విద్యార్థులు ఎక్కువగా ఉండే నగరాలివే

 యూఎస్‌లో చదివేందుకు ప్రపంచ దేశాల విద్యార్థులు ఆసక్తి చూపుతుంటారు. విద్యార్థుల వలస యూఎస్‌కు భారీగానే ఉంటుంది. అందుకే అక్కడ రాష్ట్రాల్లో కొన్ని నగరాలు విద్యార్థులకు ఆవాసాలుగా మారాయి. ఏకంగా వాటిని విద్యార్థుల నగరాలు అని పిలుస్తుంటారు. విద్యార్థుల వల్ల అభివృద్ధి చెందిన నగరాలు కూడా చాలానే ఉన్నాయి. 

 
నిద్రపోని నగరం అని న్యూయార్క్ సిటీకి పేరుంది.. క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని కూడా దీన్ని పిలుస్తుంటారు. ఆకాశహర్మ్యాలు, కళ్లు జిగేల్‌మనిపించే కాంతివంతమైన భవనాలు, వినసొంపైన సంగీతంతో మైమరిచిపోయే పబ్‌లు.. ఎప్పుడు చూసినా రోడ్లపై జనం... మొత్తానికి న్యూయార్క్ సిటీ అంతా సందడి సందడిగ ఉంటుంది. దీంట్లో సగం సందడంతా స్టూడెంట్స్ వల్లే అంటే ఆశ్చర్యపడనక్కర్లేదు. 

న్యూయార్క్ సిటీలాగానే బోస్టన్ సిటీ కూడా విద్యార్థులతో సందడిగా ఉంటుంది. టాప్ యూనివర్శిటీలు, వాటి కార్యాలయాలు ఎన్నో బోస్టన్ సిటీలో ఉన్నాయి. కేంబ్రిడ్జి, ఎమ్‌ఐటీ, హార్వార్డ్ వంటి టాప్ ర్యాకింగ్ యూనివర్శిటీలు ఈ నగరంలో ఉన్నాయి. 

ఆర్థికంగానూ, జనాభా పరంగానూ న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ నగరాల తర్వాతి స్థానం చికాగోదే. ఇక్కడ భిన్న సంస్కృతులు మిళితమై ఉంటాయి. ఇక్కడ ఉన్న యూనివర్శిటీ ఆఫ్ చికాగో, నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీలకు మంచి పేరు ఉంది. ఈ నగరంలో ఎటు చూసినా గాజు భవంతులు దర్శనమిస్తాయి. 

శాన్‌ఫ్రాన్సిస్‌కో ద బే ఏరియా కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరం. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్కిలే వంటి టాప్ ర్యాంకింగ్ యూనివర్శిటీలు అక్కడ ఉన్నాయి. 

ఈ నగరాలతో పాటు లాస్ ఏంజిల్స్‌లో కూడా విద్యార్థుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ వంటి టాప్ యూనివర్శిటీలు కూడా ఉన్నాయి. ఈ నగరాలు విద్యార్థులకు ఆవాసాలుగా మారిపోయాయి. ఈ ప్రాంతాల్లో తెలుగువారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు.