ సిద్ధాంతాన్ని విశ్లేషించుకోవాలి. 

వర్తమానమంటే...
మరీ కొత్త అధ్యాయమేం కాదు.
గతం అనే పేజీకి కొనసాగింపే!
 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కథ... వాళ్ల తాతగారి కథతో మొదలవుతుంది. ఫ్రెడ్రిక్‌ ట్రంప్‌ జర్మనీ నుంచి అమెరికా వచ్చాడు. కాదుకాదు, అక్కడి నుంచి బలవంతంగా గెంటేశారు. కారణం... జర్మనీలో పదహారేళ్లు వస్తే మిలటరీ సర్వీసులో పనిచేయడం తప్పనిసరి. ఫ్రెడ్రిక్‌ ఆ తలనొప్పిని తప్పించుకుని అమెరికాకు వచ్చేశాడు. పదిహేను సంవత్సరాల తర్వాత మళ్లీ వెళ్లిపోయి... జర్మనీలో స్థిరపడాలనుకున్నాడు. కానీ, ప్రభుత్వం అనుమతించలేదు. వెంటనే వెళ్లిపొమ్మంది. దీంతో వెనక్కి వచ్చేసి, న్యూయార్క్‌లో స్థిరపడ్డాడు. అక్కడే ట్రంప్‌ తండ్రి... ఫ్రెడ్‌ జన్మించాడు. సెలూను పెట్టినా, హోటల్‌ నడిపినా... రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి వచ్చాకే దశ తిరిగింది. ఫ్రెడ్రిక్‌ హఠాన్మరణంతో భార్య ఎలిజబెత్‌ పగ్గాలు చేపట్టారు. ఫ్రెడ్‌కు ఇరవై రెండేళ్లు రాగానే... వ్యాపార బాధ్యతలన్నీ అప్పగించారు. ఫ్రెడ్‌ తండ్రికి తగ్గ తనయుడు. ఆస్తిని ఇంకొన్ని రెట్లు పెంచాడు. స్కాట్లాండ్‌కు చెందిన మేరీని మనువాడాడు. ఆ దంపతులకు డోనాల్డ్‌ ట్రంప్‌ నాలుగో సంతానం. జూన్‌ 14, 1946న పుట్టాడు. మిగతావారు... మేరియాన్నే ట్రంప్‌, ఫ్రెడ్రిక్‌ క్రిస్ట్‌ ట్రంప్‌, ఎలిజబెత్‌ 

ట్రంప్‌, రాబర్ట్‌ ట్రంప్‌.

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన ఏడాదిలోపే డోనాల్డ్‌ ట్రంప్‌ జన్మించాడు. అప్పటికి న్యూయార్క్‌ ప్రపంచ నగరంగా మారుతోంది. పెద్దపెద్ద కంపెనీలు అక్కడ భవంతులను నిర్మించాయి. న్యూయార్క్‌ సంపన్న వాతావరణం మన్‌ హాట్టన్‌కు కూడా విస్తరించసాగింది. ఆతర్వాత మధ్యతరగతి వారు క్వీన్స్‌, బ్రూక్లిన్‌లలో స్థిరపడటం ప్రారంభించారు. ఇదే అదనుగా బ్రూక్లిన్‌లోని బాత్‌ బీచ్‌ ప్రాంతంలో దాదాపు ముప్పైరెండు ఆరంతస్తుల భవనాలను నిర్మించాడు ఫ్రెడ్‌. ఆ లాభాలతో మరింత సంపన్నుడయ్యాడు. తన కుటుంబం కోసం 23 గదులతో విశాలమైన భవంతిని కట్టుకున్నాడు. అదో రాజసౌధంలా ఉండేది.
 
ఫ్రెడ్‌కు దర్పం ఎక్కువ. స్థాయికి తగని మనుషుల్ని చిన్నచూపు చూసేవాడు. అదే బుద్ధి ట్రంప్‌కూ వచ్చింది. పక్కింటి పిల్లల బంతి తమ పెరట్లో పడినా కొంపలు మునిగినట్టు గొడవ చేసేవాడు. అరిచేవాడు. పోలీసుల్ని పిలుస్తానంటూ కేకలు వేసేవాడు. దేనికీ భయపడేవాడు కాదు. చిమ్మచీకటిని కూడా లెక్క చేసేవాడు కాదు. 
నాలుగేళ్ల వయసులో ట్రంప్‌ను న్యూయార్క్‌లోని కివ్‌-ఫారెస్ట్‌ స్కూల్‌లో చేర్చారు. స్కూలు డ్రెస్‌కోడ్‌ తనకు అస్సలు నచ్చేది కాదు. ఆ అసంతృప్తిని ఏదోరకంగా వెళ్లగక్కేవాడు. పెద్దపెద్దగా నవ్వుతూ తరగతిలో సమస్యలు సృష్టించేవాడు. ఒకరోజు శరన్‌ మజరెల్లా అనే విద్యార్థిని జడను పందితోక.. (పిగ్‌ టెయిల్‌)తో పోలుస్తూ అందర్నీ నవ్వించాడు. దీంతో ఆ పిల్ల కోపంగా లంచ్‌ బాక్స్‌తో తలపై బాదింది. ట్రంప్‌ విద్యార్థి దశలో ఇలాంటి గడుగ్గాయి ఘటనలు చాలా ఉన్నాయి. ట్రంప్‌కు ఏ పరీక్షలోనూ మంచి మార్కులు వచ్చేవి కావు. జిమ్నాసియం, బంతాటల్లో మాత్రం సత్తా చాటేవాడు. పంచ్‌ బాల్‌, బాస్కెట్‌ బాల్‌, ఫుట్‌ బాల్‌ ఎన్ని ఆటలాడినా... బేస్‌ బాల్‌ అంటే ప్రాణం. పాఠశాల వార్షిక సంచికలో బేస్‌ బాల్‌ మీద ఏకంగా ఓ కవితే రాశాడు.

పాఠశాల పాలకమండలిలో ఫ్రెడ్‌ సభ్యుడు. కొడుకు ఆగడాలు ఆయన దృష్టికి వచ్చేవి. తన పిల్లలు బాగా చదువుకుని... ప్రయోజకులు కావాలని ఫ్రెడ్‌ కోరిక. చిన్నప్పటి నుంచే సంపాదన గురించి చెప్పేవాడు. ఖాళీ రాక్‌ సోడా బాటిల్స్‌ను సేకరించి అమ్మించేవాడు. వార్తాపత్రికలను విక్రయించమనేవాడు. వర్షం పడితే, తనే కార్లో తీసుకువెళ్లి ఇంటింటికి పత్రికలు వేయించేవాడు. తన నిర్మాణ స్థలాల వద్దకు తీసుకువెళ్లేవాడు. ట్రంప్‌ చాలా విషయాల్లో తండ్రితో విభేదించేవాడు. వాదానికి దిగేవాడు. ‘అరే, నువ్వు రాజువురా! ఏ రంగంలో ప్రవేశించినా నీవే నంబర్‌ వన్‌ కావాలి. అందుకే చెప్పింది చేయి..’ అని మెచ్చుకుంటూనే కొడుకును దారికి తెచ్చుకునేవాడు. ఏడో తరగతి పూర్తయ్యే సమయానికే... ట్రంప్‌ కొన్ని చేయిదాటిపోయే పనులు చేశాడు. రౌడీలా వ్యవహరించేవాడు. కత్తులు కొనుక్కునేవాడు. వాటితో ఆడుకునేవాడు. ఇంట్లోనే ఉంటే బిడ్డ ఏమైపోతాడో అన్న భయం పట్టుకుందా తండ్రికి. పదమూడేళ్ల వయసులో ఉండాల్సిన పసితనం... ట్రంప్‌లో మచ్చుకైనా కనిపించేది కాదు. దీంతో, దాదాపు అరవై మైళ్లదూరంలో ఉన్న న్యూయార్క్‌ మిలటరీ స్కూల్లో చేర్పించాడు. అక్కడే ట్రంప్‌ జీవితం మారిపోయింది. 

బడి బాట..
స్కూలు వాతావరణం ఎంత కఠినంగా ఉండేదంటే... విద్యార్థులు పక్కనే ఉన్న హడ్సన్‌ నదిలో దూకి పారిపోయేవారు. ఇంట్లో రుచికరమైన హంబర్గర్లూ గట్రా ఆరగించే అలవాటున్న ట్రంప్‌... మెస్‌హాలులో బుద్ధిగా కూర్చుని మాంసం ముక్కలు, మకరోనీ, వెన్న తినాల్సి వచ్చేది. ఇరుకిరుకు బరాక్స్‌లో పడుకోవాల్సి వచ్చేది. ఓ పెద్ద షవర్‌ కింద... తోటివిద్యార్థులతో సామూహిక స్నానం చేయాల్సి వచ్చేది. తెల్లవారుజామున బాకా ఊది నిద్రమత్తు వదిలించేవారు.
ఇక, టెడ్‌ డొబియాస్‌ అనే మాస్టారు దగ్గరైతే నోరెత్తినా నేరమే. రెండో ప్రపంచ యుద్దంలో పాల్గొన్న సైనికాధికారి ఆయన. పదవీ విరమణ తర్వాత మిలటరీ అకాడమీలో చేరారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన విద్యార్థులను బాక్సింగ్‌ రింగ్‌లోకి నెట్టి కొట్టుకోమనేవాడు. కోటీశ్వరుల పిల్లలైనా సరే, తన ఆదేశాల్ని తప్పక పాటించాల్సిందే. ప్రశ్నలకు తావు లేదు. ట్రంప్‌ ఆ వాతావరణాన్ని త్వరలోనే జీర్ణించుకున్నాడు. పద్ధతిగా ఉండే విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. పతకాలు గెలుచుకున్నాడు. డొబియాస్‌ను కూడా మచ్చిక చేసుకున్నాడు. తన జీవితంలో డోనాల్డ్‌లాంటి తిమ్మిని బమ్మిని చేసే విద్యార్థిని ఎక్కడా చూడలేదనీ, న్యూయార్క్‌ మిలటరీ అకాడమీని కూడా తనకు తగ్గట్లుగా మలుచుకున్నాడనీ ప్రశంసించాడు ఓ సందర్భంలో. ట్రంప్‌ నిజంగానే కష్టపడి చదివేవాడు. గ్రేడులు సంపాదించుకోవాలన్న తపన ఉండేది. సెలవుల్లో తండ్రికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో సహకరించేవాడు. ‘మా నాన్న ఏ ప్రాజెక్టు చేపట్టినా మా ఆస్తి అంతకు ముందున్న దానికన్నా రెట్టింపు అవుతుంది. నేను కూడా ఒక రోజు ఎంతో కీర్తి, డబ్బు సంపాదిస్తాను’ అని చెప్పుకునేవాడు. 

‘సైనిక శిక్షణలోనే నేను బాగుపడతానని నాన్న భావించారు. నాకెందుకో ఆ ఆలోచన నచ్చలేదు. ఆయన చెప్పిందే సరైందని తర్వాత అనిపించింది. మిలటరీ అకాడమీలో జీవితం అంటే ఏమిటో తెలిసింది. నాలోని దుందుడుకు స్వభావం... పాజిటివ్‌ శక్తిగా మారి... నా విజయాలకు ఉపకరించింది’ అని తన పుస్తకం ‘ద ఆర్డ్‌ ఆఫ్‌ ద డీల్‌’లో ప్రస్తావించాడు. 1964లో ట్రంప్‌ మిలటరీ అకాడమీలో గ్రాడ్యుయేట్‌ అయ్యాడు. 

‘పట్టా’దారు...
అకాడమీ నుంచి వచ్చాక... నటన మీద మక్కువ కొద్దీ, యూనివర్సిటీ ఆఫ్‌ సదర్న్‌ కాలిఫోర్నియాలోని చలనచిత్ర విద్యాసంస్థలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. అంతలోనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఆకర్షించింది. ఇంటికి దగ్గరగా ఉండాలన్న కోరిక బలపడింది. దీంతో, పోర్దామ్‌ యూనివర్సిటీలో చేరాడు. అక్కడా ఇమడలేకపోయాడు. ఆతర్వాత, వార్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌లో ఎకనామిక్స్‌తో బీయే పూర్తిచేశాడు. వ్యాపారాన్ని వృత్తిగా ఎంచుకోవాలనుకుంటే... అంతకు మించిన విద్యాసంస్థ ఉండదని ట్రంప్‌ చెబుతుంటాడు. ట్రంప్‌ అసాధారణ ప్రతిభావంతుడేం కాడు. దృష్టంతా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపైనే ఉండేది. వార్టన్‌ స్కూల్‌లో ఉండగానే తన కుటుంబ వ్యాపార సంస్థ అయిన ట్రంప్‌ మేనేజిమెంట్‌ కంపెనీలో చేరాడు. మన్‌ హాట్టన్‌ పొలిమేరల్లో మఽధ్యతరగతి ఇళ్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ప్రారంభించాడు.

యువ వ్యాపారిగా...

ట్రంప్‌ తండ్రి పోలిక. మరీ ముఖ్యంగా ఆ మాటతీరు. ఫ్రెడ్‌ అందరితో కలుపుగోలుగా మాట్లాడేవారు. సమాజంలోని బలమైన వ్యక్తులతో స్నేహం చేసేవారు. క్రమంగా రాజకీయాల్లో చేరారు. ఎంతోమంది అభ్యర్థులకు ఆర్థికసాయం చేశారు. సంబంధాలను ఎలా ఉపయోగించుకోవచ్చో, జనంతో ఎలా ఆడుకోవచ్చో ట్రంప్‌కు... రుజువు చేసి మరీ చూపించారు. ఆ మార్గంలోనే ట్రంప్‌ నడిచాడు. అంతకంటే వేగంగా అడుగులు వేశాడు. 1968లో తండ్రి కంపెనీలో చేరిన ట్రంప్‌, 1971లో ప్రెసిడెంట్‌ అయ్యాడు. ట్రంప్‌కు 24 సంవత్సరాలు వచ్చే నాటికి... ఫ్రెడ్‌ ఆస్తి విలువ... 200 మిలియన్‌ డాలర్లు. కానీ, మిలియన్‌ డాలర్ల అప్పు ఇచ్చి మరీ కొడుకును వ్యాపారంలో ప్రవేశపెట్టారు. డబ్బుతో పాటే.. తన రాజకీయ, వ్యాపార సంబంధాలనూ ఇచ్చారు. ఆ అస్త్రశస్ర్తాలతో యుద్ధం ఎలా చేయాలో ట్రంప్‌కు బాగా తెలుసు. కాబట్టే, పదకొండేళ్లలోనే ఫోర్బ్స్‌ పత్రిక ప్రకటించిన సంపన్నుల జాబితాలో చేరిపోయాడు. తండ్రి అప్పు తీర్చేసి... ఆస్తిని వంద మిలియన్లకు పెంచేశాడు. ఇంకో ఏడేళ్లలో ప్రపంచ కుబేరుల చిట్టాలో స్థానం సంపాదించాడు. వ్యాపారంలో తీవ్ర నష్టాలూ ఎదురయ్యాయి. ఓ దశలో కుటుంబ సభ్యుల దగ్గరే అప్పులు చేయాల్సి వచ్చింది. పడ్డాడు, లేచాడు. నిలదొక్కుకున్నాడు. పరుగులు తీశాడు. గత ఏడాది నాటికి ప్రపంచ కుబేరుల ర్యాంకింగ్‌లో 766వ స్థానానికి చేరుకున్నాడు. ట్రంప్‌ టవర్స్‌ నిర్మాణంతో ఆయన కీర్తి ఆకాశానికి చేరింది.

ట్రంప్‌ వ్యాపారాన్ని ప్రారంభించిన తొలి రోజుల్లో... న్యూయార్క్‌లో నేరాలు పెరిగిపోయాయి. దీంతో జనాభా తగ్గింది. న్యూయార్క్‌ కాస్తా దివాలా నగరంలా మారింది. అందుకు ప్రత్యామ్నాయంగా... మన్‌ హాట్టన్‌లో అందమైన రెస్టారెంట్లనూ ఆకాశాన్ని తాకే భవనాలనూ పెద్దపెద్ద వ్యాపారాలనూ ఊహించుకున్నాడు ట్రంప్‌. అలా అని, తన తండ్రిలా మధ్యతరగతి జీవుల్ని లక్ష్యం చేసుకోలేదు. సంపద ఆర్జించాలంటే తండ్రి మార్గానికి భిన్నంగా పోవాలని భావించాడు. మన్‌ హాట్టన్‌లో రెండేళ్లలోనే తన రియల్‌ ఎస్టేట్‌ లక్ష్యాన్ని రూపొందించుకున్నాడు. ఆయన స్వభావానికి తగ్గట్టుగా... అధికారపు కారిడార్లలో, న్యాయవ్యవస్థలో పరిచయాలు ఉన్న యూదు న్యాయవాది లభించాడు. అతడే రాయ్‌ కోహన్‌. రాయ్‌ ప్రవేశంతో ట్రంప్‌ జీవితం మలుపు తిరిగింది. ఆయన ద్వారా న్యూయార్క్‌ నగరంలో రాజకీయ నాయకులు, దళారుల మధ్య తిరిగే వ్యక్తులతో పరిచయం పెంచుకున్నాడు. ట్రంప్‌కు ముందే దూకుడెక్కువ. కోహన్‌ ఆయన పక్కన చేరడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. మన మీద ఏదైనా ఆరోపణ వస్తే వెంటనే దాన్ని ఖండించాలి. అది తప్పని ఎదురుదాడి చేయాలి, ప్రత్యర్థినే ఆత్మరక్షణలో పడేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించకూడదు... అన్నది కోహన్‌ సిద్ధాంతం. అది ట్రంప్‌కు బాగా నచ్చింది. ఆయనకి మీడియా ప్రాధాన్యం తెలుసు. పత్రికల్లో వార్తలు ఎలా రాయించాలో తెలుసు. ఈ కళను ట్రంప్‌కు అనుకూలంగా ఉపయోగించాడు. మన్‌ హాట్టన్‌లోని ప్రముఖులకు ట్రంప్‌ను పరిచయం చేశాడు కోహన్‌. సంఘటిత నేరాలకు పాల్పడే వ్యక్తులు, సంస్థలతోనూ ట్రంప్‌ చాలాకాలం సంబంధాలు కొనసాగించాడు. తనకు విజయం ముఖ్యం. ఆ విజయానికి ఎంచుకునే దారి అప్రస్తుతం. లక్షమందిలో ఉన్నా, పదిలక్షల మందిలో ఉన్నా.... తాను ప్రత్యేకంగా కనబడాలి. అంతా తనవైపే చూడాలి. తన గురించే మాట్లాడుకోవాలి. ఆ ప్రయత్నంలో ప్రపంచ మీడియా కేంద్రమైన న్యూయార్క్‌ సిటీని ఎంచుకున్నాడు. జాతీయ స్థాయికి ఎదిగేందుకు అవసరమైన ఏ మార్గాన్నీ వదులుకోలేదు. టీవీ షోలలో పాల్గొన్నదీ అందుకే! ఓసారి ప్లేబాయ్‌ పత్రిక ముఖచిత్రంగా... ఓ నగ్న యువతి ట్రంప్‌ను రాసుకుంటూ మోహంతో చూస్తున్న ఛాయాచిత్రాన్ని ప్రచురించారు. అదో దుమారం. ట్రంప్‌ మాత్రం, ‘ఏ రకంగా అయితేనేం, నాకు ప్రచారం వచ్చింది. అంతటా నేనే కనపడుతున్నాను. అదే నా గొప్పతనం’ అని మురిసిపోయాడు. 
ప్రేమాయణం..
ఒక రోజు, న్యూయార్క్‌లోని ఓ ఖరీదైన బార్‌ బయట ఓ అందగత్తెను చూసి ట్రంప్‌ కళ్లు మెరిసాయి. ఆమె వద్దకు వెళ్లి భుజం తట్టాడు. ‘ఈ క్యూలో మీలాంటి సౌందర్య రాశులు నిలబడటం ఏమిటి? నాకు ఈ బార్‌ ఓనర్‌ బాగా తెలుసు... రండి’.. అని ముందుకు నడిచాడు. ఆమె పేరు ఇవానా. ‘థాంక్యూ...’ అంటూ అతడి వెంట నడిచింది. ఆ రాత్రి ఆమెకు, ఆమె స్నేహితులకు తన ఖర్చుతోనే విందు ఇచ్చాడు. ఆ తర్వాత వారిని హోటల్‌ దగ్గర వదిలిపెట్టాడు. మరునాడు, మూడు డజన్ల గులాబీలు పంపి ఇవానా మనసును మరింత చూరగొన్నాడు. ఇవానా కమ్యూనిస్టు పాలనలో ఉన్న చెకోస్లోవేకియాలో పెరిగింది. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క బిడ్డ. మొదట కెనడాకు వలస వెళ్లి అక్కడ మోడల్‌గా స్థిరపడింది. ఆ తర్వాత ఆమెరికాకు వచ్చింది. ట్రంప్‌తో పరిచయం అయ్యాక ఇద్దరూ డేటింగ్‌ మొదలు పెట్టారు. తన ఆస్తుల గురించి ట్రంప్‌ ఎంత గర్వంగా చెప్పుకునేవాడో, ఇవానా గురించీ అంతే గర్వంగా ప్రకటించుకునేవాడు. నిజానికి, ట్రంప్‌తో పరిచయానికి ముందే ఆమెకు ఒక ఆస్ట్రేలియన్‌ వ్యాపారితో పెళ్లయింది. అతడి సహాయంతో అమెరికాకు వచ్చింది. పనైపోగానే తెగతెంపులు చేసుకుంది. అప్పటికి ట్రంప్‌ వయసు 30 ఏళ్లు. జీవితంలో స్థిరపడాలని అనుకుంటున్న సమయం. ఒక పురుషుడు తన జీవితంలో విజయవంతం కావాలంటే, కుటుంబం వైపు నుంచీ మద్దతు అవసరమని అతడికి తెలుసు. ఇవానా కూడా, తన తల్లి మాదిరే సాయపడుతుందని భావించాడు. తల్లి లాగే వలసవచ్చిన అమ్మాయి కనుక, తనకు సరిగ్గా సరిపోతుందనుకున్నాడు. ఆమెకు తెలివీ, అందమూ రెండూ ఎక్కువే. ‘ఆ అమ్మాయి మాట్లాడుతుంటే అందానికి మెచ్చుకోవాలో, తెలివికి హత్తుకోవాలో తెలియలేదు..’ అని ట్రంప్‌ చెప్పుకున్నాడోసారి. ఇవానా కూడా... ట్రంప్‌లో ఓ అందగాడిని, ఉత్సాహవంతుడిని చూసింది. ఆస్తిపాస్తులు సరేసరి. విధేయుడైన భర్తగా ఉంటాడనుకుంది. సమయం సందర్భం చూసుకుని... ట్రంప్‌ తన మనసులోని మాట చెప్పాడు. ఆమె అంగీకరించగానే మూడు కారట్ల డైమండ్‌ రింగ్‌ను తొడిగాడు. పరిచయమైన ఏడాదిలోపే వివాహమైంది. పెళ్లికి ముందే, ట్రంప్‌ తన న్యాయవాది రాయ్‌ కోహన్‌ను రంగంలోకి దించాడు. ఒకవేళ విడాకులు తీసుకుంటే ట్రంప్‌ ఆస్తిలో వాటా లభించదని కోహన్‌ ఆమెకు స్పష్టంగా చెప్పాడు. ఈ ఒప్పందానికి ఇవానా ఒప్పుకుంది. బహుమతులు మాత్రం తిరిగి ఇవ్వబోనని తేల్చింది. వివాహమైన ఏడాదికి, ఇవానాకు మొదటి సంతానం కలిగింది. మొదటి పిల్లాడికి డోనాల్డ్‌ జాన్‌ ట్రంప్‌ అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత 1981లో ఇవాంకా, 1984లో ఎరిక్‌ జన్మించారు. పెళ్లయిన వెంటనే ఇవానాను తన కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రకటించాడు. ఇద్దరూ ఒకే విధంగా ఆలోచించేవారు. పట్టుదలతో, తాము చేస్తున్న పనిపై దృష్టి కేంద్రీకరించేవారు. ఇద్దర్నీ వేరు చేసి ఆలోచించలేని విధంగా వ్యవహరించేవారు. ట్రంప్‌కు పిల్లలంటే ప్రాణం. తన పనులు తాను చేసుకుంటూనే... బుడిబుడి అడుగులేసుకుంటూ ఆఫీసులోకి వస్తే మాత్రం, మనసారా ముద్దాడేవాడు. ప్రేమగా మాట్లాడేవాడు. పిల్లలు కూడా స్కూలు నుంచి రాగానే నాన్న ఆఫీసులో ఆడుకునేవారు. జీవిత భాగస్వామి ఇవానా మీద మోజు మాత్రం... ఎంతోకాలం కొనసాగలేదు. విడాకులు తప్పలేదు. మర్లా, మెలాయినా - ఒకరి తర్వాత ఒకరు ప్రవేశించారు. 
ట్రంప్‌ అనే నేను...
రాజకీయాలపై ట్రంప్‌ కన్ను ఎప్పుడో పడింది. మొదట్లో రాజకీయాల్ని వ్యాపార అవసరాల కోసం, ప్రచారం కోసం వాడుకునేవాడు. ఆతర్వాత తానే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడు. అమెరికా అధ్యక్ష పీఠం... ఎప్పటి నుంచో ఊరిస్తూ ఉంది. 2010-12లోనూ పోటీ విషయమై ఆలోచన చేశాడు. ఒబామా మూలాల గురించి వివాదాలు సృష్టించాడు. అయితే, ఆతర్వాత మళ్లీ ఆలోచన మానుకున్నాడు. 2015లో ఎట్టకేలకు ట్రంప్‌ టవర్‌ నుంచి తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాడు. ‘నేను యునైటెడ్‌ స్టేట్స్‌ అధ్యక్ష పదవికి అధికారికంగా పోటీపడుతున్నాను’ అని ప్రకటించాడు. చెప్పినట్టే పోటీపడ్డాడు. ఎలాగైతేనేం గెలిచాడు. 

ట్రంప్‌... 

మంచివాడు అంటే, విభేదించేవారు ఉన్నారు. చెడ్డవాడు అంటే కూడా, విభేదించే వారు ఉన్నారు. ‘అసాధ్యుడు...’ అంటే మాత్రం... ఖండించేవారే ఉండరు.
ప్రజలు దేనికి అర్హులో అదే వారికి లభిస్తుంది. ఇవాల్టి అమెరికన్‌ ఆలోచనా విధానానికి ప్రతిబింబం ట్రంప్‌.
- ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌
 
 
రసిక 
శిఖామణి
 అందమైన మోడల్స్‌ను వివాహం చేసుకోవడంలోనూ, సుందరీమణులకు తన కార్యాలయంలో కొలువులు ఇవ్వడంలోనూ... అర్ధరాత్రుళ్ల వరకు కేసినోల్లోనో, పేరుమోసిన క్లబ్బుల్లోనో అందాల విందులు ఆస్వాదించ డంలోనూ ట్రంప్‌కు ట్రంపే సాటి. ఆయనకు మద్యం, మాదక ద్రవ్యాల పట్ల ఆసక్తి లేదు. స్త్రీల సాహచర్యం మాత్రం మహా మత్తు కలిగించేదని ట్రంప్‌తో పరిచయం ఉన్నవాళ్లకు తెలుసు. పురుషుడి విజయాన్ని సక్సెస్‌ ఫుల్‌ అనాలని, స్త్రీ విజయాన్ని బ్యూటిఫుల్‌ అనాలని చెప్పేవాడు. ఆ సౌందర్య దాహమే ఆయన్ని  అన్ని పెళ్ళిళ్లకు ఉసిగొల్పింది.
 
మీడియాతో 
దాగుడుమూతలు
1980లోనే అమెరికన్లు అభిమానించే పదిమంది వ్యక్తుల్లో ఒకడిగా గుర్తింపు పొందాడంటేనే... ట్రంప్‌ ఎంత వ్యూహాత్మకంగా పనిచేశారో అర్థం చేసుకోవచ్చు. పైకి వివాదాస్పద ప్రకటనలు చేస్తూ, రకరకాల హావభావాలు ప్రకటిస్తూ... కనిపిస్తాడు. కానీ, చేసే ప్రతి పనిలో ఓ దీర్ఘకాలిక వ్యూహం ఉంటుంది. పైకి తిట్టినా, ప్రెస్‌ అంటే  ఎంతో ప్రేమ. మీడియా ఆయనకు ఆక్సిజన్‌ లాంటిది. తన గురించి వచ్చే వార్తలు అహాన్ని సంతృప్తి పరుస్తాయి. లేవగానే... మీడియాలో ఏం వచ్చిందో చూసుకోకుండా ముందుకు కదలడు. తన పేరున్న చోట ఇంక్‌తో మార్క్‌ చేసి సంతృప్తి చెందుతాడు.
 
మోదీ...ట్రంప్‌!
నరేంద్ర మోదీ జాతీయ  రాజకీయాల్లోకి ప్రవేశించిన రెండేళ్లకు ట్రంప్‌ అమెరికా అధ్యక్ష పదవికి రేసులో దిగారు. బహుశా మోదీ విజయాన్ని అధ్యయనం చేసిన తర్వాతే ట్రంప్‌ రంగంలోకి దిగి ఉండవచ్చు. 2016లో ట్రంప్‌ ఉపన్యాసాలు 2014లో మోదీ చేసిన ఉపన్యాసాల మాదిరే ఉంటాయి. ఇద్దరూ... ఆర్థిక ప్రగతిని సాధిస్తామని, ఉద్యోగాలను కల్పిస్తామని హామీలిచ్చారు. సైనిక విధానంపై దృష్టి కేంద్రీకరించారు. దూకుడు విదేశాంగ విధానాన్ని అనుసరించారు. జాతి పూర్వ వైభవానికి ప్రాధాన్యమిచ్చారు. 2013 మే 14న అమెరికాలో జనాన్ని ఉద్దేశిస్తూ మోదీ ‘ఇండియా ఫస్ట్‌’ నినాదాన్ని ఇచ్చారు. ట్రంప్‌ కూడా ఆ తర్వాత ‘అమెరికా ఫస్‌’్ట నినాదాన్ని చేపట్టారు.
మోదీ మాదిరి ట్రంప్‌ కూడా అక్రమ వలస దారులపై దృష్టి కేంద్రీకరించారు. ఎన్నికల కమిషన్‌ తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని, బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చినవారు తన పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారని మోదీ ఆరోపించారు. ట్రంప్‌ కూడా అక్రమ మెక్సికన్లు డెమొక్రటిక్‌ పార్టీకి ఓటు వేస్తున్నారని, వారిని వెనక్కు పంపుతానని చెప్పారు. ప్రధానమంత్రిగా మన్మోహన్‌ సింగ్‌ నిర్ణయాలు తీసుకోలేని బలహీన నేత అనీ ఆయనకు అంతర్జాతీయంగా గౌరవం లేదనీ ముఖ్యంగా పాక్‌ ప్రధానమంత్రి ఆయన్ని పట్టించుకోరనీ మోదీ ఆరోపించారు. బరాక్‌ ఒబామాను కూడా ఇలానే విమర్శించారు ట్రంప్‌. చైనా అతడిని గౌరవించదన్నారు.