గర్భం దాల్చేందుకు విదేశాల నుంచి మన దేశానికి!

ప్రెగ్నెన్సీ టూరిజం!
లూసీ... అందమైన అమ్మాయి. లండన్‌లో పుట్టిపెరిగినందువల్ల పాశ్చాత్యసంస్కృతికి నిలువెత్తు నిదర్శనంలా ఉంటుంది. ఆమెకు పిల్లలంటే ఎంతో ఇష్టం. ఓ బిడ్డకి జన్మనివ్వాలనుకుంది. డేటింగ్‌, పెళ్ళి అనేవాటిపై ఆమెకంత సదభిప్రాయం లేదు. కానీ, బిడ్డను కనితీరాలనే పట్టుదల మాత్రం ఉంది. అందులోనూ ప్రపంచంలోనే మేలైన జాతిగా పేరొందిన ఒక ఆర్యుణ్ణి కనాలనుకుంది. అనుకున్నదే తడవుగా భారతదేశానికి వచ్చి, తనకడుపున బిడ్డ ప్రాణం పోసుకుంటుందని ధ్రువీకరించుకున్నాకే తిరిగి లండన్‌ వెళ్ళిపోయింది. ఇందేంటి... పిల్లల్ని కనాలంటే ఐవీఎఫ్‌, సరోగసీ వంటి కృత్రిమపద్ధతులుండగా ఇండియాకు రావడమేంటి? అనుకుంటున్నారా.. ఇదే ప్రెగ్నెన్సీ టూరిజం!
 
‘ప్రెగ్నెన్సీ టూరిజం’ అనే మాట ఎప్పుడైనా విన్నారా? హిస్టారికల్‌ టూరిజం, వెదర్‌ టూరిజం, హెల్త్‌ టూరిజం, కేసినో టూరిజం... ఇలా ఎన్నో రకాల టూరిజాల గురించి మనకు తెలుసు. ప్రయాణ కారణాన్ని అనుసరించి ఏ టూరిజానికి ఆ పేరు. ఇక్కడ కూడా అంతేనండి. గర్భం దాల్చడం కోసం ఒక ప్రాంతానికి వెళ్ళి, గర్భం దాల్చగానే తమ సొంత ప్రాంతానికి తిరిగి వెళ్ళడం. అదేంటీ గర్భంకోసం వేరే ప్రాంతానికి వెళ్ళడం ఎందుకు? అని సందేహమా. గర్భం దాల్చేదే అక్కడి ఆ ప్రాంతానికి చెందిన పురుషులతో. గర్భం కోసం చేసే ప్రయాణం కాబట్టి ఇది ప్రెగ్నెన్సీ టూరిజంగా ప్రాచుర్యం పొందింది.
 
ఎవరీ ఆర్యులు!
భూమిపై మానవుడి పుట్టుక దగ్గరనుంచి ఇప్పటివరకూ అనేకరకాల జాతులు ఉద్భవించాయి. అదేరకంగా చాలాజాతులు అంతరించాయి. మానవుల్లో మేలైన జాతిగా ఆర్యులను పేర్కొంటారు. అయితే చరిత్రలో వీరి పుట్టుక గురించి స్పష్టమైన ఆధారాలేవీ లేవు. కొందరు చరిత్రకారులు ఆర్యులు మధ్య ఆసియానుంచి వచ్చారని అభిప్రాయపడితే, మరికొందరు ఆర్యులది భారతదేశమే అని వాదిస్తున్నారు. ఏడు నదుల సంగమంలో విలసిల్లిన హరప్పా నాగరికత ఆర్యుల జీవనశైలిని, సంస్కృతిని తెలియజేస్తుంది. అయితే హరప్పా నాగరికత అంతరించినప్పటికీ కొంతమంది ఆర్యులు ఇప్పటికీ భూమిపై నివసించి ఉన్నారనేది కొందరి అభిప్రాయం. హరప్పా నాగరికత విలసిల్లిన ప్రాంతమైన ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ వీరు జీవించి ఉన్నారనేది ఒక విశ్లేషణ. ఇలా ఇప్పటికీ ప్రపంచంలో నివసిస్తున్న మేలైన ఆర్యులుగా మనదేశంలోని లఢఖ్‌లో గల బ్రోక్పాజాతిని పేర్కొంటారు చరిత్రకారులు.
 
మేలైన జాతి
ఆర్యులు దాదాపుగా అంతరించినప్పటికీ వారే మేలైన మానవజాతి అని ముద్రపడిపోయింది. ఆదర్శవంతులకు ఉండే లక్షణాలన్నీ ఆర్యుల్లో ఉన్నాయని ప్రతీతి. అంతేకాకుండా అందంలోనూ వీరికి ప్రత్యేకస్థానం ఉంది. తెల్లని మేనిఛాయ, నీలిరంగు కళ్ళు, భిన్నమైన రంగులో ఉండే జుట్టు, సున్నితమైన చర్మం వీరికే సొంతం. హిమాలయాల్లోని లఢఖ్‌ పరిసర ప్రాంతంలో నివసించే హిమాలయన్‌ తెగ అయిన బ్రోక్పాజాతి మనుషులు కూడా ఇవే లక్షణాలను కలిగి ఉన్నారు. అందువల్లనే వీరు ఆర్యులసంతతికి చెందినవారే అని చాలామంది నమ్ముతున్నారు. అందుకే వీరిద్వారా పిల్లల్ని కనాలనే ఉద్దేశంతో చాలామంది యువతులు దేశవిదేశాలనుంచి మనదేశానికి వస్తున్నారు.
 
అలెగ్జాండర్ సైనికులు!
లఢఖ్‌లో నివసించే బ్రోక్పాజాతిని కొంతమంది పరిశోధకులు ఆర్యులకు చెందిన సంతతిగా విశ్వసిస్తుంటే, మరికొంతమంది అలెగ్జాండర్‌ సైనికులుగా భావిస్తున్నారు. అలెగ్జాండర్‌ భారతదేశంపై దండెత్తినప్పుడు కొంతమంది సైనికులు ఇక్కడే చిక్కుకుపోయారని, వారి సంతతే ఈ బ్రోక్పాజాతి అని కొంతమంది అభిప్రాయం. భౌతికంగా ఆర్యులకు ఉండే చాలా లక్షణాలు ఈ తెగ వ్యక్తుల్లో కనబడుతాయి. ఆర్యుల్లాగే వీరూ సాధారణ మనుషులకంటే ఎత్తుగా ఉంటారు. నీలికళ్ళు, నిగనిగలాడే ఒత్తైన జుట్టు, సున్నితమైన చర్మం కలిగి ఉంటారు. అన్నివిషయాల్లోనూ వీరిలో ఆర్యుల లక్షణాలు ప్రస్పుటంగా కనిపిస్తాయి. వీరి వేషధారణ, ప్రవర్తన, మాటతీరు అన్నింటిలోనూ ఆర్యుల లక్షణాలు ఉట్టిపడతాయి. సమాజానికి భిన్నంగా ఉండే వీరు జాతి సంరక్షణకోసం ఏం చేయడానికైనా వెనుకాడరు.
 
వైదిక సంస్కృతి
బ్రోక్పాజాతిని ఆర్యులుగా భావించడానికి అనేక వివరణలు ఇస్తున్నారు అధ్యయనకారులు. వాటిలో ముఖ్యమైనది సంస్కృతి. ఆర్యులు వైదికసంస్కృతిని ఆదరించారు. ఈ జాతికూడా వైదికసంస్కృతినే పాటిస్తోంది. వీరి భాషపై కూడా సంస్కృతభాష ప్రభావం కనపడుతోంది. వీరు కూడా సూర్యుడిని సూర్య్‌ అని, గుర్రాన్ని అశ్వ్‌ అని అంటారు. అనేకమంది దేవతలతోపాటు ప్రకృతిని కూడా ఆరాధిస్తారు. బౌద్ధులే అయినప్పటికీ స్థానిక దేవతలను పూజిస్తారు. ఇవన్ని లక్షణాలనుబట్టి వీరు ఆర్యులే అయి ఉండవచ్చుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు చరిత్ర కారులు.

 

పోలికలు

లఢఖ్‌ పరిసర ప్రాంతాల్లో జీవించే ఇతర తెగలతో పోల్చినప్పుడు బ్రోక్పాజాతిలో అనేక భిన్నమైన పోలికలు కనిపిస్తాయి. ఉదాహరణకు అక్కడ కనిపించే ఇతర తెగలకు చెందినవారి ముఖాకృతి మంగోలియన్లలా కనిపిస్తుంది. కానీ బ్రోక్పాతెగ వారి ముఖాకృతి అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అంతేకాదు వీరి వేషధారణ, కట్టుబాట్లు, సంప్రదాయాలు, ఆహారనియమాలు అన్నికూడా పరిసరప్రాంత తెగలకు పూర్తి వైవిధ్యంగా ఉంటాయి. తాము గిల్గిత్‌ ప్రాంతం నుంచి వచ్చిన ఆర్యులుగా వీరు గర్వంగా చెప్పుకుంటారు. అయినప్పటికీ వీరి పుట్టుపూర్వోత్తరాలమీద చాలా అనుమానాలు ఉన్నాయి.

 

 
బాలికల చదువుకు ప్రోత్సాహం
హిమాలయాల్లో నివసించే మరే ఇతర తెగలో లేనటువంటి అభ్యుదయ భావాలు బ్రోక్పాతెగవారికి ఉన్నాయి. ఆడపిల్లల చదువు, భవిష్యత్తు గురించి వీరి ఆలోచనలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. ఆడపిల్లల చదువు విషయంలో వీరు పూర్తి స్వేచ్ఛనిస్తారు. అయితే ఉద్యోగావకాశాలు మాత్రం అంతంతమాత్రమే. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న టూరిజం కారణంగా కొంతమందికి గైడులుగా, మరికొంతమందికి వ్యాపారులుగా ఉపాధి లభిస్తోంది. పెరుగుతున్న పర్యాటకుల వల్ల హోటళ్ళ నిర్వహణ కూడా ఇక్కడి ప్రజలకు లాభదాయకంగా మారుతోంది.
 
చాలా ప్రత్యేకం
లఢఖ్‌లోని బియామా, దాహ్‌, హానూ, దార్చిక్‌ అనే నాలుగు గ్రామాల్లో ఈ బ్రోక్పాజాతి ప్రజలు నివసిస్తున్నారు. చరిత్రకారుల లెక్కప్రకారం 1991లో వీరి జనాభా కేవలం 1900. కానీ ఇప్పుడు వీరి జనాభాలో చాలా వృద్ధి జరుగుతోంది. ప్రస్తుతం వీరి జనాభా ఐదువేల పైచిలుకే. బ్రోక్పాజాతి చాలా ప్రత్యేకమైంది. వీరు పాటించే నియమాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఒకవేళ వీరిజాతికి చెందిన అమ్మాయి వేరే జాతికి చెందిన అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే, ఆమెను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి గ్రామంలోకి అనుమతించరు. ఇదివరకు వీరి గ్రామాల్లోకి ఎవరూ ప్రవేశించకూడదనే నిబంధనలు కూడా ఉండేవి. ప్రభుత్వ జోక్యంతో ఇప్పుడు అందరూ ప్రవేశించేందుకు వీలుకలిగింది. ప్రస్తుతం ఇక్కడికి చాలామంది విదేశీ యువతులు వస్తూ ఉంటారు. అనేక పరిశోధనల అనంతరం కొంతమంది విదేశీయులు వీరు చాలా తెలివైనవారని, ఆర్యుల సంతతికి చెందినవారని నిర్ధారించారు. అందుకే వీరితో సంభోగంలో పాల్గొని పిల్లల్ని కనేందుకు విదేశీయువతులు ఆసక్తి కనబరుస్తున్నారు.
 
ఫొటోకి కూడా డబ్బులే!
ఈ తెగవారు తాము స్వచ్ఛమైన ఆర్యులమని నమ్ముతారు. అందువల్లే విదేశాలనుంచి చాలామంది తమతో పిల్లల్ని కనేందుకు వస్తున్నారని గర్వపడుతుంటారు. అయితే మొదట్లో కొన్నిరోజులు వీరు విదేశీ వనితలు అడగ్గానే సంతోషంగా వారి కోరికను తీర్చేవారు. కానీ, తరువాత విదేశీయుల తాకిడి ఎక్కువవడంతో ప్రస్తుతం వీరు సంభోగంలో పాల్గొనేందుకు డబ్బులు తీసుకుంటున్నారు. అంతేకాదు వీరితో ఫొటోలు దిగాలనుకున్నా సొమ్ము అప్పజెప్పడం తప్పనిసరి. అయినప్పటికీ విదేశీయువతులు వీరితో పిల్లల్ని కనేందుకు వెనుకాడకపోవడంతో బ్రోక్పా తెగ నివసిస్తున్న నాలుగు గ్రామాల్లో ఈ పద్ధతి లాభదాయకంగా మారింది. ఇదే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టూరిజంగా ప్రసిద్ధిపొందింది.
 
ఒంటరి జీవితానికో తోడు
ప్రస్తుత జీవన పరిస్థితుల్లో చాలా వివాహ బంధాలు చిన్నాభిన్నమవుతూ చివరకు విడాకులకు దారి తీస్తున్నాయి. మరికొంతమంది వివాహమనే బంధానికే పూర్తిగా దూరంగా ఉంటు జీవిస్తున్నారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా జీవించేవారిసంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కానీ, జీవితాంతం ఒంటరిగా ఉండడం ఎవరికైనా అసాధ్యమే. అందుకే జీవితంలో తమకంటు సొంతమనుషులు ఉండాలనే ఉద్దేశంతో కొత్తదారులను వెతుకుతున్నారు. తమ జీవితంలో వివాహబంధం లేకపోయినా, సమాజంలో తమ సంతతి ఉన్నత స్థాయిలో ఉండాలని కలలు కంటున్నారు. తమ జీవితాల్లో సంతోషం నింపుకునేందుకైనా పిల్లలను కనాలనే కోరికమాత్రం చాలామందిలో ఉంటోంది. అందుకే కొంతమంది సరోగసీ ద్వారా తల్లి, తండ్రిగా మారుతున్నారు. మరికొంతమంది మహిళలు తామే గర్భందాల్చి పిల్లల్నికని, ఒంటరి జీవితాలకు స్వస్తి పలుకుతున్నారు.
 
డాక్యుమెంటరీ
మగవారికి డబ్బులిచ్చిమరీ వారితో కలిసి పిల్లల్ని కనడం అంటే వినడానికి కాస్త వింతగానే ఉంటుంది. అందుకే ఈ ఇతివృత్తంతో 2007 లో ఒక డాక్యుమెంటరీ రూపొందించారు. సంజయ్‌ శివన్‌ తీసిన ‘ద ఆచ్టంగ్‌ బేబీ.. ఇన్‌ సెర్చ్‌ ఆఫ్‌ ప్యూరిటీ’ అనే డాక్యుమెంటరీ బ్రోక్పాజాతి ప్రజల జీవనశైలిని కళ్ళకు కట్టింది. ఈ డాక్యుమెంటరీలో జర్మనీకి చెందిన ఒక మహిళ స్వచ్ఛమైన ఆర్యుల సంగమంతో పిల్లల్ని కనాలనే ఉద్దేశంతో ఇండియాకు వస్తుంది. లఢఖ్‌లోని బ్రోక్పా ప్రజలు ఆర్యులేనని తెలుసుకుని చివరకు వారి ద్వారా గర్భం దాలుస్తుంది. ఈ డాక్యుమెంటరీలో విదేశీయుల ఆలోచనలు, ఆర్యుల పట్ల వారికి గల అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేశారు. ఈ డాక్యుమెంటరీ ద్వారా ప్రెగ్నెన్సీ టూరిజం గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. దీనిపై చాలామంది భిన్నఅభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు.