వాళ్లకు అదే స్వర్గం

అదో చిన్న ఐలాండ్‌. కరెంటు లేదు. మూడు వారాల కొకసారి తాగు నీరొస్తుంది. మరో చోటుకెళ్లాలంటే పడవ ఎక్కాల్సిందే! ఇన్ని సమస్యలున్నా అక్కడి ప్రజలు ఆ దీవిని స్వర్గంలా భావిస్తుంటారు. వాళ్లు ఆ ఐలాండ్‌లో ఎందుకు ఉంటున్నారు? అది ఎక్కడుంది?

కొలంబియాలోని సాన్‌ బెర్నడోకు సమీపంలో శాంతాక్రజ్‌ డెల్‌ ఐసోలెట్‌ అని చిన్న ఐలాండ్‌ ఉంటుంది. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ఐలాండ్‌లో 1200 మంది జనాభా నివసిస్తున్నారు. ఈ ఐలాండ్‌లో తాగు నీరు లేదు. డ్రైనైజీ వ్యవస్థ లేదు. విద్యుత్‌ లేదు. జనరేటర్‌ సహాయంతో రోజూ ఐదు గంటలు విద్యుత్‌ సరఫరా అవుతుంది. మూడు వారాలకొకసారి కొలంబియా నేవీ మంచి నీటిని తెచ్చి ఇచ్చి వెళుతుంటారు.
 150 ఏళ్ల క్రితం కొంత మంది జాలరులు చేపలు పట్టడానికి ఈ ప్రాంతానికి వచ్చారట. ఇంటికి వెళ్లడం ఆలస్యం కావడంతో ఆ రాత్రి అక్కడే పడుకున్నారట. వాతావరణం ప్రశాంతంగా ఉండటం, దోమలు లేకపోవడం, మంచి నిద్ర పట్టడంతో అక్కడే శాశ్వతంగా షెల్టర్‌ ఏర్పాటు చేసుకున్నారట. ప్రస్తుతం ఈ ఐలాండ్‌లో 90 ఇళ్లున్నాయి. షాపులు, రెస్టారెంట్లు, స్కూల్‌ కూడా ఉన్నాయి.
 ఇక్కడి ప్రజల వృత్తి చేపలు పట్టడం. కొంతమంది మాత్రం సమీపంలోని ఐలాండ్‌లలో ఉన్న హోటల్స్‌, రిసార్టుల్లో పనిచేస్తున్నారు. ఈ ఐలాండ్‌ను చూడటానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువే.
 ఈ ఐలాండ్‌లో నేరాలు అసలు లేవు. ఇంటికి ఎప్పుడూ లాక్‌ చేయరు. పిల్లలు చాలా డిసిప్లిన్‌గా ఉంటారు. స్కూల్లో అల్లరి చేయకుండా టీచర్‌ చెప్పినట్టు నడుచుకుంటారు. ప్రతిరోజూ సాయంత్రం 7 గంటలకు జనరేటర్‌ ఆన్‌ చేస్తారు. రాత్రి 12 గంటల వరకు కరెంట్‌ సరఫరా ఉంటుంది. ఈ సమయంలో టీవీ చూస్తారు. సదుపాయాలు లేకపోయినా ప్రశాంత వాతావరణం ఉండటంతో ఐలాండ్‌ను స్వర్గంలా భావిస్తుంటారు.