అమెరికాలో ఆ రెండు పార్టీలే ఎందుకు..?

వాషింగ్టన్:  అయితే డెమొక్రటిక్ లేదంటే రిపబ్లికన్.. అగ్రరాజ్యం అమెరికాలో ఈ రెండు పార్టీలదే హవా. ప్రపంచంలోనే అతి పురాతన ప్రజాస్వామ్య దేశంగా భాసిల్లుతోన్న అమెరికాను శతాబ్దాలుగా ఈ రెండు పార్టీలే శాసిస్తున్నాయి. ఈ ఏడాది జరగనున్న 58వ అధ్యక్ష ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలే తలపడుతున్నాయి. ఎందుకిలా? అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మరో పార్టీకి అధికారంలో కూర్చునే అదృష్టం లేదా..? అసలక్కడ ఇతర పార్టీల ఉనికే లేదా..? అనే ప్రశ్న చాలామంది మెదళ్లను తొలిచేస్తోంది.

 
నాలుగేళ్లకు ఒకసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ప్రతీ ఏడాది నవంబరులో తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం(నవంబరు 8) ఎన్నికలు నిర్వహిస్తారు. 1845 నుంచీ ఇదే జరుగుతోంది. ఇదే సమయంలో సమాఖ్య(కేంద్ర), రాష్ట్ర, స్థానిక ఎన్నికలు కూడా జరగుతాయి. సాధారణ ఎన్నికలుగా పరిగణించే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 35 ఏళ్లు నిండిన దేశ పౌరులను అర్హులుగా పరిగణిస్తారు. లేదంటే కనీసం 14 ఏళ్లపాటు అమెరికాలో నివసిస్తున్నవారు అయి ఉండాలి. రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి మూడోసారి పోటీకి అనర్హుడు.
 
ఇక పార్టీల విషయానికి వస్తే అమెరికాలో డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలే దేశాన్ని పాలిస్తున్నాయి. ఈ రెండు పార్టీలే అధికారాన్ని పంచుకుంటుంటాయి. మరి మిగతా పార్టీల సంగతేంటి. అసలు అవి ఉన్నాయా? లేవా? అంటే.. ఉన్నాయి. దేశంలో చిన్నాచితకా పార్టీలు మరో 30 వరకు ఉన్నాయి. వాటిలో లిబర్టేరియన్, కాన్‌‌స్టిట్యూషన్ పార్టీ, గ్రీన్ పార్టీ, 1869లో పురుడు పోసుకున్న ప్రొహిబిషన్, 1919లో స్థాపించిన కమ్యూనిస్టు పార్టీ, 2011లో తెరపైకి వచ్చిన జస్టిస్ పార్టీ, 2014లో స్థాపించిన ట్రాన్స్ హ్యూమన్ పార్టీ.. ఇలా 30కి పైగా పార్టీలు గుర్తింపు పొందాయి. మరెన్నో పార్టీలు తెరపైకి వచ్చినా అంతే వేగంగా కనుమరుగయ్యాయి. ఎన్ని పార్టీలు పురుడు పోసుకున్నా 1854లో స్థాపించిన రిపబ్లికన్ పార్టీ, 1868లో వచ్చిన డెమొక్రటిక్ పార్టీలు మాత్రం ఇప్పటికీ బలంగా ఉండి అగ్రరాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల విధానం, పార్టీ వ్యయం.. ఈ రెండే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
 
అమెరికా ఎన్నికల్లో పోటీ పడడంమంటే మన దేశంలో ఉన్నంత ఈజీ కాదు. అందుకే ఇక్కడ మూడో పార్టీ ఉనికి కనబడదు. పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ కోసం ఓసారి, అది సాధించాక మరోసారి దేశం మొత్తం పర్యటించాల్సి ఉంటుంది. ఇందుకు వందల కోట్ల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది చిన్న పార్టీలకు తలకు మించిన భారంగా మారుతోంది. 2012 ఎన్నికల్లో ఒబామా ఒక్కరే వంద కోట్ల డాలర్లు ఖర్చు చేశారని అంచనా. ఆ ఎన్నికల్లో దాదాపు 700 కోట్ల డాలర్లు ఖర్చయినట్టు చెబుతారు. ఖర్చు భారీ మొత్తంలో ఉండడంతో విరాళాల ద్వారా సేకరించడం ఇక్కడ ఆనవాయితీ. ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న పార్టీలకే వ్యాపారవేత్తల ‘అండ’ దొరుకుతుంది. దీంతో మూడో పార్టీ దాదాపు కనిపించకుండా పోతోంది. చిన్నాచితకా పార్టీలకు అంత పెద్దమొత్తంలో ఖర్చు చేసే స్థోమత లేకపోవడం, పారిశ్రామికవేత్తల అండ కూడా లేకపోవడంతో పోటీ చేసినా ఓటమి ఖాయం కావడంతో అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలని భావిస్తూ పోటీ ఊసే ఎత్తకుండా గమ్మున ఉండిపోతున్నాయి. 1992, 1996లో రాస్ పెరోట్ సారథ్యంలోని రిఫార్మ్ పార్టీ సాహసం చేసి బరిలో నిలిచినా ఒక్కరంటే ఒక్క ఎలక్టర్ ఓటూ దక్కక అవమానాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. సో.. ఇదన్నమాట అగ్రరాజ్యంలో మూడో పార్టీ పరిస్థితి.