తెలుగోడి వంటకు.. కోహ్లి టీమ్‌ ఫిదా!

విదేశీ యాత్రల్లో... సరైన భోజనం దొరక్కపోతే కడుపు మాడ్చుకోవాల్సిందే. మ్యాచ్‌ల కోసం ప్రపంచమంతా చుట్టేసే క్రికెటర్ల పరిస్థితి ఏమిటి? యాత్రల్లో టీమ్‌ ఇండియా ఏం తింటోంది? ఫారిన్‌ రుచులు వాళ్లకి నచ్చుతాయా? లేదు, అస్సలు నచ్చవు. ఆమధ్య సిడ్నీ వెళ్లినప్పుడు... ఏరికోరి ఓ భారతీయ షెఫ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తను తెలుగువాడే. ‘కోహ్లి బృందానికి వండిపెట్టడం నా అదృష్టం’ అంటున్నాడు విజయవాడ వాసి సాయి హర్ష చిట్టాంజల్లు.

నాలుగేళ్ల క్రితం సిడ్నీలో టీమ్‌ ఇండియాకు చేదు అనుభవం ఎదురైంది. భారతీయ భోజనం కాకుండా.. బీఫ్‌తో వండిన పదార్థాలేవో వడ్డించారు. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఆమధ్య సిడ్నీ టూర్‌కు వెళ్లినప్పుడు.. ‘ఇక్కడ, భారతీయ పాకశాస్త్ర నిపుణులు ఎవరైనా ఉన్నారా?’ అనడిగారు ఇండియన్‌ క్రికెటర్లు. అప్పటికే ఐదేళ్లుగా నేనక్కడ క్రికెటర్లకు షెఫ్‌గా చేస్తున్నాను. దీంతో నా పేరు సిఫార్సు చేశారు. అలా మన క్రికెటర్లకు నా చేతివంట రుచి చూపించే అవకాశం దక్కింది. క్రీడాకారులకు వండిపెట్టడం అంత సులభమేం కాదు. ముందుగా...ఇష్టాయిష్టాల్ని అర్థం చేసుకోవాలి. వాళ్లకు నచ్చే వంటల్నే వండాలి. అందులోనూ సమృద్ధిగా పోషక విలువలు ఉండాలి. అన్నీ ఆలోచించుకున్నాకే...బాధ్యత స్వీకరించాను.
 
కోహ్లికి వెజ్‌ అంటే ఇష్టం..
విరాట్‌ కోహ్లికి శాకాహారం అంటే ప్రీతి. వెన్నరుచులు, పనీర్‌ వంటలంటే ఇష్టం. అన్నం, పప్పు, నెయ్యి మహా మమకారంగా తింటారు రవిశాస్త్రి. సంప్రదాయ వంటలంటే... ఆకు కూరలు, కూరగాయలు, పప్పు.. ఇవేగా! దాదాపుగా అన్నీ నాదైన పద్ధతిలో వండి పెట్టాను. ‘అచ్చం ఇంట్లో తిన్నట్లే ఉంది’ అన్నారు క్రికెటర్లు. ఏరోజుకు ఆరోజు కొత్తకొత్త వంటలు చేసేవాడిని. ఆటగాళ్లు పెవిలియన్‌ నుంచి డ్రెస్సింగ్‌ రూమ్‌కు రాగానే... కేటరింగ్‌ అటెండెంట్‌ వారెన్‌ రిచర్డ్స్‌ ద్వారా కబురు అందేది. వెంటనే వాలిపోయేవాడిని. ఛాయ్‌ టైమ్‌లో మష్రూం చిల్లీ, క్రీమ్డ్‌ వెజిటబుల్స్‌, కొత్తిమీర ఆమ్లెట్‌ వేడివేడిగా చేసి ఇచ్చేవాణ్ణి. చివర్లో నేనిచ్చే అల్లం టీకి ఫిదా అయ్యేవాళ్లు. చిన్నప్పటి నుంచీ నాకు క్రికెట్‌ అంటే ఇష్టం. నా అభిమాన క్రికెటర్లకు... నేనే స్వయంగా వండిపెట్టడం అదృష్టంగా భావిస్తున్నా. ఇదో మరచిపోలేని అనుభవం. సిడ్నీలో నా చేతి వంట రుచి చూశాక.. ‘న్యూజిలాండ్‌ పర్యటనకు కూడా నువ్వే రావాలి’ అని అడిగారు. క్రికెట్‌ దేవుళ్లే అడిగితే, కాదనగలనా?
 
మొదట్నుంచీ..
మాది విజయవాడ. నాన్న మనోజ్‌ కుమార్‌ డిఫెన్స్‌ అకౌంట్స్‌లో సీనియర్‌ ఆడిటర్‌. దీంతో హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. నాకు వంటలు నేర్పిన తొలి గురువు మా అమ్మ సుశీల. కిచెన్‌లో అమ్మకు సాయపడేవాణ్ణి. అన్నం, పప్పు, ఆమ్లెట్‌ వంటివన్నీ తనే నేర్పింది. ఇంటర్‌ పూర్తయ్యాక.. ఇంజనీరింగ్‌లో చేరమన్నారు అమ్మానాన్నలు. ‘ఆ చదువు నాకిష్టం లేదు. ఎప్పటికైనా పెద్ద షెఫ్‌ అవుతాను. అదే నా లక్ష్యం’ అని చెప్పాను. వాళ్లను ఒప్పించి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కేటరింగ్‌ టెక్నాలజీలో చేరాను. అనంతరం ఆస్ట్రేలియా వెళ్లి ఎంబీయే చదివినా.. నా మనసంతా వంటకాలపైనే ఉండేది. పట్టా చేతికి రాగానే, సిడ్నీ క్రికెట్‌ మైదానంలో జూనియర్‌ షెఫ్‌గా చేరాను. అక్కడ జరిగే ప్రతి వేడుకకూ... భారతీయ వంటకాలు చేసే ఉద్యోగం నాది. చదువుకునే రోజుల్లో బేకరీలో, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లలో పార్ట్‌టైమర్‌గా పనిచేశాను. ఆ అనుభవం ఇక్కడ పనికొచ్చింది. షెఫ్‌ కావాలన్న కల తీరినందుకు సంతోషంగా ఉంది. ఎవరైనా సరే, ఒకటి గుర్తు పెట్టుకోవాలి. తమ ఇష్టాన్ని వదులుకోకుండా.. నచ్చిన కోర్సులో చేరితే మంచి ఫలితం ఉంటుంది. జీవితంలో సంతృప్తి కూడా లభిస్తుంది. మైదానంలో క్రికెటర్ల పనితీరు మీద... ఆ రోజు తిన్న వంటకాల ప్రభావమూ ఉంటుందని నమ్ముతాన్నేను. అంటే, ఆ బృందంలో షెఫ్‌ పన్నెండో ఆటగాడు.
 
అమృతమే!
ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌కు రకరకాల వంటలు చేసిపెట్టినా.. నామట్టుకు నాకు, అమ్మ చేతి వంటే అమృతం. అందులోనూ హైదరాబాద్‌ బిర్యానీ, సాంబారు, రొయ్యల వేపుడు ఇంకెవరు వండినా నచ్చదు. ఆ రుచుల్ని నేను ఆవురావురుమంటూ తింటాను. అమ్మను మించిన షెఫ్‌ ఎవరైనా ఉంటారా?
 
టీమిండియా మెనూ...
లంచ్‌లో: బ్రకోలి సూప్‌, గ్రీన్‌ సలాడ్‌ విత్‌ బాయిల్డ్‌ ఎగ్స్‌, సాల్టెడ్‌ మష్రూమ్స్‌, కడాయ్‌ పనీర్‌, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ పోరియాల్‌, మటన్‌ కర్రీ, దాల్‌ పంచరతన్‌, ఉడుపి సాంబార్‌, పాపడ్‌, ప్లెయిన్‌ కర్డ్‌, రోటీ, పుల్కా, బ్రౌన్‌ రైస్‌, వైట్‌ రైస్‌, ఆనియన్‌ రైతా.
టీ బ్రేక్‌లో: వెజిటబుల్‌ రాప్‌, చికెన్‌ రాప్‌, కుకీస్‌.
పోస్ట్‌ మ్యాచ్‌: ఇండియన్‌ బ్రెడ్‌ అండ్‌ డిప్స్‌, గ్రిల్డ్‌ చికెన్‌ షేవర్స్‌, షమీ కబాబ్‌, టోఫు, లమింగ్‌టన్స్‌.
- ఎస్‌.కె. సలీం, ఇంటర్‌నెట్‌ డెస్క్‌