ఆ ఒక్క కారణంతో అమెరికా వీసా ఇవ్వకపోవచ్చు..!

అమెరికాలో చదువుకునేందుకు ఏటా వెళ్ళే విద్యార్థుల సంఖ్య రమారమి రెండు లక్షలకు అటూ ఇటూగా ఉంటుంది. కోర్సు పూర్తి చేసుకుని కొందరు తిరిగి వస్తుండగా, మరికొందరు అక్కడే స్థిరపడడానికి ప్రయత్నిస్తున్నారు. తిరిగి వచ్చినవారు సివిల్స్‌ నుంచి ఐటి వరకు తమకు నచ్చిన రంగంలో మన దేశంలోనే చేరిపోతున్నారు. అమెరికాలోనే ఉండాలనుకునేవారు మాత్రం  గ్రీన్‌కార్డు కూడా పొంది స్థిరపడుతున్నారు. వీరెవరికీ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావటం లేదు. ఆర్జనే లక్ష్యంగా అమెరికాకు  వెళుతున్న కొద్ది మంది మాత్రమే ఇక్కట్లపాలవుతున్నారు. దరిమిలా సక్రమ మార్గంలో అమెరికాలో ఉన్నత చదువులు ఎలా సాగించవచ్చో తెలుసుకుందాం. 

ఎక్కువ మంది విదేశీ విద్యార్థులను ఆకట్టుకోవాలన్నదే అమెరికాలోని యూనివర్సిటీల లక్ష్యం. విదేశీ విద్యార్థులతో ఆదాయం సమకూర్చుకోవాలని అవి భావిస్తుంటాయి. 2017-18 సంవత్సరంలో అమెరికా ఆర్థిక వ్యవస్థలో విదేశీ  విద్యార్థుల వాటా 42.4 బిలియన్‌ డాలర్లు. 2017-18 సంవత్సరంలో అమెరికాలో చదువులకు వెళ్లిన చైనా విద్యార్థుల సంఖ్య 3,63,341.  రెండో స్థానంలో ఉన్న భారత విద్యార్థుల సంఖ్య 1,96,271.  అయితే విదేశీ విద్యార్థులు పద్ధతి ప్రకారం రావాలని మాత్రమే అక్కడి ప్రభుత్వం కోరుకుంటోంది.  అమెరికాలో చదువుకునే విద్యార్థులకు వారానికి ఇరవై గంటలు, అదీ క్యాంపస్‌లోనే పని చేసుకునే అవకాశం(వర్క్‌ పర్మిట్‌) కల్పిస్తారు. విద్యార్థిగా ఉన్నప్పుడు బైట పని చేస్తామంటే మాత్రం అంగీకరించరు. స్టెమ్‌(సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మేథ్స్‌) కోర్సులో చేరే విద్యార్థులు కోర్సు చేసేంతవరకు ఉండొచ్చు. ఆ తరవాత కూడా ఒపిటి(ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌) కోసం ఒక ఏడాది, తదుపరి ఉద్యోగంతో మరో రెండేళ్ళు ఉండొచ్చు. నాన్‌స్టెమ్‌ కోర్సులో చేరే విద్యార్థులకు మాత్రం ఉద్యోగ కాలం ఒక ఏడాది మాత్రమే ఉంటుంది. పద్ధతిగా స్టెమ్‌ కోర్సులో చేరే విద్యార్థులు ఎకాఎకిన అయిదేళ్ళు ఉండొచ్చు.  అలాంటి విదేశీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావటం లేదు.  
 
మంచి వర్సిటీ ఎంపిక
ఇటీవలి పరిణామాల నేపథ్యంలో అసలు ఏది మంచి యూనివర్సిటీ,  ఒక విద్యాసంస్థను ఎలా ఎంపిక చేసుకోవాలి అన్నది పెద్ద ప్రశ్న. ఇంటర్నెట్‌ సహకారంతో కొంతవరకు గ్రౌండ్‌వర్క్‌ చేయవచ్చు. మన ఆకాంక్షలకు అనువైన యూనివర్సిటీలను ఎంపిక చేసుకోవచ్చు.  అయితే అక్కడితో  ఆగిపోకూడదు.  తదుపరి చర్యగా తాము రూపొందించుకున్న జాబితాలోని విద్యా సంస్థల్లో  మన సీనియర్లు లేదంటే బంధువులు చదువుతున్నారా లేదా అని చెక్‌ చేసుకోవాలి. ఈ మార్గంలోనే ఎక్కువ సమాచారం అదీ ఫస్ట్‌ హ్యాండ్‌ తెలుస్తుంది. అమెరికా ఐవీ(ఐవివై) యూనివర్సిటీలు ప్రతిష్ఠాత్మకమైనవి. ఇవి ఎక్కువగా ప్రైవేటు యూనివర్సిటీలు. విద్యార్థులను ఆకట్టుకోవాల్సిన అవసరం వీటికి లేదు. ఇక్కడ సీటు తెచ్చుకోవడమే గొప్ప.  ఎనిమిది యూనివర్సిటీలు మాత్రమే వీటి పరిధిలోకి వస్తాయి. అమెరికాలోని ‘యూఎస్‌ న్యూస్‌’ అక్కడి యూనివర్సిటీలు అన్నింటికీ ర్యాంకింగ్‌ ఇస్తుంది. ముఖ్యంగా నేషనల్‌, రీజినల్‌ యూనివర్సిటీలుగా ఉన్న వాటిని ఎంపిక  చేసుకోవాలి. పుర్దు, కార్నెగిమెలన్‌, స్టాన్‌ఫోర్డ్‌, మిచిగన్‌ వర్సిటీల విషయం తెలిసిందే. ఇలాంటివి కాకుండా మరేవైనా అయితే మాత్రం కొద్దిగా ఆలోచించాల్సిందే. 
 
మంచి ఏజెన్సీ
కాలేజీ ఎంపిక తరవాత మంచి ఏజెన్సీని సంప్రదించాలి. అమెరికా ఇంటర్నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ కౌన్సిల్‌(ఎఐఆర్‌సి)  సర్టిఫికెషన్‌ ఉన్న ఏజెన్సీలతో మాట్లాడితే ఆయా వర్సిటీల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఎఐఆర్‌సి  అమెరికా ప్రభుత్వ గుర్తింపు పొందిన లాభాపేక్ష రహిత(నాన్‌ ప్రాఫిట్‌) సంస్థ. అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ అండ్‌ ఫెడరల్‌ కమిషన్‌ దగ్గర నమోదైన అధికారిక సంస్థ.  ప్రధానంగా అమెరికాలోని వివిధ వర్సిటీల అడ్మిషన్‌ ప్రాతిపదికలు  ఒకేలా ఉండవు. ఉదాహరణకు జిఆర్‌ఇ 340 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు కనీసం 260 మార్కులు తెచ్చుకోగలరు. అపై మార్కులు పొందడంలోనే విద్యార్థి ఘనత అంతా ఉంటుంది. అదే ఒక యూనివర్సిటీలో సీటుకు ప్రధాన ప్రాతిపదిక అవుతుంది. 340కి 260కి మధ్య ఉన్న గ్యాప్‌ 80 మార్కులే సీటును నిర్ధారిస్తాయి. 310కి మించి మార్కులు తెచ్చుకోగలిగితే మంచి వర్సిటీలో సీటు వస్తుంది. అయితే ఏ మార్కుకు ఏ యూనివర్సిటీలో సీటు వస్తుందన్నది ముఖ్యంగా ఎఐఆర్‌సి రిజిష్టర్డ్‌ ఏజెన్సీలు మాత్రమే చెప్పగలుగుతాయి. అదే ఏజెన్సీ జిఆర్‌ఇ కి కూడా కోచింగ్‌ ఇచ్చేది అయితే మరీ మంచిది. జిఆర్‌ఇలో మంచి మార్కులు పొందేందుకు టెక్నిక్స్‌ను సైతం బోధిస్తుంది. 
 
డాక్యుమెంట్లు
అమెరికా వర్సిటీలో సీటు నుంచి వీసా పొందడం వరకు అడగడుగునా డాక్యుమెంట్స్‌ కీలకపాత్ర పోషిస్తాయి. డాక్యుమెంట్ల ఆధారంగానే మంచి యూనివర్సిటీలు సీటు ఇస్తాయి. డాక్యుమెంట్‌లో పొందుపరిచిన విషయాలకు, ఇంటర్వ్యూ సమయంలో చెప్పే  మాటలకు పొంతన కుదరకుంటే సీటు వచ్చినప్పటికీ  వీసా లభించదు. అమెరికా యూనివర్సిటీలో సీటుకు దరఖాస్తు కంటే ప్రధానమైనది ఎస్‌ఒపి(స్టేట్‌మెంట్‌ ఆఫ్‌  పర్పస్‌).  సీటు పొందడంలో ఈ డాక్యుమెంట్‌  కీలకమైన పత్రం. మన పరోక్షంలో మనం ఏమిటో తెలియజేసే పత్రం. ఇక్కడ రాసే ప్రతి అక్షరం ముఖ్యమైనదే. చదవాలనుకుంటున్న కోర్సు మన ఆకాంక్షలను ప్రతిబింబించాలి. బేసిక్‌ అర్హతలు సరిపోవాలి. అసలు మనం అక్కడ ఎందుకు చేరాలని అనుకుంటున్నామన్నది జస్టిఫై చేయగలగాలి. వేల దరఖాస్తులో మనది పరిశీలించాలన్నా, ఎంపిక కావాలన్నా ఎస్‌ఒపిలో ప్రత్యేకత కనిపించాలి. దాదాపుగా అన్ని యూనివర్సిటీలు వర్క్‌పర్మిట్‌ ఇస్తాయి. కొద్ది వర్సిటీలు స్కాలర్‌షిప్స్‌ ఇచ్చి ప్రోత్సహిస్తాయి. అందుకని యూనివర్సిటీల అడ్మిషన్‌ కమిటీలు  విద్యార్థి ఎంపికలో  చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. స్విమ్మింగ్‌ ఇష్టమని అందుకు అవకాశం లేని ప్రాంతంలో యూనివర్సిటీని కోరుకుంటే అవి అడ్మిషన్‌ ఇవ్వకపోవచ్చు. ఆ ఒక్క కారణమే మన ఎంపికకు అవరోధం కావచ్చు. అందువల్ల కామన్‌ ఎస్‌ఒపి ని రూపొందించుకోవడం ఎంతమాత్రం మంచిది కాదు. యూనివర్సిటీ బ్యాక్‌గ్రౌండ్‌, అక్కడ నిబంధనలను తెలుసుకుని అందుకు అనుగుణంగా మన ఆకాంక్షలు, అర్హతలు, హాబీలు వంటివన్నీ సరిపోల్చుకుని ఎస్‌ఒపి తయారుచేసుకోవాలి. ప్రతి అక్షరం ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోవాలి. 
 
లెటర్‌ ఆఫ్‌ రికమండేషన్‌ మరొక ముఖ్యమైన డాక్యుమెంట్‌. విద్యార్థి కనీసం ముగ్గురి నుంచి రికమండేషన్‌ లెటర్లను తీసుకోవాలి. తను చదువుకున్న కాలేజీ ప్రొఫెసర్లు లేదంటే ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా చేసిన కంపెనీలోని సీనియర్‌ అధికారుల నుంచి వీటిని తీసుకోవాలి.   లెక్చరర్‌ లేదంటే ప్రాజెక్టు వర్క్‌ చేయించిన కంపెనీ ప్రతినిధి తన పరిశీలనలతో రికమెండేషన్‌ లెటర్‌ రాయాలి. అభ్యర్థికి ఉన్న సబ్జెక్టు, ప్రాక్టికల్‌  పరిజ్ఞాన బలాలు, సదరు యూనివర్సిటీలో ప్రత్యేకించి ఆ కోర్సు అధ్యయనానికి తను ఎలా అర్హుడో వివరిస్తూ రికమెండేషన్‌ లెటర్‌ రాయాలి. ఇలాంటి ప్రత్యేకతలు ఏవీ లేనప్పుడు అభ్యర్థి పెట్టుకున్న దరఖాస్తుకు న్యాయం జరగదు. అంతకంటే మంచి అర్హతలు ఉన్న మరొకరు లేదంటే ఇంకో దేశ విద్యార్థి సీటు పొందే అవకాశాలే బలంగా ఉంటాయి. ఇటీవలి కాలంలో వీటికి ఫార్మేట్లు వస్తున్నాయి. అలాంటి రికమండేషన్‌ లెటర్లకు పెద్దగా  విలువనివ్వరు. 
 
వీసాకి  ఇంటర్వ్యూ
అమెరికాకు ఏ రకంగా వెళ్లాలన్నా వీసా ఇంటర్వ్యూ తప్పనిసరి. అందుకే అమెరికాలోని విద్యాసంస్థలో సీటు పొందడం ఒక ఎత్తయితే, వీసా సాధించడం మరొక ఎత్తు. వీసా కోసం సమర్పించే పత్రాల్లో ఒకటైన ఐఈల్‌టిసి స్కోర్‌ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అది అభ్యర్థి ఇంగ్లీష్‌ పరిజ్ఞానానికి ఉద్దేశించిన స్కోర్‌. అయితే మాట్లాడే సమయంలో అతని ఇంగ్లీష్‌ ప్రావీణ్యం ఆ స్థాయిలో లేకపోతే.. ఆ ఒక్క కారణంతో వీసా రిజెక్ట్‌ చేయవచ్చు. అయితే ఈ విషయం అర్థంకాక అమెరికా వీసా పొందడం అదృష్టంపై ఆధారపడి ఉంటుందని ఎక్కువ మంది భావిస్తారు. అలాగే చదివింది మెకానికల్‌ ఇంజనీరింగ్‌, అక్కడ చేయబోయే కోర్సు కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ అనుకోండి. నిజానికి మంచి యూనివర్సిటీలు ఏవీ అలా కోర్సులను ఆఫర్‌ చేయవు. ఆ విషయం అమెరికా ఎంబసీ అధికారులకు బాగా తెలుసు. ఆ కారణం రీత్యా కూడా వీసాను మంజూరు చేయకపోవచ్చు.
 
కె.హెచ్.వాసుదేవ్
ఆంధ్ర, తెలంగాణ రీజనల్ హెడ్
ప్రిన్స్‌టన్ రివ్యూ-మాన్య ఎడ్యుకేషన్