ముఖ్యమైన 3 సమస్యలు- పరిష్కారాలు

అమెరికాలో చదువుకోవటానికి వెళ్లే విద్యార్థులందరి మనస్సుల్లోను- ‘చదువు తర్వాత ఏమిటి? ఉద్యోగం వస్తుందా? హెచ్‌-1బీ వీసా వస్తుందా?’ లాంటి అనేక సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. అమెరికాలో చదువుకోవటానికి.. ఆ తర్వాత ఉద్యోగం చేయటానికి అనేక అవకాశాలు ఉన్నాయంటున్నారు విద్యా నిపుణులు. అమెరికాకు వెళ్లిన విద్యార్థులను ఎక్కువగా వేధించే మూడు సందేహాలకు సమాధానాలివి..

చదువు తర్వాత..
అమెరికాలో చట్టాలు, విధానాలు తరచూ మారుతూ ఉంటాయి. అందువల్ల వెళ్లే ముందే వీసాలో ఉన్న నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకోవాలి. చాలా విశ్వవిద్యాలయాల్లో చదువుపూర్తయిన తర్వాత ఇంటర్న్‌షి్‌పలను అందిస్తూ ఉంటారు. అలాంటి ఇంటర్న్‌షి్‌పలు ఉన్న కోర్సులను ఎంపిక చేసుకుంటే మంచిది. చాలా సందర్భాలలో విద్యార్థులు- తమ విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సుల గురించి పూర్తిగా తెలుసుకోరు. ఏదైనా విశ్వవిద్యాలయానికి అప్లై చేసే ముందే పూర్తిగా కోర్సు గురించి.. కోర్సు పూర్తయిన తర్వాత లభించే ఉపాధి అవకాశాల గురించి తెలుసుకొని.. ఆ తరహా వీసాలకు దరఖాస్తు చేసుకోవటం మంచిది. వీలైతే ఆ కోర్సులను చేసిన వారితో మాట్లాడితే అదనపు వివరాలు తెలుస్తాయి. అంతేకాకుండా చదువుతున్న సమయంలో- విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న కంపెనీలలోని అవకాశాలను తెలుసుకుంటే మంచిది. ఈ విధమైన నెట్‌వర్కింగ్‌- చదువుపూర్తయిన తర్వాత ఎంతో ఉపయోగపడుతుంది.
 
 కమ్యూనికేషన్‌..
చాలా మంది విద్యార్థులకు టోఫెల్‌లో మంచి స్కోరు వస్తుంది. అయితే వారికి ఇంగ్లీషులో బాగా రాయటం.. మాట్లాడటం రాదు. దీనితో ఒక సారి విశ్వవిద్యాలయంలోకి వెళ్లిన వెంటనే- అక్కడి వాతావరణం భయంకరంగా కనిపిస్తుంది. దీని వల్ల వారు కొన్ని కొన్ని కోర్సులలో ఉన్నత స్థానాలు సాధించలేకపోతారు. గ్రూపుల్లో భాగస్వాములు కాలేకపోతారు. అందువల్ల అమెరికాకు వెళ్లే ముందే- అక్కడి భాషావ్యవహారాలను గమనిస్తే మంచిది. దీనికి ఇంగ్లీషు సినిమాలు ఎంతో ఉపకరిస్తాయి. ఇంగ్లీషు సినిమాలు చూసి వారు మాట్లాడే భాషను అర్థం చేసుకోవటం వల్ల ఎన్నో ఉపయోగాలుంటాయి. చాలా విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీషేతర విద్యార్థుల కోసం కోచింగ్‌ క్లాసులుంటాయి. వీటిలో చేరటం వల్ల చాలా ఉపయోగాలుంటాయి. ఒక వేళ కమ్యూనికేషన్‌ సబ్జెక్ట్‌ కోర్సులో లేకపోయినా- దానిని ఎంచుకోవటం మంచిది.
 
కాపీ విషయంలో జాగ్రత్త..
చాలా సందర్భాలలో- అంతర్జాతీయ విద్యార్థులకు అమెరికాలో కాపీ కొట్టడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తారని తెలియదు. వాస్తవానికి అమెరికాలోని హైస్కూళ్లలోను, కాలేజీలలోను- ఈ విషయాన్ని ముందు నుంచి చెబుతారు. ఇద్దరు కలిసి ప్రిపేర్‌ అయి.. ఒకే నోట్స్‌ను సబ్‌మిట్‌ చేస్తే దానిని కూడా అమెరికాలో కాపీగా పరిగణిస్తారు. అందువల్ల అమెరికాలో చదువుకొనే విద్యార్థులు- కాపీకి సంబంధించి- తాము చదువుతున్న విశ్వవిద్యాలయం విడుదల చేసిన మార్గదర్శకాలను జాగ్రత్తగా చదవాలి. ప్రొఫెసర్లతో తరచూ మాట్లాడుతూ ఉండటం వల్ల కూడా దేనిని కాపీగా పరిగణిస్తారనే విషయం
తెలుస్తుంది.
-స్పెషల్‌ డెస్క్‌