పునాది బలంగా ఉంటే నల్లేరుపై నడకే..
ఐఈఎల్టీఎస్, టోఫెల్, జీఆర్ఈకి నాలుగైదు సిట్టింగ్‌లు
తొలి ప్రయత్నంలో విజయం కొందరికే..
ఇంటర్మీడియెట్ నుంచే శ్రద్ధ పెట్టాలంటున్న నిపుణులు
ఆంధ్రజ్యోతి, విజయవాడ : కలలు అందరూ కంటారు. వాటిని సాకారం చేసుకునేవారు కొందరే ఉంటారు. ఆశల పల్లకీలో ఊరేగే వారంతా ఆశయాలను చేరుకోలేరు. అనుకున్న సమయానికి అనుకున్న గమ్యానికి చేరుకున్నవారే నిజమైన విజేతలవుతారు. లక్ష్యం ఎంత కఠినంగా ఉన్నా.. గమ్యం ఎంత సుదూరంగా ఉన్నా అనుకున్న సమయానికి చేరుకుంటారు. ప్రస్తుతం యువతలో చాలామంది కల విదేశీ విద్య. అయితే, పునాది బలం లేకపోవడం.. మరేదో చిన్నచిన్న కారణాలతో సరైన స్కోర్ సాధించక చతికిలపడిపోతున్నారు. పట్టువీడని పట్టుదల ఉంటే విదేశాలకు చేరుకోవడం సులువేనంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని సూచనలు చేస్తున్నారు.
కృష్ణాజిల్లా నుంచి ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. విదేశాలకు వెళ్లాలన్న ఆసక్తి ఉన్నా.. చదివే శక్తి లేక ఆదిలోనే కూలబడిపోతున్నారు. సరైన స్కోర్ సాధించలేక ఉన్న ఊర్లోనే ఏదో ఉద్యోగం వెతుక్కుంటున్నారు. శ్రద్ధ లేకే ఈ పరీక్షలు రాసే ప్రతి వెయ్యి మందిలో 600 మందికి పైగా తొలి ప్రయత్నంలోనే స్కోర్ సాధించలేకపోతున్నారని లెక్కలు చెబుతున్నాయి.
ఎందుకిలా..
జీవితంలో పైకి రావాలని తపించే ప్రతి విద్యార్థి తొలి ప్రయత్నం విదేశీ చదువు. విదేశాల్లో చదివితే ఉన్నత కొలువులు, లక్షల్లో జీతాలు, లగ్జరీ జీవితాలు.. ఇవే నేటి యువత భవిష్యత్తు ప్రణాళికలు. అయితే, అనుకోగానే వెళ్లిపోవడానికి విదేశాల్లోని యూనివర్సిటీలకు సవాలక్ష నిబంధనలు ఉన్నాయి. వాటిని అనుసరించిన విద్యార్థులకే ఆయా పేరెన్నికగన్న విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం దొరుకుతుంది. వాటిలో ప్రథమాంకమే ఐఎల్ట్స్ (ఐఈఎల్టీఎస్), జీఆర్ఈ, టోఫెల్ (టీవోఈఎఫ్ఎల్) పరీక్షలు. ఆయా పరీక్షల్లో నచ్చిన దేశం నిర్దేశించిన స్కోర్‌ను దక్కించుకోగలిగితే చాలు.. ఇక విమానం ఎక్కేసినట్టే. కానీ, ప్రయత్నించిన ప్రతి ఒక్కరికీ ఈ స్కోర్ దక్కుతుందా? అనేది ప్రశ్నార్థకమే. కలల సాకారానికి ప్రయత్నించే విద్యార్థులు ఈ స్కోర్ కార్డును దక్కించుకోవడంలో వెనకబడిపోతున్నారు. ఇంగ్లీషులో పట్టు ఉంటే స్కోరేం సమస్య కాదని చాలామంది అంటున్నా, కావాల్సిన ముడి సరుకల్లా శ్రద్ధే అంటున్నారు నిపుణులు.
ఐఈఎల్టీఎస్ (ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్)
అమెరికాకు తప్ప ఇతర దేశాల్లో చదువుకోవాలనుకునే చాలామంది విద్యార్థులు ఐఈఎల్టీఎస్ ద్వారానే అడ్మిషన్లు పొందాలి. ఈ మధ్య కాలంలో యూఎస్ఏలో కూడా ఐఈఎల్టీఎస్ స్కోర్‌ను అనుమతించారు. ఈ పరీక్ష ఫీజు సుమారు రూ.13వేల వరకు ఉంటుంది. ఇందుకు బెజవాడ నగరంలోని చాలాచోట్ల ప్రత్యేక కోచింగ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. నెలపాటు ఉండే ఈ కోర్సులో సీడీలను అనుసరిస్తూ, నిరంతరం కృషిచేస్తే స్కోర్ సాధన కష్టమేమీ కాదు. రీడింగ్, స్పీకింగ్, రైటింగ్ , లిజర్నింగ్ వంటి నాలుగు దశల్లో విద్యార్థిలోని ఇంగ్లీషు పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. వాటిలో రీడింగ్, స్పీకింగ్, రైటింగ్‌కు ఒకే రోజున పరీక్ష నిర్వహిస్తుండగా, లిజర్నింగ్కు మాత్రం ప్రత్యేకంగా పరీక్ష పెడతారు. ఆయా 4 దశల్లో ఒక్కో దశలో 6 బ్యాండ్ స్కోర్‌ను సాధించగలిగితే విద్యార్థి దాదాపు అడ్మిషన్ దక్కించుకున్నట్టే. కొన్ని యూనివర్సిటీలు మాత్రం మరింత స్కోర్‌ను డిమాండ్ చేసే క్రమంలో విద్యార్థి కచ్చితంగా 6.5-8 స్కోర్ సాధించాల్సి ఉంటుంది.
జీఆర్ఈ (గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్)
యునైటెడ్ స్టేట్స్‌లోని ఏదేని యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం ఈ జీఆర్ఈ ప్రవేశ పరీక్ష తప్పనిసరి. ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్‌తో 1949లో ఈ జీఆర్ఈ నిర్వహిస్తున్నారు. ఎనాలిటికల్ రైటింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్ అనే అంశాలపై పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో బ్యాండ్లకు బదులుగా స్కోరును నెంబరులో పరిగణిస్తారు. 300 దాటి 325 వరకు మార్కులు సాధించి న విద్యార్థికి అక్కడ చదువుకోవడానికి మార్గాలు తెరుచుకున్నట్టే. గతంలో కేవలం ఈ పరీక్ష ద్వారానే విద్యార్థులకు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా వంటి కోర్సులకు అడ్మిషన్లు లభించేవి. ప్రస్తుతం ఐఈఎల్టీఎస్ ను కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
ఆంగ్లంపై పట్టు అవసరం
పునాది వేయాల్సిన పాఠశాల చదువు తెలుగు మీడియంలో సాగడం, శ్రద్ధ పెట్టాల్సిన కళాశాల సమయంలో ఇంగ్లీషుపై పట్టు సాధించలేకపోవడం వంటి పలు సమస్యల కారణంగా విద్యార్థులు అవసరమైన స్కోర్‌ను సాధించడంలో వెనుకబడుతున్నారు. నిజానికి ఇంగ్లీష్‌పై పట్టులేని వారికి ఈ పరీక్షలు ఓ అగ్ని పరీక్షే. కానీ, శ్రద్ధాసక్తులతో కృషిచేస్తే రాకపోవడానికి అదేమీ రాకెట్ సైన్స్ కాదంటున్నారు అధ్యాపకులు. ఆ కృషి లేకపోవడంతో పాటు ఇతరుల్ని చూసి భయపడి, తనను తాను తక్కువగా అంచనా వేసుకునే విద్యార్థుల్లో 90 శాతం మంది తొలి ప్రయత్నంలో విఫలమవుతున్నారు. అలా విఫలమైన వారిలో 58 శాతం తిరిగి రెండో ప్రయత్నానికి ముందుకురావడంలేదు. చివరికి అందుబాటులో దొరికిన ఉద్యోగంతో సరిపెట్టుకుని పదేళ్ల తర్వాత బాధపడుతుంటారు. చాలా కాలేజీల్లో ఇంగ్లీష్‌లో మాట్లాడటం అనేది సిస్టమాటిక్‌గా లేదు. తద్వారా ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు చేతికొచ్చినా కమ్యూనికేషన్స్‌లో మాత్రం వెనుకంజ వేస్తున్నారు. తోటి విద్యార్థులతో పాటు అధ్యాపకులు ఇతరులతో వీలైనంతగా ఇంగ్లీషులోనే కమ్యూనికేట్ చేయడం అనేది ఈ తరహా పరీక్షలకు సిద్ధపడే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ వార్తలు, సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడం కూడా ఈ కోవలోకే వస్తుంది.
మధ్యలోనే ఆపేశాను
గతంలో ఐఈఎల్‌టీఎస్‌కు ప్రయత్నించాను. కానీ, సమయం కుదరక శ్రద్ధ పెట్టలేకపోయాను. తరువాత బ్యాంక్ జాబ్ రావడంతో పూర్తిగా ఆ ప్రయత్నం ఆపేసుకున్నాను. కానీ, గట్టిగా ప్రయత్నించి ఉంటే రెండోసారైనా విదేశాలకు వెళ్లేవాడినేమో..
- జి.ప్రవీణ్
నమ్మకంతో..
మొదటి సారి ఐఈఎల్టీఎస్కి ప్రిపేర్ అవుతున్నాను. కచ్చితంగా 7 బాండ్ తెచ్చుకోగలనన్న నమ్మకం ఉంది. విదేశాల్లో స్థిరపడాలనేది నా కల. ఆ దిశగానే ప్రయత్నిస్తున్నాను.
- బి.సాయి ప్రశాంత్, ఎంబీఏ విద్యార్థి