మతం.. కాకూడదు భారం!

వివిధ సంస్కృతుల దేశంలో చదవడం మేలే..

ఇతర మతాలవారిపై అనుచిత వ్యాఖ్యలొద్దు
మతపర అంశాలపై చర్చించడం మంచిదికాదు
పేయింగ్‌ గెస్ట్‌ అవకాశం వస్తే వదులుకోవద్దు
అమెరికా విద్యార్థులకు నిపుణుల సూచనలు
 
స్వదేశంలో ఉన్నప్పుడు చాలా మంది జీవితాల్లో మతం అనేది అంతర్లీనంగా ఉంటుంది. కానీ, చదువు కోసమో, ఉద్యోగం కోసమో విదేశాలకు వెళ్లినప్పుడు ఇతర మతాచారాలు, సంస్కృతులను గమనిస్తారు. వివిధ సంస్కృతుల్లోని గొప్పతనాన్ని తెలుసుకునేందుకు మతం ఓ మంచి మార్గదర్శి. అనేక మత సంస్కృతులున్న దేశాల్లో చదువుకోవడం వల్ల విద్యార్థులకు మేలే జరుగుతుంది. అమెరికానే తీసుకుంటే అది అనేక మతాల సమ్మిళిత దేశం. అక్కడ చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు వివిధ మతాల సహాధ్యాయులు పరిచయమవుతారు.
 
అక్కడ ప్రధానమతం క్రైస్తవమే అయినా, 80 శాతం మంది క్రిస్టియానిటీనే పాటించినా అక్కడ మత స్వేచ్ఛ ఉంది. కాబట్టి అక్కడి పౌరులు ఏ మతాన్నైనా స్వీకరించే స్వేచ్ఛ ఉంది. కాబట్టి క్రైస్తవులతో పాటు హిందువులు, సిక్కులు, బౌద్ధులు, యూదులు తదితర మతాల వారిని మనం చూడొచ్చు. వాటికి తోడు ఆ దేశంలో సైన్సాలజీ అనే సరికొత్త మతం వచ్చి చేరింది. అయితే, తమకు నచ్చిన మతాన్ని అనుసరించే హక్కున్నా.. కొన్నిరకాల మతాచారాలను అమెరికా చట్టాలు అంగీకరించవు. భజనలు చేయడం, అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో మతకార్యక్రమాలను నిర్వహించడం చట్టవిరుద్ధం.
 
అపార్ట్‌మెంట్‌లలో చుట్టుపక్కల ఉన్న వారికి ఇబ్బంది కలిగించేలా గణగణ గంటలు మోగించడం, గట్టిగా మంత్రోచ్ఛారణ చేయడం వంటి చర్యలు మంచిదికాదు. అంతేకాదు, బహుభార్యత్వం, బాల్యవివాహాలూ అమెరికాలో నిషిద్ధం. అమెరికాలోని చాలా పట్టణాల్లో హిందూ దేవాలయాలుంటాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు మత సంఘాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తాయి. అయితే, అవన్నీ కూడా విశ్వవిద్యాలయ చట్టాల పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఒరియెంటేషన్‌ సమయంలోనే ఈ విషయాలన్నింటినీ స్పష్టంగా చెబుతారు. విద్యార్థులు కూడా ఇలాంటి సున్నితమైన అంశాలపై కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది.

విదేశీ... చదువులు

యూనివర్సిటీల్లో ఇతర విద్యార్థులపై మతపరమైన వ్యాఖ్యలు చేయొద్దు. దీనివల్ల ఆ విద్యార్థులకు జరిగే హానికన్నా వ్యాఖ్యలు చేసే వారి సంకుచిత మనస్తత్వం అందరికీ తెలుస్తుంది.

మతపర అంశాలపై చర్చలకు దిగడం మంచిది కాదు. ఒకవేళ చర్చించాల్సిన అవసరమే వస్తే మతాచారాలపై పరస్పర విమర్శలు చేయడం కన్నా మతం ఏం చెబుతోందన్న విషయాల గురించి మాట్లాడడం మంచిది.

ఇతర మతాలకు చెందిన ప్రార్థనామందిరాలను సందర్శించడం వల్ల వారు పాటించే ఆచారాలు తెలుస్తాయి. కొన్ని వర్సిటీల్లో చర్చిలు ఉంటాయి. కాబట్టి ఆదివారం తీరిక చేసుకుని అక్కడకు వెళితే వారి ఆచార వ్యవహారాలు తెలుస్తాయి.

ఇతర మతాల పండుగల్లో చురుగ్గా పాల్గొంటే వారి మతంలోని విలువలు తెలుస్తాయి.

కొన్నికొన్నిసార్లు ఇతర మతాలవారి ఇంట్లో పేయింగ్‌ గెస్ట్‌గా ఉండాల్సివచ్చే అవకాశం రావొచ్చు. అలాంటి అవకాశాలను చేజార్చుకోవద్దు. వారి ఇళ్లలో ఉండడం వల్ల అనేక కొత్త విషయాలు తెలుస్తాయి.
- స్పెషల్‌ డెస్క్‌