క్యాంపస్‌లో ఎదురయ్యే సవాళ్లివి..

ఆంధ్రజ్యోతి, 18-07-2017: స్వదేశాన్ని వదిలి విదేశాల్లో నివసించటం అంత సులువు కాదు. శారీరకంగాను, మానసికంగాను, సాంస్కృతికపరంగాను- కొత్త ప్రాంత పరిస్థితులకు అలవాటు పడాలి. అంతే కాకుండా అక్కడి ప్రజలను అర్థం చేసుకోవాలి. మన దేశం నుంచి వెళ్లిన విద్యార్థులు అమెరికాలో ఎదుర్కొనే సవాళ్లను.. వాటిని అధిగమించే మార్గాలను వివరిస్తున్నారు ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ రీజినల్‌ ఆఫీసర్‌ ప్రియా బహదూర్‌..

 
కల్చర్‌ షాక్‌

అమెరికాలో చదువుకోవటానికి వెళ్తున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది ఆ దేశాన్ని ఎప్పు డూ చూసి ఉండరు. అక్కడి ప్రజల జీవన విధానం, ఆచార వ్యవహారాలు, ప్రవర్తనల గురించి వినటమే తప్ప ప్రత్యక్షంగా చూసి ఉండరు. అందువల్ల అమెరికాకు వెళ్లిన తర్వాత అక్కడి పద్ధతులకు అలవాటు పడటానికి కొద్ది సమయం పడుతుంది. కొందరు విద్యార్థులు చాలా ఉత్సాహంగా కొత్త పరిస్థితులకు అలవాటు పడిపోతారు. మరికొందరు బెంగపెట్టుకుంటారు. క్లాసులు ప్రారంభమయి న తర్వాత ఈ బెంగ తగ్గిపోయి- కొత్త వాతావరణానికి అలవాటు పడతారు.

భద్రత ఎలా..

అమెరికాలో చాలా విశ్వవిద్యాలయాలలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. విశ్వవిద్యాలయం సిబ్బంది ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా.. విద్యార్థులు కూడా తమవంతుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఆ జాగ్రత్తలేమిటంటే..

టెక్నాలజీపై ఎక్కువ ఆధారపడవద్దు. విశ్వవిద్యాలయంలో వివిధ రకాల ప్రదేశాలలో తిరిగి వాటిని గుర్తు పెట్టుకోవటం మంచిది.

ప్రతి విశ్వవిద్యాలయానికి ఒక భద్రతా హాట్‌లైన్‌ ఉంటుంది. దానిని ఫోన్‌లో ఫీడ్‌ చేసుకుంటే మంచిది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు- ఎమర్జెన్సీ ఫోన్‌ నెంబర్లు దగ్గర పెట్టుకోవటం మర్చిపోవద్దు.

వీలైనంత వరకూ ఒంటరిగా ఎక్కడికి వెళ్లవద్దు. ఒక వేళ వెళ్తే ఎవరితోనైనా చెప్పి వెళ్లండి. ఎక్కడైనా భయంగా అనిపిస్తే- వెంటనే మీ స్నేహితులకు ఫోన్‌ చేయండి

ఎవరైనా దాడి చేసినప్పుడు- తప్పించుకొనే అవకాశం ఉంటే- తప్పించుకోండి. ఎదురుదాడి చేయవద్దు.

ఆరోగ్యంగా ఉండాలంటే..

సాధారణంగా మొదటి సంవత్సరం విద్యార్థులు కొంత బరువు పెరుగుతారు. దీనిని ఫ్రెష్‌మెన్‌ 15 అంటారు. ఎక్కువ శారీరక శ్రమ చేయకపోవటం.. ఎక్కువ సార్లు తిన టం, ఎక్కువ మొత్తం తినటం వంటివి- బరువు పెరగటానికి ప్రధాన కారణాలు. కొత్తగా వెళ్లిన విద్యార్థులు- తాము తీసుకొనే ఆహారంతో పాటుగా వ్యాయామం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కల్చరల్‌ షాక్‌ వల్ల చాలా సందర్భాలలో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. ఎక్కువ మందిని స్నేహితులుగా చేసుకుంటే ఈ ఒత్తిడి తగ్గుతుంది. కొన్ని వర్సిటీలలో కొత్త విద్యార్థులకు కౌన్సిలింగ్‌ సదుపాయాలు కూడా ఉంటాయి. వీటితో చాలా ప్రయోజనాలుంటాయి. వీటితో పాటుగా..

ఏదైనా మెడికల్‌ ఎమర్జెన్సీ వస్తే వెంటనే 911కి కాల్‌ చేయవచ్చు

ఎక్కడికి వెళ్లినా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కార్డును తీసుకువెళ్లటం మర్చిపోకూడదు

డాక్టర్లకు, నర్సులకు విద్యార్థులు ఇచ్చే సమాచారాన్ని రహస్యంగా ఉంచాలి.

ఒత్తిడి తగ్గించుకోవటమెలా..

ఒత్తిడి తగ్గించుకోవాలంటే బాగా తినాలి.. వ్యాయామం చేయాలి.. రెస్ట్‌ తీసుకోవాలి

మన హాబీలకు కొంత సమయం కేటాయించుకోవాలి.

అన్ని పనులు ఒకే సారి చేయాలనుకోకూడదు. ఒక దాని తర్వాత మరొకటి చేయటం వల్ల ఎక్కువ ఒత్తిడి ఉండదు.

సమయాన్ని సమర్థంగా ఉపయోగించుకోవటానికి అవసరమైన వ్యూహాలను అనుసరించాలి.

ఆరోగ్య బీమా

అంతర్జాతీయ విద్యార్థుల కోసం అమెరికాలో చాలా వర్సీటీలు ఆరోగ్య బీమాను అందిస్తున్నాయి. బీమా తీసుకొనే ముందు ఈ కింది అంశాలను దృష్టిలో ఉంచు కోవాలి.. ఆ విషయాలేమిటంటే..

మన ఆరోగ్య అవసరాలను బీమా పాలసీ తీరుస్తుందా? లేదా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి.

ఇతర పాలసీలతో పోలిస్తే విశ్వవిద్యాలయం అందించే పాలసీలలో ప్రయోజనం ఉందా? లేదా? అనే విషయాన్ని చూసుకోవాలి.

కొన్ని బీమా కంపెనీలు అదనంగా ప్రీమియం చెల్లిస్తే- కొన్ని రకాల సేవలు అందిస్తాయి. వాటిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.

కొన్ని బీమా పాలసీలు- అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పనిచేస్తాయి. ఆ పాలసీ అవసరమా? కాదా? అనే విషయాన్ని విశ్లేషించుకోవాలి.