వారివి ఆత్మహత్యలు కావు!

విప్లవవీరుడు సర్దార్‌ భగత్‌సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ అమెరికాలోని డల్లాస్‌లో మాట్లాడుతూ అన్నారు! అలాగే మరో విప్లవ వీరుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆత్మహత్య చేసుకున్నాడని కూడా ఆయన పేర్కొన్నట్లు ఒక ప్రముఖ దిన పత్రిక రాసింది. (‘ఆంధ్రజ్యోతి’ కాదు). రెండూ పొరపాట్లే! భగత్‌ సింగ్‌ను బ్రిటిష్‌ పోలీసులు ఉరితీయగా, చంద్రశేఖర్‌ ఆజాద్‌ను కాల్చి చంపారు! 1960వ దశకంలో ఈ విప్లవ వీరులందరి చరిత్రలను నేను ‘ఆంధ్రజ్యోతి’లో రాశాను. అవి గ్రంథాలుగా వెలువడ్డాయి కూడా. పంజాబ్‌ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతిరాయ్‌ని బ్రిటిష్‌ పోలీసు ఆఫీసర్‌ శాండర్స్ కాల్చి చంపగా, అతడిని భగత్‌ సింగ్‌, ఆయన సహచరులు రాజగురు, సుఖదేవ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌ ప్రభృతులు మాటువేసి కాల్చి చంపారు. దీన్ని లాహోర్‌ కుట్ర కేసు అన్న పేరుతో భగత్‌ సింగ్‌ ప్రభృతులపై బ్రిటిష్‌ ప్రభుత్వం కేసును బనాయించింది. 1931 మార్చి 23వ తేదీన లాహోర్‌ జైలులో ఆ ముగ్గురు విప్లవవీరులకు ఉరిశిక్ష. ఆ విప్లవ వీరులు ఉరితాడును స్వయంగా బిగించుకున్నారు. ఉరి తీసేముందు భగత్‌ సింగ్‌ ‘‘కొద్ది క్షణాలలో మేము ఈ మట్టిలో కలిసిపోతాము. కాని, ఆ మట్టి నుంచే మహావీరులెందరో ఆవిర్భవించి, ఈ బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని మా మాతృభూమి నుంచి పారద్రోలుతారు. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌! సామ్రాజ్యవాద్‌ నాశ్‌ హో!’’ అంటూ నినాదాలు చేశారు. వారి ముఖాలలో ఎక్కడా విషాద ఛాయలు గోచరించలేదు.

 
ఆ తరువాత కొద్ది క్షణాలకు వారి ప్రాణాలు అనంత వాయువులలో లీనమైనాయి. సర్దార్‌ భగత్‌ సింగ్‌ ఒక సిక్కు జాట్‌ కుటుంబంలో పంజాబ్‌లోని లాయల్‌పూర్‌ జిల్లాలో జన్మించాడు. ఉరితీసేనాటికి ఆయన వయస్సు 23 సంవత్సరాలే! ఇక, చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఇప్పటి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ ప్రాంతానికి చెందినవాడు. ఆయనను హిందుస్థాన్‌ సోషలిస్టు రిపబ్లికన్‌ ఆర్మీకి కమాండర్‌ అనేవారు. ఆయన బ్రిటిష్‌ పోలీసుల బారి నుంచి తప్పించుకుని, వారిని ముప్పు తిప్పలు పెట్టసాగాడు. ఒక సారి ఆయన అలహాబాద్‌ లోని ఆల్‌ఫ్రెడ్‌ పార్కులో ఒక మిత్రునితో మాట్లాడుతుండగా – ఆ నమ్మకద్రోహ మిత్రుడే యిచ్చిన సమాచారంతో – బ్రిటిష్‌ పోలీసులు ఆజాద్‌ను చుట్టు ముట్టారు. వారికి దీటుగా ఆజాద్‌ కూడా వారిపై కాల్పులు జరుపుతున్నాడు. అయితే, పోలీసులు చాలా మంది వున్నందున, వారి కాల్పులకు ఆజాద్‌ శరీరం తూట్లు పడిపోయింది! ఆయనను పట్టుకుందామని పోలీసులు ప్రయత్నిస్తున్నారు కాని, వారికి ధైర్యం చాలడం లేదు. ఆజాద్‌ మృతి చెందినా, పోలీసులు భయంతో ఆయన మృతదేహంపై కాల్పులు జరుపుతూ శరీరాన్ని స్వాధీనం చేసుకున్నారు! చంద్రశేఖర్‌ ఆజాద్‌, భగత్‌సింగ్‌లు ఆత్మహత్యలు చేసుకునే పిరికి పందలు కారు! వారు స్వాతంత్ర్య సమర యోధులు! విప్లవసేనానులు!
తుర్లపాటి కుటుంబరావు