ఎన్నారైలూ.. మీ పేరు లీగల్‌గా మార్చుకోవాలనుకుంటున్నారా?

కొంతమంది చాలా కారణాల వల్ల తమ పేర్లను మార్చుకోవాలనుకుంటారు. ముఖ్యంగా వివాహం అయిన తర్వాత మహిళలు తమ ఇంటి పేరును మార్చుకోవాలనుకుంటారు. అలాగే ఎన్నారైలు తమ పాస్‌పోర్ట్‌లోని పేరును లీగల్‌గా మార్చుకోవడం ఎలాగో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారికి సహాయ పడేందుకే ఈ కథనం. 
 
1)ముందుగా పేరును లీగల్‌గా మార్చుకోవాలనుకుంటున్నామని ఓ రిక్వెస్ట్‌ లెటర్‌ పెట్టాలి. ఈ లెటర్‌ భారత్‌లోని ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఇచ్చే నోటరీ రూపంలో ఉండాలి. విదేశాల్లో ఉండే ఎన్నారైలు తమకు దగ్గర్లో ఉండే ఇండియన్‌ కాన్సులేట్‌ నుంచి ఈ అఫిడవిట్‌ను పొందవచ్చు. 
2)అలాగే ఓ తెల్ల కాగితంపై పాత పేరు, మార్చుకోవాలనుకుంటున్న పేరు, తండ్రి పేరుతోపాటు చిరునామా కూడా రాయాలి. ఉద్యోగం చేస్తున్నట్టైతే యజమాని పేరు కూడా రాయాలి. అలాగే దాని మీద ఇద్దరు సాక్ష్యుల ఎదుట సంతకం చేసి వారి సంతకాలు కూడా తీసుకోవాలి. 
3)అనంతరం ఏదైనా స్థానిక వార్తా పత్రికలో(ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతం, భారత్‌లోని నివాస ప్రాంతంలో) పేరు మార్చుకున్న విషయం గురించి ఓ ప్రకటన ఇవ్వాలి. అందులో కూడా పూర్తి వివరాలు ఉండాలి. ఆ న్యూస్‌ ప్రింట్‌ కాపీని భద్రపరుచుకోవాలి. 
4)అనంతరం సంబంధిత దరఖాస్తులను కంట్రోలర్‌ ఆఫ్‌ పబ్లికేషన్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లికేషన్‌, సివిల్‌ లైన్స్‌, ఢిల్లీ-54 అనే చిరునామాకు పంపించాలి. 
జతచేయవలసిన డాక్యుమెంట్లు:
ఎ)అటెస్టెడ్‌ అఫిడవిట్‌ (నోటరి)
బి)సాక్ష్యుల సంతకాలతోపాటు వివరాలు నమోదు చేసిన డాక్యుమెంట్‌
సి)రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటోగ్రాఫ్స్‌
డి)ప్రకటన ఇచ్చిన పత్రిక కాపీలు(రెండు ప్రాంతాల్లోనూ)
ఇ)నిర్దేశించిన ఫీజు
5)నేమ్‌ చేంజ్‌కు నిర్దేశించిన ఫీజు భారత కరెన్సీలో రూ.900. దీన్ని డిమాండ్‌ డ్రాఫ్ట్‌ ద్వారా పంపించాలి. కంట్రోలర్‌ ఆఫ్‌ పబ్లికేషన్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లికేషన్‌ పేరు మీద డీడీ తీయాలి.