విదేశాల్లో ఆరోగ్యం జాగ్రత్త...

ఆంధ్రజ్యోతి(13-8-15):విదేశాలకు వెళుతున్నారా? వెళ్లేటప్పుడు ప్రయాణ ఏర్పాట్లను ప్లాన్డ్‌గా చేసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన డాక్యుమెంట్లను మర్చిపోకుండా మీ దగ్గరపెట్టుకోవాలి. ఇంకా... 

విదేశాలకు వెళ్లే ముందర ఆరోగ్యపరంగా అన్ని రకాల చెకప్స్‌ చేయించుకోవాలి.

మీరు వెళ్లే ప్రదేశంలో ఆరోగ్యసేవల తీరుతెన్నులెలా ఉన్నాయో ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకోవాలి.

ఆరోగ్య విషయాలకు సంబంధించి ముందే చక్కటి ప్లానింగ్‌తో వ్యవహరించాలి.

మీరు వెళ్లే దేశంలో ఉన్న హెల్త్‌కేర్‌ సిస్టమ్‌ గురించి ముందే అధ్యయనం చేయాలి. ఆ దేశంలో అమలులో ఉన్న ఆరోగ్య సేవల స్వరూప స్వభావాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి.  

విదేశాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఇన్సూరెన్స్‌ కార్డుల వల్ల  వీటిని ఎక్కువ ఖర్చులేకుండా పొందగలం.

మీరు వెళ్లే దేశంలో ఏతరహా అనారోగ్యసమస్యలు  ఎక్కువగా తలెత్తే అవకాశం ఉందో  కూడా తెలుసుకోవాలి. దాన్ని బట్టి ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

ట్రావెల్‌ మెడిసెన్‌ స్పెషలిస్టులుంటారు. మీ ప్రయాణపు ప్లానింగ్‌ని బట్టి, చూడబోయే ప్రదేశాలను బట్టి, టూరిస్టుల మెడికల్‌ హిస్టరీని బట్టి ఆరోగ్యపరంగా ఏ ఏ ప్రదేశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మెడికల్‌ స్పెషలిస్టులు సూచిస్తారు. ఉదాహరణకు మీరు వెళ్లే దేశంలో మలేరియాలాంటివి ఉన్నాయనుకోండి అలాంటి సందర్భాలలో మీకు మెడికేషన్స్‌ ఎంతవరకు అవసరం, ఎలాంటి మందులు తీసుకోవాలి వంటి విషయాలను మెడికల్‌ స్పెషలిస్ట్‌ తెలియజేస్తారు.  

మీ ఏరియాలోని ట్రావెల్‌ మెడికల్‌ స్పెషలిస్టు ఎవరో తెలుసుకోవడానికి ‘ది ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ ట్రావెల్‌ మెడిసెన్‌ (ఐఎ్‌సటిఎం) వారి వెబ్‌సైట్‌ www.istm.org  మీకు కావలసిన సమాచారాన్ని అందిస్తుంది. 

విదేశాలకు వెళ్లాల్సి వచ్చినపుడు ప్రయాణీకులు రకరకాల బాక్టీరియాల బారిన పడే అవకాశం ఉంది. వయసులో చిన్నవాళ్లు ట్రావెల్‌ డయేరియా, జెట్‌ లాగ్‌ వంటి సమస్యల  నుంచి తొందరగా తేరుకోగలుగుతారు కానీ సీనియర్‌ సిటిజన్స్‌కు  వీటి  నుంచి తేరుకోవడానికి ఎక్కువ టైమ్‌ పడుతుంది.  వయసులో పెద్దవాళ్లు కావడం వల్ల రోగనిరోధకశక్తి కూడా వీళ్లకు తక్కువగా ఉంటుంది. అందుకే  అన్ని విధాలా  ఆరోగ్యంగా ఉన్నప్పుడే పెద్దవాళ్లు విదేశీ ప్రయాణాలు పెట్టుకోవాలి.

ప్రయాణం చేస్తున్న వ్యక్తి ఆరోగ్యం అన్ని విధాల బాగుందని రూఢీ చేస్తూ వైద్యుడు జారీచేసిన సర్టిఫికేట్‌ కూడా చాలా అవసరం. ప్రయాణం చేస్తున్న వ్యక్తులు గుండెజబ్బులతో బాధపడేవారైనా, గర్భవతులైనా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఇలాంటివాళ్లు ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల ‘డీప్‌ వెయిన్‌ త్రోంబోసిస్‌’ (డివిటి)వస్తుంది. ఎక్కువ సేపు కదలకపోవడం వల్ల కాళ్లల్లో  బ్లడ్‌ క్లాట్స్‌ ఏర్పడి ‘డివిటి’ సమస్య తలెత్తుతుంది. అవి పగిలి ఊపిరితిత్తుల గుండా ప్రయాణించిందనుకోండి ఎంతో ప్రమాదకరమైన ‘పల్మనరీ ఎంబోలిజం’ (పిఇ)కి దారితీస్తుంది. అందుకే వేరే దేశానికి వెళ్లే ముందు ఇలాంటి వాళ్లు తప్పనిసరిగా వైద్యుని సంప్రదించాలి. 

 వివిధ దేశాల్లో వైద్య సేవలకు మెడికల్‌ ఇన్సూరెన్సులు ఉన్నాయి. అయినా కూడా మీరు వెళ్లే చోట మెడికల్‌ ఇన్సూరెన్స్‌ కింద వైద్యసేవలు అందుతాయో లేదో నిర్థారించుకోవాలి.

అలాగే విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ని వెంట తీసుకువెళ్తే మంచిది. అందులో యాస్పిరిన్‌, యాంటి డయేరియా మెడిసెన్‌, బ్యాండేజెస్‌ లాంటివి ఉంటాయి. ప్రయాణంలో అస్వస్థతకు గురైతే ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సు ఎంతగానో సహాయపడుతుంది.  

మీతో ప్రిస్ర్కిప్షన్స్‌ తీసుకుని వెళ్లేటప్పుడు డాక్టర్‌ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని కూడా తీసుకెళ్లాలి. అలాగే ఇన్సూరెన్సు కార్డును కూడా మర్చిపోకుండా తీసుకెళ్లాలి. వీటితోపాటు వాక్సినేషన్‌ సమాచారం, మీ డాక్టర్‌ చిరునామా, ఇతర వివరాలను మర్చిపోకుండా తీసుకెళ్లాలి.  మీ మెడికల్‌ హిస్టరీ కూడా అవసరం.  దాన్నిబట్టి కూడా ఆరోగ్యపరంగా మీరు  తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి.