నార్వే వెళ్తున్నారా.. పెళ్లి గురించి అడగొద్దు

యూరప్‌లోని దేశాలన్నింటిలోను నార్వేకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అక్కడి ప్రజలు కూడా ప్రత్యేకంగా ఉంటారు. ఇతరులతో ఎక్కువ కలవరు. కానీ పర్యాటకులకు ఇచ్చే ఆతిథ్యంలో మాత్రం ఏ మాత్రం పొరపాటు చేయరు. అలాంటి నార్వే గురించి విశేషాలు తెలుసుకుందామా..?

సూట్‌కేసులు జాగ్రత్త..
నార్వేలోని అనేక పట్టణాలలో ఫుట్‌పాత్‌లు ఎగుడుదిగుడుగా ఉంటాయి. అందువల్ల నార్వేకు వెళ్లే పర్యాటకులు పెద్ద పెద్ద సూట్‌కేసులను పట్టుకువెళ్తే ఇబ్బంది పడతారు. చేతితో మోసుకువెళ్లగలిగిన సూట్‌కేసులు పట్టుకువెళ్తే మంచిది. ఇక నార్వే సమాజం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నార్వేలో లివింగ్‌ ఇన్‌ రిలేషన్‌షి్‌పలకు ఇచ్చిన ప్రాధాన్యం పెళ్లికి ఇవ్వరు. కొందరైతే ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత కూడా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అందువల్ల నార్వేజియన్లను పెళ్లికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు అడగకూడదు. ఇక ఆసియా దేశాల మాదిరిగా నార్వేజియన్లు ఇతరులను ముట్టుకోవటానికి ఇష్టపడరు. కొత్తవారు ఎదురైతే కేవలం కరచాలనంతో సరిపెట్టేస్తారు. అందువల్ల స్థానికులతో భుజాల మీద చేతులు వేసి మాట్లాడటం వంటి చర్యలు చేయకుండా ఉంటే మంచిది. లేకపోతే వారు ఆ చర్యలను అవమానకరంగా భావించే అవకాశముంది.
 
టిప్పులెక్కువుండవు..
నార్వేలో ఎక్కువగా టిప్పులు ఇవ్వాల్సిన అవసరముండదు. బిల్లులోనే సర్వీ సు ట్యాక్స్‌ కూడా చేరుస్తారు. సర్వీసు చాలా బావుందని భావిస్తే బిల్లులో పదిశాతాన్ని టిప్పుగా ఇస్తే చాలు. నార్వేలో ధరలన్నీ ముందుగానే నిర్ణయించి ట్యా గ్‌ల రూపంలో పెడతారు. కాబట్టి అక్కడ బేరాలు ఆడొద్దు.
- స్పెషల్‌ డెస్క్‌