అమెరికా వీసా కోసం ఫొటోకు కఠిన నిబంధనలు

హైదరాబాద్ : అమెరికా వీసా కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నారా? అయితే నిబంధనలను జాగ్రత్తగా గమనించండి. కళ్ళజోడు దగ్గర నుంచి పాస్‌పోర్టు సైజు ఫొటో వరకు ఎలా ఉండాలో తెలిపే నిబంధనలను 2016 నవంబరు 1 నుంచి అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ ప్రకటించిన వివరాల ప్రకారం...

 
కళ్ళజోడు ధరించి పాస్‌పోర్టు సైజు ఫొటోను తీయించుకోకూడదు. కంటి సమస్యలు ఉన్నవారు కళ్ళజోడు ధరించి ఫొటో తీయించుకోవాలంటే మెడికల్ ప్రొఫెషనల్ లేదా హెల్త్ ప్రాక్టీషనర్‌ సంతకం చేసిన స్టేట్‌మెంట్‌ను సమర్పించవలసి ఉంటుంది. పాస్‌పోర్టు సైజ్ పొటో పొడవు 51 మి.మీ., వెడల్పు 51 మి.మీ. ఉండాలి. ముఖం 25 మి.మీ. నుంచి 35మి.మీ. మధ్యలో ఉండాలి. గెడ్డం క్రింద నుంచి తలపైభాగం వరకు కనిపించాలి. రెండు కళ్ళు తెరచి ఉంచుతూ చిరునవ్వు నవ్వుతూగానీ, మామూలుగా ఉంటూ కానీ ఫొటో తీయించుకోవాలి. ముఖం మొత్తం స్పష్టంగా కనిపించాలి. తలకు పెట్టుకున్నవాటి నీడ ముఖంపై పడకూడదు. కలర్ ఫొటో అయి ఉండాలి. టోపీలు, హెడ్ కవరింగ్స్ ధరించకూడదు. మతపరమైన ఆచారాల ప్రకారం రోజూ ధరించేవాటికి మినహాయింపు ఉంది. 
 
బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, దుబాయ్ దేశాలవారు అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసేటపుడు పాటించవలసిన నిబంధనలు ఏమిటంటే...
 
బ్రిటన్ : సన్ గ్లాసెస్, టింటెడ్ గ్లాసెస్ ధరించకూడదు. రీడింగ్ గ్లాసెస్ ధరించవచ్చు. అయితే కళ్ళు స్పష్టంగా కనిపించేవిధంగా ఫొటో తీయించుకోవాలి. గ్లేరింగ్, రిఫ్లెక్షన్స్ కనిపించకూడదు. 
 
చైనా : కెమెరాకు మధ్యగా ఉంటూ మొత్తం ముఖం కనిపించాలి. హెయిర్ యాక్సెసరీస్ పెట్టుకోకూడదు. కాంతిని వెదజల్లే, దరఖాస్తుదారు కళ్ళను పక్కదారి పట్టించే కళ్ళజోళ్ళను ధరించకూడదు. 
 
ఫ్రాన్స్ : రోజూ ధరించే కళ్ళజోళ్ళను ధరించవచ్చు. అయితే కళ్ళు స్పష్టంగా కనిపించేలా ఉండాలి. వాటి నుంచి రిఫ్లెక్షన్లు రాకూడదు.
 
రష్యా : కళ్ళజోడును పూర్తిగా తీసేసి ఫొటో తీయించుకోవాలి. వైద్యపరంగా అవసరమైతే వైద్యుల నుంచి సర్టిఫికేట్‌ను సమర్పించవలసి ఉంటుంది. గ్లాస్‌లపై గ్లేరింగ్ ఉండకూడదు. కళ్ళు స్పష్టంగా కనిపించాలి. 
 
దుబాయ్ : ముఖ కవళికలు స్పష్టంగా కనిపించాలి. వెంట్రుకలు, కళ్ళజోడు ఫ్రేము ముఖాన్ని కప్పేయకూడదు.