అమెరికా.. అమీర్‌పేట

కాలేజీల్లో ఔట్‌ డేటెడ్‌ సిలబస్‌.. ఇక్కడంతా అప్‌ టు డేట్‌

అతి తక్కువగా ఫీజులు.. క్యూలు కడుతున్న విద్యార్థులు
అ అంటే అమ్మ. ఐటీలో జాబ్‌ కొట్టాలనుకునే యువతకు అ అంటే అమీర్‌పేట కూడా!
సి, సి++, జావా, ఒరాకిల్‌, శాప్‌, డాట్‌నెట్‌, టెస్టింగ్‌ టూల్స్‌.. ఇవన్నీ అవుట్‌డేటెడ్‌
కాదుగానీ.. పురానాజమానా!!
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, మొబైల్‌ అప్లికేషన్స్‌.. ఇదీ లేటెస్ట్‌ ట్రెండ్‌!
 
హైదరాబాద్‌:కొత్త కొలువు రావాలన్నా.. చేస్తున్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలన్నా.. ట్రెండ్‌ ఫాలో అవ్వాలి. అలా అవ్వాలంటే.. అమీర్‌పేట వెళ్లాలి!! హైదరాబాద్‌లో ఆఫీసులన్నీ ఏ 9-10 గంటలకో తెరుచుకుంటాయిగానీ.. అమీర్‌పేట మాత్రం పొద్దున్నే ఆరు గంటలకు నిద్ర లేచి ఒళ్లు విరుచుకుంటుంది. ఐటీ శిక్షణకోసం వచ్చే యువతీయువకులతో కళకళలాడిపోతుంటుంది! మైత్రీవనం, ఆదిత్య ఎన్‌క్లేవ్‌ మధ్యలో ఉన్న రోడ్డులో చిన్నచిన్న హోటళ్లు.. చాయ్‌ బడ్డీలూ జోరుగా బిజినెస్‌ చేస్తుంటాయి!! కమ్మటి చాయ్‌ వాసనలు గుమ్మెత్తిస్తుంటాయి. వేసిన ఇడ్లీ వాయలు వేసినట్టే అయిపోతుంటాయి! గబగబా టిఫిన్‌ తినేసి ఆదరాబాదరాగా చేతులు కడిగేసుకుని ‘పైసల్‌ మళ్లొచ్చి ఇస్తాలే కాకా.. క్లాసుకు టైమైతుంది’ అంటూ పరిగెత్తే కుర్రాళ్లు.. రంగురంగుల్లో స్పైరల్‌ బౌండ్‌ చేసిన కోర్సు పుస్తకాల్ని గుండెలకు హత్తుకుని నింపాదిగా అడుగులేసే అమ్మాయిలు.. అ సందడే వేరు! తల పైకెత్తి చుట్టూ ఓ 360 డిగ్రీల లుక్కు వేసుకుంటే.. జావా కోచింగ్‌ సెంటర్‌ అనో... క్లౌడ్‌ టెక్నాలజీలో శిక్షణనిస్తామనో చెప్పే బోర్డులే అన్ని వైపులా కనిపిస్తాయి. తల ఓ 45 డిగ్రీలు దించి కిందికి చూస్తే.. రోడ్డంతా రంగురంగుల పాంప్లెట్లు. వాటిలోనూ అదే విషయం ఉంటుంది!!
 
ఒకటా రెండా.. 500కి పైగా ఐటీ శిక్షణ కేంద్రాలు మరి! దేశంలోనే అతిపెద్ద శిక్షణ కేంద్రాల సముదాయాల్లో ఒకటి అది!! అందుకే.. తెలుగు రాష్ట్రాల యువతే కాక, దేశ రాజధాని ఢిల్లీ సహా దేశం నలుమూలల నుంచి బోలెడన్ని ఐటీ కలలతో ‘అమెరికా వయా అమీర్‌పేట్‌’ వెళ్దామనే ఆశతో ఇక్కడ ల్యాండయిపోతుంటారు. ఫలితంగా.. తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలంత సందడి అక్కడ ఏడాదిలో దాదాపుగా 365 రోజులూ కనిపిస్తుంది! ‘ఇప్పుడేదో ఐటీ రంగంలో సంక్షోభం.. ఉద్యోగాలు తీసేస్తున్నారు కదా’ .. అనుకోవద్దు.
ఇంతటి సంక్షోభంలోనూ అమీర్‌పేట ఐటీ కేంద్రాలకు వస్తున్న వాళ్ల సంఖ్య తగ్గలేదు. కారణం.. ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బోధిస్తున్న విద్యలో నాణ్యత లోపం. ఇటీవలే ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం ఐదింట మూడు వంతుల ఇంజనీరింగ్‌ పట్టభద్రులు ఉద్యోగాలకు పనికిరారు. దేశవ్యాప్తంగా ఉన్న 3300 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సగానికి పైగా అరకొర వసతులతో నడిచేవే. ఆయా కళాశాలల్లో ప్రతి 10 మంది అధ్యాపకుల్లో కేవలం ముగ్గురు మాత్రమే బోధన సామర్థ్యం ఉన్నవారు. ఈ నేపథ్యంలో.. పాతబడిపోయిన కోర్సులనే ఇప్పటికీ నేర్పిస్తూ ఇంజనీరింగ్‌ కాలేజీలు విఫలమవుతున్న చోట.. ‘ఎప్పటికప్పుడు మార్కెట్‌ ఓరియెంటెడ్‌ కొత్త కోర్సుల’ను అందుబాటులోకి తేవడమే అమీర్‌పేట ఐటీ శిక్షణ కేంద్రాల సక్సెస్‌కి కారణం.
 
పురుడు పోసుకుందిక్కడే!

అమీర్‌పేట కేంద్రంగానే హైదరాబాద్‌ ఐటీ రంగం పురుడు పోసుకుంది. ఐటీ శిక్షణ సంస్థలకు అనుమతివ్వాల్సిన ఎస్టీపీఐ (సాప్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా) ప్రాంతీయ కార్యాలయం మైత్రీవనంలోనే ఉండేది. చిన్నా, పెద్దా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఇక్కడ ప్రారంభమైనవే! ఆ తర్వాతే హైటెక్‌ సిటీకి వలస వెళ్లాయి. ఎస్టీపీఐ ఉండడం ఒక్కటే కాదు.. అప్పట్లో ఈ ప్రాంతంలో అద్దెలు తక్కువ ఉండేవి. చుట్టూ నివాస ప్రాంతాలు కాబట్టి వేరే ఊళ్ల నుంచి వచ్చిన విద్యార్థులు సైతం ఉండి చదువుకునేందుకు వీలుగా ఉండేది. అందుకే ఐటీ శిక్షణ కేంద్రాలన్నీ ఎస్టీపీఐ చుట్టూ వేళ్లూనుకున్నాయి. ఆ సంఖ్య పెరుగుతుండగానే.. ‘ఇంతింతై.. వటుడింతై’ అన్నట్లుగా హైదరాబాద్‌ ఐటీ రంగం దేశంలోనే రెండో స్థానానికి చేరుకుంది. 

అదే ఇప్పుడు అమీర్‌పేటకు మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చేందుకు దోహదపడుతోంది. హైదరాబాద్‌కు చేరుకుంటే.. అమీర్‌పేటలో కోచింగ్‌ తీసుకుని హైటెక్‌ సిటీలో ఉద్యోగం సాధించవచ్చనే ఆలోచన చాలా మంది విద్యార్థులది. కొత్త టెక్నాలజీ్‌సలో అనుభవం ఉన్న ఫేకల్టీ.. కాలేజీల్లో కన్నా అమీర్‌పేట శిక్షణ కేంద్రాల్లోనే ఎక్కువగా ఉంటున్నారని అక్కడ కోచింగ్‌ తీసుకుంటున్న విద్యార్థులు చెబుతున్నారు. ఒకవేళ కొత్త టెక్నాలజీలను కొన్ని కాలేజీల్లో చెబుతున్నా.. అక్కడ ఫీజు ఏ రూ.50 వేలో ఉంటే, అదే కోర్సును అమీర్‌పేటలో రూ.25 వేలకే నేర్చేసుకోవచ్చు! ఎక్కువ మంది విద్యార్థులు ఉండడం వల్ల తక్కువ ఫీజుకే చెప్పడం నిర్వాహకులకు సాధ్యమవుతోంది. ఇది ఇలా కొనసాగినన్నాళ్లూ.. అమీర్‌పేట ఐటీ మూడు పువ్వులూ ఆరు కాయల చందమే!!

 
పాతవాళ్లకే సమస్య..
కొత్త నీరు వచ్చి పాత నీటిని కొట్టేస్తుంది. ఇది సహజం. ఆ మాటకొస్తే.. రూలు! ప్రకృతికే కాదు ఏ రంగానికైనా వర్తించే నిత్యసత్యం!! ఐటీ రంగం అందుకు మినహాయింపేమీ కాదు. ఫలితమే ఉద్యోగాల సంక్షోభం. కానీ.. ఈ క్రైసి్‌సలో ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నది సీనియర్‌ స్థాయి ఉద్యోగులు, అంతంతమాత్రం నైపుణ్యాలతో.. ఇన్నాళ్లూ నడిచిన బూమ్‌లో కొట్టుకొచ్చేసినవారు. సత్తా ఉన్న ఉద్యోగిని ఏ కంపెనీ వదులుకోవట్లేదు. అలాగే.. కొత్త కొత్త టెక్నాలజీలు నేర్చుకుని సత్తా చూపడానికి సిద్ధంగా ఉన్నవారికి రెడ్‌కార్పెట్‌ స్వాగతం పలుకుతున్నాయి. ఆ కొత్త టెక్నాలజీల కోసమే అంతా అమీర్‌పేట వైపు పరుగెడుతున్నారు. పాత టెకీలు కొత్త స్కిల్స్‌తో తమనుతాము సానబెట్టుకునేందుకు.. కొత్త కుర్రాళ్లు, అమ్మాయిలు పాత వాళ్లతో పోటీ పడేందుకు అమీర్‌పేట ఐటీ శిక్షణ కేంద్రాలే వేదికగా నిలుస్తున్నాయి. అందుకే.. ఇంత సంక్షోభంలోనూ అక్కడ సందడి మాత్రం తగ్గట్లేదు సరికదా పెరుగుతోంది. ఐటీ శిక్షణలో అమీర్‌పేట ఖ్యాతి దశదిశలా విస్తరిస్తోంది.
 
తొలగింపు భయంతోనే..
ఐటీ కంపెనీల్లో ఉద్వాసనల నేపథ్యంలో చాలా మంది పాత టెకీలు తమనుతాము అప్‌డేట్‌ చేసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. ఇంజనీరింగ్‌ చదువుతున్న వారితో పాటు పూర్తయిన వారిలో చాలామంది అమీర్‌పేటలో ఏదో ఒక కోర్సులో చేరి శిక్షణ తీసుకుంటుంటారు. కొన్ని కళాశాలల్లో ఫేకల్టీ సరిగ్గా చెప్పకపోవడమే ఇందుకు కారణం. రియల్‌ టైం ఫేకల్టీలు ఇక్కడ చాలా మందే ఉన్నారు. ప్యూచర్‌ టెక్నాలజీస్‌ నేర్చుకోవాలంటే ఇక్కడి కోచింగ్‌ సెంటర్లలో ఎక్కడో ఒకచోట అందుబాటులో ఉంటాయి. కాబట్టి అమీర్‌పేట ఐటీ శిక్షణ పరంగా ఎప్పటికీ బిజీగానే ఉంటుంది.
-ఎన్‌.రామకోటేశ్వరరావు, పీర్స్‌ టెక్నాలజీస్‌, హెడ్‌ ఆపరేషన్స్‌,
 
తాజా నైపుణ్యాలతో కొలువు పక్కా
ఎంత సంక్షోభం ఉన్నా.. సరికొత్త నైపుణ్యాలున్నవారికి ఇప్పటికీ రెడ్‌కార్పెటే. అందునా తాజా టెక్నాలజీలపై పట్టున్న ప్రెషర్స్‌కి ఎప్పటికీ డిమాండు ఉంటుంది. ఆ టెక్నాలజీలన్నిటినీ ఇక్కడ తక్కువ ధరకే నేర్చుకోవచ్చు. అందుకే ఉత్తర్‌ప్రదేశ్‌లోని బనారస్‌ నుంచి ఐదు మంది స్నేహితులం కలిసి కోచింగ్‌ తీసుకోవడానికి హైదరాబాద్‌ వచ్చాం. ఇక్కడి హాస్టల్స్‌, ఆహారం అన్నీ మాకు బాగా నచ్చాయి. 
-శరత్‌, బి.టెక్‌ విద్యార్థి
 
ఉపసంహారం: ట్రంపులు.. గింపులు.. మబ్బుల్లాంటోళ్లు. వీసాలపై ఆంక్షలంటూ వస్తారు.. పదవీకాలం పూర్తవగానే పోతారు. కానీ, అమీర్‌పేట ఐటీ ఆకాశం లాంటిది. ఇలాంటి ఒడుదొడుకులనెన్నిటినో తట్టుకుని నిలబడింది. అది శాశ్వతం!!