ఆ ఊరెళితే డబ్బులిస్తారు!

అమెరికా సంపన్న దేశమని అందరికీ తెలుసు. ఎంత సంపన్నదేశమైనా అక్కడికి వెళ్ళాలంటే వీసాకి డబ్బు చెల్లించాల్సిందే.. వెళ్ళాక విపరీతంగా ఖర్చు చేయాల్సిందే. కానీ, అమెరికాలోని ఓ రాష్ట్రం మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. ఆ రాష్ట్రానికి వెళితే ఉండడానికి ఇల్లు, చేయడానికి ఉద్యోగం అన్నీ ఉచితమే. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.
 
  ఏ ఊరైనా వెళితే ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే పలకరిస్తారు లేదంటే ఓ పూట ఆతిథ్యం ఇస్తారు. కానీ, ఎవరైనా వచ్చిన అతిథులకు డబ్బులిస్తారా? కానీ అక్కడ ఇస్తారు. అమెరికాలోని వెర్మాంట్‌ రాష్ట్రంలోని ఏ ఊరికెళ్ళి స్థిరపడాలనుకున్నా డబ్బులు ఎదురిచ్చి మరీ ఆహ్వానిస్తారు. అదీ ఏ వంద రూపాయలో, వేయి రూపాయలో కాదండీ.. ఏకంగా ఇంచుమించు ఏడు లక్షలు. ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ నిజమండీ. ఇదంతా కూడా ఆ ఊర్లో జనాభా పెంచేందుకు అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం.
 
ఎందుకిలా!
మనదేశంతోపాటే చాలా దేశాల్లో జనాభా పెరుగుదలపై రోజురోజుకీ భయం పెరిగిపోతుంది. కానీ, అమెరికాలో జనసాంద్రత చాలా తక్కువ. ముఖ్యంగా వెర్మాంట్ రాష్ట్రంలో జనాభా క్రమక్రమంగా తగ్గిపోతుంది. అంతేకాకుండా అక్కడి జనాభాలో వయస్సు మళ్ళినవారే ఎక్కువ. యువతరం లేకపోవడంతో అక్కడ దాదాపు పదహారు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎలాగైనా రాష్ట్రంలో జనాభా సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో ఆ రాష్ట్రప్రభుత్వం ఈ వినూత్న పథకాన్ని రూపొందించింది.
 
అన్ని సౌకర్యాలు ఉచితమే!
వెర్మాంట్‌లో ఎన్నో పరిశ్రమలున్నాయి. ముఖ్యంగా ఐటీ పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఈ పరిశ్రమలు నిరాటకంగా కొనసాగాలంటే అక్కడ ఉద్యోగాల్లో చేరేందుకు యువతని ఆకర్షించాలి. ఈ ప్రయత్నంలోనే వెర్మాంట్‌లో ఉండేందుకు సిద్ధపడే వ్యక్తులకు ఉద్యోగంతోపాటు పదివేల డాలర్లు క్యాష్‌ ఇవ్వాలని అక్కడి అధికారులు నిర్ణయించుకున్నారు. ఇలా మూడేళ్లపాటు ఏడాదికి పదివేల డాలర్ల చొప్పున ఇస్తారు. ఈ డబ్బు ఇల్లు మారేందుకు, ల్యాప్‌టాప్‌ కొనుగోలుకు, ఇంటర్‌నెట్‌ సదుపాయం వగైరా అవసరాలకోసం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఉండేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన ఇంటిని కూడా వారే సూచిస్తారు. ఇష్టమైతే అందులో ఉండవచ్చు. లేకపోతే వేరే దగ్గర కూడా ఉండే సదుపాయాన్ని కలిగిస్తారు. అయితే ఈ ఊర్లో ఉండి ఇక్కడ ఉద్యోగంతోపాటు వేరే పట్టణాల్లోని కంపెనీల్లో కూడా ఇంటి నుంచే పని(వర్క్‌ ఫ్రం హోం) చేసేందుకు అన్ని సౌకర్యాలను కలిగిస్తారు.
 
మొదటి వందమందికే!
పట్టణ జనాభా పెంచుకునేందుకు వెర్మాంట్‌ రాష్ట్రం ప్రవేశపెడుతున్న ఈ పథకంలో ఓ మెలిక కూడా ఉందండోయ్‌! అదేంటంటే ఈ పథకం అక్కడ స్థిరపడేందుకు వెళ్ళే వారందరికీ కాదట. కేవలం మొదటి వందమంది మాత్రమే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేందుకు అర్హులట. అటు తర్వాత ఏడాదికి ఇరవైమంది చొప్పున ఈ పథకానికి ఎంపిక చేసి డబ్బు అందజేస్తుందట అక్కడి ప్రభుత్వం.
 
స్టే టూ వీకెండ్స్‌!
వెర్మాంట్‌ ప్రస్తుత జనాభా కేవలం ఆరు లక్షల పైచిలుకు. ఈ రాష్ట్రంలో కోటిమందికిపైగా జీవించేందుకు వెసులుబాటు ఉంది. అందుకే రాష్ట్రజనాభాను దాదాపు కోటి ముప్పై లక్షలవరకు పెంచాలనే ఉద్దేశంతో ఇప్పటికే ‘స్టే టూ వీకెండ్స్‌’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చుట్టుప్రక్కల పట్టణాల్లోని ప్రజలు ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ మధ్య వారాంతాల్లో ఇక్కడకు పర్యాటకుల్లా వచ్చి కంపెనీలతో చర్చలు సాగించవచ్చు.
 
యువతలో ఆసక్తి
గ్రీన్‌ మౌంటెయిండ్‌ స్టేట్‌గా పేరొందిన వెర్మాంట్‌ రాష్ట్రం ప్రకృతి అందాలకు నెలవు. చుట్టూ పచ్చదనంతో నిండిన కొండలు, గలగలపారే సెలయేర్లు, సరస్సులతో పర్యాటకుల్ని ఆకర్షించే ప్రదేశాలు ఇక్కడి ప్రత్యేకతలు. పెరుగుతున్న జనాభాతోపాటు రణగొణ ధ్వనులు, ఊపిరాడనివ్వని కాలుష్యంతో మానసిక ప్రశాంతతకి, శారీరక ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతోన్న క్రమంలో పచ్చని పరిసరాలతో ఆహ్లాదంగా అలరిస్తోన్న వెర్మాంట్‌లో స్థిరపడేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఉన్నత చదువులు చదివినా సరైన ఉద్యోగాలు లభించక అవస్థలు పడుతున్న చాలామంది ఇంజనీర్లు, పోస్టుగ్రాడ్యుయేట్లు వెర్మాంట్‌లో స్థిరపడేందుకు మొగ్గుచూపుతున్నారు. అక్కడ స్థిరపడేందుకు అమెరికావాసులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉద్యోగార్థులు వేచిచూస్తున్నారు. రాష్ట్రంలో జనాభాపెరగడంతోపాటు పారిశ్రామికంగానూ ఎంతో అభివృద్ధి సాధించవచ్చనే అభిప్రాయంతో ప్రవేశపెట్టే ఈ పథకం ఎలా ఉంటుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు వేచిచూడక తప్పదు.